మారుతినగర్‌లో పెట్రోల్ పోసుకున్న నిర్వాసితుడు
ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్న మార్కింగ్
నిర్వాసితులకు జీఐఎస్ దెబ్బ
పాత సర్వే ఆధారంగానే మార్కింగ్
మార్క్ పడిన గృహాలకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు?
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహకంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆపరేషన్ మూసీకి వ్యతిరేకంగా నిరసన గళం తీవ్రమవుతోంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నివాసాల కూల్చివేత కోసం మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల బృందాలకు రెండోరోజు శుక్రవారం తీవ్ర నిరసన ఎదురైంది. బాధితులు అడుగడుగునా అధికారులను అడ్డుకున్నారు. వాగ్వివాదానికి దిగారు. రోడ్లపై బైటాయించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినదించారు. ఇళ్లకు మార్కింగ్ వేయకుండా అధికారులను వెనక్కి పంపించారు. నిర్వాసితులకు కాంగ్రెసేతర పక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. చైతన్యపురిలో బాధితుల ఆందోళనలకు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు. కొత్తపేట మారుతినగర్‌లో ఒక యువకుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి దిగాడు. తన భార్య 9 నెలల గర్భిణి అని, తన ఇల్లు ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీ పోలీసు బందోబస్తు మధ్య..
మూసీ పరీవాహక ప్రాంతం పరిధిలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే బృందాలు మార్కింగ్ కొనసాగిస్తున్నాయి. మొదటి విడతగా మూసీ నదీగర్భం (రివర్ బెడ్) పరిధిలోని నిర్మాణాల కూల్చివేత కోసం మార్కింగ్ చేసే ప్రక్రియ గత రెండు రోజులుగా కొనసాగుతోంది. అయితే తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు పునరావాసం కింద డబుల్ బెడ్‌రూమ్ అందిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నప్పటికి, పక్కా గృహాలు నిరి్మంచుకున్న వారు మాత్రం కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనకు దిగుతున్నారు. దీంతో మార్కింగ్‌కు ఆటంకాలు తప్పడం లేదు.
పునరావాసంపై అయోమయం
మూసీ నిర్వాసితులకు పునరావాసంపై అయోమయం నెలకొంది. అర్హులైన నిర్వాసితులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను గుర్తిస్తామని స్పష్టం చేసినప్పటికీ గతంలో జీఐఎస్ సర్వే ద్వారా గుర్తించిన గృహాలపైనే మార్కింగ్ వేస్తూ ఆ కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాటిలో పక్కాగృహాలకు మార్కింగ్ వేయకపోవడం, ఆ కుటుంబాల వివరాలు సేకరించడం పోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేక పోతున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఆరు నెలల క్రితం మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ నదికి రెండువైపులా 2 కి.మీ. పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మా ణాలున్నాయో గుర్తించింది. వాటిని జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)తో అనుసంధానం చేసింది. ప్రస్తుతం దాని ప్రకారమే రెడ్ మార్కింగ్ వేస్తూ పునరావాసం కోసం వివరాలు సేకరించి ప్రత్యేక యాప్‌లో పొందుపర్చుతున్నారు.
అన్ని గృహాలపై ఆపరేషన్
మూసీ ప్రక్షాళనలో భాగంగా మొదటి విడతగా నదీ గర్భంలోని నివాసాలపై ఆపరేషన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కూల్చివేత బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. దీంతో నదీగర్భం పరిధిలోని గల ఆర్‌బీ–ఎక్స్(రివర్ బెడ్) మార్కింగ్ పడిన గృహాలతో పాటు దాని వెంట ఉన్న గృహాలు సైతం కూలి్చవేయక తప్పని పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.
నిర్వాసితుల తరలింపు
మూసీ నిర్వాసితులైన 20 కుటుంబాలను డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయానికి తరలించి పునరావాసం కలి్పంచినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం హిమాయత్‌నగర్ మండలంలోని శంకర్‌నగర్ కాలనీకి చెందిన 6 కుటుంబాలు, వినాయక వీధిలోని మూడు కుటుంబాలను మలక్‌పేట పిల్లిగుడిసెల సముదాయానికి, నాంపల్లిలోని 11 కుటుంబాలను ఆసిఫ్‌నగర్ జియాగూడ సముదాయానికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
వేల సంఖ్యలో నివాసాలు..
మూసీ పరీవాహక పరి«ధి పొడువునా..నదీ గర్భంలో వేల సంఖ్యలో గృహాలు ఉన్నప్పటికీ వందల సంఖ్యలో మాత్రమే డ్రోన్ సర్వేలో గుర్తించినట్లు తెలుస్తోంది. సర్వే ఆధారంగా ప్రభుత్వం నదీ గర్భంలో సుమారు 2166 నివాసాలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంటుంది. అందులో సుమారు 288 భారీ కట్టడాలు ఉన్నాయి. వాస్తవానికి ఒక్కో మండలంలోని పలు ప్రాంతాల్లో వందలాది గృహలు నదీ గర్భంలో ఉన్నప్పటికీ జీఐఎస్ డేటా ప్రకారమే గృహాలపై రెడ్ మార్కింగ్ వేస్తూ పునరావాసం కోసం వివరాలు సేకరించడం విస్మయానికి గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment