ఉద్యోగాలు ఊడుతాయా? | Fear in the officials who involved in Indiramma House issue | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు ఊడుతాయా?

Published Thu, May 10 2018 1:32 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Fear in the officials who involved in Indiramma House issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మంజూరులో అక్రమాల కేసును తిరగదోడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడం ఇప్పుడు హౌసింగ్‌ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. వివిధ కారణాలతో నిలిచిపోయిన కేసులో దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని సీఎం స్పష్టం చేయడంతో ఇళ్ల అక్రమాల రికార్డుల బూజును అధికారులు దులుపుతున్నారు. కేసును తిరగతోడడంతోపాటు బాధ్యులపై చర్యలకు సిఫారసు చేయాలన్న కేసీఆర్‌ ఆదేశాల మేరకు కసరత్తు కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగాలకు ఎసరు వచ్చేలా కేసులు నమోదవుతాయేమోననే భయం గృహనిర్మాణశాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వాస్తవానికి అర్హుల ఇళ్ల జాబితాను ఫైనల్‌ చేసే బాధ్యత తమదే అయినా ఎమ్మెల్యేలు చెప్పినట్లుగానే చేయాలన్న ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో సంతకాలు చేశామని, ఇప్పుడు కేసును తిరగదోడి జైలుకు వెళ్లే పరిస్థితులు కల్పిస్తున్నారని ఇంజనీర్లు వాపోతున్నారు. 

ఎమ్మెల్యేలపై.. 
దర్యాప్తులో భాగంగా సీఐడీ పరిశీలించిన 19 నియోజకవర్గాల్లోని 38 గ్రామాల్లో అప్పటి ఎమ్మెల్యేల సిఫారసు మేరకు ఇళ్ల మంజూరు, బిల్లుల జారీ జరిగిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే ఒకే వ్యక్తికి 2-3 ఇళ్లను సిఫారసు చేయడంలో ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉన్నట్లు సీఐడీ ఆరోపిస్తోంది. దీంతో ఎమ్మెల్యేలపైనా చర్యలకు ప్రభుత్వం అనుమతిస్తే అదే రీతిలో దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు ఎమ్మెల్యేలు, కొందరు దళారులను మొదటి జాబితాలో చేర్చి అరెస్టుకు సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ఇవ్వనుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తే దర్యాప్తు పునఃప్రారంభిస్తామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 

గతంలో మూసేశారు... : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వాటి బిల్లుల మంజూరులో అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని 2015లో సీఐడీని ఆదేశించింది. ఈ కేసులో 19 నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరు తదితరాలపై సీఐడీ 3 నెలలపాటు వేగంగా దర్యాప్తు చేసింది. ఆ తర్వాత కేసు దర్యాప్తు అనూహ్యంగా ఆగిపోయింది. 2016లో మళ్లీ కొంత కదలిక వచ్చినా నిందితుల జాబితా, అరెస్టుల వరకు వెళ్లలేదు. ఎందుకంటే ఇళ్ల నిర్మాణం, కేటాయింపుల్లో పూర్తిగా ప్రభుత్వాధికారులు, గతంలోని ప్రజాప్రతినిధులు తదితరుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇదే విషయాన్ని సీఐడీ ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో ఆ విచారణ కాస్తా ఆగిపోయింది. అక్రమాలపై గతంలో విచారణ జరిపిన సీఐడీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం సింహభాగం అసిస్టెంట్‌ ఇంజనీర్లే (ఏఈలు) బాధ్యులని తేల్చడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement