ఉగాది కృత్యం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్!
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే!!
గాయత్రీ ధ్యానమ్
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయైర్ముఖైీస్ర్తక్షణై
యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదా భయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం
శంఖచక్ర మదారవింద యుగళం హస్త్వైహంతీం భజే నవగ్రహ స్తుతి
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ!
గురుశుక్ర శనిభ్యశ్చ! రాహవే కేతవే నమః లక్ష్మీ స్తుతి
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
పంచాంగ కర్త: సింహంభట్ల సుబ్బారావు
ఉగాది కృత్యం
చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజు ఉగాది పండుగ జరుపుకోవడం తెలుగు ప్రజల ఆనవాయితీ. తెలుగువారు చాంద్రమానం పాటిస్తుండగా, తమిళులు సౌరమానం రీత్యా ఈ పండుగ జరుపుకుంటారు. ఉదయమే అభ్యంగన స్నానం ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించడం, అనంతరం షడ్రుచులతో కూడిన (తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు) ఉగాది పచ్చడిని తినడంతో పండుగ ప్రారంభమవుతుంది. అలాగే పంచాంగ శ్రవణం ద్వారా ఆ ఏడాది దేశ కాలమాన పరిస్థితులు, జాతక విశేషాలు తెలుసుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడపడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉగాది రోజున పాటిస్తారు.
పంచాంగ సారాంశం
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడినదే పంచాంగం. తిథులు శ్రేయస్సుకు, వారాలు ఆయుర్వృద్ధికి, నక్షత్రాలు పాప పరిహారానికి, యోగాలు రోగ నివారణకు, కరణాలు కార్యసిద్ధికి తోడ్పడతాయి. ఈ పంచాంగ శ్రవణం వింటే శుభం కలుగుతుంది. చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీదుర్ముఖినామ సంవత్సరంగా పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 30వది దుర్ముఖినామ సంవత్సరం. అధిపతి రుద్రుడు, రుద్రుని ఆరాధించిన సకలసంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే, రజతదానం మంచిది.
కర్తరులు...
చైత్ర బహుళ ద్వాదశి తత్కాల త్రయోదశి, బుధవారం, అనగా మే 4 నుంచి డొల్లు కర్తరి (చిన్న కర్తరి) ప్రారంభం. వైశాఖ శుక్ల పంచమి, బుధవారం అనగా మే 11 నుంచి నిజ కర్తరి(అగ్నికర్తరి) ప్రారంభం. వైశాఖ బహుళ సప్తమి, శనివారం అనగా మే 28న కర్తరి పరిసమాప్తమవుతుంది. కర్తరీ కాలంలో శంకుస్థాపనలు, గృహ నిర్మాణాలు చేయరాదు.
మూఢములు
గురు మూఢమి... భాద్రపద శుక్ల ఏకాదశి, సోమవారం, అనగా సెప్టెంబర్ 12వ తేదీ నుంచి గురుమూఢమి ప్రారంభం. ఆశ్వయుజ శుక్ల నవమి, సోమవారం అనగా అక్టోబర్ 10వ తేదీన మూఢమి సమాప్తం. శుక్ర మూఢమి... చైత్ర బహుళ నవమి, ఆదివారం అనగా మే 1 నుంచి మూఢమి ప్రారంభం. ఆషాఢ శుక్ల అష్టమి, మంగళవారం అనగా జూలై 12న మూఢమి సమాస్తమవుతుంది. తిరిగి ఫాల్గుణ బహుళ అష్టమి, సోమవారం అనగా మార్చి(2017) 20 నుంచి మూఢమి ప్రారంభం. శ్రీహేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల చవితి శుక్రవారం అనగా మార్చి(2017) 31న ముగుస్తుంది.
మకర సంక్రమణం...
పుష్య బహుళ విదియ, శనివారం అనగా 2017 జనవరి 14న ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం మకరరాశిలో పగలు 12.48గంటలకు రవి ప్రవేశం. మకర సంక్రాంతి అయిన ఈరోజున దానధర్మాల వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం చేకూరతాయి. పుష్కరాలు... ఈ ఏడాది జూలై 31నుంచి గోదావరి నదికి అంత్య పుష్కరాలు ప్రారంభమై 12రోజుల పాటు జరుగుతాయి. ఈ 12రోజులు గోదావరిలో స్నానాదులు, దానధర్మాలు ఆచరించడం ఉత్తమం. అలాగే, శ్రావణ శు.అష్టమి తత్కాల నవమి గురువారం అనగా ఆగస్టు 11వ తేదీ రాత్రి ఉత్తర 2వ పాదం కన్యారాశిలో గురుని ప్రవేశంతో కృష్ణానది పుష్కరాలు ప్రారంభవుతాయి.
గ్రహణాలు: ఈ సంవత్సరం మన ప్రాంతానికి కనిపించే గ్రహణములు లేవు.
నుదుట తిలకాన్ని (బొట్టు, తిలకం) ఎందుకు ధరిస్తారు?
తిలకం, బొట్టు అనేవి తిలకధారితో పాటు ఎదుటివ్యక్తికి పవిత్రభావాన్ని కలిగిస్తాయి. కులం, మతం. శాఖ లేదా భగవంతుడిని పూజించే విధానం ఆధారంగా తిలకధారణ రూపు, రంగుల్లో తేడాలుంటాయి. పూర్వంలో.... బొట్టును విభిన్న రూపాల్లో ధరించేవారు. విద్యాసంబంధమైన వృత్తిని అనుకరించేవారు పవిత్రతకు చిహ్నంగా చందనాన్ని, వీరత్వానికి చిహ్నంగా ఎర్రటి కుంకుమను, సంపద సృష్టికి ప్రతీకగా పసుపుబొట్టును, ఇక శూద్రుడు.. పైమూడింటిని ఆమోదిస్తూ నల్లటి భస్మం, కస్తూరి లేదా బొగ్గుపొడిని వర్ణాలవారీగా ధరించేవారు. వై ఆకారంలో ఉండే విధంగా వైష్ణవ భక్తులు చందనపు బొట్టును, శైవభక్తులు వీభూదిని (అడ్డంగా)మూడు రేఖలుగా (త్రిపుండ్రాలు) ధరిస్తారు. దేవీభక్తులైతే ..ఎర్రని కుంకుమను బొట్టు పెట్టుకుంటారు. జ్ఞాపకశక్తికి, ఆలోచనకు మూలస్థానమైన కనుబొమ్మల మధ్య భాగంలో తిలకాన్ని ధరిస్తారు. దీన్నే యోగభాషలో ఆజ్ఞా చక్రమంటారు.‘ పరమాత్ముడిని నేను స్మరిస్తుండాలి. నా కర్తవ్యం పూర్తయ్యేవరకు ఈ పవిత్రభావం నిలవాలి. నా ప్రవర్తన సక్రమంగా ఉండాలి’ ఈ ప్రార్థనతో తిలకధారణ చేయాలి. తప్పుడు విధానాలను, ఆలోచనలను నిలువరించడమే కాకుండా పరమాత్మ దీవెనగా తిలకం నిలుస్తుంది.
ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాల ద్వారా శరీరం మొత్తానికి శక్తి పుడుతుంది. నుదురు, కనుబొమ్మల భ్రుకుటి ఈ తరంగాలకు మూలస్థానం. అందువల్లే ఎప్పుడైనా క్లేశం పుడితే తలనొప్పి కలుగుతుంది. నుదుటిని చల్లబరిచి మనల్ని తిలకం శాంతింపజేస్తుంది. శక్తి నష్టాన్ని నివారిస్తుంది. చందనాన్ని, భస్మాన్ని కొన్నిసార్లు నుదురు మొత్తాన్ని ఆవరించేలా ధరిస్తాం. అయితే, ప్లాస్టిక్ బొట్లు ఉపయోగించడం వల్ల కేవలం అలంకారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదు.