‘గ్రాండ్‌పా కిచెన్’.. యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్లందరికీ పరిచయం. ఆసక్తి ఉన్న చానెల్. ఈ చానెల్ నడుపుతున్న కుక్, గ్రాండ్ పా పేరు నారాయణ రెడ్డి. ముద్ద పప్పు, పులిహోర, చింతకాయ తొక్కు, బిర్యానీ వంటి సంప్రదాయ వంటల నుంచి.. మంచూరియా, పిజ్జా, బర్గర్స్ లాంటి చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్ ఫుడ్ వరకు అన్నిటినీ అవలీలగా వండి వార్చేవారు నారాయణ రెడ్డి. డెజర్ట్స్ ఆయన చేయి పడితే అదుర్సే! వీటన్నిటినీ కట్టెల పొయ్యిమీదే చేస్తాడు. అవెన్ వాడకుండా ఆయన చేసే చాక్‌లెట్ కేక్స్, పాన్‌కేక్స్ చూస్తూంటేనే నోట్లో నీళ్లూరుతుంటాయి. మిల్క్ షేక్స్, పుడ్డింగ్స్ గురించే చెప్పే పనేలేదు. ఎక్కువ మోతాదులో వండిన వంటకాలను అనాథాశ్రమంలోని పిల్లలకు పంచుతాడు.
అంతేకాదు ఈ యూట్యూబ్ చానెల్ ద్వారా వచ్చే ఆదాయంతో అనాథలకు బట్టలు, పుస్తకాలు, వాళ్ల పుట్టినరోజుకి కానుకలు కొనిపెడ్తూంటాడు. ఈ తెలంగాణ తాత నడిపే ‘గ్రాండ్‌పా కిచెన్’ యూట్యూబ్ చానెల్‌కు 60 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇంత మంచి మనిషి గురించి చెప్పుకునే సందర్భమే ఇప్పుడు విషాదమైంది. నారాయణ రెడ్డి మొన్న 27 తారీఖున అనారోగ్య కారణాలతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చనిపోయే ముందు ఆరు రోజుల వరకు గ్రాండ్‌పా కిచెన్‌లో వంట చేశారు. తను పోయాక కూడా చానెల్‌ను ఆపొద్దని సహ ఉద్యోగులకు చెప్పారట నారాయణ రెడ్డి. అనాథల ఆకలి తీర్చేందుకే కాదు, వాళ్ల జీవితాలనూ తీర్చిదిద్దే గ్రాండ్‌పా కిచెన్ ఎప్పటికీ నిండుకోకూడదనే ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment