ముంచెత్తనుందా?! | World Environment Day. | Sakshi
Sakshi News home page

ముంచెత్తనుందా?!

Published Sat, May 31 2014 11:41 PM | Last Updated on Sat, Sep 29 2018 5:47 PM

ముంచెత్తనుందా?! - Sakshi

ముంచెత్తనుందా?!

వివరం
 
 జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినం.
 
ఈ ఏడాది థీమ్... రెయిజ్ యువర్ వాయిస్, నాట్ ద సీ లెవల్.
 అంటే... స్వరాన్ని పెంచండి, సముద్రమట్టాన్ని కాదు... అని.
 సముద్రమట్టం పెరిగితే తీరప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది కనుక పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని యు.ఎన్.ఇ.పి. (యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్) అంటోంది.

 అలాగని సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయనా? లేదు. సముద్రమట్టం పెరగడం వల్ల వాటికి ప్రమాదం లేకపోవచ్చు కానీ, నానాటికీ పేరుకు పోతున్న చెత్త కారణంగా ఇక్కడ, అక్కడ అని లేకుండా మొత్తం భూగోళానికే ముప్పు పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే సముద్రాలను కూడా ఈ చెత్తగుట్టలు పీల్చేస్తాయని హెచ్చరిస్తున్నారు.
 
 ‘‘మన ఇళ్లు మాత్రమే శుభ్రంగా ఉండాలనే ‘చెత్త’ ఆలోచన వల్లే  కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇంటితో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే, ఉంచినప్పుడే మనకీ, పర్యావరణానికీ హానీ జరక్కుండా ఉంటుంది’’ - ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ అధికారులు వాడవాడా తిరిగి చెప్పే మాటలివి. ఎవరు చెబితే ఏంటి? ఎంత చెబితే ఏంటి? గోడమీద నుంచి వీధిలోకి చెత్త పడుతూనే ఉంటుంది. సరైన పద్ధతిలో పారిశుద్ధ్య నిర్వహణ జరక్కపోతే భవిష్యత్తులో భూమంతా కాలుష్యకాసారం అయిపోతుందని ఐక్యరాజ్యసమితి సైతం మైకు పట్టుకుని ప్రచారానికి దిగింది. పరిసరాలలో కాలుష్యం పెరగడానికి కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి. అన్నింటిలోకెల్లా భయంకరమైన కారణం...‘డంపింగ్ యార్డ్’.

 నగరాలలో తెల్లవారేసరికి ఇంట్లో చెత్త సిటీ శివార్లలోకి చేరిపోతుంది. మన హైదరాబాద్ నగరంలో రోజుకి 22 వేల టన్నుల చెత్తను తీసుకెళ్లి డంపింగ్ యార్డ్స్‌లో వేస్తున్నారు. రాష్ట్రం మొత్తంమీద రోజుకి 5 లక్షల 56 వేల టన్నుల చెత్త శివార్లకు తరలిపోతుంది. వెళ్లడం వరకూ బాగానే ఉంది. వెళ్లాక జరగాల్సిన పనే జరగడం లేదు. విదేశాల్లో, స్పష్టంగా చెప్పాలంటే అభివృద్ధి చెందిన దేశాల్లో చెత్తను మూడు విధాలుగా మాయం చేస్తారు. కరగపెట్టడం, కాలబెట్టడం, భూమిలో నిక్షిప్తం చేయడం. మొత్తానికి ఈ రోజు చెత్తను రేపటికి మాయం చేయడం వారి పరిసరాల పరిశుభ్రత వెనకున్న బ్రహ్మరహస్యం. మన దేశానికి కూడా అలాంటి సూత్రాలే ఉన్నాయి. అయితే మనకున్న ‘చెత్త’ వ్యవస్థ వల్లే వాటి అమలు సరిగ్గా జరగడం లేదంటారు సామాజిక శాస్త్రవేత్తలు. ఈ విషయంలో పాలకుల చేయి ప్రజలను చూపిస్తుంటే...ప్రజలు పాలకుల పుణ్యం అంటారు.

 డంపింగ్ యార్డుని నమ్ముకుని..

 ‘‘మనదేశంలో చెత్త ఎక్కువ. కారణం...అన్ని వస్తువులూ ఒక్క పనికి మాత్రమే ఉపయోగపడేవి కావడం వల్ల. పొరుగుదేశాల్లో ఒక వస్తువు పనైపోగానే చెత్తలోకి చేరిపోదు. దాన్ని మరో వస్తువుగా మలిచే పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయక్కడ. లేదంటే రిసైక్లింగ్‌కి ఎక్కువగా ఉపయోగిస్తారు. మరో ముఖ్యమైన విషయం చెత్త విభజన ఇంట్లోనే జరిగిపోతుంది. వంటింట్లో వచ్చే కూరగాయల చెత్త, ఆహారం వంటివాటిని ఎరువులుగా తయారుచేయడానికి ఉపయోగిస్తారు. పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు రీసైక్లింగ్‌కి వెళ్లిపోతాయి. మన దేశంలో అలాకాదు. అన్నీ కలగాపులగంగా డంపింగ్‌యార్డ్‌కి చేరిపోతాయి. మన దగ్గర డంపింగ్ యార్డ్‌పై ఆధారపడి బతుకున్నవారి సంఖ్య లక్షల్లో ఉంటుందంటే నమ్మగలరా? కాగితాలకోసం, బట్టలకోసం, ప్లాస్టిక్ కవర్లకోసం, ఇనుప ముక్కలకోసం...తెల్లవారే సరికి సంచులతో డంపింగ్‌యార్డులపై పడి ఒళ్లంతా కళ్లు చేసుకుని వెతుకుతుంటారు’’ అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ కాలుష్యనియంత్రణ మండలికి చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రసన్నకుమార్.

 పదేళ్లక్రితం జరిగిన సంఘటన...హైదరాబాద్ శివారులోని ఆటోనగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతం. వర్షాకాలం వచ్చిందంటే చాలు... ఆ చుట్టుపక్కల ప్రజలకు రకరకాల వ్యాధులొచ్చేవి. ‘‘సిటీలోని చెత్తనంతా తీసుకొచ్చి మా ముంగిళ్లలో పోయకండంటూ...’’ పెద్ద ఎత్తున అక్కడ ప్రజలంతా ధర్నాలు చేస్తే విషయం ఎలా ఉందో తెలుసుకుందామని మునిసిపల్ కార్పోరేషన్‌కి చెందిన అధికారులు అక్కడికి వెళ్లారు. గుట్టగుట్టలుగా పడి ఉన్న చెత్త. చెత్తమధ్యలో వర్షపు నీరు...ముక్కుపుటాలు ఎగిరిపోతున్నాయి. అడుగులు ముందుకు పడడం లేదు. ఇక మా వల్ల కాదంటూ కొందరు కారు తలుపులు తీయబోతుంటే...ప్రజలు ఊరుకోలేదు.‘‘ఇంకా ముందుకు రండి సార్..అసలు డంపింగ్ యార్డ్ ఉందక్కడ’’ అని ఓ నివాసి అన్నమాటలు అధికారులకు ప్రాణ భయాన్ని కలిగించాయి. వెళ్లకపోతే జనం ఊరుకునేలా లేరు. కర్చీప్‌లతో ముక్కుని అదిమిపట్టుకుని ముందుకెళ్లారు. ఆ అసలు డంపింగ్ యార్డ్‌లో జంతువులవి కళేబరాలు కనిపించాయి. వాటి మధ్య నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్న పిల్లలు కూడా వీరి కంట పడ్డారు. ‘‘ఇక్కడ మమ్మల్ని ఎలా బతకమంటారు సార్. మీరు ఓ పది నిమిషాలు ఉండడానికే ఇబ్బంది పడుతుంటే...ఎప్పుడూ ఇక్కడే ఉంటే మా పరిస్థితి ఏంటి?’’ అంటూ మహిళలు చొక్కా పట్టుకున్నంత పనిచేశారు. ఇక లాభం లేదంటూ... పదేళ్లక్రితం ఆ డంపింగ్‌యార్డ్‌ని చిలుకూరు సమీపంలోని ‘గంధంగూడాకి’ మార్చారు. ఇప్పుడు గంధంగూడాలో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రోజురోజుకీ విస్తరిస్తున్న నగరం కొండల్ని, గుట్టల్ని లెక్కచేయనట్టు డంపింగ్ యార్డ్‌లను కూడా తనలో కలిపేసుకుంటుంది. దీంతో ప్రజలకు ‘చెత్త’ కష్టాలు తప్పడం లేదు.

 ‘నిర్వహణ ’ లోపమే...

 పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగితే డంపింగ్ యార్డ్‌ను చూసి పారిపోవాల్సిన పని ఉండదంటారు కాలుష్యనియంత్రణ అధికారులు. ‘‘డంపింగ్ యార్డ్ చెత్తతో బయో పవర్‌ని తయారుచేయడం వల్ల బోలెడన్నీ ప్రజయోజనాలుంటాయని గంధంగూడలో ఆ ప్రాజెక్టుని అమలులో పెట్టారు. మిగతాచోట్ల కూడా ఆ పని చేస్తే మనకు విద్యుత్ కొరత తీరుతుంది. పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. కానీ ఆ  పాజెక్టు అమలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. కనీసం పారిశుద్ధ్య నిర్వహణ సూత్రాలను అమలు చేసినా బోలెడంతా ప్రయోజనం ఉంటుంది’’ అని అంటారు ఓ అధికారి.

 కబ్జాల కంపు...

 హైదరాబాద్ ఒక్కటే కాదు...ఎక్కడ చెత్త డంపింగ్ యార్డులున్నా..అక్కడ కబ్జాలుంటున్నాయి. ప్రభుత్వ స్థలమే కదా! పైగా డంపింగ్ యార్డ్... అడిగేదెవరనుకని చాలామంది భూ ఆక్రమణలు చేస్తున్నారు. గుడిసెలు, ఇళ్లు...మెల్లగా కాలనీలు. అదేమంటే... మా ఇళ్లమధ్యనే చెత్త పారేస్తున్నారనే వాదనలు. చాలాచోట్లా ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం. అలాంటివారికి స్థానిక నాయకుల అండ. వెరసి మనదేశంలో చెత్త చుట్టూ నివాసాలు, నివాసాల మధ్య చెత్త. ప్రజల ఆలోచనా తీరులో మార్పు రాకపోతే చెత్తనిర్వహణ ఎప్పటికీ ‘చెత్త’గానే ఉంటుంది. ‘ఇందులో కూడా కఠినమైన చట్టాలు వస్తేగానీ ప్రజలు చెప్పిన మాట వినర’ంటారు ప్రభుత్వ అధికారులు. ‘రోడ్డుపై చెత్త తీసుకెళ్లే పద్ధతి... మన ప్రభుత్వ అధికారుల పనితీరుకు నిదర్శనం’ అంటారు సామాన్యులు. నిజమే...ఎమ్‌సిహెచ్ వ్యాన్లు చెత్తను తీసుకెళ్లేటప్పుడు వ్యాన్ పైకప్పు మొత్తం కవర్‌తో కప్పి తీసుకెళ్లాలి. కానీ, జరుగుతున్నదేంటి....ఎక్కడో ఒకటి అరా తప్ప...వ్యాన్ పైకప్పు మూసివేసి చెత్తను తీసుకెళ్లడం ఇప్పటివరకూ ఎక్కడా అమలు కాలేదు. పైగా వ్యానులో నుంచి రోడ్డుపై చెత్త పడుతున్నా అధికారులు, ప్రజలు పట్టించుకోని సంఘటనలు బోలెడు.

 కుండీల గోల...

 చెత్తను వేసే చెత్త కుండీలు ఎక్కడ పెట్టాలి? అనేది అధికారులకు పెద్ద సమస్యగా మారిపోయింది. మామూలుగా అయితే రోడ్డు పక్కన పెడతారు. ఆ మధ్య మోతీనగర్‌లో ఓ స్థానిక నాయకుడి దగ్గరికి కొందరు పేదలు వచ్చి ఒక కంప్లయింట్ చేశారు. ‘‘మా గుడిసెల మధ్యలో చెత్త కుండీ పెట్టడం వల్ల మేం అక్కడ నివసించలేకపోతున్నాం.  ఆ కుండీల దుర్వాసనకు నోట్లోకి మెతుకు దిగడం లేదని మెరపెట్టుకున్నారు.’’ అది వారి బాధ. త్వరలోనే వారి ఇబ్బందుల్ని తీరుస్తానని ఆ నాయకుడు మాటిచ్చాడు. అసలు విషయం ఏమిటంటే...ఆ గుడిసెలు రోడ్డుకిరువైపులా అక్రమంగా వేసుకున్నవి. ఇళ్లమధ్యన పెడితే నివాసులకు ఇబ్బంది, రోడ్డు పక్కన పెడితే అక్రమణవాసులకు నచ్చదు. ఇంకెక్కడ పెట్టాలంటూ అధికారులు తలపట్టుకుంటున్నారు. నెలకోచోటకి మారుతున్న చెత్తకుండీల వెనకున్న గాధలివి.  ఇల్లు దాటిన చెత్త తెచ్చిపెడుతున్న కష్టాలకు మీరు బాధ్యులంటే...మీరంటూ  జరుగుతున్న వాదనలే తప్ప పొరుగింటిని చూసి నేర్చుకుందామన్న ఆలోచన కూడా కలగడం లేదు మనకు. ఓ చిన్న ఉదాహరణ...మొన్నామధ్య సింగపూర్‌కి విహారయాత్రకు వెళ్చొచ్చిన జంట అక్కడి విశేషాల గురించి చెబుతూ...‘‘అక్కడ రోడ్డుపై నడుస్తూ...చిన్న కాగితం ముక్క కింద వేసినా వెంటనే పోలీసులొచ్చి ఫైన్ కట్టమంటున్నారు. బాబోయ్ ఉన్న నాలుగురోజులు చేతిలో నుంచి చెత్త కింద పడకుండా జాగ్రత్తపడ్డాం. అందుకే కాబోలు...అక్కడ పరిసరాలు అంత శుభ్రంగా ఉన్నాయి. ఇండియాలో విమానం దిగేవరకూ సింగపూర్ సిస్టిమ్‌ని తు.చ తప్పకుండా పాటించాల్సి వచ్చింది’’ అంటూ...ఎంతో ఆశ్చర్యంగా చెప్పారు. మరి ఇక్కడికి వచ్చాక అంటే...‘‘ఇది మన దేశం కదండీ...ఇక్కడ మనిష్టమొచ్చినట్టు ఉండొచ్చు’’ అన్నారు. నిజమే ఇక్కడ మనిష్టమొచ్చినట్టు ఉండొచ్చు. చెత్తను ఇంటెదురుగా విసిరేసినా ఎవరూ అడగరు, వీధి చివరన పారేసినా ఎవరూ అడ్డు చెప్పరు, మనింటి చెత్త శివార్లలో కుళ్లుతూ...విషవాయువులను ఆశాశంలోకి పంపుతున్నా దాని గురించి ఎవరూ ఆలోచించరు. మనకున్న వ్యవస్థలో ఇది నేరం కాదు, ఘోరం అంతకన్నా కాదు. కానీ మన నడవడిక వల్ల భవిష్యత్తులో మనిషి మనుగడుకు భూమ్మీద చోటు లేకుండా చేసుకుంటున్నామన్నది మాత్రం నమ్మాల్సిన వాస్తవం. ప్రతిక్షణం పరిసరాల గురించి ఆలోచించడం కనీస అవసరం.  
 
- భువనేశ్వరి

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement