70 వేల ఇందిరమ్మ ఇళ్లు రద్దు? | The cancellation of Indiramma 70 houses | Sakshi
Sakshi News home page

70 వేల ఇందిరమ్మ ఇళ్లు రద్దు?

Published Mon, Jul 7 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

The cancellation of Indiramma 70 houses

 మోర్తాడ్:  గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల ఇళ్లు రద్దు అయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను, అంతకు ముందు సంవత్సరాల్లో మంజూరు అయిన ఇళ్లకు సంబంధించి ఎంతో కొంత బిల్లు చేసిన ఇళ్లను మాత్రమే ఆన్‌లైన్‌లో ఉంచిన అధికారులు అసలే బిల్లు చేయని ఇళ్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

పేద, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అయితే, పాత విధానానికి స్వస్తి పలుకుతూ కొత్త విధానానికి దివంగ త ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించి ఆర్థిక సహాయాన్ని పెంచారు. సకల సదుపాయాలు కల్పిం చే విధంగా చర్యలు తీసుకున్నారు.

 తాజాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు బెడ్‌రూం లు, హాలు, కిచెన్, అటాచ్డ్ బాతురూం కలిగిన ఇంటిని రూ. మూడు లక్షల వ్యయంతో నిర్మించి ఇస్తామని ప్రకటించింది. అయితే ఇంతవరకు గృహనిర్మాణ సంస్థ ద్వారా అందించే ఆర్థిక సహాయానికి సంబంధించిన పాలసీని ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యిందనే నమ్మకంతో ఎంతో మంది ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు.

 బంధు, మిత్రులు, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసి అనేక మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభిం చారు. ఎలాగూ ఇల్లు మంజూరు అయ్యింది కదా అని భావించిన లబ్ధిదారులు బిల్లు వచ్చిన తరువాత అప్పులు తీర్చేయవచ్చని ఆశించి ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశారు. అయితే రాష్ట్ర విభజనకు ముందుగానే బిల్లుల చెల్లింపునకు వెబ్‌సైట్‌ను క్లోజ్ చేసిన గృహనిర్మాణ సంస్థ ఇప్పటి వరకు ఆన్‌లైన్‌కు అనుమతి ఇవ్వలేదు. వెబ్‌సైట్ ఆన్‌లో ఉంటేనే ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు చెల్లించే వీలు ఉంది.

 ఇళ్లు మంజూరు అయినా ఎంతో కొంత బిల్లు చెల్లింపు జరుపకపోవడంతో 70 వేల ఇళ్లు రద్దు కానున్నాయని సంబంధిత అధికారిక వర్గాలు చెబుతున్నాయి. పాతవి, కొత్తవి కలుపుకుని 1.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 25 వేల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరో 25 వేల ఇళ్లు 50 శాతం నిర్మాణ దశను పూర్తి చేసుకున్నాయి. 30 వేల ఇళ్ల నిర్మాణం మొదలు కావడంతో 10 శాతం బిల్లు చెల్లింపు జరిగింది. 70 వేల ఇళ్లకు అసలే బిల్లు చెల్లింపు జరుగకపోవడంతో అవి రద్దు కానున్నాయి.

 మంజూరు అయి రద్దు అవుతున్న ఇళ్ల స్థానంలో రెండు బెడ్‌రూంలు, హాలు, కిచెన్, అటాచ్డ్ బాత్‌రూం గల ఇంటిని మంజూరు చేస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పథకం ప్రకారం తమకు ఇళ్లు మంజూరు అయితే పర్వాలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం విషయమై ప్రభుత్వ పాలసీ ఖరారు కాక పోవడంతో ఇప్పుడే ఏమీ చెప్పలేమని అధికారులు అంటున్నారు.


 ఇప్పుడే ఏమీ చెప్పలేం
 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వెబ్‌సైట్ క్లోజ్ అయ్యింది. వెబ్‌సైట్ ఆన్‌లో ఉంటే ఏదైనా చెప్పగలం. ఇళ్లు రద్దు విషయం మాకు అధికారికంగా ఇంకా తెలియలేదు. బిల్లులు అసలే చెల్లించకుంటే ఆ ఇళ్లను రద్దు చేస్తారా లేక కొత్త పథకం కింద తీసుకుంటారో ఇంకా స్పష్టత లేదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement