సత్యం: ఐన్‌స్టీన్ = మేధావి
ప్రతి మనిషీ వ్యక్తిగతంగా గౌరవం పొందాలి. ఎవరినీ దేవుళ్లను చేయొద్దు. విచిత్రమేమిటంటే, నా దురదృష్టంకొద్దీ నా తోటివారినుంచి నేను ఎక్కువ ఆదరణనూ, భక్తినీ పొందాను, నా గొప్పతనం అంతగా ఏమీలేకపోయినా...
చిన్నతనంలో ఐన్‌స్టీన్‌కు వాళ్ల నాన్న ఒక ప్యాకెట్ కంపాస్ ఇచ్చాడట. ఏమీలేకుండానే శూన్యంలో అటూయిటూ తిరుగుతున్న ఆ ముల్లును చూస్తూంటే, ఏమీలేనిదాన్లోనే ఏదోవుందన్న గ్రహింపు కలిగిందట! ఆ కుతూహలమే ఆ పిల్లాడిని ‘ఐన్‌స్టీన్’ను చేసింది. నిస్సందేహంగా ఇరవయ్యో శతాబ్దపు అత్యున్నత మేధావిగా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను శాస్త్ర ప్రపంచం కీర్తించింది.
ప్రతిదాన్నీ ప్రశ్నించే స్వభావం ఆయనది. పాఠశాలల్లో అతి క్రమశిక్షణను సహించేవాడు కాదు. ప్రశ్నలు ఎదుర్కోవడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు ఆయనకు నచ్చేవాళ్లు కాదు. మనిషికి మెదడు ఉన్నదే ప్రశ్నించడానికనేవారు. ప్రశ్నిస్తూనే జ్ఞానాన్ని పొందాలిగానీ, గుడ్డిగా కాదనేవారు. విద్య అనేది విద్యార్థుల్ని ఆలోచించేలా చేయాలి, అంతకుముందు ఊహించడానికి కూడా సాధ్యంకాని ఊహల్ని సాధ్యం చేసేట్టుగా ఉండాలి. ఉత్తినే వాస్తవాలు తెలుసుకోవడంకన్నా, ఆలోచించేలా మెదడుకు తర్ఫీదు ఇవ్వాలనే ఆలోచనలు ఆయనవి.
ఆధునిక భౌతికశాస్త్రానికి మూలస్తంభాల్లో ఒకటైన సాపేక్ష సిద్ధాంతాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రపంచ సుప్రసిద్ధ సూత్రం ‘ఈ=ఎం.సీస్క్వేర్’ కనుగొన్నారు. 1921లో భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. అయితే, ఆయన కేవలం మేధావిగా, శాస్త్రవేత్తగా మాత్రమే ఉండిపోలేదు. అలా ఉండిపోకపోవడమే ఆయన్ని జనానికి కూడా చేరువ చేసింది. తాత్వికుడిగా, ఆధ్యాత్మిక అన్వేషకుడిగా, అహింస పట్ల ప్రేమ ఉన్నవాడిగా ఆయన ఎన్నో అంశాల్లో తన భావాలను పంచుకున్నారు.
ప్రతి మనిషీ వ్యక్తిగతంగా గౌరవం పొందాలి. ఎవరినీ దేవుళ్లను చేయొద్దు. విచిత్రమేమిటంటే, నా దురదృష్టంకొద్దీ నా తోటివారినుంచి నేను ఎక్కువ ఆదరణనూ, భక్తినీ పొందాను, నా గొప్పతనం అంతగా ఏమీలేకపోయినా, అన్నారు ఓ సందర్భంలో. ఆర్థిక విధానాల రీత్యా సామ్యవాదం వైపు మొగ్గినా, వ్యక్తి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి ఉండే ప్రాధాన్యతను నొక్కిచెప్పేవారు.
ఐన్‌స్టీన్ ఏ దేవుడినీ అంగీకరించలేదు. మానవ బలహీనతలోంచే దేవుడు జన్మించాడని వ్యాఖ్యానించారు. అయితే మతంగా మాత్రం బౌద్ధానికి పెద్దపీట వేశారు. ఏ మతమైనా ఆధునిక శాస్త్రీయావసరాలతో తూగగలిగినది ఉందంటే అది బౌద్ధమే అన్నారు.
జర్మనీలో హిట్లర్ అధికారంలోకి వచ్చినప్పుడు అమెరికా పర్యటనలో ఉన్న ఐన్‌స్టీన్ తిరిగి తన మాతృదేశం వెళ్లలేదు. అమెరికాలోనే స్థిరపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మిత్రదేశాల మద్దతుదారుగా శత్రువును ఎదుర్కోవడానికి మరింత శక్తిమంతమైన బాంబుల తయారీ అవసరం గురించి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్‌వెల్ట్‌కు లేఖ రాశారు. అయితే, 1955లో తన మరణానికి ముందుమాత్రం బ్రిటన్ రచయిత బెర్ట్రండ్ రసెల్‌తో కలిసి ‘ద రసెల్-ఐన్‌స్టైన్ మానిఫెస్టో’లో అణ్వాయుధాల ప్రమాదం గురించి హెచ్చరించారు.
‘అహింసతోనూ అనుకున్నది సాధించవచ్చని మీరు నిరూపించారు. మీ దారి ఆదర్శప్రాయమైనదీ, ప్రపంచ శాంతిని నెలకొల్పేదీనూ. మీరంటే నాకు ఆరాధన’ అని గాంధీజీకి లేఖ పంపారు ఐన్‌స్టీన్, కలయికను అభ్యర్థిస్తూ. అయితే ఇద్దరూ కలిసే సమయం వచ్చేలోపే మహాత్ముడు నేలకొరిగారు. మహాత్ముడి గురించిన ఐన్‌స్టీన్ వ్యాఖ్య ‘రక్తమాంసాలతో కూడిన ఇలాంటి మనిషి...’ ప్రసిద్ధమైంది.
నేనెప్పుడూ ఒంటరి ప్రయాణికుడినే! నేను ఏనాడూ నా దేశానికి చెందలేదు, నా ఇంటికిగానీ, నా స్నేహితులకుగానీ నా నిండుగుండెతో చెందిలేను. అయినప్పటికీ నేను ఏనాడూ ఒంటరితనాన్నిగానీ, దేనికైనా దూరపుతనాన్నిగానీ అనుభవించలేదు, అన్నారు ఐన్‌స్టీన్. ఆయన మరణించి అర్ధశతాబ్దం దాటిపోయినా ఇప్పటికీ ఐన్‌స్టీన్‌నుంచి మనకు కూడా ఏ దూరపుతనమూ లేదు.
14 మార్చి ఐన్‌స్టీన్ జయంతి