దురాజ్‌పల్లి (సూర్యాపేట): గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం దరఖాస్తుదారుల్లో సందిగ్ధ్దత నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తులు ఆమోదిస్తారా? ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మళ్లీ స్వీకరిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్చి ఉంది.
ఒకవేళ కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తే గతంలో గృహలక్ష్మి పథకం కింద ఎంపికై ఇళ్ల మంజూరు పత్రాలు అందించిన చోట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తే ఇప్పటి వరకు పడిన శ్రమ, పెట్టిన ఖర్చు వృథాయేనా? అనే గందరగోళ పరిస్థితి నెలకొంది.
డబుల్ బెడ్‌రూం సక్సెస్ కాకపోవడంతో..
గృహలక్ష్మి పథకానికి ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. జిల్లాలో అనుకున్న స్థాయిలో ఆ పథకం సక్సెస్ కాలేదు. లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం.. నిర్మించిన ఇళ్లు తక్కువ కావడంతో సర్వత్రా ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం కింద సొంతస్థలం ఉన్న వారికి గృహ నిర్మాణం కోసం మూడు విడతల్లో రూ.3లక్షల నగదు ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో మొత్తం 58,564 దరఖాస్తులు రాగా క్షేత్ర స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు పరిశీలించారు. వీటిలో 34,849 మందిని అర్హులుగా తేల్చి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3వేల యూనిట్ల చొప్పున జిల్లాలోని నాలుగు నియోకవర్గాల్లో 12వేల యూనిట్లకు మంజూరు పత్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు.
దీంతో వారంతా సంతోషంలో మునిగిపోయారు. మిగతా ఆశావహులు సైతం వారికి అందుతాయని భావించారు. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం చకచకా జరిగిపోయాయి. తమ హామీల్లో భాగంగా గృహలక్ష్మి స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకున్న వారిలో ఆందోళన నెలకొంది.
కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు
ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం అమలు చేయాలని యోచిస్తోంది. దీంట్లో భాగంగా ఇంటి నిర్మాణానికి ఇప్పటికే రూ.5 లక్షలు ప్రకటించింది. సాయం పెంపుపై అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నా.. కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తారో, విధివిధానాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.
దీనిపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో సుమారు 70 వేలకు పైగా కుటుంబాలు సొంతిల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment