షోలాపూర్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన ధూమపాన చట్టం నుంచి బీడీ పరిశ్రమకు మినహాయింపు కల్పించాలని ఎన్సీసీపీ కార్మిక సెల్ పట్టణ అధ్యక్షుడు గోవర్ధన్ సంచు డిమాండ్ చేశారు. ఆయన గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కొత్త చట్టం ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీనుంచి బీడీ కట్టలపై 85 శాతం మేర హెచ్చరికలు, 15 శాతం మేర బ్రాండ్ పేరు ముద్రించుకోవాలి. దీనివల్ల బీడీ కట్టలపై కంపెనీ పేరు మరీ చిన్నదిగా కనిపిస్తుందని గోవర్ధన్ అన్నారు. పేరు సైజు తగ్గించడం వల్ల నిజమైన కంపెనీలు దెబ్బతింటాయని, విక్రయాలు పడిపోతాయని వాపోయారు.
అలాగే తంబాకుపై కూడా నిషేధం విధించేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దీనివల్ల సుమారు ఆరు లక్షల మంది బీడీ కార్మికులపై ప్రభావం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు బట్టల మిల్లులు, మరమగ్గాలు మూతపడుతుండటంతో స్థానికంగా ఉపాధి లభించడం కష్టమవుతోందని, ఇప్పుడు బీడీ పరిశ్రమ కూడా దెబ్బతింటే నిరుద్యోగ సమస్య పెరుగుతుందన్నా రు. ఈ అంశంపై ఎన్సీపీ సెల్ బృందం త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల ను కలిసి విన్నవిస్తామన్నారు. చట్టంపై ప్రభుత్వం పునరాలోచన చేయకుంటే ఎన్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.
‘ధూమపాన చట్టం నుంచి బీడీని మినహాయించాలి’
Published Thu, Dec 11 2014 10:30 PM | Last Updated on Mon, Oct 22 2018 2:06 PM
Advertisement