పుర్రె గుర్తుపై కదం తొక్కిన కార్మికులు
మెట్‌పల్లి: కరీంనగర్ జిల్లాలో బీడీ కార్మికులు కదం తొక్కారు. బీడీ కట్టలపై పుర్రెగుర్తుతోపాటు 85 శాతం డేంజర్ మార్కును తొలగించాలని ఏఐటీయూసీ అనుబంధ బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సోమవారం మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన వందలాది మంది బీడీ కార్మికులు చావిడి నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ చౌరస్తాకు వచ్చి అక్కడ రాస్తారోకో చేశారు. అనంతరం అక్కడి నుంచి కొత్త బస్టాండ్ చేరుకొని మరోమారు రాస్తారోకో నిర్వహించారు. తర్వాత తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
బీడీ పరిశ్రమపై లక్షలాది మంది ఆధారపడి బతుకుతున్నారని, పుర్రె, డేంజర్ గుర్తుల వల్ల బీడీల అమ్మకాలు కార్మికులు రోడ్డున పడతారని అన్నారు. అలాగే బీడీ కట్టలపై పుర్రె, డేంజర్ బొమ్మలను 85శాతం మేరకు ముద్రించాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను నిరసిస్తూ బీడీ కార్మికులు గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కథలాపూర్, కోనరావుపేట తహశీల్దార్ కార్యాలయూల ఎదుట ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్లకు అందజేశారు. ఎల్లారెడ్డిపేటలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కథలాపూర్ మండలంలోని 18 గ్రామాలకు చెందిన బీడీ కార్మికులు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీడీ పరిశ్రమపై ఆంక్షలు ఎత్తివేయూలని డిమాండ్ చేశారు. కోనరావుపేటలోనూ తహసీ ల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.