పుస్తకాలు ఎప్పుడిస్తారు సారూ..
Published Sat, Aug 27 2016 3:43 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
సర్కారు స్కూళ్లకు ఇంకా అందని దైన్యం
పాఠశాలలు తెరిచి రెండున్నర నెలలు పూర్తి
బోధించడం కష్టమంటున్న ఉపాధ్యాయులు
చదువులో వెనుకబడుతున్న విద్యార్థులు
నర్సాపూర్: ప్రస్తుత విద్యాసంవత్సరంలో పాఠశాలలు తెరిచి రెండున్నర నెలలు గడుస్తున్నా ఇంత వరకు పలు తరగతులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు సర్కారు బడులకు అందలేదు. దీంతో ఒకటి నుంచి పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని మెజార్టీ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు అందించడం లేదు. కొన్ని మండలాల్లోని పాఠశాలలకు అన్ని సబ్జెక్టుల పుస్తకాలు వచ్చారుు. మిగతా చోట్ల మాత్రం అరకొరగానైనా ఇవ్వలేదు.
ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యేనా?
ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ కానందున పదవ తగరతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యేనా అనే అనుమానాలు కలుగుతున్నారుు. ఉత్తమ ఫలితాల సాధనకు ఆటంకం కలుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పాఠ్యపుస్తకాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, నెలలు గడుస్తున్నా పుస్తకాలు రాకపోతే ఫలితాలెలా సాధ్యమంటున్నారు.
ఇప్పటికీ అందని పాఠ్య పుస్తకాలు ఇవే..
పాఠశాలలు తెరిచి రెండున్నర నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలకు అందని పాఠ్య పుస్తకాలు లిస్టు భారీగానే ఉంది. పదవ తరగతి గణితం, బయో సైన్సు, ఫిజికల్ సైన్సు పాఠ్య పుస్తకాలు ఇంత వరకు జిల్లాలోని అనేక మండలాలకు సరఫరా కాలేదు. 9వ తరగతి ఆంగ్లం, గణితం, బయో మెడికల్ సైన్సు, సాంఘీకం, ఈవీఎస్ పాఠ్య పుస్తకాలు అందలేదు. 8వ తరగతి బయో సైన్సు, సాంఘీక శాస్త్రం పాఠ్యాంశాలు, 6, 7వ తరగతుల హిందీ, 5వ తరగతి ఎన్విరాల్‌మెంట్ సైన్సు పుస్తకాలతోపాటు ఒకటి నుంచి మూడు తరగతులకు చెందిన పలు రకాల పుస్తకాలు సైతం రాలేదని తెలిసింది. ఇదిలా ఉండగా ఆయా తరగతుల్లో పాసైన విద్యార్థుల పాత పుస్తకాలు సేకరించి పలువురు విద్యార్థులకు అందచేయడంతోపాటు ఉపాధ్యాయులు సైతం పాత పుస్తకాలతోనే పాఠాలు బోధిస్తున్నారు. పాత పుస్తకాలు అందరికీ సరిపడా దొరకడం లేదు.
నిరంతర సమగ్ర మూల్యాంకనంలో పుస్తకాలు తప్పనిసరి
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి నిరంతర సమగ్ర మూల్యాంకనం పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఈ విధానంలో ఉపాధ్యాయులు ఏ రోజుకారోజు పాఠం బోధించగానే దానికి సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులనడిగి జవాబులు రాబట్టేందుకు చర్యలు తీసుకుంటారు. అప్పటి వరకు బోధించిన పాఠంపై విద్యార్థులకు ఏ మేరకు అవగాహన కలిగిందో తెలుసుకుంటారు. అంతేగాక ప్రాజెక్టు వర్కును సైతం ఇస్తారు. ఈ విధానంలో పాఠ్య పుస్తకాలు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు.
పాఠ్య పుస్తకాలు లేకుంటే విద్యార్థులు ఇంటి వద్ద హోం వర్కు పూర్తి చేయలేరని, ప్రాజెక్టు వర్క్‌లను సైతం పూర్తి చేయలేరని చెబుతున్నారు. ప్రాజెక్టు వర్క్‌లకు మార్కులు వేసే విధానం అమలులో ఉండడంతో పుస్తకాలు లేక ప్రాజెక్టు వర్క్‌లు పూర్తి చేయకపోతే మార్కులు వేయలేని పరిస్థితులు ఉత్పన్నమవడంతో విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నది కాదనలేని వాస్తవం. కాగా పాఠ్య పుస్తకాలు సరఫరా చేయకుండా ప్రభుత్వం పరోక్షంగా విద్యార్థులకు నష్టం కలిగిస్తోందనే ఆరోపణలు వస్తున్నారుు.
Advertisement