స్వార్థపూరితమైన ఆలోచనలు కక్షగడితే.. ఆనవాళ్లు, అవశేషాలు కూడా దొరకవనేందుకు సింథియా ఆండర్సన్ కథే సాక్ష్యం.అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలో టోలీడోలోని.. ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయే సింథియా. మైఖేల్ ఆండర్సన్ దంపతులకు..1961 ఫిబ్రవరి 4న జన్మించింది. మత సంప్రదాయాల్ని కచ్చితంగా పాటించే మైఖేల్‌కి కూతురు సింథియా అంటే ప్రాణం. సింథియాకూ తండ్రంటే అంతే గౌరవం. ఏనాడూ తండ్రి మాటకు ఎదురు చెప్పిందిలేదు. సహజంగానే అందగత్తెన సింథియాకు మేకప్ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే మేకప్ వేసుకోవడమో, నవలలు చదవడమో చేసేది. మొదటి నుంచీ ఆమెకు స్నేహితులు ఎక్కువ.
అయినా సరే తండ్రి చెప్పినట్టుగా.. తనకంటూ కొన్ని హద్దులు ఏర్పరచుకుని నడుచుకునేది. తన కుటుంబ గౌరవానికి తలవంపులు తేవద్దనే తలంపుతోనే ఉండేది. ఆమెకు తన 19వ ఏట ఒక కలొచ్చింది.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి.. తనని ఎత్తుకెళ్లి క్రూరంగా చంపేసినట్లు. బెదిరిపోయి ఇంట్లో వాళ్లకి చెప్పింది. తల్లి, సోదరి ఇద్దరూ సింథియాకు ధైర్యం చెప్పారు. అయితే ఆ కల ఆ ఒక్కరోజుతో ముగిసిపోలేదు. రోజుల తరబడి వెంటాడడంతో సింథియా కలవరపడింది. తనకు ఏదో జరగబోతోందని శంకించింది. నిత్యం ఆ భయంతోనే గడపసాగింది. కొన్ని రోజులకు అదో మానసిక రుగ్మతగా మారింది.
ఓ పక్క కుటుంబ నియమాల ప్రకారం ప్రతిరోజూ ప్రార్థన సమావేశాలు, క్యాంపింగ్ ఈవెంట్స్‌కు హాజరవుతూనే లీగల్ సెక్రెటరీగా ఉద్యోగం చేసేది సింథియా. ఆమె పని చేసే కార్యాలయంలో తను కూర్చునే డెస్క్ ఎదురుగా ఉండే గోడపైన ఓ ఆకతాయి.. ‘ఐ లవ్యూ సిండీ.. బై జీడబ్ల్యూ’ అని స్ప్రే పెయింట్ చేశాడు. సిండీ అనేది సింథియా ముద్దుపేరు. అప్పటికే సింథియా.. పీడ కలతో సతమతమవు తుండటంతో ఆ రాసింది ఎవరనే దానిపై దృష్టి పెట్టలేకపోయింది. తనకొచ్చిన కల ఎక్కడ నిజమవుతుందోనన్న భయంతో తన డెస్క్ దగ్గర ఎమర్జెన్సీ బజర్ ఏర్పాటు చేయించుకుంది. ఎందుకంటే ఉదయం పూట అంతపెద్ద ఆఫీస్‌లో సింథియా ఒక్కత్తే ఉండేది. మిగిలిన కొలీగ్స్ అంతా మధ్యాహ్నం వచ్చేవారు.
అది 1981, ఆగస్టు 4.. సింథియా జీవితాన్ని చరిత్రలో కలిపేసిన రోజది. అప్పటికి ఆమెకు ఇరవై ఏళ్లు. మరో రెండువారాల్లో తను చేసే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి.. బైబిల్ కాలేజీకి వెళ్లాలనేది ఆమె నిర్ణయం. కానీ అలా జరగలేదు. ఆగస్టు 4న ఉదయం ఎనిమిదిన్నరకి.. బ్రేక్‌ఫాస్ట్ చెయ్యకుండానే ఆమె తన కారులో ఆఫీస్‌కి బయలుదేరింది. ఎప్పటిలా కాకుండా ఆ రోజు తొమ్మిది నలభై ఐదుకి అంటే కాస్త ఆలస్యంగా ఆమె ఆఫీస్‌కు వచ్చినట్టుగా గమనించాడు వాచ్‌మన్. మధ్యాహ్నం 12 గంటలకు తతిమా సహోద్యోగులు ఆఫీస్‌కి వచ్చేసరికి సింథియా అక్కడ లేదు. తలుపులు తీసే ఉన్నాయి. కారు పార్కింగ్‌లోనే ఉంది.
కారు తాళంచెవి, హ్యాండ్ పర్స్ మాత్రం కనిపించలేదు. ఫోన్ రిసీవర్ పక్కకు తీసిపెట్టి ఉంది. లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. రేడియో మోగుతూనే ఉంది. అప్పుడే నెయిల్ పాలిష్ వేసుకున్నట్లు.. ఆ వాసన ఇంకా ఆఫీస్ వాతావరణంలో తచ్చాడుతూనే ఉంది. మరో విచిత్రం ఏమిటంటే.. ఆమె క్యాబిన్‌లో ఓ రొమాంటిక్ నవల తెరిచి ఉంది. అందులో.. ‘అతను వచ్చి కత్తితో బెదిరించి.. ఆమెని ఎత్తుకుపోయాడు’ అనే వాక్యం ఉంది. కానీ ఎక్కడా కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు లేవు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి.
పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు మొదలుపెట్టారు. పేరెంట్స్‌కి తెలియకుండా సింథియాకి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతడు చర్చిలో సభ్యుడని, బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నాడని.. అందుకే సింథియా కూడా ఉద్యోగం మానేసి.. బైబిల్ కాలేజీలో జాయిన్ కావాలనుకుందని.. ఇలా ఏవేవో విషయాలు బయటికి లాగారు. సింథియా ఆఫీస్‌లో.. జీడబ్ల్యూ (ఐ లవ్యూ కింద ఉన్న లెటర్స్) పేరున్న వ్యక్తిని కూడా ప్రశ్నించారు. అతడికీ, ఈ కేసుకు ఏ సంబంధం లేదని తేలింది.
మరోవైపు సింథియాకి ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఏవేవో బెదిరింపు కాల్స్ వచ్చేవని, వాటితో ఆమె చాలా ఇబ్బంది పడేదని కొందరు కొలీగ్స్ చెప్పుకొచ్చారు. కొన్ని రోజులకు ఓ అజ్ఞాత మహిళ.. పోలీసులకు ఫోన్‌చేసి ‘మా పక్కింటి అబ్బాయి.. సింథియాని బలవంతంగా బంధించాడు. అతడి తల్లిదండ్రులు అతడితో లేరు. పక్కిల్లే కావడంతో ఆ విషయం నాకు తెలిసింద’ని చెప్పింది. పూర్తి వివరాలు అడిగేసరికి ఆమె భయపడి ఫోన్ కట్ చేసింది. దాంతో పోలీసులు అనుమానాస్పదమైన కొన్ని ఇళ్లను సోదా చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మరోవైపు.. సింథియా పనిచేసే లా ఆఫీస్‌లో రిచర్డ్ నెలర్ అనే న్యాయవాదికి మాదకద్రవ్యాలకు సంబంధించిన నేర చరిత్ర ఉంది. ఈ క్రమంలో నెలర్‌కి సంబంధించిన చట్టవిరుద్ధమైన డ్రగ్ యాక్టివిటీ గురించి సింథియాకి ఏమైనా తెలిసిందా? అదే ఆమెకు శాపమైందా? అనే యాంగిల్‌ల్లోనూ విచారణ కొనసాగింది. కానీ కేసు ముందుకు కదల్లేదు.
ఇంట్లో కఠినమైన నియమనిబంధనలను తాళలేక ఇంట్లోంచి తప్పించుకునేందుకు సిం«థియానే అలాంటి నాటకమాడిందనే వాదనా బలంగా వినిపించింది. అదే నిజమైతే.. సింథియా అకౌంట్‌లో చాలా డబ్బులు ఉన్నాయి. వాటిని వినియోగించినట్లు ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవు. ఎప్పటికైనా సింథియా తిరిగి వస్తుందని ఆశపడ్డాడు తండ్రి మైఖేల్. ఫోన్ నంబర్ మార్చినా, ఇళ్లు మారినా సింథియా తిరిగి రావాలనుకుంటే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో అదే ఇంట్లో, అదే ఫోన్ నంబర్‌తోనే గడిపింది ఆ కుటుంబం. చివరికి ఆమె వివరాలు తెలుసుకోకుండానే చనిపోయారు సింథియా తల్లిదండ్రులు. అసలు ఆ రోజు ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఎవరైనా చంపేశారా? లేక సింథియానే కుటుంబాన్ని వదిలి పారిపోయిందా? మానసిక రుగ్మతతో ఏ ఆత్మహత్యకైనా పాల్పడిందా? అనేది నేటికీ మిస్టరీనే.
సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment