కొన్నిసార్లు కథ ఏదో.. కట్టుకథ ఏదో తేల్చలేం!
ఎవరిది నేరమో.. ఎవరిది న్యాయపోరాటమో.. గుర్తించలేం!
ఏవి కన్నీళ్లో.. ఏవి కపటనాటకాలో ఊహించలేం.
ఎవరు బాధితులో.. ఎవరు నిందితులో.. కనిపెట్టలేం!
చియోంగ్ సిస్టర్స్ మిస్టరీ అలాంటిదే.
అది 1997 జూలై 16. మారిజోయ్ చియోంగ్(21), జాక్వెలిన్ చియోంగ్(23) ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. ఫిలిప్పీనో–చైనీస్. సాయంత్రం ఆఫీస్ కాగానే.. ఇంటికి కలసి వెళ్లేందుకు.. ఫిలిప్పీన్స్‌లోని సెబు సిటీలో ఉన్న అయాలా మాల్ బయట కలుసుకున్నారు. కానీ రాత్రి పది దాటినా వాళ్లు ఇంటికి రాకపోయేసరికి.. మిస్టర్ డియోనిసియో, మిసెస్ థెల్మా చియోంగ్ దంపతులు పోలీస్‌స్టేషన్‌కి పరుగుతీశారు. అక్కడ ఆ వయసు పిల్లలు.. వారానికి ఒకసారి ఇంటికి రావడమే గొప్ప. దాంతో పోలీసులు కేసైతే నమోదు చేసుకున్నారు కానీ, పెద్దగా శ్రద్ధ చూపించలేదు.
సరిగ్గా రెండు రోజులకు కార్కార్ సిటీకి చెందిన రూడీ లసాగా అనే స్థానికుడి నుంచి.. సెబు సిటీ సమీప లోయలో ఓ స్త్రీ మృతదేహం కనిపిస్తోందని పోలీస్‌స్టేషన్‌కి మరో కేసు వచ్చింది. కుళ్లిన దేహంపైన ఉన్న బట్టలను చూసి.. అవి మా అమ్మాయి మారిజోయ్‌వే అంటూ నెత్తినోరు బాదుకున్నారు చియోంగ్ దంపతులు. పోస్ట్‌మార్టమ్ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, బలవంతంగా లోయలోకి తోయడం వల్లే చనిపోయిందని తేలింది. మరి జాక్వెలిన్ ఏమైంది?
ఫ్రాన్సిస్కో జువాన్ లారానాగా(పాకో), జోస్మాన్ అజ్నార్, రోవెన్ అడ్లావాన్, అల్బర్టో అలెన్ కానో, ఏరియల్ డెనిస్ రష్యాలతో పాటు జేమ్స్ ఆండ్రూ ఉయ్, జేమ్స్ ఆంథోనీ ఉయ్, (ఇద్దరూ సోదరులు, ఒకరు మైనర్) అనే ఏడుగురు యువకుల్ని అనుమానితులుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పాకో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పది నెలల తర్వాత 1998 మే 8న నిందితుల్లో ఒకరైన డెనిస్ రష్యా నోరు విప్పాడు. ‘పాకో ప్రోత్సాహంతో ఆ రోజు అక్కాచెల్లెళ్లిద్దరినీ బలవంతంగా కారులోకి లాగారు. వెంటనే మేము ఏడుగురం వాళ్లని ఓ ఇంటికి తీసుకెళ్లి, వారిని రేప్ చేశాం నాతో సహా. తర్వాత వాళ్లంతా... ఆ అమ్మాయిలకు కళ్లగంతలు కట్టి.. సెబుకొండ లోయ దగ్గరకు తీసుకెళ్లి.. మారిజోయ్‌ని బలవంతంగా లోయలోకి తోసేశారు.
జాక్వెలిన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. కారుతో వెంబడించి పట్టుకుని, ఆమెను రోవెన్ కొట్టాడు. తర్వాత అయాలా సెంటర్ దగ్గర నన్ను దించి, వెళ్లిపోయారు. ఆమెను ఏంచేశారో నాకు తెలియదు. ఈ మొత్తం కేసులో అమ్మాయిల కిడ్నాప్, హత్యలతో నాకు ఏ సంబంధం లేదు’ అంటూ సాక్ష్యం చెప్పాడు. అయితే పాకో, జోస్మాన్‌లు అసలు ఈ డెనిస్ ఎవరో తమకు జైలుకు వచ్చేవరకూ తెలియదని వాదించారు. థెల్మా.. డెనిస్‌ను కలసి.. సాక్ష్యం చెప్పినందుకు అతడికి బహుమతులు కూడా ఇచ్చింది. అది చాలామందికి గిట్టలేదు.
డెనిస్ ఇచ్చిన వాగ్మూలంతో కేసు కీలక మలుపు తిరిగే సమయంలో.. ఈ కేసు విచారణ చేసిన న్యాయమూర్తి మార్టిన్ ఓకాంపో ఓ హోటల్‌లో 1999 అక్టోబర్ 9న.. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఓకాంపోది కచ్చితంగా హత్యేనన్నది చాలామంది నమ్మకం. ఎందుకంటే డెనిస్ రష్యాను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్న సమయంలో ఓకాంపో.. డెనిస్ తరపున ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. పైగా పాకో జూలై 16న సెబులో లేనేలేడని, మనీలాలోని పాఠశాలలో ఉన్నాడని 40 మంది సాక్ష్యం చెప్పారు. అయితే వారంతా పాకో సన్నిహితులేనన్న కారణంతో ఆ సాక్ష్యాలు చెల్లవని ఓకాంపో తీర్పునిచ్చాడు.
మొత్తానికి 2004లో పాకో బృందాన్ని నేరస్థులుగా నిర్ధారిస్తూ.. మైనర్, డెనిస్ రష్యాకు మినహా మిగిలిన వారికి మరణశిక్ష విధించింది ఫిలిప్పీన్స్ సుప్రీంకోర్టు.
దాంతో ఈ తీర్పుపై స్పెయిన్ ప్రభుత్వం కలగజేసుకుంది. దానికి కారణం పాకో... ఫిలిప్పినో–స్పానిష్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన వ్యక్తి కావడమే. ఈ క్రమంలోనే మరో అంశం తెరమీదకు వచ్చింది. మిస్టర్ డియోనిసియో.. మాదకద్రవ్యాల వ్యాపారవేత్త పీటర్ లిమ్స్ దగ్గర కొన్నాళ్లు పని చేశాడని, చియోంగ్ సిస్టర్స్ మిస్ అవ్వడానికి ముందు.. మిస్టర్ చియాంగ్ లిమ్స్‌కి వ్యతిరేకంగా డ్రగ్స్ కేసులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడ్డాడని, మిస్సింగ్ తర్వాత సాక్ష్యమివ్వడానికి నిరాకరించా డని తేలింది. దాంతో మానవహక్కుల సంఘం పాకో వెనుకే నిలబడింది. స్పెయిన్ ప్రభుత్వ ప్రభావంతో 2006లో వారి మరణశిక్ష రద్దు అయింది. పైగా 2011లో ‘గివప్ టుమారో’ అంటూ పదిహేనేళ్ల పాటు నిర్దోషి అయిన పాకో శిక్ష అనుభవిస్తున్నాడని.. ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది అతడి కుటుంబం. దాంతో సగానికి సగం మంది పాకో తప్పు చేసి ఉండడని నమ్మడం మొదలుపెట్టారు.
నిజంగానే చియోంగ్ కుటుంబం ఏదో దాస్తోందనే అనుమానాలు బలపడ్డాయి. సరిగ్గా అప్పుడే కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అవేంటంటే.. మారిజోయ్, జాక్వెలిన్ పోలికల్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు.. తమ భర్తలతో, పిల్లలతో కలసి దిగిన ఫొటోలు. ఆ ఫొటోల్లో.. థెల్మా, డియోనిసియోలు కూడా ఉన్నారు. వాటిని చూసి.. ఈ కథ తెలిసిన వాళ్లు నోరెళ్లబెట్టారు. ‘చియోంగ్ సిస్టర్స్ బతికే ఉన్నారా? పెళ్లిళ్లు కూడా చేసుకున్నారా? వేరీజ్ జస్టీస్?’ అంటూ నిందితుల వర్గం విస్తృత ప్రచారం చేసింది. అయితే అదంతా మార్ఫింగ్ మాయాజాల మని కొట్టి పారేసేవారూ లేకపోలేదు. చివరికి ద్వంద్వ పౌరసత్వాన్ని ఉపయోగించుకుని పాకో.. స్పెయిన్ జైలుకు బదిలీ అయ్యాడు.
మిగిలిన వారు ఫిలిప్పీన్స్‌లోనే శిక్ష అనుభవిస్తున్నారు. శిక్ష పూర్తి అయ్యేసరికి పాకోకి 61 ఏళ్లు వస్తాయి. అయితే పాకో.. స్పెయిన్‌లో శిక్షను అనుభవిస్తూనే.. కొన్ని ఆంక్షల మధ్య.. పార్ట్‌టైమ్‌గా ఓ హోటల్‌లో షెఫ్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు అతడ్ని నమ్మేవాళ్లు, అతడ్ని స్ఫూర్తిగా తీసుకునేవాళ్లు ఫిలిప్పీన్స్‌లో చాలామందే ఉన్నారు. ఈ కథలో చియోంగ్ స్టిస్టర్ తల్లి థెల్మా ఎంత ఏడ్చిందో.. పాకో తల్లి మార్గరీటా కూడా అంతే ఏడ్చింది. అంతే పోరాటం చేసింది. ఏది ఏమైనా ఈ కథలో పాకో దోషో, నిర్దోషో తేలనే లేదు. చియోంగ్ సిస్టర్స్ బతికే ఉన్నారా? అనే ప్రశ్నలకి ఆ ఫొటోలు తప్ప మరో సాక్ష్యం లేదు. నిజంగానే పాకో బృందం నేరం చేసి ఉంటే.. జాక్వెలిన్ ఏమైంది? చియోంగ్ సిస్టర్స్ బతికే ఉంటే.. ఆ రోజు దొరికిన మృత దేహం ఎవరిది? ఇలా వేటికీ సమాధానాలు లేవు.
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment