ఓ వైపు ప్రపంచంలో 300 కోట్ల మందికి సరైన ఆహారం లభించక ఆకలితో మాడిపోతుంటే మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఉత్పత్తి చేస్తున్న దాదాపు 130 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారంలో 33 శాతం వృథా అయిపోతోంది. ఈ వృథా విలువ ఏడాదికి సుమారు రూ.లక్ష కోట్లని అంచనా. పోషకాలు అధికంగా వుండే పండ్లు, కూరగాయలు, సముద్రపు ఉత్పత్తులు, రకరకాల మాంసాలు భారీగా పాడైపోతున్నాయి. ‘గ్లోబల్ ప్యా నల్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సిస్టమ్స్ ఫర్ న్యూట్రిషన్’తో కలసి ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార– వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) వెలువరించిన తాజా నివేదికలోని విషయాలివి. ఆహార వ్యవస్థల్లో చోటు చేసుకున్న ఈæ లోపాల్ని నివారించేందుకు విధానపరమైన చర్యలు చేపట్టాలని, ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని ఎఫ్‌ఏవో పాల కులకు విజ్ఞప్తి చేసింది. త్వరగా పాడైపోయే ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ప్రభుత్వ– ప్రైవేటు రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంపై దృష్టి సారించాలని కోరింది.
సగానికి సగం కూరగాయలు..
నివేదిక ప్రకారం.. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, కూరగాయల్లో 50% పైగా వృథా అవుతున్నాయి. మొత్తం మాంసంలో 25%, సముద్ర ఉత్పత్తుల్లో 30 శాతం పైగా నిరుపయోగమవుతున్నాయి. వ్యవసాయం ద్వారా ప్రపంచ ప్రజలకు అవసరమైన దానికంటే 22% ఎక్కువ విటమిన్ ఏ ఉత్పత్తుల్ని పండిస్తున్నప్పటికీ, వృథా కారణంగా అవి పూర్తి స్థాయిలో జనం వద్దకు చేరడం లేదు. దీంతో విటమిన్ ఏ ఆహారోత్పత్తులకు 11% మేరకు కొరత ఏర్పడుతోంది. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో– పంటకోతలు, స్టోరేజీ, ప్రాసెసింగ్, రవాణా దశల్లో ఎక్కువ నష్టం జరుగుతోంది. అధికాదాయ దేశాల్లో– చిల్లర అమ్మకాల సందర్భంలో కొంత, వినియోగదార్ల వద్ద కొంత వ్యర్థమైపోతోంది.
ఆరోగ్యానికి అతి పెద్ద ముప్పు..
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతి 5 మరణాల్లో ఒకటి నాసిరకపు ఆహారంతో ముడిపడిందని మలేరియా, టీబీ, మీజిల్స్ కంటే నిత్యం నాసిరకపు ఆహారం తీసుకోవడం వల్లే ప్రజారోగ్యానికి ఎక్కువ నష్టం వాటిల్లుతోందని నివేదిక పేర్కొంది. వృథాను నివారించడం వల్ల ప్రజలకు పోషకాలు లభ్యం కావడంతోపాటు ఐరాస సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పింది. ఆహార వృథాను ఎంతవరకు నివారించగలిగితే అంతమేరకు ఆర్థిక వ్యవస్థలకు లాభం చేకూరుతుందని, నీరు– నేల– ఇంధనాన్ని కూడా పొదుపు చేసుకోవచ్చునని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment