
ఇంట్లో వంటలు చేస్తూ.. అదే చేత్తో ఏదో వేణ్నీళ్లకు చన్నీళ్లు అన్నట్లు పరిమితంగా కేటరింగ్ సేవలు కూడా అందించే హోమ్ చెఫ్స్ అనేది ఇప్పుడు పాత చరిత్ర. స్టార్ హోటల్స్ అధిపతులతో మీటింగ్‌లూ, బడా రెస్టారెంట్లలో ఈటింగ్‌లూ వెరసి పాపులర్ హోమ్‌చెఫ్స్ జాబితాలో లిస్టింగ్‌లూ కామన్‌గా మారుతోంది.. ప్రస్తుతం నడుస్తున్న చరిత్రకావచ్చు.. ట్రెండ్ కావచ్చు.. మొత్తానికి ఇంటి రుచులకు కేరాఫ అడ్రస్‌గా నిలుస్తున్నారు హోమ్ చెఫ్స్..
హైదరాబాద్ నగరంలో రెస్టారెంట్ ఫుడ్ ఫెస్టివల్స్‌లో హోమ్ చెఫ్‌లు ఎక్కువగా పాల్గొంటున్నారు. ప్రత్యేకమైన శైలితో భోజనప్రియులకు కొత్త అనుభవాలు పంచుతున్నారు. హోమ్ చెఫ్స్ కూడా వింత రుచులను వండి వడ్డిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రాంతీయ ప్రత్యేకతలను అచ్చంగా అదే విధంగా అందించడం వీరితోనే సాధ్యమవుతుండడంతో నగరంలోని దాదాపు ప్రతి స్టార్ హోటల్, టాప్ క్లాస్ రెస్టారెంట్ వీరి సేవలను వినియోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి.
లోకల్.. రుచులు
ఇటీవల సోమాజిగూడలోని ఆక్వా, ది పార్క్‌లో జరిగిన ‘బోనాలు ఫెస్ట్’ దప్పళం, (మేక ఆఫల్) మేక తల కూర వంటి వంటకాలతో తెలంగాణ అచ్చమైన రుచులను ప్రదర్శించింది అంటే కారణం దానికి సారథ్యం వహించింది ఓ హోమ్ చెఫ్. అదే విధంగా రాయలసీమ రుచుల పండుగకు గానీ, గోదావరి ఘుమఘుమలు వడ్డించాలన్నా గానీ.. నగరంలోని హోమ్ చెఫ్స్‌కు జై కొట్టాల్సిందే అంటున్నాయి రెస్టారెంట్స్.
గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్ ఏకంగా ఏడుగురు హోమ్ చెఫ్స్‌తో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి సందడి సృష్టించింది. ఈ ఫెస్టివల్‌లో ఆర్కిటెక్ట్ అయిన మీరా, ప్రీ స్కూల్ యజమాని అయిన స్ఫూర్తి, నిజామీ వంటకాలను ఇంటి నుంచే అందించే షహీన్, మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తున్న శ్రియ.. ఇలా భిన్న రంగాలకు చెందిన మహిళలు పాకశాస్త్రంలో ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ రుచుల పండుగకు సారధ్యం వహించారు.
ఇతర నగరాల నుంచి..
ఇంటి వంటకు, ఇంతి వంటకు రెస్టారెంట్స్ పెద్ద పీట వేయడం అనేది స్థానిక మహిళల వరకే పరిమితం కాలేదు. పలు నగరాల నుంచి కూడా హోమ్ చెఫ్స్ నగరానికి తరలి వచ్చేందుకు ఇది దోహదం చేస్తోంది. ఇటీవలే నాగా క్యూలినరీ ట్రయల్స్: గోవా నుంచి హోమ్ చెఫ్ అలిస్టైర్ లెథోర్న్ వచ్చిది పార్క్‌లో నాగా వంటకాలను ప్రదర్శించారు. ఫ్యూజన్ ఫుడ్‌తో పాటు క్లాసిక్ నాగా వంటకాలను అందించారు.
(చదవండి: అరే..! మరీ ఇలానా..! గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?)
అమ్మతో ఆరంభం.. అత్తమ్మతో నైపుణ్యం..
నగరంలోని మారియట్ హోటల్ వేదికగా గత నెల్లో బొహ్రా క్యుజిన్‌ను నగరవాసులకు రుచి చూపించారు అలిఫియా అమ్రేలివాలా. తన భర్త అజీజ్‌తో సహా వచ్చి కొన్ని రోజుల పాటు నగరానికి గెస్ట్‌గా ఉండి.. తమ వెరైటీ వంటకాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో ముచ్చటించారు.
ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘చిన్నప్పటి నుంచి వంట చేయడం ఇష్టం, అమ్మ దగ్గర కొంత నేర్చుకున్నా, పెళ్లి తర్వాత, మా అత్తగారి నుంచి మరిన్ని నైపుణ్యాలను అలవర్చుకున్నా.., నా భర్త అజీజ్ కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా, నేను ఇంటి పరిసరాల్లోనే క్యాటరింగ్ ప్రారంభించా. కాలక్రమంలో నా భర్త కూడా సహకారం అందిస్తుండడంతో మా మెనూ విస్తరించాం.
ముంబైలో పలు ప్రాంతాల్లో ఫుడ్ ఫెస్ట్‌లు నిర్వహించి, పలు నగరాల నుంచి ఆహ్వానాలు వస్తుండడంతో పూణె, హైదరాబాద్‌లోనూ ఫుడ్ ఫెస్ట్‌లను ఏర్పాటు చేశాం. హైదరాబాదీలు మా వంటకాలను రుచి చూసి, వావ్ ఇవి వెరైటీగా బాగున్నాయి అంటూ కొనియాడడం మాకు ఎంతో సంతృప్తిని అందించింది.
– అలియా, హోమ్ చెఫ్, ముంబై
(చదవండి: Golden Chariot Tour: ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా..జస్ట్ ఒకే రైలుబండిలో..!)