Traditional dishes
-
తిరుమలలో నిరంతరాయంగా నిత్యాన్నదానం
తిరుమల/తిరుపతి రూరల్: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదన్నారు. సంప్రదాయ భోజనాన్ని టీటీడీ విక్రయించడం లేదన్నారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ విజయవంతం కాకపోవడంతో నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు. టీటీడీ పాలక మండలి లేని సమయంలో అధికారులు ఒక మంచి ఉద్దేశంతో గో ఆధారిత ఉత్పత్తులతో తయారు చేసిన సంప్రదాయ భోజనం భక్తులకు అందించాలని ఆలోచన చేశారని, దీనిని మాత్రమే నిలిపి వేస్తున్నామని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. భక్తులు నమ్మొద్దని ఆయన కోరారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసే వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవనీత సేవ ప్రారంభం శ్రీవారికి వెన్న సమర్పించే నవనీత సేవను శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని సోమవారం ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి గోశాల నుంచి వెన్న తీసుకుని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని అర్చకులకు అందజేశారు. ముందుగా పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, చైర్మన్, ఈవో వెన్న తయారీని పరిశీలించారు. వెన్న తీసుకెళ్లి స్వామికి సమర్పించేందుకు గాను 1.12 కేజీల వెండి గిన్నెను టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి బహూకరించారు. ఏనుగుల ఘీంకారం వెన్న ఊరేగింపు సందర్భంగా ఏనుగుల ఘీంకారం భక్తులను భయాందోళనలకు గురి చేసింది. ఊరేగింపు మొదట్లో గోశాల వద్ద శ్రీవారి వృషభం అటూఇటూ పరుగెత్తేందుకు ప్రయత్నించగా సిబ్బంది నిలువరించారు. అనంతరం ఊరేగింపు శ్రీవారి పుష్కరిణి సమీపంలోని మాడ వీధి మీదుగా వస్తుండగా ఆకస్మాత్తుగా ఏనుగులు ఘీంకారం చేశాయి. పక్కనే ఉన్న మావటిలు వాటిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో భక్తులు భయాందోళనలతో పరుగులు తీయగా.. ఏనుగులు మరింత భయానికి గురై ఘీంకారాలు కొనసాగించాయి. భద్రతా సిబ్బంది సహకారంతో ఏనుగులను మావటిలు గోశాలకు తీసుకెళ్లారు. రెండు, మూడు రోజుల్లో సర్వదర్శనం టికెట్లు శ్రీవారి సర్వదర్శన టికెట్లను భక్తులకు రెండు, మూడు రోజుల్లో అందించేలా అధికారులు, జిల్లా యంత్రాంగంతో చర్చిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సామాన్య భక్తుల విజ్ఞప్తుల మేరకు ప్రస్తుతం అందిస్తున్న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ టికెట్ల కోటాలోనే 20 నుంచి 30 శాతం టికెట్లను సర్వదర్శనం భక్తులకు కేటాయించేలా చూడాలని అధికారులకు సూచించామని తెలిపారు. ప్రస్తుతం కరోనా ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై అధికారులు చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. చైర్మన్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. -
బ్రిటిష్ దొరల ప్రశంసలు పొందిన ‘లచ్చించారు’
మండపేట (తూర్పుగోదావరి జిల్లా): ఘుమఘుమలాడే లచ్చించారులో గొంగూర పచ్చడి నంచుకుంటే ఆ రోజు విందు మహా పసందే. వేడివేడి అన్నంలో లచ్చించారును కొసరి కొసరి వడ్డిస్తుంటే లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. వండర్ఫుల్ సూప్ అని బ్రిటిష్ దొరల కితాబు పొందిన లచ్చించారు రుచికే కాదు ఆరోగ్యానికి దివ్య ఔషధమే. తెలుగింటి వంట లచ్చించారు ఘుమఘుమలు రానురాను కనుమరుగవుతున్నాయి. అసలు పేరు లక్ష్మీచారు అయినా వాడుకలో లచ్చించారుగా మారింది. గతంలో వేసవికాలం రాగానే పల్లెటూర్లలో దాదాపు అందరి ఇళ్లలోను లచ్చించారు కుండను ఆనవాయితీగా పెడుతుండేవారు. మట్టికుండకు పసుపు రాసి, కుంకుమ బొట్టులు పెట్టి గదిలో ఓ మూలన ఉంచి సంప్రదాయబద్ధంగా లక్ష్మీదేవిని పూజించేవారు. ఆరోజు నుంచి ఇంట్లో బియ్యం కడిగిన నీళ్లను ఆ కుండలో పోసేవారు. ఇలా నాలుగు రోజుల వరకు ఉంచితే కడుగు నీళ్లు బాగా పులుస్తాయి. ఈ పులిసిన కడుగులో వంకాయలు, టమాట, బెండకాయలు, మునగకాడ, కొత్తిమీర వేసి తాలింపు పెడితే ఘుమఘుమలాడే లచ్చించారు తయారయ్యేది. కాయగూరలతో పాటు ఎండిరొయ్యల తలలు వేసి కాసిన లచ్చించారులో ఉప్పు చేప నంచుకుంటే ఆ టేస్టే వేరంటారు మాంసాహార ప్రియులు. అతిథులు వచ్చినప్పుడు ఈ లచ్చించారు కుండ కూరై ఆపద్బాంధవుడిలా ఆదుకునేదని పెద్దలు చెబుతుంటారు. బియ్యపు కడుగులో ‘డి’ విటమిన్‌తో పాటు లచ్చించారులో ఉండే ఎన్నో బలవర్థకమైన పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నమ్మకం. ఒక ఇంటి వారు కుండ ఏర్పాటు చేసుకుంటే ఇరుగు పొరుగు ఆ కడుగు ద్రావణాన్ని తీసుకువెళ్లి లచ్చించారు కాచుకోవడం పల్లెల్లో కనిపించేది. సూప్స్, పాశ్చాత్య వంటకాల మోజులో కాలక్రమంలో సంప్రదాయబద్ధంగా వచ్చిన లచ్చించారు కనుమరుగైపోతోంది. సెంటిమెంట్ల చారు ►జిహ్వకు వహ్వా అనిపించే లచ్చించారుకు సెంటిమెంట్లు ఎక్కువే. దాళ్వా పంట ఇంటికి చేరగానే లక్ష్మీదేవిని పూజించి ఆ బియ్యాన్ని తీసుకుని దానిని కడగగా వచ్చిన నీటి(కడుగు)తో కుండను ప్రతిష్ఠింపచేసేవారు. ►పెళ్లి జరిగిన ఇంటిలో ఆరు నెలల వరకు లచ్చించారును కాచుకునేవారు కాదు. ►ఇరుగు పొరుగు వారు వచ్చి అడిగినా మంగళ, శుక్రవారాలలో లచ్చించారు కడుగును బయటకు ఇచ్చేవారు కాదు. ►ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్న సందర్భంలో ఆ ఇంటికి సంప్రదాయంగా ఉంటున్న లచ్చించారు కుండ ఎవరి దక్కాలన్న విషయమై గతంలో తగవులు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. ఒక్కోసారి వేలం పాట ల ద్వారా ఉమ్మడి కుటుంబాల వారు ఈ కుండలను దక్కించుకునే వారిని పెద్దలు చెబుతుంటారు. చదవండి: రఘురామకృష్ణరాజు కేసు: కొట్టారన్నది కట్టు కథే AP Budget 2021: జన సాధికార బడ్జెట్ -
వంటర్‌ఫుల్ కేరాఫ్ రావులపాలెం
గలగలపారే గోదావరి పాయల నడుమ పచ్చని పైరులు, పిల్ల కాలువలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలకు నిలయమైన కోనసీమకు ముఖద్వారంగా నిలిచే రావులపాలెంలో ఘుమఘుమలాడే పోషకాహార రుచుల ఆర్.కె. టిఫిన్ సెంటర్ కేరాఫ్ అడ్రస్. రావులపాలేనికి చెందిన గొలుగూరి వెంకటరెడ్డి ఆహార ప్రియుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఆహార ప్రియులకు ఇక్కడకు వస్తే పండుగే. అతి తక్కువ ధరకు ఆరోగ్యకరమైన ఆహారంతో ఆకలి తీర్చుకోవచ్చు. వినియోగదారుడు చూస్తుండగానే వేడివేడిగా తయారుచేస్తూ, ప్రేమగా పలకరిస్తూ, ఆప్యాయంగా వడ్డిస్తారు. తిన్నవారికి తిన్నంత. కాని చెల్లించవలసినది మాత్రం కేవలం 70 రూపాయలు. రకరకాల చట్నీలు, పలు రకాల పొడులతో విందుగా పసందుగా కడుపు నింపుకోవచ్చు. సంప్రదాయానికి ప్రతీకగా... ప్రతి చోట లభించే అల్పాహారాలకు భిన్నంగా పోషకాలతో కూడిన సంప్రదాయ అల్పాహారం కోసం ఒక్కసారి ఇక్కడ ఆగి రుచి చూస్తారు. ఆధునిక యువతకు తెలియని దిబ్బరొట్టి (మినపరొట్టి), కోనసీమకే తలమానికంగా నిలిచే పొట్టిక్కలు, ఆవిరి కుడుము, చిట్టి పెసరట్టు, చిట్టి మినపట్టు, చిట్టి గారెలు, రాగి మాల్ట్ (చోడి జావ), మొలకల వడ, విటమిన్ ఇడ్లీ, పెసర పునుగులు... అన్నీ రుచి చూడచ్చు. దిబ్బరొట్టి – చెరకు పానకం: బాణలిలో వేరుసెనగ నూనె వేసి కాగాక మినప్పిండి వేసి, మధ్యలో గ్లాసు పెట్టి దానిలో నీళ్ళు పోసి పైన మూతపెడతారు. అది కొంత సేపటికి రొట్టెగా తయారవుతుంది. దానిని ముక్కలుగా కోసి చట్నీతో పాటు ప్రత్యేకంగా చెరకు పానకం జత చేసి అందిస్తారు. పొట్టిక్కలు: పనసాకులతో బుట్టలు తయారుచేసి వాటిలో ఇడ్లీ పిండిని వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. పనసాకుల పోషకాలు పొట్టిక్కలకు అదనంగా చేరడంతో, ఇవి బలాన్ని చేకూరుస్తాయి. ఆవిరి కుడుము: క్యారట్, జీలకర్ర కలిపిన ఇడ్లీ పిండితో ఆవిరి మీద వండుతారు. నెయ్యి, జీలకర్ర, క్యారట్లలో ఉండే పోషకాలతో ఆవిరి మీద ఉడికి, ఆరోగ్యం సమకూరుస్తుంది. మొలకల వడ: పెసలు, బొబ్బర్లు్ల, సెనగలు నానబెట్టి, వస్త్రంలో కట్టి, మొలకొచ్చాక గ్రైండ్ చేసి ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర కలిపి నూనెలో వేయిస్తారు. మొలకలు వచ్చాక వండటం వల్ల పోషకాలు అధికంగా లభిస్తాయి. విటమిన్ ఇడ్లీ: మినప్పప్పు, బీట్రూట్, రాగులు, పెసలు నానబెట్టి గ్రైండ్ చేసి ఇడ్లీ మాదిరిగానే పాత్రలో వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. చిరుధాన్యాలు, బీట్రూట్ల వల్ల అదనపు పోషకాలు సమకూరతాయి. జగతా రాంబాబు, కొత్తపేట ఫొటోలు:కొవ్వూరి ఆదినారాయణరెడ్డి,రావులపాలెం రోజుకు రెండు వేల మందికి పైగా... అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ టిఫిన్ సెంటర్ ప్రారంభించాం. రోజూ సుమారు రెండువేల మంది వస్తుంటారు. ఇటుగా ప్రయాణించేవారంతా ఇక్కడ ఆగి మరీ లొట్టలేసుకుంటూ అల్పాహారం తిని వెళ్తుంటారు. ఉద్యోగస్థులు క్యారేజీలు మానేసి మా దగ్గర తినడానికి ఇష్టపడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం కావడమే ఇందుకు కారణం. – జి.శ్రీరామ్, మేనేజర్, ఆర్కే టిఫెన్ సెంటర్, రావులపాలెం -
వంటల తాత
‘గ్రాండ్‌పా కిచెన్’.. యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్లందరికీ పరిచయం. ఆసక్తి ఉన్న చానెల్. ఈ చానెల్ నడుపుతున్న కుక్, గ్రాండ్ పా పేరు నారాయణ రెడ్డి. ముద్ద పప్పు, పులిహోర, చింతకాయ తొక్కు, బిర్యానీ వంటి సంప్రదాయ వంటల నుంచి.. మంచూరియా, పిజ్జా, బర్గర్స్ లాంటి చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్ ఫుడ్ వరకు అన్నిటినీ అవలీలగా వండి వార్చేవారు నారాయణ రెడ్డి. డెజర్ట్స్ ఆయన చేయి పడితే అదుర్సే! వీటన్నిటినీ కట్టెల పొయ్యిమీదే చేస్తాడు. అవెన్ వాడకుండా ఆయన చేసే చాక్లెట్ కేక్స్, పాన్‌కేక్స్ చూస్తూంటేనే నోట్లో నీళ్లూరుతుంటాయి. మిల్క్ షేక్స్, పుడ్డింగ్స్ గురించే చెప్పే పనేలేదు. ఎక్కువ మోతాదులో వండిన వంటకాలను అనాథాశ్రమంలోని పిల్లలకు పంచుతాడు. అంతేకాదు ఈ యూట్యూబ్ చానెల్ ద్వారా వచ్చే ఆదాయంతో అనాథలకు బట్టలు, పుస్తకాలు, వాళ్ల పుట్టినరోజుకి కానుకలు కొనిపెడ్తూంటాడు. ఈ తెలంగాణ తాత నడిపే ‘గ్రాండ్‌పా కిచెన్’ యూట్యూబ్ చానెల్‌కు 60 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంత మంచి మనిషి గురించి చెప్పుకునే సందర్భమే ఇప్పుడు విషాదమైంది. నారాయణ రెడ్డి మొన్న 27 తారీఖున అనారోగ్య కారణాలతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చనిపోయే ముందు ఆరు రోజుల వరకు గ్రాండ్‌పా కిచెన్‌లో వంట చేశారు. తను పోయాక కూడా చానెల్‌ను ఆపొద్దని సహ ఉద్యోగులకు చెప్పారట నారాయణ రెడ్డి. అనాథల ఆకలి తీర్చేందుకే కాదు, వాళ్ల జీవితాలనూ తీర్చిదిద్దే గ్రాండ్‌పా కిచెన్ ఎప్పటికీ నిండుకోకూడదనే ఆశిద్దాం. -
ప్రసాదాలు కావాలా?
పండగ రోజు కొనే లడ్లు, కజ్జికాయలు ఎక్కడైనా దొరుకుతాయి. కాని ఆ షాపులో ఉండ్రాళ్లు, ఉగాది పచ్చడి, పులిహోర, గారెలు, బూరెలు కూడా దొరుకుతాయి. ప్రత్యేక పూజలకు నైవేద్యాలు చేయడం ఒక్కోసారి వీలు కాకపోవచ్చు. ఆ షాపుకు వెళితే పేలాల పిండి, అట్లు, కట్టెపొంగలి, చక్కెర పొంగలి దొరుకుతాయి. కొని దేవునికి పెట్టుకోవడమే. విజయవాడ కస్తూరిబాయి పేటలోని అనుభవ ఫుడ్స్ వారు రెండు దశాబ్దాలుగా వినియోగదారులకు శుచిగా ప్రసాదాలను అందిస్తున్న తీరుపై ఈ వారం ఫుడ్ ప్రింట్స్... ఉమ్మడి కుటుంబాలు అంతరించి చిన్నచిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి. భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. పండుగ రోజుల్లో, శుభకార్యాలప్పుడు పిండి వంటలు, సంప్రదాయ వంటలు తయారు చేసుకునే సమయం లేకపోతోంది. ‘అటువంటి వారి కోసం మేము పండుగరోజుల్లో ఉండ్రాళ్లు, కుడుములు, అట్లు, ఉగాది పచ్చడి, కట్టెపొంగలి, రవ్వ పులిహోర, పాలతాలికలు, మోదకాలు వంటివి తయారు చేసి అందచేస్తున్నాం’ అంటున్నారు అభినవ ఫుడ్స్ యజమాని మండవ చైతన్యకుమార్. నోములు, వ్రతాలు చేసుకునేవారు నైవేద్యానికి పిండివంటలు కావాలని ముందుగా కోరినట్లయితే తయారు చేయించి అందజేస్తామని ఆయన అన్నారు. అమ్మ ఆలోచనల నుంచే... ‘రెండున్నర దశాబ్దాల క్రితం మేము హోమ్పుడ్స్ పెట్టినప్పుడు కస్టమర్లకు వంటకాలను వినూత్నంగా అందించాలని మా అమ్మ ఎం.ఎం.దేవి ఆలోచించారు. షాపుకి వచ్చిన కస్టమర్లకు చిన్న కప్పుల్లో పులిహోర, చక్రపొంగలి రుచి చూడమని పెట్టేవారు. దాంతో కస్టమర్లకు సంతోషం కలిగేది. కొంతకాలం తరవాత ఆ వంటకాలను ఆర్డర్ల మీద తయారు చేసి ఇవ్వమని కోరడం మొదలుపెట్టారు. రెండు దశాబ్దాల క్రితం వినాయకచవితి, దసరా, శ్రీరామనవమి, దీపావళి పండుగల్లో ఆయా సంప్రదాయ వంటల్ని ఆర్డరుపై మా అమ్మగారు తయారు చేయించి అందించారు. మొదట్లో మా అమ్మగారే స్వయంగా వండేవారు. ఆ తరవాత కొందరు మహిళలకు రుచిగా తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారు. ఇప్పటికీ మా హోమ్పుడ్స్లోని సంప్రదాయ వంటల్ని మహిళల చేతే చేయిస్తాం. భగవంతుడికి నైవేద్యం పెడతారనే ఉద్దేశ్యంతో మడిగా వండిస్తాం. ప్రసాదాలను తయారు చేయడంలో శుచికి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తాం. పండుగ రోజుల్లో తెల్లవారు జాము నుంచే వంటలు వండటం ప్రారంభిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం భోజనాలు సమయం వరకు కస్టమర్లకు అందిస్తాం’ అన్నారు చైతన్య కుమార్. ప్రతిరోజు.... పులిహోర, దద్ధ్యోదనం, గారెలు, పూర్ణాలు (బూరెలు), చక్రపొంగలి, చలిమిడి, పాలతాలికలు వంటివి ప్రతిరోజు ఉదయం నుంచి వేడివేడిగా అందుబాటులో ఉంటాయి. ‘ఇంటికి బంధువులు వచ్చినప్పుడు గంటలు తరబడి వంటలు చేస్తూ కూర్చోకుండా మా దగ్గర నుంచి అప్పటికప్పుడు తీసుకువెళతారు’ అంటున్నారు చైతన్య కుమార్. విజయవాడ నగరంలో వినాయకచవితి, దసరా, శ్రీరామనవమి వంటి పండుగలకు పందిళ్లు వేసి సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. అటువంటి సమయాల్లో పెద్ద స్థాయిలో నైవేద్యం పెట్టి భక్తులకు పంపిణీ చేయడానికి అనుభవ వారికే ఆర్డర్లు పెడుతున్నారు. ముఖ్యంగా పోలీసు, రెవిన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల వారు తమ ఆఫీసు పూజలకు ఇక్కడ తయారుచేసిన ప్రసాదాలనే నివేదిస్తున్నారు. – ఉప్పులూరు శ్యామ్‌ప్రకాష్, సాక్షి, విజయవాడ ఫొటోలు: పవన్ -
మీ వంటనూ రుచి చూపించండి
ప్రాంతాలను బట్టి కొన్ని కుటుంబాలకే ప్రత్యేకమైన సంప్రదాయ వంటకాలను డోర్ డెలివరీ ద్వారా అందరికీ పరిచయం చెయ్యాలనుకున్నారు లీనా దీక్షిత్. అనుకోవడమే కాదు, ఒక హోమ్ ఫుడ్ కంపెనీని పెట్టి సాటి మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఇది ఆమె ఒక్కరి సక్సెస్ స్టోరీనే కాదు, రుచిగా వంట చేయడం తెలిసిన మరికొందరు మహిళల ఇన్స్పైరింగ్ స్టోరీ కూడా. తాము డెలివరీ చేస్తున్న వంటకాలను ఎలా తయారు చేసుకోవచ్చో కూడా ఈ స్టార్టప్ కంపెనీ చెబుతుంది! అనురాధ హవల్దార్ ఉండేది నాగపూర్‌లో. వంట చేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం. కొన్ని స్థానిక వంటల పోటీలలోనూ, టెలివిజన్ షోలలోనూ పాల్గొంది. ఉదయాన్నే పనులన్నీ ముగించుకొని 7 గంటల నుంచి మోదక్‌లను తయారుచేయడం మొదలుపెడుతుంది. బెల్లం, కొబ్బరి, ఇలాచీ పొడి, నెయ్యి వేసి మిశ్రమం తయారు చేసుకుంటుంది. ఈ మిశ్రమాన్ని బియ్యప్పిండి గవ్వలలో కూరి రుచికరమైన మోదక్‌లను తయారుచేస్తుంది. వీటిని ఓ డబ్బాలో పెట్టే సమయానికి డెలివరీ బాయ్ వచ్చి తీసుకెళతాడు. ఇలాగే మసాలా పావ్, సాబుదనా కిచిడీ... ఇలా రోజూ వచ్చిన ఆర్డర్లను బట్టి అనురాధ 4–5 రకాలవి తయారుచేసి ఇస్తుంటుంది. ముఖ్యంగా పండగల సమయంలో. ఆ తర్వాత అనురాధ ‘హోమ్ చెఫ్’గా నాగపూర్‌లోని ‘నేటివ్ చెఫ్’ అనే ఫుడ్ డెలివరీ స్టార్టప్‌లో చేరింది. ఈ స్టార్టప్ కేవలం ఫుడ్ డెలివరీనే కాదు. ఇంట్లో తయారుచేసుకోదగిన సంప్రదాయ వంటకాల తయారీని కూడా పరిచయం చేస్తోంది. ఆ సంస్థ యజమానే లీనా దీక్షిత్. హోమ్ చెఫ్‌లుగా చేరొచ్చు ‘నేటివ్ చెఫ్స్’ వ్యవస్థాపకురాలు లీనా దీక్షిత్ గతంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని. సంప్రదాయ వంటకాలను ఇంట్లో తయారుచేసి అందించేవారి కోసం కిందటేడాది మే నెలలో ఆమె ఈ స్టార్టప్‌ని ప్రారంభించారు. మహిళలకు వ్యాపార ప్రణాళికలను రూపొందించడం, సూచనలు ఇవ్వడం ఆన్లైన్ ద్వారానే చేస్తారు లీనా. ఆమె సహకారంతో.. ఖర్చు, ధర, మార్కెటింగ్ నైపుణ్యాలను అర్థం చేసుకున్న వంద మంది మహిళలు లీనాతో చేరారు. కిందటి నెల చివరి నాటికి ఆమె సంస్థకు అనుసంధానమైన హోమ్ చెఫ్‌లు పదహారు మంది. వీరు సంప్రదాయ వంటకాల జాబితా, వంటల రుచి–నాణ్యతను ముందుగా పర్యవేక్షిస్తారు. తర్వాత యాప్ ద్వారా పరిచయం చేస్తారు. తరతరాల వంటకాలు ‘‘ఇక్కడ మేము తరతరాలుగా ఒక నిర్దిష్ట కుటుంబంలో ఉన్న వంటకాలను, వంటలను మేం ఎంచుకుంటాం. ఈ వంటకాల అసలు రుచితో ప్రజలకు కనెక్ట్ కావాలనుకుంటున్నాం’’ అని సంతోషంగా చెప్తారు లీనా. నేటివ్ చెఫ్స్‌లో నూట యాభై రకాల వంటకాల తయారీ గురించి ఉంటుంది. కావాలనుకున్నవారు వాటిని తయారుచేసుకోవచ్చు. ప్రస్తుతం నేటివ్ చెఫ్స్ వినియోగదారుల సంఖ్య 900కి చేరింది. – ఆరెన్నార్ -
జావ..చేవ
⇒ మారుతున్న నగర ప్రజల ఆహారపు అలవాట్లు ⇒ జావ, గటక, దలియా, మొలకలకు ప్రాధాన్యం ⇒మారుతున్న నగర ప్రజల ఆహారపు అలవాట్లు ⇒ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాల వైపు చూపు ⇒జావ, గటక, దలియా, మొలకలకు ప్రాధాన్యం ⇒‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే’ నినాదంతో ముందుకు ఖమ్మం హవేలి: సంప్రదాయ వంటకాలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు మళ్లీ వాటినే ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యం అలనాటి వంటల్లోనే ఉందనే విషయాన్ని ఇన్నాళ్లకు గ్రహించినట్టున్నారు. ‘బ్యాక్ టు నేచర్’ అనే నినాదంతో సంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. జొన్నలు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు, పెసలు, మినుములు, గోధుమలతో తయారు చేసిన గటక, జావ, దనియా (అన్ని చిరుధాన్యాలు కలిపిన పిండి), మొలకలు సత్ఫలితాలు ఇస్తుండటంతో ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఉదయం అల్పాహారానికి బదులు జొన్న, రాగి జావకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఆహారంతోనే రోజును ప్రారంభిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మార్నింగ్ వాకర్స్, క్రీడాకారులు, జిమ్‌కు వెళ్లేవారు, బాడీబిల్డర్స్, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు కాస్తంత ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ వీటిని స్వీకరిస్తున్నారు. నగరంలో ఉదయాన్నే జనసమర్థం ఎక్కువగా ఉండే చోట గటక, జావ విక్రయ స్టాల్స్ వెలుస్తున్నాయి. ఎనీ ఐటెమ్ టెన్ రూపీస్ ఓన్లీ.. ఈ స్టాల్స్‌లో జన్న, రాగి జావతో పాటు వామువాటర్, మొలకలు లభిస్తున్నాయి. ఏ ఐటమ్ అయినా రూ.10కే లభిస్తుండడంతో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. జావలో శొంఠి, మిరియాల పొడి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, మజ్జిగ, నిమ్మకాయ రసం, తేనె కలిపి ఇస్తుండటంతో ఆరోగ్యానికి ఆరోగ్యం..రుచికి రుచి ఉంటుండటంతో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. వీటిలో కారం, మసాలాలు లేకపోవడంతో ఆరోగ్యానికి ఉపకరిస్తున్నాయి. ఇక ఇంటి వద్ద రొట్టెలు తయారు చేసుకునే దలియా (చిరుధాన్యల మిశ్రమాల పిండి)కి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. సర్దార్‌పటేల్ స్టేడియం, భక్తరామదాసు కళాక్షేత్రం, రైతుబజార్, డీఆర్డీఏ కూరగాయల మార్కెట్ వద్ద రెండుళ్లుగా ఈ ఆహారపదార్థాల స్టాల్స్ నిర్వహిస్తున్నారు. ఉదయం 5:30 నుంచి 11:00 గంటల వరకు వీటి వద్దకు వందల సంఖ్యలో జనం వచ్చి జావ, గటక సేవిస్తున్నారు. కొందరు ఇళ్లకు పార్సిల్స్ తీసుకెళ్తున్నారు. డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉండటం కూడా కలిసొస్తోంది. తక్కువ పరిమాణం.. ఎక్కువ శక్తి చిరుధాన్యాల ఆహారం కావడంతో తక్కువ పరిమాణంలో తీసుకున్నా సరే ఎక్కవ శక్తి లభిస్తోందని వినియోగదారులు అంటున్నారు. షుగర్, మలబద్ధకం జీర్ణసంబంధ వ్యాధుల నియంత్రణ, లావు, బరువు తగ్గటం, రక్తశుద్ధి, రోగ నిరోధకశక్తి పెంపుదలకు ఈ ఆహారపదార్థాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయని పలువురి అభిప్రాయం. ఆయా ఆహారపదార్థాలతో ఉపయోగం.. జొన్నల్లో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. ఇనుము, కాల్షియం, జింక్, పొటాష్, పాస్ఫరస్ లాంటి పోషకాలు, థయామిన్, రైబోఫ్లోవిన్, లాంటి ‘బి’ విటమిన్లు లభిస్తాయి. టానిన్లూ, ఫెనోలిక్ ఆమ్లాలు యంథోసియానిన్స్ లాంటి ఫైటోకెమికల్స్ శరీర బరువును తగ్గించడమే కాకుండా శక్తినిస్తాయి. గర్భిణులకు ఇవి మరీ మంచిది. రాగుల్లో ఇనుము, కాల్షియం, మాంసకృత్తులు, ‘ఏ’, ‘బి’ విటమిన్స్ లభిస్తాయి. ఫాస్ఫరస్ లాంటి పోషకాలు, పీచు పదార్థాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. కాల్షియం ఎముకల్ని దృఢపరుస్తుంది. కీళ్లనొప్పులు, మహిళల్లో మోనోపాజ్ (40ఏళ్లు దాటిన) దశ దాటిన తరువాత ఆస్టియోపోరోసిస్ రాకుండా ఇవి నియంత్రిస్తాయి. రాగులు మైగ్రెయిన్ ను తగ్గిస్తాయి. బాలింతలకు పాలు పెరిగేందుకు దోహదపడుతాయి. మహిళల్లో రక్తహీనతను నివారించే ఇనుము పెరుగుతుంది. రాగుల్లో ఉన్న మెగ్నీషియం నెలసరిలో వచ్చే నొప్పులు, అసౌకర్యాన్ని దూరం చేస్తుంది. సజ్జలు, సామలు, బార్లీ, రాజ్గీరా ధాన్యాల్లో గ్లైసమిన్ ఇండెక్స్ తక్కువ. అవి జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా ఇన్సులిన్ నియంత్రించబడి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి. నాడీవ్యవస్థ బాగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు కరిగేలా ఇందులో ఉన్న ‘బి’ విటమిన్ దోహదపడుతుంది. గుండెజబ్బులు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ వంటికి రాకుండా ఉంటాయి. బీపీ, గుండెజబ్బులు, కొలెస్ట్రాల్ ఉన్న మహిళలు వారానికి 6 సార్లు చిరుధాన్యాలు తీసుకోవాలని న్యూట్రిషన్స్సూచిస్తున్నారు. ప్రతిఒక్కరూ చిరుధాన్యాలను ఒకేసారి కాకుండా నెమ్మదిగా జీవనవిధానంలో చేరిస్తే బాగుంటుందని వైద్యుల సలహా.