క్రైమ్‌ స్టోరీ: రెండు పిట్టలు.. ఒకే దెబ్బ! | funday buddavarapu kameswara rao telugu crime story | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ స్టోరీ: రెండు పిట్టలు.. ఒకే దెబ్బ!

Published Sun, Aug 14 2022 11:22 AM | Last Updated on Sun, Aug 14 2022 11:23 AM

funday buddavarapu kameswara rao telugu crime story - Sakshi

18 నవంబర్‌ 1996. ఆ రోజు దినపత్రిక చదువుతున్న సీఐ ష్రఘ్వీ తన స్టేషన్‌ పరిధిలో ఉన్న సహన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ డైరెక్టర్‌ సరితాదేవిని ఎవరో హత్య చేశారని ఫోన్‌ రావడంతో తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నాడు. హత్య జరిగిన గదిలోకి వెళ్లి, అన్నీ పరిశీలించి, పోస్ట్‌మార్టమ్, ఫింగర్‌ ప్రింట్స్‌ ఏర్పాట్లు చూడమని, అక్కడ ఉన్న అన్ని వస్తువులూ, ఫైల్స్‌ కూడా స్టేషన్‌కి పంపమని అక్కడ నుండి బయటకు వచ్చాడు సీఐ. బయట ఉన్న మేనేజర్‌ని కలుసుకుని, కొన్ని విషయాలు సేకరించి, ఇంకో డైరెక్టర్‌ నరేష్‌ రూమ్‌ వద్దకు వెళ్లాడు సీఐ.. రాత్రి పడిన వర్షానికి చిత్తడిగా ఉన్న నేల మీద నెమ్మదిగా నడుస్తూ.

‘ఈ కంపెనీ, చనిపోయిన ఈవిడదేనా? ఈ క్వార్టర్‌లో ఈవిడతో పాటు ఎవరు ఉంటారు? కొంచెం వివరంగా చెప్పండి’  నరేష్‌ని అడిగాడు సీఐ ష్రఘ్వీ, 
‘సార్, ఐదేళ్ల క్రితం సరితాదేవి, హరనాథ్, నరేష్‌ అనే నా పేరునూ కలిపి, మా పేర్లలో మొదటి అక్షరాలు కలిసి వచ్చేలా కంపెనీకి సహన అని పేరు పెట్టి ప్రారంభించాం. సరిత ఒక్కరే ఈ క్వార్టర్‌లో ఉంటారు. హరనాథ్‌  చెన్నైలో ఉంటాడు. నేను ఇక్కడే సిటీలో ఉంటాను’ చెప్పాడు నరేష్‌.   

‘మిస్టర్‌ నరేష్, గదిలో ఎటువంటి వస్తువులు చోరీకి గురి కాకపోవడం చూస్తూంటే, నిందితుడు కేవలం ఆమెను చంపడానికే వచ్చినట్టుంది. సూటిగా అడుగుతున్నా.. సరితాదేవికి కుటుంబ సభ్యులనుంచి కానీ, బిజినెస్‌ పరంగా కానీ ఎవరైనా శత్రువులున్నారా?’
‘ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. తల్లి కూడా ఈ మధ్యనే మరణించింది. ఇక బిజినెస్‌ పరంగా అంటే, మా పార్ట్‌నర్‌ హరనాథ్‌ తనను తరచూ ఫోన్‌లో బెదిరిస్తున్నాడు అని చెబుతూండేది. ఇంకో విషయం, అతను కాలేజీ రోజుల నుంచి కూడా ఆమెను ప్రేమించేవాడు. అమె అతడిని దూరంగా ఉంచింది. అందుకే అతను ఇక్కడ ఇమడలేక చెన్నైలో ఉంటున్నాడు. అంతే కాదు, మొన్న జనవరిలో అయితే ఏకంగా ఓ బెదిరింపు లెటర్‌ వచ్చిందని కూడా చెప్పింది’ చెప్పాడు నరేష్‌.

‘ఆమె హత్య వలన హరనాథ్‌కి ఏమిటి ప్రయోజనం?’ 
‘ఏముంది సార్, మా బిజినెస్‌ బావుంది. దాని మీద ఇతని కన్ను పడింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఆమెను హత్య చేసి, ఆ నేరం ఇదే ఊర్లో ఉంటున్న నా మీదకు తోసేసి, మా ఇద్దరినీ అడ్డు తొలగించి, కంపెనీ తన అధీనంలోకి తీసుకోవచ్చుగా?’
‘అయితే, ఆయనే హత్య చేశాడంటారా?’ అడిగాడు సీఐ.

‘లేదు, చేయించి ఉంటాడు. ఎందుకంటే నిన్ననే అతను చెన్నై నుంచి వచ్చి, లాడ్జిలో ఉన్నాడు. రాత్రి నాకు ఫోన్‌ చేసి, ‘నేను వేరే బిజినెస్‌ పనిమీద ఇక్కడకు వచ్చేను. నీకు తెలుసుగా, సరితకు చెన్నై సాంబార్‌ అంటే ఇష్టమని. ఓ సాంబార్‌ పౌడర్‌ ప్యాకెట్‌ తెచ్చాను. అది ఆమెకు అందచేయాలి. మీ మనిషిని పంపిస్తావా?’ అని అడిగాడు. దానికి నేను, ‘ఎవరూ లేరు. అయినా వర్షం వస్తోంది కుదరదు’ అని చెప్పాను. అయినా కానీ రాత్రి ఎవరో మనిషిని ఇచ్చి  పంపేడుట. నాకు తెలిసి, ఆ వచ్చిన మనిషి కిరాయి హంతకుడు అయి ఉండవచ్చు’  చెప్పి కంటి నీరు తుడుచుకున్నాడు నరేష్‌.

నరేష్‌ రూమ్‌లోంచి బయటకు వచ్చిన ష్రఘ్వీ, సెక్యూరిటీ ఆఫీస్‌ వద్దకు వచ్చి, ‘రాత్రి మేడమ్‌ గారిని కలుసుకోవడానికి ఎవరు వచ్చారో చెప్పగలవా?’  రాత్రి డ్యూటీ చేసిన సెక్యూరిటీ గార్డుని అడిగాడు. అతను చెప్పిన వివరాలు అన్నీ సేకరించి, చివర్లో  ‘అతడిని గుర్తు పట్టగలవా?’ అడిగాడు సీఐ. ‘చలి మూలంగా మొహం అంతా మఫ్లర్‌ చుట్టుకున్నాడు, గుర్తు పట్టలేను సార్‌. అయితే నేను ఇక్కడ చేరి పదిరోజులే అయ్యింది సార్‌’ చెప్పాడు గార్డు.

ఆ రోజు సాయంత్రం అంతవరకూ లభించిన ఆధారాలతో, లాడ్జిలో ఉన్న హరనాథ్‌ను అదుపులోకి తీసుకుని, స్టేషన్లో విచారణ మొదలెట్టాడు ష్రఘ్వీ. ‘సీ.. మిస్టర్‌ హరనాథ్‌! ఏ విధంగా చూసినా సరితాదేవి హత్యలో మీ ప్రమేయం కనబడుతోంది. ఆఫీసులో ఫోన్‌ బిల్లులు వెరిఫై చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే, ఆవిడ మిమ్మల్ని తిరస్కరించిందన్న కోపంతో, ఆమెను కంపెనీ షేర్లు అమ్ముకుని బయటకు పొమ్మని బెదిరిస్తూ తరచుగా ఫోన్‌ చేస్తున్నారని’ చెప్పాడు సీఐ.

‘సార్, అంతా అబద్ధం. ఆమెను ప్రేమించి, ఆమెచే తిరస్కరించబడ్డది నేను కాదు, నరేష్‌! అతను లైంగికంగా వేధిస్తున్నాడని తరచుగా ఫోన్లో నాతో చెప్పుకుని బాధపడేది. నేను ధైర్యం చెప్పేవాడిని. అందుకే మా ఫోన్‌ బిల్లుల మీద మీకు అనుమానం వచ్చి ఉంటుంది’ చెప్పాడు హరనాథ్‌. ‘ఇదే విషయం నీ గురించి నరేష్‌ కూడా చెప్పాడు కానీ, మరి నిన్న రాత్రి ఆమెను హత్య చేసిన ఆ కిరాయి హంతకుడిని ఎందుకు పంపినట్లు?’ అడిగాడు సీఐ.

‘సార్, సరితాదేవిని హత్య చేయమని నేను ఏ మనిషినీ పంపలేదు. నరేష్‌ తన డ్రైవర్‌ని పంపడం కుదరదని చెప్పడంతో నేను హోటల్లో ఉన్న ఓ కుర్రాడికి ఓ ప్యాకెట్‌ ఇచ్చి పంపించాను. కానీ మార్గమధ్యంలో ఎవడో బైకుతో ఆ కుర్రాడిని ఢీకొట్టి, ఆ ప్యాకెట్‌తో ఉడాయించాట్ట. నాకు ఆ విషయం ఈ ఉదయమే తెలిసింది. ప్రస్తుతం ఆ కుర్రాడు హాస్పిటల్లో ఉన్నాడు. కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు’ అసలు విషయం చెప్పాడు హరనాథ్‌.

‘సరే, అది అలా ఉంచు. మరి నువ్వు సరితాదేవిని బెదిరిస్తూ రాసిన ఈ లెటర్‌ మాట ఏమిటి?’ అడిగాడు ష్రఘ్వీ, ఆ లెటర్‌ హరనాథ్‌ చేతికిచ్చి. తన ఇంటి అడ్రసుతో ఉన్న లెటర్‌ హెడ్‌ మీద తెలుగులో ఉన్న ఆ లెటర్‌ చదవడం మొదలెట్టాడు హరనాథ్‌.
చెన్నై ,30.12.1995.
డియర్‌ సరితా,
 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నీకు మొన్న ఫోన్లో చెప్పిన విధంగా, కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా, కంపెనీలో నీ వాటాలు విక్రయించి డైరెక్టర్‌ పోస్ట్‌కు రాజీనామా చేసి వెడతావని ఆశిస్తున్నా. తరువాత బాధపడి ప్రయోజనం లేదు.
ఇట్లు
(ఏ.హరనాథ్‌)
‘సరే, లెటర్‌ చదివేవు కదా! ఇప్పుడు చెప్పు, ఇది నువ్వు పంపినదేనా?’ అడిగాడు సీఐ ష్రఘ్వీ.

‘ఈ లెటర్‌ హెడ్‌ నాదే కానీ, సంతకం నాది కాదు. ఎవరో ఫోర్జరీ చేసినట్లు ఉంది. ఈ లెటరూ నేను పంపలేదు’ ఆశ్చర్యంగా చెప్పాడు హరనాథ్‌.
‘నిజానిజాలు త్వరలో తెలుస్తాయి కానీ, అంతవరకూ మా అధీనంలో ఉండాలి. ఔనూ ఇంతకీ నిన్న సరితాదేవికి పంపిన ఆ ప్యాకెట్‌ ఏమిటి? అందులో ఉన్నది సాంబార్‌ పౌడరేనా లేక..’ అడిగాడు సీఐ.
‘ఒహ్‌.. అదా సార్‌? ఆ ప్యాకెట్లో..’ అంటూ మొత్తం విషయం వివరించాడు హరనాథ్‌.
‘ఓ ఐసీ. ఆ ప్యాకెట్‌ ఇంకా మా దగ్గరే ఉంది. ఇంకా ఓపెన్‌ చేయలేదు’ అంటూ స్టేషన్‌ నుంచి బయటకు నడిచాడు సీఐ ష్రఘ్వీ.
∙∙l
మర్నాడు ఉదయం, పక్కా ఆధారాలు, సాక్ష్యాలు లభించడంతో నరేష్‌ ఇంటికి వెళ్లి, అతడిని అరెస్టు చేశాడు ష్రఘ్వీ.
‘దారుణం, నాకేమీ తెలియదు. కావాలనే ఆ హరనాథ్‌ నన్ను ఇందులో ఇరికిస్తున్నాడు’ భోరుమని విలపించసాగేడు నరేష్‌.
‘నీ దొంగ ఏడుపు ఆపు మిస్టర్‌ నరేష్‌. అసలు జరిగింది ఏమిటో నేను చెబుతాను విను. హరనాథ్‌ తన సొంత పనిమీద హైదరాబాద్‌ వస్తున్నాడన్న విషయం నీకు మూడు రోజుల ముందే తెలిసింది. వెంటనే సరితాదేవిని హత్య చేసి ఆ నేరం హరనాథ్‌ మీదకు మళ్లేలా పథకానికి రూపకల్పన చేశావు. అందులో భాగంగా నీ దగ్గర ఉన్న హరనాథ్‌ కొత్త లెటర్‌ హెడ్‌ మీద పాత తేదీతో, మొన్ననే ఓ లెటర్‌ సృష్టించావు.’

‘అంతా అబద్ధం’ గట్టిగా అరిచాడు నరేష్‌.
‘కంగారు పడకు. నాకు అనుమానం వచ్చి, నేను అదే లెటర్‌ను మళ్లీ మీ టైపిస్ట్‌ చేత ఈరోజు టైప్‌ చేయించా. మీ ఆఫీసు టైప్‌ మిషన్‌లో  ‘ర’, ‘ ?’ అనే అక్షరాలకు దుమ్ము పట్టేయడం వలన మూడు రోజుల క్రితం నువ్వు  సృష్టి్టంచిన లెటర్‌ మీద, అలాగే ఈరోజు లెటర్‌ మీద కూడా  ఒకలాగే వచ్చాయి. మీ టైపిస్ట్‌ను గట్టిగా అడిగేసరికి అతను మీరే ఈ పని చేయించారని ఒప్పేసుకున్నాడు. అతను ప్రస్తుతం మా అధీనంలో ఉన్నాడు.’

‘బ్రహ్మాండంగా అల్లారు క«థని. ఇంకెందుకు ఆలస్యం. ఆ కిరాయి హంతకుడిని కూడా నేనే పురమాయించేను అని చెప్పండి’ అన్నాడు ఉడికిపోతూ.
‘ఔను. అదీ నిజమే. ఎప్పుడైతే హరనాథ్‌ మీ మనిషి కోసం ఫోన్‌ చేశాడో, నువ్వు అనుకోని అదృష్టం కలసివచ్చిందని భావించి, మీ కంపెనీకి తరచూ అద్దెకు టాక్సీని నడిపే కిరాయిహంతకుడు అప్పారావుని ఈ పనికి పురమాయించేవు. మాకు లభ్యమైన ఆధారాలతో అతడిని కస్టడీలోకి తీసుకున్నాం. మా పద్ధతిలో విచారించేసరికి, అతడు జరిగింది అంతా చెప్పి లొంగిపోయాడు’ చెప్పాడు ష్రఘ్వీ.

అంతా విన్న నరేష్‌ చేసేదేమీ లేక మౌనంగా తల వంచుకున్నాడు.‘సీ, మిస్టర్‌ నరేష్‌! నేరస్థుడు ఎప్పటికైనా దొరక్కపోడు. కానీ, ఆ ఫోర్జరీ లెటర్, అలాగే కిరాయి హంతకుడు విషయంలో నువ్వు చేసిన పొరబాట్లే నిన్ను పట్టించేశాయి.’
‘ఔనా! ఏమిటి సార్‌ ఆ పొరబాట్లు?’ అమాయకంగా అడిగాడు నరేష్‌. ‘అవీ..’ అంటూ మొత్తం అంతా చెప్పాడు ష్రఘ్వీ. చేసేదేమీ లేక పోలీస్‌ జీపు ఎక్కాడు నరేష్‌.
‘మిస్టర్‌ నరేష్, నిన్ను చూస్తే జాలేస్తోంది. హత్య జరిగిన ఆ ఒక్క రోజూ నువ్వు కొంచెం ఓపిక పట్టి, కొంచెం తెలివి ఉపయోగించుంటే, నువ్వు ‘ఒక్క దెబ్బ’  వేయనక్కర లేకుండానే ఆ ‘రెండు పిట్టలు’ ఎగిరి పోయేవి’ స్టేషన్‌లోపలికి వస్తూ చెప్పాడు సీఐ ష్రఘ్వీ. ‘ఏంటి సార్‌ మీరనేది?’ కుతూహలంగా అడిగాడు నరేష్‌.

‘ఔను. సరితాదేవి హత్య జరిగిన రోజు సాయంత్రం, హరనాథ్‌ ఆమెకు ఫోన్‌ చేసి, కంపెనీ డైరెక్టర్‌గా తను రిజైన్‌ చేస్తున్నాననీ, షేర్లు కూడా అమ్మేస్తున్నానీ వాటికి సంబందించిన కాగితాలు ఒక ప్యాకెట్‌లో పెట్టి, ఓ కుర్రాడితో పంపిస్తున్నానీ, వీలైతే ఆమెను కూడా రిజైన్‌ చేసి బయటకు వచ్చేయమనీ చెప్పడంతో ఆమె కూడా అంగీకరించిందట. ఇవిగో ఆ సాంబారు పౌడర్‌ ప్యాకెట్‌తో పాటు  ఉన్న రాజినామా కాగితాలు’ అంటూ చూపించాడు. 
∙∙l
మర్నాడు ట్రైనీ ఎస్సైలతో సమావేశం అయిన సీఐ ష్రఘ్వీ, ఈ కేసు గురించి చెప్పి ‘ఓకే, ఫ్రెండ్స్‌ అంతా విన్నారుగా! ఇప్పుడు చెప్పండి. నేను ఈ కేసును సునాయాసంగా సాల్వ్‌ చేయగలిగేలా, నరేష్‌ చేసిన ఆ రెండు తప్పులు ఏమిటి?’ అడిగాడు.
‘పాత తేదీతో లెటర్‌ క్రియేట్‌ చేయడం’ చెప్పాడు ఓ యస్సై. ‘ఆ కిరాయి హంతకుడి వేలిముద్రలు’ చెప్పాడు వేరొకతను.

 ‘మీరు చెప్పింది కొంచెం వాస్తవమే కానీ, అసలు విషయమేమిటంటే ఆ ఫోర్జరీ లెటర్‌ తయారు చేసింది 30.12.1995 తేదీతో. అప్పటికి మద్రాసు అనే పేరే వాడుకలో ఉంది. చెన్నై పేరు అమల్లోకి వచ్చింది 17.07.1996 నుంచి. అంటే, ఇతను మర్చిపోయి, రెండు నెలలు క్రితం హరనాథ్‌ కోసం వేయించిన కొత్త లెటర్‌ హెడ్‌ మీద  పాత తేదీతో ఆ మేటర్‌ టైప్‌ చేయించాడు’  చెప్పాడు సీఐ ష్రఘ్వీ.
‘సార్, అతను చేసిన రెండో తప్పు?’ అడిగాడు ఇంకో ఔత్సాహికుడు. 
‘మీరన్నట్టు హంతకుడి వేలిముద్రలు ఎక్కడా లేవు. కిరాయి హంతకుడు కాబట్టి, ముందుగానే జాగ్రత్త పడ్డాడు. కానీ, ఆ రోజు రాత్రి, వర్షంలో తడిసిన రైన్‌ కోటు, రైన్‌ షూస్‌ గేట్‌ వద్దే విప్పి వెళ్లమని సెక్యూరిటీ గార్డు చెప్పడంతో,  బూట్లు లేకుండా మట్టి కాళ్లతో మేడమ్‌ రూమ్‌లోకి వెళ్లడం వలన అక్కడ అతని పాద ముద్రలు దొరికాయి.

ఆ పాదముద్రలను చూపించి, కంపెనీలో వారిని ఎంక్వయిరీ చేస్తే కొంతమంది గుర్తుపట్టి చెప్పారు అతను తరచూ వచ్చే టాక్సీ డ్రైవర్‌ అప్పారావని’ చెప్పాడు సీఐ. ‘వాళ్లు, పాదముద్రలు బట్టి ఎలా గుర్తు పట్టేరు సార్‌?’ ఆశ్చర్యంగా అడిగాడు ఓ ఎస్సై. ‘ఆ కిరాయిహంతక డ్రైవర్‌ రెండు పాదాలకీ నాలుగో వేలు భూమికి ఆనకుండా కొంచెం పైకి లేచి ఉంటుంది’ అసలు విషయం చెప్పాడు ష్రఘ్వీ .
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement