Mysterious Stories In Telugu: Unsolved Mystery Of Killing Of JonBenet Ramsey - Sakshi
Sakshi News home page

లిటిల్‌ ఏంజెల్‌ దారుణ హత్య.. ఇప్పటికీ మిస్టరీగానే!

Published Sun, Oct 16 2022 2:07 PM | Last Updated on Sun, Oct 16 2022 6:42 PM

john patsy crime story in sakshi funday - Sakshi

ఒక ముగింపు అస్పష్టమైనప్పుడు.. దాని చుట్టూ అల్లే అల్లికలు అనంతాలై.. దట్టంగా అలముకుంటాయి. ఆధారాలు లేక.. ఉన్నా సరిపోలక.. ఎంతో అప్రతిష్ఠను మూటగట్టుకుంటాయి. 26 ఏళ్ల కిందట అమెరికా మీడియాను ఓ ఊపు ఊపిన కథ ఇది. ప్యాట్రీషియా రామ్‌సే(పాట్సీ), జాన్‌ బెనే రామ్‌సే దంపతుల అందాల కూతురు జాన్‌ బెనే ప్యాట్రీషియా రామ్‌సే కథ ఇది. తను 1990 ఆగస్ట్‌ 6న జన్మించింది.

ముద్దుగా ఆమెను జూనియర్‌ పాట్సీ అని కూడా పిలిచేవారు. తన అన్న బుర్కే రామ్‌సే.. ఆమె కంటే మూడేళ్లు పెద్దవాడు. ఈ కుటుంబం అమెరికా, కొలరాడోలోని బౌల్డర్‌లో నివాసం ఉండేవారు. ప్యాట్రీషియా మాజీ మిస్‌ వెస్ట్‌ వర్జీనియాగా అప్పటికే ప్రపంచానికి సుపరిచితం. ఆమె భర్త జాన్‌ బెనే పెద్ద వ్యాపారవేత్త, రచయిత కూడా.

అతను 1978లో మొదటి భార్య లుసిండాకి విడాకులు ఇచ్చి.. ప్యాట్రీషియాను పెళ్లి చేసుకున్నాడు. జూ. పాట్సీ కూడా ఎన్నో వెల్‌ బేబీ షో పోటీల్లో విజేతగా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే అదో సెలెబ్రిటీ ఫ్యామిలీ. ఏమైందో ఏమో.. 1996 డిసెంబర్‌ 26న జూ. పాట్సీ తన ఇంట్లోనే శవమై కనిపించింది. 
అసలేం జరిగింది?
డిసెంబర్‌ 26, తెల్లవారు జామున రామ్‌సే దంపతులు.. తమ కూతురు పాట్సీ అంతకు ముందు రోజు కి డ్నాప్‌ అయిందని పోలీసులను ఆశ్రయించారు. ముందురోజు వారు అందుకున్న కిడ్నాపర్స్‌ లేఖను కూడా చూపించారు. ‘మిస్టర్‌ రామ్‌సే (జాన్‌ బెనే).. శ్రద్ధగా వినండి! మాదొక విదేశీ సంఘం. మేము మీ కూతురును కిడ్నాప్‌ చేశాం. ఆమె 1997ను చూడాలనుకుంటే, మీరు మా సూచనలను తప్పనిసరిగా పాటించాలి. మాకు 1,18,000 డాలర్లను చెల్లించి మీ అమ్మాయిని తిరిగి తీసుకెళ్లొచ్చు.

మిగిలిన వివరాలు రేపు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య కాల్‌ చేసి చెబుతాం. ఈలోపు మీరు బ్యాంక్‌ అధికారులను కానీ పోలీసులను కానీ అప్రమత్తం చేస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అనేది ఆ లేఖ సారాంశం. విషయం మీడియాకి చేరడంతో రిపోర్టర్స్, స్నేహితులు, చుట్టు పక్కల ప్రజలు ఇలా చాలామంది రామ్‌సే ఇంటికి చేరుకున్నారు. ఆరాలు, విచారణ, కిడ్నాపర్స్‌ నుంచి తదుపరి ఆదేశాలు.. ఇలా ఓ పక్క హంగామా నడుస్తూనే ఉంది. మరో వైపు జాన్‌ బెనే కిడ్నాపర్స్‌ కోరినట్లు డబ్బు సిద్ధం చేసే పనిలోపడ్డాడు.

మధ్యాహ్నం కావస్తున్నా.. పాప ఆచూకీ తెలియకపోవడంతో డిటెక్టివ్‌ అర్ట్‌.. జాన్‌ బెనే స్నేహితుడు ఫ్లిట్‌ వైట్‌తో.. ‘ఎందుకైనా మంచిది ఒకసారి ఇల్లంతా వెతుకు’ అని చెప్పడంతో.. ఫ్లిట్‌ వెతకడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే తాళం వేసి ఉన్న బేస్‌మెంట్‌ రూమ్‌ని బలవంతంగా తెరచి చూశాడు. ఆ గదిలో శవమై కనిపించింది జూ. పాట్సీ. పాప నోటికి డస్ట్‌ టేప్‌ చుట్టి ఉంది.

విరిగిన పెయింట్‌ బ్రష్‌తో ముడివేసిన నైలాన్‌ తాడు చేతికి, మెడకు బలంగా బిగించి ఉంది. బాడీ అంతా తెల్లటి దుప్పటితో కప్పి ఉంది. వెంటనే మృతదేహాన్ని పట్టుకుని బయటికి వచ్చాడు ఫ్లిట్‌. అనుమానాస్పద ప్రాంతం నుంచి మృతదేహాన్ని తీసుకుని రావడం.. ఈలోపే అందరూ పాపను పట్టుకోవడంతో  వేలి ముద్రలు, కీలక ఆధారాలు అన్నీ నాశనమైపోయాయి.

జూ. పాట్సీ తలపై బలమైన గాయం ఉందని.. ఊపిరాడకుండా చేíసి చంపేశారని, లైంగికదాడి జరగలేదు కానీ.. ప్రయత్నించినట్లు ఆధారాలు ఉన్నాయని రిపోర్ట్స్‌ తేల్చాయి. దాంతో కేసు వివాదం రామ్‌సే ఫ్యామిలీనే చుట్టుముట్టింది. దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి.

జూ. పాట్సీ మృతదేహం దగ్గర లభించిన పెయింట్‌ బ్రష్‌కి సంబంధించిన మరో ముక్క.. తల్లి మేకప్‌ కిట్‌లో దొరకడంతో కేసు బిగుసుకుంది. మరోవైపు ఎన్నో పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో బుర్కేతో సహా ప్యాట్రీషియా, జాన్‌ బెనేలు చెప్పిన విషయాలకు, జరిగిన సంఘటనలకు పొంతన కుదరలేదు.

చనిపోయే ముందు జూ. పాట్సీ పైనాపిల్‌ తిన్నదని వైద్యపరీక్షల్లో తేలింది. పైగా పైనాపిల్‌ ముక్కలతో మిగిలి ఉన్న బౌల్‌పై బుర్కే వేలి ముద్రలు ఉన్నాయి. అయితే ఆ రోజు పైనాపిల్‌ తిన్నట్లు గుర్తులేదని చెప్పారు ముగ్గురూ.

పాపను వెతికే సమయంలో బుర్కే అసలు బయటికే రాలేదు. ఎందుకు రాలేదు? అంటే నిద్రపోయాడని చెప్పారు తల్లిదండ్రులు. బుర్కేది అదే మాట. నిజానికి ఇంట్లో అంత అలజడి రేగుతుంటే.. అంతా చెల్లెల్ని వెతుకుంటే తొమ్మిదేళ్ల బాలుడికి మెలకవరాకపోవడమేంటీ? అనేది చర్చనీయాంశంగా మారింది. దాంతో ఆ కిడ్నాపర్స్‌ లేఖను తల్లి సీనియర్‌ పాట్సీనే రాసుంటుందనే అనుమానాలు బలపడ్డాయి.

మరి పాపను ఎవరు చంపి ఉంటారు అనేదానికి చాలా వాదనలు రాద్ధాంతాలుగా మారాయి. ‘పాపపై తండ్రి జాన్‌ బెనే లైంగిక దాడికి యత్నించాడని కొందరు.. బుర్కే అనుకోకుండా బలమైన వస్తువుతో చెల్లెలు జూ. పాట్సీని కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడిందని.. కొడుకుని కాపాడుకునే క్రమంలోనే పాపను చంపేసి తల్లిదండ్రులు డ్రామా ఆడారని మరికొందరు తమ ఊహాగానాలను మొదలుపెట్టారు. ఆ దిశగానే క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో కూడా విచారణ  జరిపింది.

ఆ రోజు రాత్రి ఎవరో ఆగంతకుడు బేస్‌మెంట్‌ గది కిటికీని పగలగొట్టుకుని లోపలికి వచ్చి ఉంటాడని.. వాడే పాపని కిడ్నాప్‌ చేసి చంపేసి ఉంటాడని మరో వాదన పుట్టుకొచ్చింది. అయితే కిటికీ పరిసరప్రాంతాల్లో చాలాకాలంగా ఉన్న సాలిగూడు చెక్కుచెదరలేదంటూ ఆ కథను కొట్టిపారేశారు విశ్లేషకులు.

ఇక్కడే మరో అంశాన్ని లేవనెత్తారు అధికారులు. జూ. పాట్సీ చిన్నప్పటి నుంచి ఉన్న హెల్త్‌ రిపోర్ట్‌ని బయటికి తీశారు. 1994లో అంటే పాపకు నాలుగేళ్ల వయసున్నప్పుడు బుర్కే ఆమె ముఖం మీద బలంగా కొట్టాడని హెల్త్‌ రికార్డ్‌లో ఉంది.

1995, మేలో పాప ముక్కు పగిలిందని, అదే ఏడాది నవంబర్‌లో ఎడమ కన్నుకు గాయమైందని.. 1996లో ఎడమ చేతివేలు దెబ్బ తిన్నదని.. ఇలాంటివన్నీ బుర్కే నేరస్థుడనేందుకు ఆధారాలుగా మారి నమ్మకాన్ని బలపరిచాయి. మరోవైపు1996 ఆగష్టు 27న పాప పునరుత్పత్తి సామర్థ్యాన్ని గురించి తల్లి ప్యాట్రీషియా.. డాక్టర్‌ను ఆరా తీసినట్లు కూడా ఆధారాలు సంపాధించారు అధికారులు. 

అయితే 2003లో పాప బట్టల మీద దొరికిన మరో డీఎన్‌ఏ.. కుటుంబసభ్యులది కాకపోవడంతో కథ అడ్డం తిరిగింది. డిఏ(డిస్ట్రిక్ట్‌ అటార్నీ) 2008లో పాప హత్యతో ఆ కుటుంబానికి సంబంధం లేదంటూ రామ్‌సే ఫ్యామిలీకి క్షమాపణ పత్రాన్ని కూడా పంపించింది. అయితే కొందరు అధికారులు.. దీన్ని తప్పుబట్టారు. కేసు దారి తప్పిందని విమర్శించారు. మరోవైపు దర్యాప్తు సమయంలోనే.. జాన్‌ బెనే ఇంట్లో పనిమనిషి ఆత్మహత్య కూడా అప్పట్లో వివాదంగానే నిలిచింది.

2006లో అలెక్సిస్‌ వాలోరన్‌ రీచ్‌ అనే ట్రాన్స్‌జెండర్‌.. జూ. పాట్సీ కథలోకి ఊహించని ఎంట్రీ ఇచ్చింది. తను మగవాడిగా ఉన్నరోజుల్లో తనే పాపకి మత్తుమందు ఇచ్చి.. లైంగిక దాడిలో పొరపాటున చంపేశానంటూ లొంగిపోయింది. అయితే శవ పరీక్షలో పాపకు మత్తుమందు ఇచ్చిన ఆనవాళ్లు లేకపోవడంతో రీచ్‌ చెప్పేదాన్ని తోసిపుచ్చారు నిపుణులు. అదే ఏడాది ప్యాట్రీషియా అండాశయ క్యాన్సర్‌తో తన 49 ఏళ్ల వయసులో కన్నుమూసింది. తండ్రి జాన్‌ బెనే.. ఇంకా ఈ కేసుపై దర్యాప్తు గురించి పోలీసుల్ని ఆరా తీస్తూనే ఉన్నాడు.

బొర్కే ఇన్వెస్టిగేషన్‌ బ్యూరోపై 750 మిలియన్‌ డాలర్లు పరువు నష్టం దావా వేశాడు. ఏదిఏమైనా.. బుల్లి అందాల రాణిగా మెరిసిన జూ. పాట్సీ మరణం.. ఆ కుటుంబానికి తలవంపులను మిగిల్చింది. పాప మృతికి ఆ కుటుంబమే కారణమా? లేక నిజంగానే కిడ్నాపర్స్‌ చంపేశారా? మరింకేదైనా కుట్ర ఉందా? అనేది నేటికీ తేలలేదు.
 ∙సంహిత నిమ్మన 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement