home chefs
-
కుకింగ్ టు కామెడీ క్వీన్స్..
ఒకరు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అయ్యారు.. మరొకరు హెల్త్ కోచ్ అయ్యారు ఇంకొకరు పాకశాస్త్ర ప్రావీణ్యతను చాటుతున్నారు. పై చదువులు చదివి ఇంట్లో కూర్చున్న మహిళలు ఇంటర్నెట్లో ప్రభావశీలురుగా మారారు. ఇంటినుంచే వ్యాపారాన్ని అభివృద్ధి వైపుగా పరుగులు తీయిస్తున్నారు. సాధారణంగా గృహిణి జీవితం ఉదయం 4–5 గంటలకు నిద్రలేచి, ఇల్లు–వాకిలి శుభ్రం చేసుకొని, పిల్లలను స్కూల్‌కు పంపించి, అందరికీ అవసరమైనవి చేసి పెడుతుండగానే సాయంత్రం అవుతుంది. తిరిగి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. సాయంత్రం టీ, టిఫిన్లు, పిల్లల హోంవర్క్‌లు, రాత్రి భోజనం సిద్ధం చేయడం. రాత్రి పది–పదకొండు గంటలలోపు అన్నీ శుభ్రం చేసి అలసిపోయి అదే చిరునవ్వుతో అందరికీ గుడ్‌నైట్ చెప్పి నిద్రపోవడం. ఇలా ఇల్లు, పెద్దలు, భర్త, పిల్లల గురించి ఆలోచిస్తూ తమని తాము విస్మరించుకునే మహిళలకు ఇప్పుడు ఇంటినుంచే పని చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. మంగళూరుకు చెందిన లిండా ఫెర్నాండేజ్ క్రెస్టా గృహిణి. నాలుగేళ్లుగా కామిక్ రీల్స్ చేస్తూ ప్రజాదరణ పొందింది. క్రెస్టాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అనేక బ్రాండ్లు ఆమెను సంప్రదిస్తూనే ఉన్నాయి. ఈ రోజు మంగళూరు వీధుల్లో ఆమె హోర్డింగులు కూడా పెట్టారంటే ఆమెకున్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవచ్చు. ‘గృహిణిగా ఉండటం ఎప్పుడూ కష్టమనిపించలేదు. కానీ, నా కొడుకుకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనుకున్నాను. దీంతో పాటు ఇంటి బాధ్యతనూ నిర్వర్తించాలనుకున్నాను. అందుకు మా కుటుంబమూ మద్దతు ఇస్తూ వచ్చింది’ అని చెబుతుంది క్రెస్టా. హోమ్ చెఫ్ నాజ్ అంజుమ్ హైదరాబాద్‌లో నివాసముంటున్న హోమ్ చెఫ్. ఏడేళ్ల క్రితం అంజుమ్ తన పేరుతో హోమ్ కిచెన్‌ను ప్రారంభించింది. ఈ రోజుల్లో గృహిణుల ఆలోచనే మారిపోయింది అనడానికి అంజుమ్ ఒక ఉదాహరణ. కాలంతో పాటు సమాజం ఆలోచనా విధానం కూడా మారింది. ఇంట్లో కూర్చున్నా నాకు సోషల్‌మీడియా చాలా ఆర్డర్లు తెచ్చిపెడుతోంది అని చెబుతుంది అంజుమ్. ‘నాకు ముగ్గురు పిల్లలు. ఉదయం 4 గంటలకు నిద్రలేచి, వారిని స్కూల్‌కి రెడీ చేసి, పంపించిన తర్వాత కిచెన్ బాధ్యత తీసుకుంటాను. 80 రూపాయలతో నా పని ప్రారంభించాను. మా చుట్టూ ఉన్నవారు నా వంటలు తిని మెచ్చుకునేవారు. మా అపార్ట్మెంట్ వాసులు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయమని సలహా ఇచ్చారు. అలా చేసిన వంటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదాన్ని. ఆర్డర్లు వరుసగా రావడం ప్రారంభించాయి. ఈ రోజు సోషల్‌మీడియాలో హైదరాబాద్ ఫుడ్ సూపర్ హిట్‌గా పేరొందింది. దీంతో ఒక గృహిణిగా ఉన్న నేను ఉద్యోగినిగా మారిపోయాను’’ అని ఆనందంగా చెబుతుంది అంజుమ్. గృహిణి నుంచి ఒక మహిళ గృహ నిర్వాహకురాలిగా మారింది. ఈ ౖహె టెక్ ప్రపంచంలో గృహిణి తనకంటూ కొత్త బిరుదును సంపాదించుకుంటుంది. ఇప్పుడు తనను తాను పని చేసే గృహిణి అని పిలవడానికి ఇష్టపడుతుంది. ఇంట్లో ఉంటూ డబ్బు సంపాదిస్తూ, బాధ్యతలను నెరవేర్చడంలో తనదైన ప్రత్యేక శైలిని కలిగి ఉంది. మారుతున్న కాలంలో ఈ తరహా ఆలోచన గృహిణితో పాటు ఇంట్లో అందరికీ నచ్చుతోంది. చేతి కళకు ఆదరణ నేటి యాంత్రిక యుగంలో చేతితో తయారు చేసిన వస్తువులు దొరకడం కష్టం. నాణ్యమైన సంప్రదాయ పనితనం కోసం అన్ని వైపుల నుండి డిమాండ్ వస్తోంది. ప్రావీణ్యం కలిగిన మహిళలు తమ నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో చాలా మంది గృహిణులు తమ జ్ఞానం ఆధారంగా హోమ్ ట్యూషన్, బ్యూటీపార్లర్ వంటి సేవలను కూడా అందిస్తున్నారు. జర్నల్ ఆఫ్ కల్చరల్ ఎకానమీలో ప్రచురించిన ఒక అధ్యయనం సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్లు గృహిణిని ‘అందం’ గా మార్చేశాయి అని నిర్వచించింది. సంప్రదాయ గృహిణులు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలుగా కూడా మారారు. ఈ చిన్న ఆరంభం మహిళను ఉద్యోగ గృహిణిని చేసింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2020–21లో దేశంలో కేవలం 32 శాతం వివాహిత మహిళలు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. వివాహిత మహిళల్లో 68 శాతం మంది గృహిణులుగా ఉన్నారు. మారిన కాలంలో ఇప్పుడు గృహిణిగా ఇంట్లో ఉంటూనే ఆర్థిక స్వావలంబన సాధిస్తోంది. ఇది ‘ఆమె’ నైపుణ్యాన్ని మరింతగా పెంచుతుంది. భారతదేశంలో చాలా మహిళలు నైపుణ్యం ఉన్నవారే. కొందరు కుట్లు–ఎంబ్రాయిడరీ చేయడంలో, కొందరు వంటలలో, మరికొందరు పెయింటింగ్‌లో నిష్ణాతులు. పనిచేసే గృహిణికి ఆమె ప్రతిభే ఆదాయ వనరుగా మారుతోంది. గృహిణి నిర్వచనంలోనే మార్పు.. కరోనా లాక్డౌన్ కారణంగా సోషల్ మీడియా గృహిణులకు డబ్బు సంపాదించే శక్తిని ఇచ్చింది. ఇప్పుడు అదే రోజువారీ దినచర్యగా మారిపోయింది. యుఎస్ జనరల్ సోషల్ సర్వే 1972 నుండి 2020 వరకు ఒక సర్వే నిర్వహించింది. ఇందులో శ్రామిక మహిళలు, పని చేసే గృహిణులు ఎంతో సంతోషంగా ఉన్నారని భావించారు. వీళ్లలో ఎక్కువ మంది మధ్య, ఉన్నత తరగతికి చెందిన 40 ఏళ్ల పైబడిన వారు. ఉద్యోగరీత్యా గృహిణిగా ఉన్నా ఇంటి నిర్వహణ, సంపాదనతో పాటు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తున్నామనే విషయాలను ఈ సర్వే వెల్లడి చేసింది. -
మీ వంటనూ రుచి చూపించండి
ప్రాంతాలను బట్టి కొన్ని కుటుంబాలకే ప్రత్యేకమైన సంప్రదాయ వంటకాలను డోర్ డెలివరీ ద్వారా అందరికీ పరిచయం చెయ్యాలనుకున్నారు లీనా దీక్షిత్. అనుకోవడమే కాదు, ఒక హోమ్ ఫుడ్ కంపెనీని పెట్టి సాటి మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఇది ఆమె ఒక్కరి సక్సెస్ స్టోరీనే కాదు, రుచిగా వంట చేయడం తెలిసిన మరికొందరు మహిళల ఇన్స్పైరింగ్ స్టోరీ కూడా. తాము డెలివరీ చేస్తున్న వంటకాలను ఎలా తయారు చేసుకోవచ్చో కూడా ఈ స్టార్టప్ కంపెనీ చెబుతుంది! అనురాధ హవల్దార్ ఉండేది నాగపూర్‌లో. వంట చేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం. కొన్ని స్థానిక వంటల పోటీలలోనూ, టెలివిజన్ షోలలోనూ పాల్గొంది. ఉదయాన్నే పనులన్నీ ముగించుకొని 7 గంటల నుంచి మోదక్‌లను తయారుచేయడం మొదలుపెడుతుంది. బెల్లం, కొబ్బరి, ఇలాచీ పొడి, నెయ్యి వేసి మిశ్రమం తయారు చేసుకుంటుంది. ఈ మిశ్రమాన్ని బియ్యప్పిండి గవ్వలలో కూరి రుచికరమైన మోదక్‌లను తయారుచేస్తుంది. వీటిని ఓ డబ్బాలో పెట్టే సమయానికి డెలివరీ బాయ్ వచ్చి తీసుకెళతాడు. ఇలాగే మసాలా పావ్, సాబుదనా కిచిడీ... ఇలా రోజూ వచ్చిన ఆర్డర్లను బట్టి అనురాధ 4–5 రకాలవి తయారుచేసి ఇస్తుంటుంది. ముఖ్యంగా పండగల సమయంలో. ఆ తర్వాత అనురాధ ‘హోమ్ చెఫ్’గా నాగపూర్‌లోని ‘నేటివ్ చెఫ్’ అనే ఫుడ్ డెలివరీ స్టార్టప్‌లో చేరింది. ఈ స్టార్టప్ కేవలం ఫుడ్ డెలివరీనే కాదు. ఇంట్లో తయారుచేసుకోదగిన సంప్రదాయ వంటకాల తయారీని కూడా పరిచయం చేస్తోంది. ఆ సంస్థ యజమానే లీనా దీక్షిత్. హోమ్ చెఫ్‌లుగా చేరొచ్చు ‘నేటివ్ చెఫ్స్’ వ్యవస్థాపకురాలు లీనా దీక్షిత్ గతంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని. సంప్రదాయ వంటకాలను ఇంట్లో తయారుచేసి అందించేవారి కోసం కిందటేడాది మే నెలలో ఆమె ఈ స్టార్టప్‌ని ప్రారంభించారు. మహిళలకు వ్యాపార ప్రణాళికలను రూపొందించడం, సూచనలు ఇవ్వడం ఆన్లైన్ ద్వారానే చేస్తారు లీనా. ఆమె సహకారంతో.. ఖర్చు, ధర, మార్కెటింగ్ నైపుణ్యాలను అర్థం చేసుకున్న వంద మంది మహిళలు లీనాతో చేరారు. కిందటి నెల చివరి నాటికి ఆమె సంస్థకు అనుసంధానమైన హోమ్ చెఫ్‌లు పదహారు మంది. వీరు సంప్రదాయ వంటకాల జాబితా, వంటల రుచి–నాణ్యతను ముందుగా పర్యవేక్షిస్తారు. తర్వాత యాప్ ద్వారా పరిచయం చేస్తారు. తరతరాల వంటకాలు ‘‘ఇక్కడ మేము తరతరాలుగా ఒక నిర్దిష్ట కుటుంబంలో ఉన్న వంటకాలను, వంటలను మేం ఎంచుకుంటాం. ఈ వంటకాల అసలు రుచితో ప్రజలకు కనెక్ట్ కావాలనుకుంటున్నాం’’ అని సంతోషంగా చెప్తారు లీనా. నేటివ్ చెఫ్స్‌లో నూట యాభై రకాల వంటకాల తయారీ గురించి ఉంటుంది. కావాలనుకున్నవారు వాటిని తయారుచేసుకోవచ్చు. ప్రస్తుతం నేటివ్ చెఫ్స్ వినియోగదారుల సంఖ్య 900కి చేరింది. – ఆరెన్నార్ -
అమ్మ వంట.. యాదికొచ్చెనంట
‘‘ఈ నువ్వుల కజ్జియాయ స్వీట్ తింటుంటే అచ్చం మా అమ్మమ్మ చేసినట్టే ఉంది. ఈ బగారా అన్నం అచ్చం మా అమ్మ వండినట్టుంది’’.. అంటూ చెమర్చిన కళ్లతో నెమరేసుకునే సందర్భాలు,ఆశ్చర్యానందాలు ఇప్పుడునగరవాసులకు తరచూ ఎదురవుతున్నాయి. దీనికి కారణం సిటీరెస్టారెంట్స్లో మొదలైన హోమ్ చెఫ్స్ ట్రెండ్. ‘నానమ్మ చేతి వంట ముందు నలభీమ పాకం కూడాదిగదుడుపే.. అమ్మ వంట ముందు ఐదు నక్షత్రాల హోటళ్లూ చిన్నబోవాల్సిందే’.. ఇంటి వంటని ఇష్టపడే వాళ్లు తరచుగా తన్మయత్వంతో పలికే పలుకులివి. ఇప్పుడు నగరంలోని స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్ కూడా ఆ పలుకులే వల్లెవేస్తున్నాయి. ఇంటి వంట అని చెప్పి మరీ వడ్డిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో :కొన్నేళ్ల క్రితం నగరంలోని తాజ్ బంజారా హోటల్ ప్రయోగాత్మకంగా ఒక హోమ్ చెఫ్‌ని తమ వంటల కోసం ప్రత్యేకంగా ఆహ్వానించింది. అప్పట్లో ఇది సిటీలో టాక్ ఆఫ్ ది రెస్టారెంట్ ఇండస్ట్రీగా మారింది. అయితే, తర్వాత ఎవరూ పెద్దగా అటువంటి ప్రయోగాల జోలికి పోలేదు. తిరిగి ఇటీవల కొన్ని నెలలుగా నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్‌లో ఈ ట్రెండ్ ఊపందుకుంది. పలు పేరొందిన రెస్టారెంట్స్ హోమ్ చెఫ్స్‌ను ఆహ్వానిస్తూ నగరవాసులకు వైవిధ్యభరితమైన వంటలను అందిస్తున్నాయి. మరికొన్ని రెస్టారెంట్స్ ఏకంగా హోమ్ చెఫ్స్తో ఫుడ్ ఫెస్టివల్ సిరీస్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మొదలైంది.. సిటీలో బోలెడన్ని థీమ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అదిరిపోయే థీమ్స్‌తో ఆడంబరంగా కనిపించే యాంబియన్స్‌తో అతిధులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఏ వంటకమైనా క్షణాల్లో అందించే చేయి తిరిగిన చెఫ్స్ ఉన్నారు. ఇంత ఉన్నా ఇంటి వంటకు ఎందుకీ డిమాండ్? ఎంతో కాలంగా ఇంటి వంటకు దూరమైపోతున్న నగరవాసుల కోసమే ఈ ట్రెండ్ మొదలైంది. ‘ఇది ఇండియా వ్యాప్తంగా పుట్టుకొచ్చిన ట్రెండ్. బెంగళూర్, చెన్నై, ఢిల్లీలో కూడా మేం త్వరలో హోమ్ చెఫ్స్తో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నాం’ అని హైదరాబాద్ ఫుడీస్ క్లబ్ నిర్వాహకులు సంకల్ప్ చెప్పారు. రా రమ్మని.. నేర్చుకోమని.. వంటల్లో చేయి తిరిగిన గృహిణులను రెస్టారెంట్స్ ఆహ్వానిస్తున్నాయి. పలు ఫుడీస్ క్లబ్స్ ద్వారా, వంటల పోటీల్లో పాల్గొనే సరదా ఉన్నవారిని గుర్తించి తమ అతిథుల కోసం ప్రత్యేకంగా వండి వడ్డించే అవకాశం ఇస్తున్నాయి. అయితే, హోమ్ చెఫ్స్‌లో చాలా మందికి ఇంటి నుంచి బయటకి వచ్చి వండడం గానీ, భారీ పరిమాణంలో వండే అలవాటు గాని ఉండదు. దీనికి అవసరమైన కాలిక్యులేషన్స్ తెలియవు కాబట్టి తొలుత కాస్త సంశయిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెస్టారెంట్స్లోని చెఫ్స్ వీరికి కొంత ప్రాధమిక శిక్షణ ఇస్తారు. చెప్పుకోదగ్గ స్థాయిలోనే హోమ్ చెఫ్స్కి రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు. దీంతో ఈ ట్రెండ్ మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరే నగరాల్నుంచీ కూడా.. నగరంలోని మహిళలతో పాటుగా విభిన్న సిటీల నుంచి కూడా హోమ్ చెఫ్స్‌ని సిటీ రెస్టారెంట్స్ ఆహ్వానిస్తుండడం విశేషం. తాజాగా సిటీలో రాయలసీమ వంటకాలకు పేరొందిన రాయలసీమ రుచులు రెస్టారెంట్ ఆధ్వర్యంలో హోమ్ చెఫ్ జ్యోతి వలబోజు వంటకాలతో తెలంగాణ రుచుల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇటీవల సోమాజిగూడలోని పార్క్ హోటల్లో కోల్‌కతా నుంచి హోమ్ చెఫ్‌లు, అక్కాచెల్లెళ్లు అయిన స్వర్నాలిపాల్, సర్బానీ లాహిరితో బెంగాలీ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఇంటి వంటకే ఓటేస్తున్నారు కొన్ని ప్రత్యేకమైన వంటకాలను ఇంట్లో మహిళలు వండితే వచ్చిన రుచి ఎంత చేయి తిరిగిన చెఫ్‌ల చేసినా రాకపోవచ్చు. సిటీలో కమర్షియల్ కిచెన్స్ బాగా వచ్చాయి. దాదాపు అన్ని రకాల క్యూజిన్లూ అందుబాటులో ఉన్నాయి. అయినా ఇంటి వంటను మిస్సవుతున్నామనే అభిప్రాయం చాలామంది ఫుడ్ లవర్స్‌లో ఉంది. దీంతో హోమ్ చెఫ్స్‌కు సిటీ రెస్టారెంట్స్‌లో అవకాశం లభిస్తోంది. – సంకల్ప్, హైదరాబాద్ ఫుడీస్ క్లబ్ -
ఇంటాయనలు వండేస్తారట.. కాసుకోండి!
ముంబై:అవకాశం రావాలే గానీ.. మగువల కంటే మగాళ్లే చక్కగా వండి వడ్డిస్తారన్నది సత్యం. పెద్ద పెద్ద హోటళ్లలో అయితే వీళ్లను గౌరవంగా 'చెఫ్' అని పిలుస్తారు. అదే ఇంట్లో అయితే.. 'వంటాయన' అనే చిన్న బిరుదు తగిలిస్తారు. ఇలాంటి ఇంటి వంటాయనలంతా కలిసి ఒక్కచోట చేరి తమ ఘుమఘుమలు రుచి చూపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ముంబైలో ఇలాంటి కార్యక్రమమే జరగనుంది. సింధీ, గుజరాతీ, ఈస్ట్ ఇండియా, మహారాష్ట్ర, ఉత్తరభారత ఒక్కటేమిటి దాదాపు 20 ప్రాంతాల నుంచి ఇంటి రుచుల కార్యక్రమంలో ఆయా ప్రాంతాలకు చెందిన వండివార్చేవారు పాల్గొంటారు. ఇందులో పురుషులు, మహిళలు కూడా పాల్గొనవచ్చు. గుర్గావ్లోని వెస్టిన్ ముంబైగార్డెన్ సిటీలో ప్రముఖ వంటల రచయిత మినీ రిబైరో దీనిని ఆదివారం నిర్వహిస్తున్నారు. ఇదో రకమైన వంటల మేళాలాంటిది. మాములుగా ఇళ్లలో వంటలు చేసేవారితోపాటు వంటను తమ అభిరుచిగా ఎంచుకున్న వారంతా ఈ కార్యక్రమంలో తమ సత్తాను ప్రదర్శించవచ్చు. అదిరిపోయే రుచులతో కూడిన ఆహార పదార్థలతో వచ్చిన వారికి ది బెస్ట్ హోం చెఫ్‌గా అవార్డు కూడా ఇవ్వబోతున్నారు. ఈ అవార్డును ఫిలిప్స్ ఇండియా అందిస్తుండగా.. మాస్టర్ చెఫ్ అజయ్ చోప్రా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. దేశంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఆరంభం మాత్రమేనని, టాలెంట్ ఉన్నవారిని వెలుగులోకి తీసుకురావడంతో పాటు, వంటలు చేయడంలో మెళకువలు నేర్పించాలనే ఉద్దేశంతో దీనిని నిర్వహిస్తున్నామని మినీరిబైరో తెలిపారు.