Environment Day
-
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. మొక్కలతో సెలబ్రిటీలు (ఫొటోలు)
-
బతుకు చెట్టుకు తల్లి వేర్లు
ఆరుగురు మహిళలు. ఆరుగురూ సామాన్యులు. సామాన్యులే కానీ.. వీళ్ల చేతుల్లో బంజరు భూమి బంగారమైంది. వీళ్లు వేసిన విత్తనం అడవై మొలకెత్తింది. వీళ్లు నాటిన మొక్క డాక్టర్ అయి ప్రాక్టీస్ పెట్టింది. వీళ్లు నూర్పిన సిరిధాన్యాలు.. ఆధునిక మానవుడికి తినడమెలాగో నేర్పాయి. మనం నరుక్కుంటున్న కొమ్మల్ని తిరిగి భూమాతకు అంటుకడుతున్న ఈ తల్లులకు.. సహస్ర ప్రణామాలు. శతకోటి వందనాలు. వెనుకటి మనిషి ‘చెట్టు నరికి గోడ కట్టకూడదు’ అని చెబితే అతడిని వెనుకబడిన మనిషిగా చూసింది మోడరన్ సొసైటీ. అభివృద్ధి పేరుతో అడవులను విచక్షణా రహితంగా నరికేసింది కూడా అప్పుడే. అడవుల్లో స్థిరనివాసం ఏర్పరచుకునే రోజుల నుంచి తనను తాను సంఘజీవిగా మలుచుకుంటూ పరిణతి చెందే క్రమంలో మనిషి పెట్టుకున్న నియమావళే చెట్టును నరికి గోడ కట్టకూడదనేది. మైదానంలో ఇల్లు కట్టుకోవాలి తప్ప, ఇంటి నిర్మాణం కోసం చెట్టును నరికేయవద్దని చెప్పడంలోనే... మనిషి జీవిక చెట్టుతో ముడిపడి ఉందని పూర్వికులు గ్రహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మాటను ఒట్టి నానుడిగా విని వదిలేసి, వేలకు వేల ఎకరాల్లో వందల ఏళ్ల కిందట పుట్టి, ఆకాశాన్నంటే ఎత్తుకు ఎదిగిన చెట్లను సైతం మొదలు నరికేసి... అదే నేలలో ఆకాశాన్నంటే భవనాలను కట్టి ‘ఇదిగో ఇదే అభివృద్ధి’ అని మోడరన్ మేన్ అంటున్నాడు. రాళ్లూరప్పలకు జీవం ఇప్పుడా మోడరన్ మేన్‌కి కర్తవ్యాన్ని, మానవ ధర్మాన్ని గుర్తు చేస్తూ.. ‘మీరు కాంక్రీట్ జంగిల్ కడితే, మేము నేచురల్ జంగిల్‌ని నిర్మిస్తాం’ అని మట్టిని తవ్వి మొక్కను నాటారు ఓ ఆరుగురు గ్రామీణ మహిళలు. వందలు, వేలు కాదు.. లక్షల మొక్కలు నాటారు! రాళ్లు రప్పలతో నిండి ఉన్న బంజరు నేలను చదును చేశారు. చేతి సత్తువతో గుంటలు తవ్వి మొక్కను నాటారు. ఆ మొక్క బతకాలంటే నీళ్లు పోసేదెవరు? దగ్గరలో నది లేదు, కాలువ లేదు. నీటి ప్రాజెక్టులనేవి ఉంటాయని కూడా వాళ్లకు తెలియదు. కుండలతో నీళ్లు మోసుకొచ్చి మొక్కలకు పోశారు. కడవ భుజాన పెట్టుకుని కిలోమీటర్ల దూరం నీటిని మోసి మొక్కలను బతికించారు. ఆ మొక్కలు పెరిగి పెద్దయ్యాయి, దశాబ్దాల వాళ్ల కష్టం పచ్చటి అడవిగా కళ్ల ముందు నిలిచింది. ఇంతటి శ్రమకోర్చిన వాళ్లందరూ గ్రామీణ దళిత మహిళలే. చిరుధాన్యాలు సాగుచేసే మహిళా రైతులు కూడా. వారి శ్రమను గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఆ ఆరుగురు మహిళలను గౌరవిస్తూ ఈ ఏడాది ‘ఈక్వేటర్ ప్రైజ్’ను ప్రకటించింది! నారూనీరు డీడీఎస్ ఈ ప్రైజ్‌కు ఎంపికైన మహిళలకు మార్గదర్శనం చేసిన స్వచ్ఛంద సంస్థ ‘డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ’ వాళ్లకు సన్మానం చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ ఐదవ తేదీన మెదక్‌జిల్లా జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మహిళలను శాలువాతో సత్కరించారు. కార్యక్రమానికి పుణెకి చెందిన పర్యావరణ వేత్త ఆశిశ్ కొఠారి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా క్లైమేట్ చేంజ్ ఎక్స్పర్ట్, ఎన్ఐఆర్డి విజిటింగ్ ఫ్యాకల్టీ ఉత్కర్ష్ ఘాటే, ఐఏఎస్ అధికారి ఉషారాణి పాల్గొన్నారు. ఉత్కర్ష్ ఘాటే సిరిధాన్యాల సాగులో ఉన్న ప్రయోజనాలను వివరించారు. ‘‘పత్తి వంటి వాణిజ్య పంటలు వేసిన రైతుల ఆత్మహత్యలను చూస్తున్నాం. కానీ మిల్లెట్స్ (కొర్రలు, జొన్న, సజ్జ, అరికెల వంటి చిరుధాన్యాలు) రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒక్కటీ లేదు. చిరుధాన్యాలు.. వాటిని తిన్న మనిషి ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు రైతును కూడా కాపాడతాయి’’ అని అన్నారు. మహిళలే వెన్నుదన్ను భూమి పుట్టి నాలుగన్నర కోట్ల ఏళ్లయిందని అంచనా. కాంస్య యుగం, లోహయుగం, మధ్యయుగం, ఆదిమ మానవ జాతి దశ నుంచి ఇప్పటి మోడరన్ పీరియడ్ వరకు ఎలా లెక్కేసుకున్నా సరే మనిషి ఒకచోట స్థిరంగా నివసించడం మొదలు పెట్టింది.. ఈ చివరి పదివేల నుంచి పదిహేను వేల ఏళ్ల మధ్యలోనే ఉంటుంది. అయితే కోట్ల ఏళ్ల భూమి మనుగడను ఆందోళనలో పడేయడానికి మనిషికి నిండా రెండువేల ఏళ్లు కూడా పట్టనే లేదు! ఆధునిక మానవుడు ప్రకృతి సమతుల్యతను దెబ్బతీశాడు. చివరికి అతడి మనుగడే దెబ్బతినే పరిస్థితులు ఏర్పడడంతో ‘దిద్దుబాటు’కోసం డి.డి.ఎస్. వంటి సంస్థలు మహిళల సహాయంతో నడుం బిగిస్తున్నాయి. – వాకా మంజులారెడ్డి విశ్వవిజేతలు ►నాగ్వార్ సునందమ్మది ఇందూరు గ్రామం. రాళ్లు రప్పలతో నిండి ఉన్న తొంభై ఎకరాల భూమిని చదును చేసి వేలాది మొక్కలను నాటింది. ఆమె కృషి... సామాజిక అడవులు విస్తరించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసింది. ►మైసనగారి రత్నమ్మ ఆల్గోల్ గ్రామంలో మహిళా సంఘం నాయకురాలు. ఆమె 72 గ్రామాలు తిరిగి ప్రతి గ్రామంలో మహిళాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామంలో యాభై ఎకరాలు, వంద ఎకరాలు, రెండు వందల ఎకరాల గుబ్బడి (మెట్ట నేల) ఉండేది. ఆ నేలల్లో వేప, మామిడి, చింత, రామచింత మొక్కలను నాటించారామె. ఫారెస్టు అధికారులు పర్యటనకు వస్తే చాలు... బీడు భూములను చూపించి మొక్కలిస్తే ఈ నేలలో కూడా నాటుతానని అడిగేదని, మొక్కలు ఏర్పాటు చేసే వరకు అధికారులను వెంటాడేదని చెబుతారు తోటి మహిళలు. ఆమె ఆ రకంగా చెట్లను నాటి సామాజిక అడవిని నాటి పరిరక్షించారు. అందుకు గాను భారత ప్రభుత్వం 1993లో ఆమెను ‘వృక్షమిత్ర’ పురస్కారంతో గౌరవించింది. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సంగతులను గుర్తు చేసుకున్నారామె. ►బేగరి తుల్జమ్మది పస్తాపూర్. ముప్పైకి పైగా మహిళా సంఘాల రూపకల్పనతోపాటు విత్తన సాగులో ఆమె విశేషంగా కృషి చేశారు. సిరిధాన్యాలను సాగు చేసే మహిళా రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా (32 గ్రామాలకు) చేస్తూ ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థను సమర్థంగా నిర్వహించారామె. ఆమె చొరవతో బీడుపడిపోయి ఉన్న ఐదువేల మూడు వందల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఆ నేలలో వాళ్లు చిరుధాన్యాలను పండిస్తున్నారు. ►చిల్కపల్లి అనుసూయమ్మ మారుమూల గ్రామాల మహిళలను నడిపించిన మార్గదర్శి. పడావు నేలలకు పచ్చటి దుప్పటి కప్పడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది. వేలాది మంది మహిళలను చైతన్యవంతం చేయడంలో ఆమె దిట్ట. వారందరినీ కలుపుకుంటూ నిరుపయోగమైన భూమిలో లక్షలాది మొక్కలు నాటి అడవిని సృష్టించిన మహిళ. ►నడిమిదొడ్డి అంజమ్మది గంగ్వార్ గ్రామం. ఆమె పాతికేళ్లుగా మనదేశీయ సంప్రదాయ విత్తనాలను కాపాడుతోంది. ఈ విత్తనాలతో సాగు చేసిన పంటలకు చీడపీడలు ఆశించవు. ఆమె పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యం కలిగిన మహిళ కూడా. ఈ రంగంలో అంజమ్మ సేవలకుగాను గతంలో అనేక ప్రాంతీయ, జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. సిరిధాన్యాల సాగుతో జీవితాలను నిలబెట్టుకోవచ్చని, సిరిధాన్యాలతో తినడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చని పాతికేళ్ల కిందటే జాతీయ వేదికల మీద చెప్పిన మహిళ కూడా. ►ఎర్రోళ్ల కనకమ్మది మచ్నూర్ గ్రామం. ఆమె పాతికేళ్లుగా బీడుభూములను సాగులోకి తీసుకువచ్చి, ఔషధ వనాన్ని పెంచారు. వనాన్ని పెంచడంతోపాటు ఏ చెట్టులో ఏ ఔషధ లక్షణం ఉందో తెలుసుకుని, గ్రామంలోని మహిళలను సంఘటిత పరిచి వారికి తెలియచేసింది. ఆధునిక వైద్యం అందుబాటులో లేని తమ గ్రామాల్లో ప్రత్యామ్నాయ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారామె. యూఎన్డీపీ ఈక్వేటర్ అవార్డు ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థ యూఎన్డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్). ఈ సంస్థ ఏటా పేదరిక నిర్మూలన, జీవవైవిధ్య నిరంతరత కోసం సమిష్టిగా కృషి చేస్తున్న సంఘాలకు ఈక్వేటర్ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది 127 దేశాల నుంచి 847 నామినేషన్లు వచ్చాయి. ఎంపికైన 20 అవార్డుల్లో ఒకటి మన తెలుగు వాళ్లది. తెలుగు వాళ్లు ఈ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలానికి చెందిన గ్రామీణ మహిళల సంయుక్త కృషే ఈ అవార్డును తెచ్చి పెట్టింది. ఐక్యరాజ్య సమితి గడచిన 17 ఏళ్లుగా ఈ అవార్డులిస్తోంది. మనదేశం ఇంతకుముందు తొమ్మిది ఈక్వేటర్ అవార్డులు అందుకున్నది. ఇది పదవ అవార్డు. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సమష్టిగా కృషి చేసిన స్వయం సహాయక బృందాల మహిళలు 2019 అవార్డుకు ఎంపికయ్యారు. వారికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో బహుమతి ప్రదానం చేస్తారు. పురస్కారంలో జ్ఞాపికతోపాటు పదివేల డాలర్ల (సుమారుగా ఏడు లక్షల రూపాయలు) నగదు బహుమతి అందచేస్తారు. -
నో ప్లాస్టిక్.. సేవ్ ఎన్విరాన్మెంట్
జీడిమెట్ల: భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతను తగ్గించాలంటే మొక్కలను నాటడమే మార్గమని జీడిమెట్ల ఐలా మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జేఎన్‌ఎమ్‌ఐఏ సర్వీస్ సొసైటీ, టీఎస్ఐఐసీ, ఐలా ఆధ్వర్యంలో 500మందితో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి పీసీబీ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ కుమార్ పాఠక్, జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, టీఎస్ఐఐసీ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ విజయరెడ్డి, ఐలా చైర్మన్ సదాశివరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచడంతో పాటు ప్రస్తుతం ఉన్న చెట్లను నరికివేయవద్దని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి భూమిని కాపాడుకోవాలని అన్నారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే డిశ్చార్జ్ చేయాలని వారు సూచించారు. కలిసికట్టుగా కార్యక్రమాలు భేష్ ప్రతి సంవత్సరం జీడిమెట్లలోని అన్ని సొసైటీలు కలిసికట్టుగా నెలరోజుల పాటు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడం భేష్ అని మేడ్చల్ జిల్లా ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ కుమార్ పాఠక్ అన్నారు. ప్రతి సంవత్సరం మొక్కలను నాటి వాటిని పెంచడంలో తీసుకుంటున్న జాగ్రత్తలు బాగున్నాయని ఈ సందర్భంగా ఆయన వారిని కొనియాడారు. కార్యక్రమంలో ఐలా కార్యవర్గ సెక్రటరీ సాయికిషోర్, ఎ.ఎల్.ఎన్.రెడ్డి, ఫేజ్–3 ప్రోగ్రాం ఇంచార్జ్ విజయ కుమార్ నంగానగర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉరుముతున్న కాలుష్య మేఘాలు..
ఒకవైపు కొరవడుతున్న పర్యావరణ స్పృహ.. మరోవైపు పెరుగుతున్న కాలుష్యంతో మహానగరం విలవిల్లాడుతోంది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న హానికరమైన వ్యర్థాలు, నానాటికీ పెరుగుతున్న వాహనాలతో పెచ్చరిల్లుతున్న ఉద్గారాలు, ఈ–వ్యర్థాలు, విచ్చలవిడిగా చెత్తా చెదారాలు.. ఇలా ఒకటనేమిటి ఎన్నో విధాలుగా పర్యావరణంపై కాలుష్యం పడగ విప్పుతోంది. జనజీవనంపై పెనుప్రభావం చూపుతోంది. జల, వాయు, శబ్ద కాలుష్యంతో నగర ప్రజలు పలు రోగాల బారిన పడుతున్నారు. పర్యావరణ పరిరక్షణపై అటు ప్రభుత్వాలు, అధికారులు, వ్యక్తిగతంగా ఎవరూ శ్రద్ధ కనబరచకపోవడంతో ప్రకృతి విషతుల్యంగా మారుతోంది. ఎవరికి వారు దీనిపై చైతన్యవంతులైతేనే ఈ దుస్థితి నుంచి బయటపడవచ్చు. అనర్థం ‘ఈ వ్యర్థం’ సనత్‌నగర్: ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ– వేస్ట్) పెనుసవాల్‌గా మారాయి. ఒకవైపు ఎలక్ట్రానిక్స్ రంగంలో మనిషి సృష్టిస్తున్న అద్భుతాలకు మురిసిపోతుంటే.. మరోవైపు అవే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. మనిషి అభివృద్ధి ముసుగులో తాను కూర్చొన్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టమేననే పరిస్థితులు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, సెల్‌ఛార్జర్, బ్యాటరీలు, మదర్‌బోర్డులు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, రిమోట్లు, సీడీలు, హెడ్ఫోన్లు, జిరాక్స్ యంత్రాలు, ప్రింటర్స్, సీపీయూ (సెంట్రల్ పాసెసింగ్ యూనిట్లు), ఐప్యాడ్, ప్యాక్స్ యంత్రాలు.. ఇలా ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు మనిషి జీవితంలో భాగమయ్యాయి. వాడి పారేసిన ఆయా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి ముప్పుగా పరిణమించాయి. ఈ– వ్యర్ధాల నుంచి వెలువడే ప్రమాదకర రసాయనాలు భూమిలోకి చేరి భూ గర్భ జలాలను విషతుల్యం చేస్తూ మానవ మనుగడకు మనిషి ఆరోగ్యానికి చేటు తెస్తున్నాయి. హెచ్ఎండీఏ నుంచే 33,000 టన్నులు.. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తాజాగా ఈపీటీఆర్ఐ (ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)చే ఈ– వేస్ట్‌పై 2017–18కు సర్వే చేయించింది. దీని ప్రకారం హెచ్ఎండీఏ పరిధిలో 33,000 టన్నుల ఈ– వేస్ట్ ఏటా విడుదలవుతున్నట్లు డ్రాప్ట్ నివేదికను పీసీబీకి అందించింది. అందులో సింహభాగం కంప్యూటర్స్, టెలివిజన్స్, ప్రింటర్స్, మొబైల్ ఫోన్ల వ్యర్థాలే ఉండడం గమనార్హం. 2016–17కు 28,790 టన్నుల ఈ– వ్యర్ధాలు విడుదల కాగా ఈ ఏడాది ఐదువేల టన్నులకుపైగా పెరిగింది. ఇలా ప్రతి ఏటా ఈ వ్యర్థాలు వెలువడే శాతం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశంలో ఈ– వ్యర్థాల విడుదలలో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, ముంబై, చైన్నైలు ఉండగా హైదరాబాద్ ఏడో స్థానంలో ఉంది. ఎంతో ప్రమాదకరం.. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ముఖ్యంగా చిప్, సర్క్యూట్, మదర్‌బోర్డు వంటి తయారీలో సీసం, ఆర్సినిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, పాదరసం, నికెల్, జింక్ తదితర ప్రమాదకరమైన వాటిని ఉపయోగిస్తారు. వీటితో తయారైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పారేయడంతో ఆయా రసాయనాలు భూమిలో కలిసి మట్టితో పాటు భూగర్భ జలాలను విషతుల్యం చేస్తాయి. వీటిని తగలబెడితే వెలువడే విష వాయువులు వాతావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి. రీచార్జిబుల్ బ్యాటరీలు, ట్రాన్సిస్టర్లు, లిథియం బ్యాటరీల తయారీలో సీసాన్ని అధికంగా ఉపయోగిస్తారు. సీసంతో కలుషితమైన నీటిని తాగడం వల్ల నాడీ వ్యవస్థతో పాటు మూత్రపిండాలు దెబ్బతింటాయి. పిల్లల్లో బుద్ధిమ్యాంద్యం వస్తుంది. కంప్యూటర్ మానిటర్, సర్క్యూట్ బోర్డులు, కంప్యూటర్ బ్యాటరీ తయారీలో కాడ్మియాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. దీర్ఘకాల కాడ్మియం ప్రభావంతో మూత్రపిండాలు, ఎముకలు బలహీనపడతాయి. వెన్నెముక, కీళ్లలో నొప్పి కలుగుతుంది. పాదరసాన్ని స్విచ్‌లు, పాకెట్ క్యాలిక్యులేటర్, ఎల్సీడీల తయారీలో ఉపయోగిస్తారు. పాదరసం ఆహారపు గొలుసు ద్వారా మనిషిలోకి చేరి మినిమెటా వ్యాధిని కలిగిస్తోంది. సెమీ కండక్టర్లు, డయెడ్లు, లెడ్‌ల తయారీలో వాడే ఆర్సినిక్ వల్ల క్యాన్సర్, గుండెజబ్బులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహన విస్ఫోటనం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో వాహన విస్ఫోటనం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కోటి జనాభా ఉన్న భాగ్యనగరంలో వాహనాల సంఖ్య అరకోటి దాటింది. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు. తాజాగా మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తున్నా వ్యక్తిగత వాహనాల జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్‌లు పరుగులు తీస్తున్నాయి. అయినా నగరవాసి సొంత వాహనానికే మొగ్గు చూపుతున్నాడు. మరోవైపు కాలం చెల్లిన వ్యక్తిగత, రవాణా వాహనాల కారణంగా కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగరంలో వాహనకాలుష్యం గురించి 15 ఏళ్ల క్రితమే భూరేలాల్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజా రవాణా వినియోగం పెరగాలని, సీఎన్జీ,ఎల్పీజీ వంటి సహజ ఇంధనాలు అందుబాటులోకి రావాలని సూచించింది. వాహన కాలుష్యానికి ప్రధాన కారణమైన ఆటోరిక్షాలపైన ఆంక్షలు విధించాలని చెప్పింది. ఆ సిఫార్సుల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. ఏటా వ్యక్తిగత వాహనాలు వెల్లువలా వచ్చిపడుతూనే ఉన్నాయి. జనాభా అవసరాలకు తగిన విధంగా ప్రజారవాణా బలోపేతం కావడం లేదు. ప్రస్తుతం గ్రేటర్లో వాహనాల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇందులో 40.51 లక్షల బైక్‌లు, 9.43 లక్షలకు పైగా వ్యక్తిగత కార్లు మొదటి రెండు స్థానాల్లో ఉండడం గమనార్హం. ప్రతి సంవత్సరం 5 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. కొరవడిన నియంత్రణ.. ఆర్టీసీలో ఉన్న సుమారు 1000 డొక్కు బస్సులు సిటీ రోడ్లను కాలుష్యంతో ముంచెత్తుతున్నాయి. 1.4 లక్షల ఆటోలు ఉంటే అందులో 80 వేలకు పైగా కాలం చెల్లినవే. ఈ ఆటోల్లో వినియోగించే నకిలీ టూ టీ ఆయిల్ వల్ల సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకరమైన కాలుష్యకారకాలు వెలువడుతున్నాయి. స్కూల్ బస్సులు, లారీలు, వ్యాన్లు, తదితర కేటగిరీకి చెందిన వాటిలో ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి దిగుమతి అయిన పాత వాహనాలే ఉన్నాయి. నగరంలో ఆందోళన కలిగిస్తున్న వాహన కాలుష్యంపైన భూరేలాల్ కమిటీ 2002లోనే హెచ్చరించింది. తక్షణమే ఆటోలను నియంత్రించాలని సూచించింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 45 వేల కొత్త ఆటోలు వచ్చి చేరాయి. కమిటీ సూచించినట్లుగా సీఎన్జీ అందుబాటులోకి రాలేదు. ఎల్పీజీ బంకులు పరిమితంగానే ఉన్నాయి. ఇదీ పరిస్థితి... గ్రేటర్లో వాహనాలు ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్లకు పైగా డీజిలును వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత పెరుగుతూనే ఉంది. పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్భన్‌మోనాక్సైడ్,నైట్రోజన్ డయాక్సైడ్,సల్ఫర్ డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం (ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది. దీంతో నగరవాసులు పలు జబ్బుల బారిన పడుతున్నారు. జబ్బుల ముప్పు సాక్షి, సిటీబ్యూరో: తినే తిండి దగ్గరి నుంచి, తాగే నీరు, పీల్చే గాలి, ఇలా అన్నీ కలుషితమే. సంపూర్ణ ఆరో గ్యంతో జీవించాల్సిన నగరవాసులు.. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్య భూతం వల్ల భయంకరమైన జబ్బుల బారిన పడుతున్నారు. గ్రేటర్ రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం వల్ల చిన్న తనంలోనే అనేక మంది శ్వాసకోశ జబ్బుల బారినపడుతున్నారు. నగరంలో ఐదు శాతం మంది పెద్దలు, 20 శాతం మంది చిన్నారులు శ్వాస కోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. వాతావరణంలో ఓజోన్ 100 మైక్రో గ్రాములు దాట కూడదు. పగటివేళ 120–150 మైక్రోగ్రాములు దాటుతోంది. సీసం, ఆర్సినిక్, నికెల్ వంటి భారలోహ ధాతువులు కలిగిస గాలి పీల్చడం ద్వారా అది శ్వాసకోశాల్లోంచి రక్తంలోకి చేరుతుంది. ఇది నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాలుష్యం వల్ల ముక్కు ద్వారాలు మూసుకపోయి గాలి తీసుకోవడం కష్టమవుతుంది. జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. పిల్లల ఎదుగుదలను నిరోధిస్తుంది. అంతేకాదు ఈ కాలుష్యం సంతాన సామర్థ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. జడలు విప్పుతున్న థైరాయిడ్.. ఇప్పటి వరకు కేవలం మధుమేహ, గుండె జబ్బులకు మాత్రమే కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరం తాజాగా హైపోథైరాయిడిజంలోనూ ఇతర ప్రాంతాలతో పోటీపడుతోంది. ఇండియన్ థైరాయి డ్ ఎపిడమిలాజీ స్టడీ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో 18 ఏళ్లుపైబడిన వారిలో 10.95 శాతం మంది థైరాయిడ్‌తో బాధ పడుతుంటే, వీరిలో 15.86 శాతం మంది మహిళలు, 5.02 శాతం మంది పురుషులు ఉండటం గమనార్హం. హైదరాబాద్ నగరం లో 8.88 శాతం బాధితులు ఉన్నట్లు నిర్ధా«రణ కాగా, వీరిలో 50 శాతం మందికి తమకు ఈ సమస్య ఉన్నట్లే తెలియక పోవడం శోచనీయం. వెంటాడుతున్న కేన్సర్ ఐఏఆర్సీ సర్వే ప్రకారం దేశంలో ఏటా కొత్తగా పది లక్షల క్యేన్సర్ కేసులు నమోదు అవుతుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే పదివేల కేసులు నమోదు అవుతున్న ట్లు సమాచారం. గ్రామీణ మహిళలతో పోలిస్తే పట్టణ మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార కేన్సర్ తక్కువగా ఉన్నా.. రొమ్ము కేన్సర్ మాత్రం రెట్టింపవుతోంది. మారిన జీవనశైలి ఒక కారణమైతే..నగరంలో పెరుగుతున్న కాలుష్యం కూడా కేన్సర్ పెరుగుదలకు మరో కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నా రు. ప్రతి వంద క్యాన్సర్ బాధితుల్లో 60 శాతం రొమ్ము, 40 శాతం మంది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఇక పొగాకు ఉత్పత్తుల వల్ల ఏటా రెండు లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అవుతుండటం విశేషం. జనజీవితాలపై పొగ రోజు రోజుకు పర్యావరణంపై కాలుష్య ప్రభావం పెరుగుతూనే ఉన్నది. పరిశ్రమల యాజమాన్యాల స్వార్థానికి తోడు అవినీతి అధికారుల కారణంగా పర్యావరణ ప్రమాణాలు పడిపోతూనే ఉన్నాయి. కాలుష్య పొగలను బహిరంగంగా గాలిలోకి కలిపేస్తున్నారు. కుత్బుల్లాపూర్ పరిధి జీడిమెట్ల, సుభాష్‌నగర్, దుండిగల్ పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య పొగలు ఇవి. కేవలం పరిశ్రమలే కాదు వివిధ ప్రాంతాలలో వ్యర్థాలను తగులబెడుతూ పర్యావరణ కాలుష్యానికి కారకులవుతున్నారు. ఈ దుస్థితి ఇకనైనా మారేనా!? – కుత్బుల్లాపూర్. పర్యావరణంపై ధ్యాస.. ప్రకృతే ‘శ్వాస’ మొక్కలు నాటడంలో ఆదర్శంగా నిలుస్తున్న కళ్యాణి హిమాయత్‌నగర్: ఆమె ఒక పర్యావరణ విద్యార్థిని. ప్రకృతిపై ఎనలేని అభిమాని. పర్యావరణంపై ప్రతి పౌరుడూ ఎంత బాధ్యతగా వ్యవహరించాలో ఆమె ప్రతిరోజూ నేర్చుకుంటున్నారు. అది తరగతి గదికే పరిమితం కాకుండా ఆచరణలోనూ పాటిస్తున్నారు. రహదారి పక్కన ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యతను తీసుకుంటున్నారు జేఎన్టీయూలో పీహెచ్డీ స్కాలర్ జి.కళ్యాణి. దీనిని ఒక యజ్ఞంలా భావించి మొక్కలు నాటేందుకు ఓ ఫౌండేషన్ కూడా స్థాపించారామె. ఫౌండేషన్ ద్వారా తోటి విద్యార్థులను ఏకం చేస్తూ పర్యావరణంపై మరింత బాధ్యతగా నిలుస్తున్నారు కల్యాణి. నగరంలో ఖాళీగా కనిపించిన స్థలాలను ఎంచుకుని తోటి సభ్యులతో కలసి వారంలో రెండు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటుతోంది. దీంతో అక్కడి ప్రజలకు ఈ మొక్కలు వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరిస్తూ వాటిని రక్షించాలనే మెసేజ్‌ను ఇస్తున్నారు. ఇప్పటి వరకు జేఎన్టీయూ, బంజారాహిల్స్, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో మొక్కలను నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకున్న విషయం ప్రజల్లోకి మరింతగా వెళ్లాలంటే ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఓ ఫౌండేషన్‌ను స్థాపించాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు కళ్యాణి. ‘శ్వాస ఫౌండేషన్’ స్థాపించి పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతకు శ్రీకారం చుట్టారు. పచ్చదనం ప్రయోజనాలను వివరిస్తాను.. ఎన్విరాన్మెంట్ పీహెచ్డీ స్కాలర్‌గా నా చదువుకు కూడా న్యాయం చేయాలి. పర్యావరణంపై మమకారం ఎక్కువ. అందుకే ఓ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. రానున్న రోజుల్లో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలనుంది. – జి.కళ్యాణి, ‘శ్వాస’ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు -
కోరలుచాచిన కాలుష్యం
- తీవ్రమైన చెట్ల నరికివేత - నీటి సంరక్షణ, మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం - అడుగంటుతున్న భూగర్భ జలాలు - ‘పర్యావరణం’పై అవగాహనే కీలకం - నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణ పరిరక్షణ.. ఇది అందరి బాధ్యత.. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలి.. చెట్లు నరకడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాలు కురవకపోవడం.. భూగర్భ జలాలు అడుగంటడం.. ఆరోగ్య సమస్యలు తలెత్తడం.. భవిష్యత్ తరాలకు ఎదురయ్యే ఇబ్బందులు.. వీటన్నింటిపై ముందస్తుగా వివరిస్తే కొంత మేలు చేసినట్లవుతుంది.. ఆ దశగా ప్రతి ఒక్కరు అడుగు ముందుకు వేయూలి.. నగరాలు, గ్రామాల్లో మొక్కలు విరివిగా పెంచడం.. వాటిని కాపాడడం బాధ్యతగా తీసుకోవాలి.. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... - వరంగల్ అర్బన్/మహబూబాబాద్ రూరల్ : పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ఏదో ఒక నగరంలో అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. ఇందులో పర్యావరణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొంది స్తుం టారు. 1972లో స్థాపించబడిన ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ పథకం’ ఇదే నివేదికను ఉపయోగించుకుని పర్యావరణానికి సంబంధించి.. రాజకీయవాదులను, ప్రజలను అప్రమత్తం చేసే దిశగా తగిన చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఆధునిక పోకడలు పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినడం వల్ల భవిష్యత్ తరాలకు శాపంగా మారనుంది. పల్లెలు, గ్రామాలను వదిలి పట్టణాలకు, నగరాలకు వలసలు పెరుగుతున్నాయి. ఏటా ఈ శాతం వృద్ధి చెందుతుండటంతో పట్టణాలు, నగరాలపై ఒత్తిడి ఎక్కువవుతోంది. ఆవాసాలకు అవసరమైన స్థలాల కోసం పచ్చని చెట్లను నరికేస్తున్నారు. చెరువులు, కుంటలను ఆక్రమిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. వాహనాల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతుండటంతో కాలుష్య భూతం ప్రజలను భయపెడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో పట్టణాలు, నగరాల్లో జీవనం దుర్భరంగా మారుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాల ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం వెరసి పట్టణాలు, నగరాల్లో పర్యావరణానికి తూట్లు పడుతున్నారు. పర్యావరణంపై పట్టింపు కరువు పర్యావరణం కలుషితం కావడం వల్ల ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయి. చెత్త చెదారాన్ని ఎక్కడపడితే అక్కడ కాల్చివేస్తుండటంతో వెలువడుతున్న పోగతో శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు. వాతావరణానికి విఘాతం కలుగుతోంది. పడిపోతున్న భూగర్భ జలాలు నగరంలో అపార్టుమెంట్ సంస్కృతి పెరగడంతో బోరుబావుల నుంచి భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరిగింది. కాంక్రీట్ జంగిల్లా మారి వర్షపు నీరు భూమిలో ఇంకేం దుకు కూడా ఆవకాశం లేకపోవడం, భూగర్భ జలాలు వినియోగించుకోవడమే కానీ, తిరిగి భర్తీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో భూగర్భ జల మట్టాలు భారీగా పడిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో హన్మకొండలో 14.38, జనగామలో 13.77 మీటర్లకు భూగర్భ జలమట్టాలు అడుగంటిపోయాయి. ఇలా జిల్లాలోని పట్టణాల్లో, నగరంలో 13 నుంచి 36 మీటర్ల మేర భూగర్భ జలమట్టం అడుగంటిపోరుుంది. కాగితాల్లోనే నిషేధం ప్రభుత్వం 40 మైక్రాన్ల లోపు మందం ఉన్న పాలిథిన్ సంచులను నిషేధించింది. అరుునా నగరంలో పాలిథిన్ వినియోగం ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ చూసినా పాలిథిన్ సంచుల క్రయవిక్రయాల నియంత్రణకు అధికారులు చేపడుతున్న చర్యలు ఏమీ కనిపించడం లేదు. గతంలో పాలిథిన్ విక్రయాలు అరికట్టేందుకు క్రమం తప్పకుండా దాడులు చేసేవారు. అవి నిలిపివేయడంతో పాలిథిన్ సంచుల విక్రయాలు కొనసాగుతున్నాయి. పాలిథిన్ విని యోగం పెరగడం వల్ల వ్యర్థాలతోపాటు టన్నులకొద్దీ పాలిథిన్ చేరుతోంది. దీంతో భూసారం దెబ్బతినడంతోపాటు డ్రైనేజీల్లో చేరినప్పడు మురుగు పారుదలకు ఆటంకంగా తయారవుతున్నాయి. వాల్టా చట్టం అమలులో విఫలం నీరు, భూమి, చెట్టు పరిరక్షణ చట్టం(వాల్టా యాక్టు-2002) అమలులో ఉంది. దీని ప్రకారం వృక్షాలు, చెట్లు నరకకూడదు. ఒకవేళ చెట్లు నరికితే 30 రోజుల్లో ఒక చెట్టుకు రెండు మొక్కల చొప్పన నాటి వాటిని పర్యవేక్షించాల్సి ఉంది. కానీ.. ఇది ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదు. ప్రైవేట్ వ్యక్తులే కాదు, విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్నాయని, ఇళ్ల నిర్మాణాలకు, రోడ్ల విస్తరణకు అడ్డుగా వస్తున్నాయని చెట్లను నరికివేస్తున్నారు. నగరంలో విపరీతంగా చెట్లు నరికి వేయడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ఈ చట్టాలను సక్రమంగా అమలు పరిచే ందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
ముంచెత్తనుందా?!
వివరం జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినం. ఈ ఏడాది థీమ్... రెయిజ్ యువర్ వాయిస్, నాట్ ద సీ లెవల్. అంటే... స్వరాన్ని పెంచండి, సముద్రమట్టాన్ని కాదు... అని. సముద్రమట్టం పెరిగితే తీరప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది కనుక పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని యు.ఎన్.ఇ.పి. (యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్) అంటోంది. అలాగని సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయనా? లేదు. సముద్రమట్టం పెరగడం వల్ల వాటికి ప్రమాదం లేకపోవచ్చు కానీ, నానాటికీ పేరుకు పోతున్న చెత్త కారణంగా ఇక్కడ, అక్కడ అని లేకుండా మొత్తం భూగోళానికే ముప్పు పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే సముద్రాలను కూడా ఈ చెత్తగుట్టలు పీల్చేస్తాయని హెచ్చరిస్తున్నారు. ‘‘మన ఇళ్లు మాత్రమే శుభ్రంగా ఉండాలనే ‘చెత్త’ ఆలోచన వల్లే కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇంటితో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే, ఉంచినప్పుడే మనకీ, పర్యావరణానికీ హానీ జరక్కుండా ఉంటుంది’’ - ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ అధికారులు వాడవాడా తిరిగి చెప్పే మాటలివి. ఎవరు చెబితే ఏంటి? ఎంత చెబితే ఏంటి? గోడమీద నుంచి వీధిలోకి చెత్త పడుతూనే ఉంటుంది. సరైన పద్ధతిలో పారిశుద్ధ్య నిర్వహణ జరక్కపోతే భవిష్యత్తులో భూమంతా కాలుష్యకాసారం అయిపోతుందని ఐక్యరాజ్యసమితి సైతం మైకు పట్టుకుని ప్రచారానికి దిగింది. పరిసరాలలో కాలుష్యం పెరగడానికి కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి. అన్నింటిలోకెల్లా భయంకరమైన కారణం...‘డంపింగ్ యార్డ్’. నగరాలలో తెల్లవారేసరికి ఇంట్లో చెత్త సిటీ శివార్లలోకి చేరిపోతుంది. మన హైదరాబాద్ నగరంలో రోజుకి 22 వేల టన్నుల చెత్తను తీసుకెళ్లి డంపింగ్ యార్డ్స్‌లో వేస్తున్నారు. రాష్ట్రం మొత్తంమీద రోజుకి 5 లక్షల 56 వేల టన్నుల చెత్త శివార్లకు తరలిపోతుంది. వెళ్లడం వరకూ బాగానే ఉంది. వెళ్లాక జరగాల్సిన పనే జరగడం లేదు. విదేశాల్లో, స్పష్టంగా చెప్పాలంటే అభివృద్ధి చెందిన దేశాల్లో చెత్తను మూడు విధాలుగా మాయం చేస్తారు. కరగపెట్టడం, కాలబెట్టడం, భూమిలో నిక్షిప్తం చేయడం. మొత్తానికి ఈ రోజు చెత్తను రేపటికి మాయం చేయడం వారి పరిసరాల పరిశుభ్రత వెనకున్న బ్రహ్మరహస్యం. మన దేశానికి కూడా అలాంటి సూత్రాలే ఉన్నాయి. అయితే మనకున్న ‘చెత్త’ వ్యవస్థ వల్లే వాటి అమలు సరిగ్గా జరగడం లేదంటారు సామాజిక శాస్త్రవేత్తలు. ఈ విషయంలో పాలకుల చేయి ప్రజలను చూపిస్తుంటే...ప్రజలు పాలకుల పుణ్యం అంటారు. డంపింగ్ యార్డుని నమ్ముకుని.. ‘‘మనదేశంలో చెత్త ఎక్కువ. కారణం...అన్ని వస్తువులూ ఒక్క పనికి మాత్రమే ఉపయోగపడేవి కావడం వల్ల. పొరుగుదేశాల్లో ఒక వస్తువు పనైపోగానే చెత్తలోకి చేరిపోదు. దాన్ని మరో వస్తువుగా మలిచే పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయక్కడ. లేదంటే రిసైక్లింగ్‌కి ఎక్కువగా ఉపయోగిస్తారు. మరో ముఖ్యమైన విషయం చెత్త విభజన ఇంట్లోనే జరిగిపోతుంది. వంటింట్లో వచ్చే కూరగాయల చెత్త, ఆహారం వంటివాటిని ఎరువులుగా తయారుచేయడానికి ఉపయోగిస్తారు. పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు రీసైక్లింగ్‌కి వెళ్లిపోతాయి. మన దేశంలో అలాకాదు. అన్నీ కలగాపులగంగా డంపింగ్యార్డ్కి చేరిపోతాయి. మన దగ్గర డంపింగ్ యార్డ్‌పై ఆధారపడి బతుకున్నవారి సంఖ్య లక్షల్లో ఉంటుందంటే నమ్మగలరా? కాగితాలకోసం, బట్టలకోసం, ప్లాస్టిక్ కవర్లకోసం, ఇనుప ముక్కలకోసం...తెల్లవారే సరికి సంచులతో డంపింగ్‌యార్డులపై పడి ఒళ్లంతా కళ్లు చేసుకుని వెతుకుతుంటారు’’ అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ కాలుష్యనియంత్రణ మండలికి చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రసన్నకుమార్. పదేళ్లక్రితం జరిగిన సంఘటన...హైదరాబాద్ శివారులోని ఆటోనగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతం. వర్షాకాలం వచ్చిందంటే చాలు... ఆ చుట్టుపక్కల ప్రజలకు రకరకాల వ్యాధులొచ్చేవి. ‘‘సిటీలోని చెత్తనంతా తీసుకొచ్చి మా ముంగిళ్లలో పోయకండంటూ...’’ పెద్ద ఎత్తున అక్కడ ప్రజలంతా ధర్నాలు చేస్తే విషయం ఎలా ఉందో తెలుసుకుందామని మునిసిపల్ కార్పోరేషన్‌కి చెందిన అధికారులు అక్కడికి వెళ్లారు. గుట్టగుట్టలుగా పడి ఉన్న చెత్త. చెత్తమధ్యలో వర్షపు నీరు...ముక్కుపుటాలు ఎగిరిపోతున్నాయి. అడుగులు ముందుకు పడడం లేదు. ఇక మా వల్ల కాదంటూ కొందరు కారు తలుపులు తీయబోతుంటే...ప్రజలు ఊరుకోలేదు.‘‘ఇంకా ముందుకు రండి సార్..అసలు డంపింగ్ యార్డ్ ఉందక్కడ’’ అని ఓ నివాసి అన్నమాటలు అధికారులకు ప్రాణ భయాన్ని కలిగించాయి. వెళ్లకపోతే జనం ఊరుకునేలా లేరు. కర్చీప్‌లతో ముక్కుని అదిమిపట్టుకుని ముందుకెళ్లారు. ఆ అసలు డంపింగ్ యార్డ్‌లో జంతువులవి కళేబరాలు కనిపించాయి. వాటి మధ్య నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్న పిల్లలు కూడా వీరి కంట పడ్డారు. ‘‘ఇక్కడ మమ్మల్ని ఎలా బతకమంటారు సార్. మీరు ఓ పది నిమిషాలు ఉండడానికే ఇబ్బంది పడుతుంటే...ఎప్పుడూ ఇక్కడే ఉంటే మా పరిస్థితి ఏంటి?’’ అంటూ మహిళలు చొక్కా పట్టుకున్నంత పనిచేశారు. ఇక లాభం లేదంటూ... పదేళ్లక్రితం ఆ డంపింగ్యార్డ్ని చిలుకూరు సమీపంలోని ‘గంధంగూడాకి’ మార్చారు. ఇప్పుడు గంధంగూడాలో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రోజురోజుకీ విస్తరిస్తున్న నగరం కొండల్ని, గుట్టల్ని లెక్కచేయనట్టు డంపింగ్ యార్డ్‌లను కూడా తనలో కలిపేసుకుంటుంది. దీంతో ప్రజలకు ‘చెత్త’ కష్టాలు తప్పడం లేదు. ‘నిర్వహణ ’ లోపమే... పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగితే డంపింగ్ యార్డ్‌ను చూసి పారిపోవాల్సిన పని ఉండదంటారు కాలుష్యనియంత్రణ అధికారులు. ‘‘డంపింగ్ యార్డ్ చెత్తతో బయో పవర్‌ని తయారుచేయడం వల్ల బోలెడన్నీ ప్రజయోజనాలుంటాయని గంధంగూడలో ఆ ప్రాజెక్టుని అమలులో పెట్టారు. మిగతాచోట్ల కూడా ఆ పని చేస్తే మనకు విద్యుత్ కొరత తీరుతుంది. పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. కానీ ఆ పాజెక్టు అమలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. కనీసం పారిశుద్ధ్య నిర్వహణ సూత్రాలను అమలు చేసినా బోలెడంతా ప్రయోజనం ఉంటుంది’’ అని అంటారు ఓ అధికారి. కబ్జాల కంపు... హైదరాబాద్ ఒక్కటే కాదు...ఎక్కడ చెత్త డంపింగ్ యార్డులున్నా..అక్కడ కబ్జాలుంటున్నాయి. ప్రభుత్వ స్థలమే కదా! పైగా డంపింగ్ యార్డ్... అడిగేదెవరనుకని చాలామంది భూ ఆక్రమణలు చేస్తున్నారు. గుడిసెలు, ఇళ్లు...మెల్లగా కాలనీలు. అదేమంటే... మా ఇళ్లమధ్యనే చెత్త పారేస్తున్నారనే వాదనలు. చాలాచోట్లా ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం. అలాంటివారికి స్థానిక నాయకుల అండ. వెరసి మనదేశంలో చెత్త చుట్టూ నివాసాలు, నివాసాల మధ్య చెత్త. ప్రజల ఆలోచనా తీరులో మార్పు రాకపోతే చెత్తనిర్వహణ ఎప్పటికీ ‘చెత్త’గానే ఉంటుంది. ‘ఇందులో కూడా కఠినమైన చట్టాలు వస్తేగానీ ప్రజలు చెప్పిన మాట వినర’ంటారు ప్రభుత్వ అధికారులు. ‘రోడ్డుపై చెత్త తీసుకెళ్లే పద్ధతి... మన ప్రభుత్వ అధికారుల పనితీరుకు నిదర్శనం’ అంటారు సామాన్యులు. నిజమే...ఎమ్‌సిహెచ్ వ్యాన్లు చెత్తను తీసుకెళ్లేటప్పుడు వ్యాన్ పైకప్పు మొత్తం కవర్‌తో కప్పి తీసుకెళ్లాలి. కానీ, జరుగుతున్నదేంటి....ఎక్కడో ఒకటి అరా తప్ప...వ్యాన్ పైకప్పు మూసివేసి చెత్తను తీసుకెళ్లడం ఇప్పటివరకూ ఎక్కడా అమలు కాలేదు. పైగా వ్యానులో నుంచి రోడ్డుపై చెత్త పడుతున్నా అధికారులు, ప్రజలు పట్టించుకోని సంఘటనలు బోలెడు. కుండీల గోల... చెత్తను వేసే చెత్త కుండీలు ఎక్కడ పెట్టాలి? అనేది అధికారులకు పెద్ద సమస్యగా మారిపోయింది. మామూలుగా అయితే రోడ్డు పక్కన పెడతారు. ఆ మధ్య మోతీనగర్‌లో ఓ స్థానిక నాయకుడి దగ్గరికి కొందరు పేదలు వచ్చి ఒక కంప్లయింట్ చేశారు. ‘‘మా గుడిసెల మధ్యలో చెత్త కుండీ పెట్టడం వల్ల మేం అక్కడ నివసించలేకపోతున్నాం. ఆ కుండీల దుర్వాసనకు నోట్లోకి మెతుకు దిగడం లేదని మెరపెట్టుకున్నారు.’’ అది వారి బాధ. త్వరలోనే వారి ఇబ్బందుల్ని తీరుస్తానని ఆ నాయకుడు మాటిచ్చాడు. అసలు విషయం ఏమిటంటే...ఆ గుడిసెలు రోడ్డుకిరువైపులా అక్రమంగా వేసుకున్నవి. ఇళ్లమధ్యన పెడితే నివాసులకు ఇబ్బంది, రోడ్డు పక్కన పెడితే అక్రమణవాసులకు నచ్చదు. ఇంకెక్కడ పెట్టాలంటూ అధికారులు తలపట్టుకుంటున్నారు. నెలకోచోటకి మారుతున్న చెత్తకుండీల వెనకున్న గాధలివి. ఇల్లు దాటిన చెత్త తెచ్చిపెడుతున్న కష్టాలకు మీరు బాధ్యులంటే...మీరంటూ జరుగుతున్న వాదనలే తప్ప పొరుగింటిని చూసి నేర్చుకుందామన్న ఆలోచన కూడా కలగడం లేదు మనకు. ఓ చిన్న ఉదాహరణ...మొన్నామధ్య సింగపూర్‌కి విహారయాత్రకు వెళ్చొచ్చిన జంట అక్కడి విశేషాల గురించి చెబుతూ...‘‘అక్కడ రోడ్డుపై నడుస్తూ...చిన్న కాగితం ముక్క కింద వేసినా వెంటనే పోలీసులొచ్చి ఫైన్ కట్టమంటున్నారు. బాబోయ్ ఉన్న నాలుగురోజులు చేతిలో నుంచి చెత్త కింద పడకుండా జాగ్రత్తపడ్డాం. అందుకే కాబోలు...అక్కడ పరిసరాలు అంత శుభ్రంగా ఉన్నాయి. ఇండియాలో విమానం దిగేవరకూ సింగపూర్ సిస్టిమ్ని తు.చ తప్పకుండా పాటించాల్సి వచ్చింది’’ అంటూ...ఎంతో ఆశ్చర్యంగా చెప్పారు. మరి ఇక్కడికి వచ్చాక అంటే...‘‘ఇది మన దేశం కదండీ...ఇక్కడ మనిష్టమొచ్చినట్టు ఉండొచ్చు’’ అన్నారు. నిజమే ఇక్కడ మనిష్టమొచ్చినట్టు ఉండొచ్చు. చెత్తను ఇంటెదురుగా విసిరేసినా ఎవరూ అడగరు, వీధి చివరన పారేసినా ఎవరూ అడ్డు చెప్పరు, మనింటి చెత్త శివార్లలో కుళ్లుతూ...విషవాయువులను ఆశాశంలోకి పంపుతున్నా దాని గురించి ఎవరూ ఆలోచించరు. మనకున్న వ్యవస్థలో ఇది నేరం కాదు, ఘోరం అంతకన్నా కాదు. కానీ మన నడవడిక వల్ల భవిష్యత్తులో మనిషి మనుగడుకు భూమ్మీద చోటు లేకుండా చేసుకుంటున్నామన్నది మాత్రం నమ్మాల్సిన వాస్తవం. ప్రతిక్షణం పరిసరాల గురించి ఆలోచించడం కనీస అవసరం. - భువనేశ్వరి