ఈ బాలికకు ఐన్‌స్టీన్ మించిన ఐక్యూ
లండన్: భారత సంతతికి చెందిన బాలిక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఐక్యూ(మేథ) పరీక్షల్లో అందరినీ ఆశ్చర్యపరిచేలా 162 పాయింట్లు సాధించింది. ఈ పాయింట్లు ప్రపంచ ప్రఖ్యాత మేథావులు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల కంటే కూడా రెండు పాయింట్లు ఎక్కువే కావటం గమనార్హం. లండన్‌లోని చెషైర్ కౌంటీలో నివసించే ప్రవాస భారతీయుడు డాక్టర్ సూరజ్ కుమార్ పవార్ కుమార్తె రాజ్‌గౌరి పవార్.
18 ఏళ్లలోపు వారికి నిర్వహించే ఐక్యూ పరీక్షలో రాజ్‌గౌరి పాల్గొని అత్యధికంగా 162 పాయింట్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో మెన్సా సంస్థ రాజ్‌గౌరిని తమ బ్రిటిష్ మెన్సా ఐక్యూ సొసైటీ సభ్యురాలిగా చేర్చుకుంది. స్కూల్‌లో టీచర్లు ఇస్తున్న ప్రోత్సాహంతోనే తమ కుమార్తె ఇంతటి ప్రతిభను చాటగలిగిందని బాలిక తండ్రి సూరజ్‌కుమార్ పవార్ తెలిపారు. సాధారణంగా 140 పాయింట్లు సాధించిన వారిని జీనియస్‌గా పరిగణిస్తామని మెన్సా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 20వేల మంది మాత్రమే ఇటువంటి ఘనతను సొంతం చేసుకున్నారని వివరించింది.