ఈ రంగుల ప్రపంచంలో చీకటి లోకమనేది ఒకటుంటుందని, అందులో దేనికైనా తెగించే మనుషులుంటారని తెలుసుకోలేరు కొందరు. కేవలం తమ కలల ప్రపంచం వైపు పరుగులు తీస్తూ జీవితాలనే పోగొట్టుకుంటుంటారు. బ్రియానా మైట్‌ల్యాండ్ అనే 17 ఏళ్ల అమ్మాయి తన జీవితంలో అదే పొరబాటు చేసింది.
అమెరికాలోని బర్లింగ్‌టన్ వర్మోంట్‌లో కెల్లీ, బ్రూస్ దంపతులకు 1986లో బ్రియానా జన్మించింది. ఈస్ట్ ఫ్రాంక్లిటన్ అనే చిన్న పట్టణంలో తన అన్నతో కలిసి పెరిగింది. పిల్లలిద్దరూ తల్లిదండ్రులతో పాటు తమ పొలాల్లోనే పనులకు వెళ్తూ, స్కూల్లో చదువుకునేవారు. ఇంట్లో అంతా ఆమెని ముద్దుగా బ్రీ అని పిలిచేవారు. బ్రీకి తన జీవనశైలి ఏమాత్రం నచ్చేది కాదు. పొలం పనులకు, పల్లె జీవితానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తనకు 17 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇంటికి 15 మైళ్ల దూరంలో ఉన్న ఎనోస్‌బర్గ్ ఫాల్స్ హైస్కూల్‌లో చేరతానని పేరెంట్స్‌పై ఒత్తిడి తెచ్చింది.
అక్కడే పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటానని పట్టుబట్టింది. మొదట సంకోచించిన పేరెంట్స్ చివరికి బ్రీ కోరికను కాదనలేకపోయారు. ఆరు నెలలు గడిచేసరికి ఆ హైస్కూల్ నుంచి డ్రాప్ ఔట్ అయ్యి.. ఇంకాస్త పైస్థాయికి వెళ్లేందుకు ఎఉఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. అందుకోసం మోంట్‌గోమేరీకి దగ్గరల్లో తన చిన్ననాటి స్నేహితురాలు జిలియన్‌తో కలిసి రూమ్‌లో ఉంటూ, జాబ్ చేసుకుంటూనే చదువుకునేది. తనున్న పట్టణం తన బాయ్ ఫ్రెండ్‌ని కలవడానికి, ఉద్యోగానికి, భవిష్యత్తులో ఎదుగుదలకూ అనువైనదని ఆమె నమ్మింది.
2004 మార్చి 19 శుక్రవారం ఉదయాన్నే తన తల్లిని కలిసిన బ్రీ.. తనకు మరో పార్ట్ టైమ్ జాబ్ దొరికిందని, మర్నాడే డ్యూటీలో జాయి¯Œ అవుతానని చెప్పింది. ఆ ఆనందంలోనే కెల్లీని రెస్టారెంట్‌కి తీసుకెళ్లింది. అప్పుడే తన కెరీర్ గురించి తల్లితో మాట్లాడింది. మధ్యాహ్నం మూడున్నర దాటే సరికి రూమ్ దగ్గర డ్రాప్ చేసి, కెల్లీ వెళ్లిపోయింది. కెల్లీ బ్రీని చూడటం అదే చివరిసారి. అదేరోజు ఈవినింగ్ డ్యూటీకి వెళ్లిన బ్రీ సోమవారం వరకూ రాకపోయేసరికి రూమ్ మేట్ జిలియన్‌కి భయమేసి బ్రీ కుటుంబానికి, పోలీసులకు చెప్పింది.
రంగంలోకి దిగిన పోలీసులు బ్రీ శుక్రవారం రాత్రి 11:20కే డ్యూటీ నుంచి తన రూమ్‌కు బయలుదేరిందని తెలుసుకున్నారు. డ్యూటీ తర్వాత పార్టీకి రమ్మని పిలిచిన కొలిగ్స్‌తో ‘రేపు ఉదయాన్నే న్యూ జాబ్‌లో జాయిన్ అవ్వాలి, ఇప్పుడు త్వరగా వెళ్లి రెస్ట్ తీసుకోవాలి’ అందట. మరో రెండు రోజులు గడిచేసరికి ఓ షాకింగ్ నిజం అక్కడ మీడియాని షేక్ చేసింది. అప్పటికే కేసు నమోదైన యాక్సిడెంట్ కారు ఎవరిదో కాదని, కనిపించకుండా పోయిన ‘బ్రీ’దేనని తేలింది.
మార్చి 20 శనివారం ఉదయానికి మోంట్‌గోమెరీ రోడ్ నం. 118లో పాడుబడిన ఇంటిని చాలా విచిత్రంగా వెనుక నుంచి ఢీ కొట్టి ఉందట ఆ కారు. ఎవరో తాగుబోతు యాక్సిడెంట్ చేసి, పారిపోయి ఉంటాడని భావించిన ఓ పోలీసు దాన్ని స్థానిక గ్యారేజ్‌కి తరలించాడట. ఆ ఇల్లు ఓ నిర్మానుష్యమైన దారిలో పెద్ద మలుపు దాటగానే ఉంటుంది. అదేం ప్రమాదకరమైన మలుపు కూడా కాదు. అయితే ఈ వార్తలు వెలుగులోకి రావడంతో చాలామంది సాక్షులు ఆ కారుని తాము చూశామంటూ ముందుకొచ్చారు.
ఆ రాత్రి పన్నెండుంపావుకి ఆ ఇంటిముందు హెడ్ లైట్స్ వెలుగుతున్న కారుని గమనించానని ఒకరు, పన్నెండున్నరకి లైట్స్ వెలగడంతో కారు టర్న్ చేస్తున్నారేమో అనుకున్నానని మరొకరు చెప్పారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ రాత్రి రెండున్నర తర్వాత బ్రీ మాజీ బాయ్ ఫ్రెండ్ రోబాటియాలే కూడా ఆ కారుని చూశాడు. ఆగి, అక్కడ ఎవరూ లేకపోవడంతో కారు లైట్స్ ఆఫ్ చేసి, డోర్స్ క్లోజ్ చేసి, తన దారిన తాను వెళ్లిపోయాడట. ‘అది బ్రీ కారని నీకు తెలుసా?’ అని అడిగితే అప్పటికి తెలియదని చెప్పాడు.
ఏది ఏమైనా 11.20కే కారులో బయలుదేరిన బ్రీ, పన్నెండుంపావుకే ఆ కారులో లేదు. యాక్సిడెంట్ అయిన ప్రదేశం తన ఆఫీస్‌కి చాలా దగ్గర్లో ఉంది. అంటే గంట సమయంలోనే తను మిస్ అయ్యింది. ఇక మరుసటి రోజు మార్చి 20న ఆ పోలీసు కారుని గ్యారేజ్‌కి పంపించకముందు ఓ బృందం విహారయాత్రకు వెళ్తూ ఆ కారుని చూసి ఆగింది. వారంతా తమ కెమేరాల్లో చాలా ఫొటోలు తీశారు. ఆ ఫొటోలే తర్వాత ఈ క్రైమ్‌సీన్ కి కీలక సాక్ష్యాలయ్యాయి. అయితే ఆ పర్యాటకులు కారు పక్కనే విరిగిన బ్రేస్‌లెట్ చూసినట్లు చెప్పారు.
కానీ అది పోలీస్ రికార్డుల్లో లేదు. మొదట అనుమానం రోబాటియాలే మీదకు మళ్లింది. అయితే అతడు విచారణ కొనసాగుతుండగానే బైక్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. దాంతో కేసుకు ముందు సాగలేదు. బ్రీ మిస్సింగ్‌కి ఐదువారాల ముందు మౌరా ముర్రే అనే అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లోనే గల్లంతైంది. బ్రీ కారు దొరికిన ప్రదేశానికి సరిగ్గా 90 మైళ్ల దూరంలోనే ముర్రే కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దిశగా విచారణ జరిపినా ఫలితం లేదు.
మిస్సింగ్‌కి 3 వారాల ముందు ఒక పార్టీలో బ్రీకి తన మాజీ స్నేహితురాలు లాక్రోస్‌కి మధ్య గొడవ జరిగిందట. లాక్రోస్ ఆ గొడవలో బ్రీని ముక్కు విరిగేలా కొట్టిందట. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న బ్రీ.. లాక్రోస్‌పై తన ప్రతాపాన్ని చూపించకుండా వదిలిపెట్టిందట. ఆ కథ తెలుసుకున్న పోలీసులు, లాక్రోస్‌ని కూడా విచారించారు. కానీ ఏ ఆధారం దొరకలేదు.
ఇలా ఎంతమందిని ప్రశ్నించినా? నిజానిజాలు బయటపడలేదు. చాలామంది బ్రీ పారిపోయి ఉంటుందని నమ్ముతారు. కానీ అది నిజం కాదని వాదించేవారు, ఇదో మానవ అక్రమ రవాణా కేసని నమ్ముతారు. బ్రీ ఎవరి నుంచో తప్పించుకునే క్రమంలో కారు వెనక్కి టర్న్ చేసుకునేటప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగి ఉంటుందని, అందుకే లైట్స్ వెలుగుతూ, డోర్స్ ఓపెన్ లోనే ఉన్నాయని ఊహిస్తుంటారు.
పైగా కరాటేలో నిష్ణాతురాలైన బ్రీని ఒకరు కిడ్నాప్ చేయలేరని ఎక్కువ మందే ఉండి ఉంటారనేది డిటెక్టివ్స్ మాట. 2022 మార్చి 18న ఇప్పటి దాకా దొరకని కొత్త డీఎన్‌ఏ దొరికిందని వెళ్లడించడంతో అది క్రిమినల్‌ది అయ్యే అవకాశం ఉండొచ్చని ఆశ మొదలైంది. పదిహేడేళ్లప్పుడు మాయం అయిన బ్రీకి ఇప్పుడు సుమారు 36 ఏళ్లు ఉండి ఉండొచ్చు. అయితే గత 19 ఏళ్లుగా ఈ కేసు మిస్టరీగానే ఉంది.
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment