వంటర్‌ఫుల్‌ కేరాఫ్‌ రావులపాలెం | You Can Starve With A Healthy Diet For A Cheap Price | Sakshi
Sakshi News home page

వంటర్‌ఫుల్‌ కేరాఫ్‌ రావులపాలెం

Published Sat, Nov 9 2019 3:40 AM | Last Updated on Sat, Nov 9 2019 3:40 AM

You Can Starve With A Healthy Diet For A Cheap Price - Sakshi

గలగలపారే గోదావరి పాయల నడుమ పచ్చని పైరులు, పిల్ల కాలువలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలకు నిలయమైన కోనసీమకు ముఖద్వారంగా నిలిచే రావులపాలెంలో ఘుమఘుమలాడే పోషకాహార రుచుల ఆర్‌.కె. టిఫిన్‌ సెంటర్‌ కేరాఫ్‌ అడ్రస్‌. రావులపాలేనికి చెందిన గొలుగూరి వెంకటరెడ్డి ఆహార ప్రియుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సెంటర్‌ను ప్రారంభించారు.

ఆహార ప్రియులకు ఇక్కడకు వస్తే పండుగే. అతి తక్కువ ధరకు ఆరోగ్యకరమైన ఆహారంతో ఆకలి తీర్చుకోవచ్చు. వినియోగదారుడు చూస్తుండగానే వేడివేడిగా తయారుచేస్తూ, ప్రేమగా పలకరిస్తూ, ఆప్యాయంగా వడ్డిస్తారు. తిన్నవారికి తిన్నంత. కాని చెల్లించవలసినది మాత్రం కేవలం 70 రూపాయలు. రకరకాల చట్నీలు, పలు రకాల పొడులతో విందుగా పసందుగా కడుపు నింపుకోవచ్చు.

సంప్రదాయానికి ప్రతీకగా...
ప్రతి చోట లభించే అల్పాహారాలకు భిన్నంగా పోషకాలతో కూడిన సంప్రదాయ అల్పాహారం కోసం ఒక్కసారి ఇక్కడ ఆగి రుచి చూస్తారు. ఆధునిక యువతకు తెలియని దిబ్బరొట్టి (మినపరొట్టి), కోనసీమకే తలమానికంగా నిలిచే పొట్టిక్కలు, ఆవిరి కుడుము, చిట్టి పెసరట్టు, చిట్టి మినపట్టు, చిట్టి గారెలు, రాగి మాల్ట్‌ (చోడి జావ), మొలకల వడ, విటమిన్‌ ఇడ్లీ, పెసర పునుగులు... అన్నీ రుచి చూడచ్చు.

దిబ్బరొట్టి – చెరకు పానకం: బాణలిలో వేరుసెనగ నూనె వేసి కాగాక మినప్పిండి వేసి, మధ్యలో గ్లాసు పెట్టి దానిలో నీళ్ళు పోసి పైన మూతపెడతారు. అది కొంత సేపటికి రొట్టెగా తయారవుతుంది. దానిని ముక్కలుగా కోసి చట్నీతో పాటు ప్రత్యేకంగా చెరకు పానకం జత చేసి అందిస్తారు.

పొట్టిక్కలు: పనసాకులతో బుట్టలు తయారుచేసి వాటిలో ఇడ్లీ పిండిని వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. పనసాకుల పోషకాలు పొట్టిక్కలకు అదనంగా చేరడంతో, ఇవి బలాన్ని చేకూరుస్తాయి. ఆవిరి కుడుము: క్యారట్, జీలకర్ర కలిపిన ఇడ్లీ పిండితో ఆవిరి మీద వండుతారు. నెయ్యి, జీలకర్ర, క్యారట్‌లలో ఉండే పోషకాలతో ఆవిరి మీద ఉడికి, ఆరోగ్యం సమకూరుస్తుంది.

మొలకల వడ: పెసలు, బొబ్బర్లు్ల, సెనగలు నానబెట్టి, వస్త్రంలో కట్టి, మొలకొచ్చాక గ్రైండ్‌ చేసి ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర కలిపి నూనెలో వేయిస్తారు. మొలకలు వచ్చాక వండటం వల్ల పోషకాలు అధికంగా లభిస్తాయి. విటమిన్‌ ఇడ్లీ: మినప్పప్పు, బీట్‌రూట్, రాగులు, పెసలు నానబెట్టి గ్రైండ్‌ చేసి ఇడ్లీ మాదిరిగానే పాత్రలో వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. చిరుధాన్యాలు, బీట్‌రూట్‌ల వల్ల అదనపు పోషకాలు సమకూరతాయి.
జగతా రాంబాబు, కొత్తపేట
ఫొటోలు:కొవ్వూరి ఆదినారాయణరెడ్డి,రావులపాలెం

రోజుకు రెండు వేల మందికి పైగా...
అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ టిఫిన్‌ సెంటర్‌ ప్రారంభించాం. రోజూ సుమారు రెండువేల మంది వస్తుంటారు. ఇటుగా ప్రయాణించేవారంతా ఇక్కడ ఆగి మరీ లొట్టలేసుకుంటూ అల్పాహారం తిని వెళ్తుంటారు. ఉద్యోగస్థులు క్యారేజీలు మానేసి మా దగ్గర తినడానికి ఇష్టపడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం కావడమే ఇందుకు కారణం.
– జి.శ్రీరామ్, మేనేజర్,
ఆర్‌కే టిఫెన్‌ సెంటర్, రావులపాలెం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement