ప్రాంతాలను బట్టి కొన్ని కుటుంబాలకే ప్రత్యేకమైన సంప్రదాయ వంటకాలను డోర్ డెలివరీ ద్వారా అందరికీ పరిచయం చెయ్యాలనుకున్నారు లీనా దీక్షిత్. అనుకోవడమే కాదు, ఒక హోమ్ ఫుడ్ కంపెనీని పెట్టి సాటి మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఇది ఆమె ఒక్కరి సక్సెస్ స్టోరీనే కాదు, రుచిగా వంట చేయడం తెలిసిన మరికొందరు మహిళల ఇన్‌స్పైరింగ్ స్టోరీ కూడా. తాము డెలివరీ చేస్తున్న వంటకాలను ఎలా తయారు చేసుకోవచ్చో కూడా ఈ స్టార్టప్ కంపెనీ చెబుతుంది!
అనురాధ హవల్దార్ ఉండేది నాగపూర్‌లో. వంట చేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం. కొన్ని స్థానిక వంటల పోటీలలోనూ, టెలివిజన్ షోలలోనూ పాల్గొంది. ఉదయాన్నే పనులన్నీ ముగించుకొని 7 గంటల నుంచి మోదక్‌లను తయారుచేయడం మొదలుపెడుతుంది. బెల్లం, కొబ్బరి, ఇలాచీ పొడి, నెయ్యి వేసి మిశ్రమం తయారు చేసుకుంటుంది. ఈ మిశ్రమాన్ని బియ్యప్పిండి గవ్వలలో కూరి రుచికరమైన మోదక్‌లను తయారుచేస్తుంది. వీటిని ఓ డబ్బాలో పెట్టే సమయానికి డెలివరీ బాయ్ వచ్చి తీసుకెళతాడు.
ఇలాగే మసాలా పావ్, సాబుదనా కిచిడీ... ఇలా రోజూ వచ్చిన ఆర్డర్లను బట్టి అనురాధ 4–5 రకాలవి తయారుచేసి ఇస్తుంటుంది. ముఖ్యంగా పండగల సమయంలో. ఆ తర్వాత అనురాధ ‘హోమ్ చెఫ్’గా నాగపూర్‌లోని ‘నేటివ్ చెఫ్’ అనే ఫుడ్ డెలివరీ స్టార్టప్‌లో చేరింది. ఈ స్టార్టప్ కేవలం ఫుడ్ డెలివరీనే కాదు. ఇంట్లో తయారుచేసుకోదగిన సంప్రదాయ వంటకాల తయారీని కూడా పరిచయం చేస్తోంది. ఆ సంస్థ యజమానే లీనా దీక్షిత్.
హోమ్ చెఫ్‌లుగా చేరొచ్చు
‘నేటివ్ చెఫ్స్’ వ్యవస్థాపకురాలు లీనా దీక్షిత్ గతంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. సంప్రదాయ వంటకాలను ఇంట్లో తయారుచేసి అందించేవారి కోసం కిందటేడాది మే నెలలో ఆమె ఈ స్టార్టప్‌ని ప్రారంభించారు. మహిళలకు వ్యాపార ప్రణాళికలను రూపొందించడం, సూచనలు ఇవ్వడం ఆన్‌లైన్ ద్వారానే చేస్తారు లీనా. ఆమె సహకారంతో.. ఖర్చు, ధర, మార్కెటింగ్ నైపుణ్యాలను అర్థం చేసుకున్న వంద మంది మహిళలు లీనాతో చేరారు. కిందటి నెల చివరి నాటికి ఆమె సంస్థకు అనుసంధానమైన హోమ్ చెఫ్‌లు పదహారు మంది. వీరు సంప్రదాయ వంటకాల జాబితా, వంటల రుచి–నాణ్యతను ముందుగా పర్యవేక్షిస్తారు. తర్వాత యాప్ ద్వారా పరిచయం చేస్తారు.
తరతరాల వంటకాలు
‘‘ఇక్కడ మేము తరతరాలుగా ఒక నిర్దిష్ట కుటుంబంలో ఉన్న వంటకాలను, వంటలను మేం ఎంచుకుంటాం. ఈ వంటకాల అసలు రుచితో ప్రజలకు కనెక్ట్ కావాలనుకుంటున్నాం’’ అని సంతోషంగా చెప్తారు లీనా. నేటివ్ చెఫ్స్‌లో నూట యాభై రకాల వంటకాల తయారీ గురించి ఉంటుంది. కావాలనుకున్నవారు వాటిని తయారుచేసుకోవచ్చు. ప్రస్తుతం నేటివ్ చెఫ్స్ వినియోగదారుల సంఖ్య 900కి చేరింది.
– ఆరెన్నార్
Comments
Please login to add a commentAdd a comment