Mystery Story: Unsolved Mystery Of 1991 Austin Yogurt Shop Killings In Telugu - Sakshi
Sakshi News home page

1991 Austin Yogurt Shop Killings: యోగర్ట్‌ షాప్‌ హత్యలు.. ఇప్పటికీ మిస్టరీ గానే..!

Published Sun, Jul 31 2022 1:55 PM | Last Updated on Sun, Jul 31 2022 2:58 PM

1991 austin yogurt shop killings story - Sakshi

అమెరికన్స్‌ను వణికించిన అపరిష్కృత మిస్టరీల్లో ఈ కథొకటి.
అది 1991 డిసెంబర్‌ 6. రాత్రి 11 దాటింది. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌లో ‘ఐ కాంట్‌ బిలీవ్‌ ఇట్స్‌ యోగర్ట్‌’ అనే క్లోజ్‌ చేసి ఉన్న షాపులోంచి మంటలు రావడం పెట్రోలింగ్‌ పోలీసుల కంటపడింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, కొద్దిసేపటికే ఫైర్‌ ఇంజన్ల మోతమోగింది. మంటలార్పేటప్పుడు కనిపించిన భయంకరమైన దృశ్యాలు సంచలనానికి తెరతీశాయి.

షాపు వెనుక గది మధ్యలో ఒక అమ్మాయి నగ్నంగా శవమై ఉంది. తన చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. ఆమె బట్టలతోనే ఆమెని ఎవరో బంధించారు. షాపులో చెలరేగిన మంటలకు సగానికి పైగా శరీరం కాలిపోయింది. వెనుక గదికి వెళ్లి చూస్తే, మరో ముగ్గురు అమ్మాయిలు అదే రీతిలో నగ్నంగా ఓ మూలన పడి ఉన్నారు. తెల్లారేసరికి చనిపోయిన వారి వివరాలను తేల్చేశారు పోలీసులు. మరునాడు దేశమంతా ఇదే వార్త.

చనిపోయిన నలుగురిలో జెన్నిఫర్‌ హార్బిసన్‌(17), ఎలీజా థామస్‌(17) ఇద్దరూ ప్రాణస్నేహితులు. అదే షాపులో పార్ట్‌టైమ్‌ ఉద్యోగులు. ఆ రాత్రి నైట్‌ షిప్ట్‌లో ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో సారా హార్బిసన్‌(15) జెన్నిఫర్‌ సొంత చెల్లెలు. మరో అమ్మాయి అమీ అయర్స్‌(13) సారా స్నేహితురాలు. ఈ నలుగురూ జీవితంలో తమకంటూ ప్రత్యేకత ఉండాలని కలలు కన్నవారే. సారా, జెన్నిఫర్‌ ఇద్దరూ స్పోర్ట్స్‌లో ఎన్నో అవార్డ్స్‌ సాధించారు. ఇద్దరూ అక్కా చెల్లెల్లా కాకుండా స్నేహితుల్లా కలిసుండేవారు.

అమీ కూడా ఎప్పుడూ వారి స్నేహాన్నే కోరుకునేది. తను చిన్నప్పటి నుంచి ప్రకృతి ప్రేమికురాలు. ఫిషింగ్, హార్స్‌ రైడింగ్, పెట్స్‌ ట్రైనింగ్‌.. ఇలా తనదో ప్రత్యేక ప్రపంచం. ఇక ఎలీజా చాలా అందగత్తె. మోడల్‌ కావాలని కలలు కనేది. మోడలింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు కావలసిన డబ్బుల కోసమే పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ చేస్తూ కష్టపడేది. ఒక్కోక్కరిదీ ఒక్కో కల. కానీ రాత్రికిరాత్రే అంతా తారుమారై, జీవితాలే ముగిసిపోయాయి. 
పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌లో నలుగురినీ తీవ్రంగా హింసించి, లైంగిక దాడి చేశారని, తర్వాత తలలపై తుపాకీలతో కాల్చి చంపారని తేలింది. నేరస్థులు షాపు వెనుక డోర్‌ నుంచి పారిపోయినట్లుగా నిర్ధారించారు. కొన్ని సాక్ష్యాలు కాలి బూడిదైతే, మరికొన్ని మంటలార్పే క్రమంలో కొట్టుకుపోయాయి. దాంతో ఎవ్వరినీ అరెస్ట్‌ చేయలేకపోయారు. 

1999 నాటికి బాధిత కుటుంబాల పోరు పెరిగింది. కేసు దర్యాప్తు చేసే అధికారులూ మారారు. అనుమానితుల్లో మారిస్‌ పియర్స్, ఫారెస్ట్‌ వెల్‌బోర్న్, మైకేల్‌ స్కాట్, రాబర్ట్‌ స్ప్రింగ్‌స్టీన్‌ అనే పాతికేళ్లలోపు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ఎవరో కాదు హత్యలు జరిగిన ఎనిమిదో రోజు తుపాకీతో పట్టుబడి, తగిన సాక్ష్యాలు లేక విడుదలైన వాళ్లే! ఈసారి మెక్సికన్‌ అధికారులు విచారించినప్పుడు నేరాన్ని ఒప్పుకున్నారు. అయితే, కీలకమైన మరే సాక్ష్యాధారాలు లేకపోవడంతో.. ఆ తర్వాత పోలీసులే తమతో బలవంతంగా ఒప్పించారని చెప్పారు. ఇలాంటి సాక్ష్యం చెల్లదని కోర్టు కొట్టేసింది. పైగా అదే ఏడాది అమీ లైంగిక దాడిలో బయటపడిన డీఎన్‌ ఏ ఆ నలుగురిలో ఏ ఒక్కరితోనూ సరిపోలేదు. మరి అసలు నేరస్థులెవరని కోర్టు అధికారులను నిలదీసింది. ఈ నలుగురిపై అభియోగాలను కొట్టేసింది. 

అయితే 2010 డిసెంబర్‌ 25 రాత్రి 11 గంటల సమయంలో మారిస్‌ పియర్స్‌ పెట్రోలింగ్‌ పోలీసుల కంటపడ్డాడు. అతడి కంగారు చూసి... పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, కత్తిదూశాడు. అధికారుల్లో ఒకరైన ఫ్రాంక్‌ విల్సన్‌ తుపాకీతో కాల్చి అతడ్ని చంపేశాడు.
జెన్నిఫర్, ఎలీజాల డ్యూటీ తర్వాత పార్టీకి వెళ్లాలనేది ఆ నలుగురు అమ్మాయిల ప్లాన్‌. అందుకే అమీ, సారాలూ వాళ్లతో ఉన్నారు. షాప్‌ క్లోజ్‌ చేసే టైమ్‌కి చివరిగా ఉన్న కస్టమర్స్‌ని కూడా పోలీసులు విచారించారు. సుమారు 52 మంది ఆ సమయంలో షాప్‌కి వచ్చి పోయారని ప్రత్యక్షసాక్షుల కథనం. అయితే క్లోజింగ్‌ టైమ్‌ కాబట్టి షాప్‌ ఫ్రంట్‌ డోర్‌ జెన్నిఫర్‌ మూసేసి, ఇతర కస్టమర్స్‌ లోనికి రాకుండా చేసిందని, ఆ టైమ్‌లో ఓ వ్యక్తి వాష్‌రూమ్‌ లోపలికి వెళ్లడం గమనించినా, తిరిగి రావడం తాము చూడలేదని కొందరు చెప్పారు.

మరోవైపు చివరిగా షాప్‌ నుంచి బయటపడిన ఓ జంట.. షాప్‌లో ఇద్దరు మగవాళ్లు నక్కి నక్కి ఉన్నట్లు అనిపించిందని, వారిలో ఒకరు గ్రీన్‌ కలర్‌ జాకెట్, మరొకరు బ్లాక్‌ కలర్‌ జాకెట్‌ వేసుకున్నారని చెప్పారు. అయితే విచారించిన కస్టమర్స్‌లో ఆ ఇద్దరూ మిస్సయినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లే ఈ ఘాతుకానికి ఒడికట్టి ఉంటారని అంచనాలు వేశారు.

మరోవైపు సీరియల్‌ కిల్లర్స్‌ పాత్రపై దర్యాప్తు చేసినా, ఫలితం దక్కలేదు. పైగా ఈ ఘటన జరిగిన రోజు షాప్‌లో 540 డాలర్లు గల్లంతైనట్లు యాజమాన్యం గుర్తించింది. అయితే అది నేరస్థుల డైవర్  టెక్నిక్‌లో భాగమేనని, వాళ్లు వచ్చింది డబ్బులు కోసం కాదని, అమ్మాయిల కోసమేనన్నది డిటెక్టివ్స్‌ నమ్మకం. అయితే ముప్పయ్యేళ్లు దాటినా ఈరోజుకీ నేరుస్థులెవరో తేలలేదు. నేటికీ యోగర్ట్‌ షాప్‌ పక్కనుంచి వెళ్లే వాళ్లు అక్కడ ఓ క్షణం ఆగుతారు. ఆ నలుగురు అమ్మాయిల స్మారక ఫలకంపై పూలు ఉంచి, ఎప్పటికైనా న్యాయం గెలవాలని కోరుకుంటారు.
∙సంహిత నిమ్మన 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement