సాక్షి,హైదరాబాద్: రైతు బీమా తరహాలో రూ.5 లక్షలతో ‘చేనేత బీమా’అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిరిసిల్లలో చేసిన ప్రకటన.. రాష్ట్రంలో చేనేత, వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు, వారి కుటుంబాల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ కొత్త పథకం మార్గదర్శకాలపై వారిలో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో చేనేత, మరమగ్గాలపై ఆధారపడి సహకార రంగంతో పాటు సహకారేతర రంగంలోనూ పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
సీఎం ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర చేనేత విభాగం పథకం మార్గదర్శకాలపై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘చేనేత మిత్ర’, ‘నేతన్నకు చేయూత’తరహాలో.. కొత్తగా ప్రవేశపెట్టే ‘చేనేత బీమా’పథకాన్ని సహకారేతర రంగంలో ఉన్న వారికి కూడా వర్తింప చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం రైతుబీమా పథకాన్ని 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులు ప్రమాదం, అనారోగ్యం, ఆత్మహత్యలు ఇలా..ఏ కారణంతో చనిపోయినా వర్తింపజేస్తున్నారు. అయితే చేనేత బీమా పథకాన్ని ఏ వయసు వారికి వర్తింపజేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. క్షేత్ర స్థాయి పరిస్థితులు, ప్రభుత్వ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అంశంపై స్పష్టత ఇచ్చే అవకాశముంది.
వలస కార్మికులకూ వర్తింపజేయాలి
రాష్ట్రంలో 615 చేనేత సహకార సంఘాలు ఉండగా, చేనేత దాని అనుబంధ రంగాల్లో సుమారు 40 వేలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. మరమగ్గాల కార్మికులను కూడా కలిపితే వీరి సంఖ్య 70 వేలకు పైనే ఉంటుందని చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం అధికారులు చెబుతున్నారు. అయితే నేత రంగంలో ఉపాధి లేక ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లినవారు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే లక్షన్నర వరకు నేత కార్మికులు ఉంటారని నేత కార్మిక సంఘాలు చెప్తున్నారు. చదవండి: వాట్సాప్ మరో ఫీచర్, పాస్ వర్డ్ మరిచిపోతే అంతే సంగతులు
గతంలో గొర్రెల పంపిణీ యూనిట్ల పంపిణీ సందర్భంగా క్షేత్ర స్థాయిలో గొర్రెల కాపరులతో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేయడం, సహకార సంఘాల బయట ఉన్న వారికి సభ్యత్వం ఇవ్వడం తదితరాలను ప్రభుత్వం చేపట్టింది. అలాగే చేనేత బీమా పథకం అమలుకు ముందు కూడా అందరినీ సహకార రంగం పరిధిలోకి తెచ్చేలా సభ్యత్వం ఇవ్వాలని నేత కార్మిక సంఘాలు కోరుతున్నాయి. స్థానికంగా ఉపాధి లేక సూరత్, ముంబయి, షోలాపూర్, భివాండీ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన నేత కార్మికులకు కూడా బీమా వర్తింప చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
జీవనజ్యోతి, సురక్ష పునరుద్దరణ?
గతంలో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన’, ‘ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన’పథకాల అమలుతో నేత కార్మికులకు కూడా ప్రయోజనం చేకూరింది. అయితే రెండేళ్లుగా ఈ పథకాల అమలు నిలిచిపోవడం, వీరికి మరే జీవిత బీమా పథకాలు లేకపోవడంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం మళ్లీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ చేనేత బీమా పథకంతో పాటు కేంద్ర పథకాలు కూడా తిరిగి అమల్లోకి వస్తే నేత కార్మికుల కుటుంబాలకు బాగా ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వయసుతో నిమిత్తం లేకుండా అమలు చేయాలి
నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకుని కొత్త బీమా పథకానికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేయాలి. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలి. చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యల మూలంగా రాష్ట్రం ఏర్పడింది మొదలు ఇప్పటివరకు 360 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ బాధిత కుటుంబాలన్నిటికీ రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలి.
పదిరోజుల్లోగా మార్గదర్శకాలు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెడుతున్న చేనేత బీమా పథకం మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నాం. మరో వారం పదిరోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తాం. ప్రస్తుతం 40 వేలకు పైగా కార్మికులు చేనేత రంగంలో, మరో 30 వేలకు పైగా పవర్‌లూమ్ రంగంలో పనిచేస్తున్నారు. ఈ పథకం ద్వారా వీలైనంత మందికి లబ్ధి జరిగేలా మార్గదర్శకాల్లో జాగ్రత్తలు తీసుకుంటాం. సంబంధిత రంగానికి చెందిన కార్మికులు, ఇతరుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం.
– శైలజా రామయ్యర్, కమిషనర్, చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కు చెందిన పిస్క పోశెట్టి (57) చేనేత కార్మికుడు. ఇతని భార్య కనకవ్వ పవర్‌లూమ్ కార్మికులకు భోజనం పెడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. అయితే కరోనా, ఇతర కారణాల నేపథ్యంలో ఇద్దరికీ ఆదాయం లేక ఈ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యింది. ఈ పరిస్థితుల్లోనే ఈ ఏడాది ఏప్రిల్ 10న పోశెట్టి కొత్త చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్తను కోల్పోయిన కనకవ్వ ప్రస్తుతం తన కుమారునితో కలిసి కిరాయి ఇంట్లో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌లో నివాసముండే బిట్ల చంద్రమౌళి (51)కూడా నేత కార్మికుడే. దివ్యాంగుడైన ఇతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉండగా.. కూతురు పెళ్ళికి రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. మరోవైపు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో చంద్రమౌళి ఇటీవల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని భార్య ప్రస్తుతం బీడీలు చుడుతూ కుటుంబాన్ని నడిపేందుకు నానా అవస్థలూ పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి చేనేత బీమా ఉపయోగపడుతుందని కార్మిక సంఘాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment