నయవంచన
ప్రతి ఆడపిల్లా బోలెడన్ని కలలు కంటుంది.
అవి నిజం కావాలని పూజలు, ప్రార్థనలు చేస్తుంది.
డెబోరా కూడా అలానే చేసింది.
కానీ ఆమె కలలు నిజం కాలేదు.
కోరుకున్న జీవితం దక్కలేదు.
ఎందుకంటే ఓ వంచకుడిని ప్రేమించింది.
నయవంచనకు గురై జీవితాన్నే కోల్పోయింది.
అమెరికాలో సంచలనం సృష్టించిన నర్తకి డెబోరా ఫ్లారెస్ నార్వేజ్
హత్యోదంతం... నేటి ‘నిజాలు దేవుడికెరుక’లో!
డిసెంబర్ 12, 2010. లాస్ వేగాస్ (అమెరికా)లోని లగ్జర్ హోటల్...
‘‘తొమ్మిదిన్నరవుతోంది. ఇంతవరకూ డెబోరా రాలేదు. ఇలా అయితే ఎలా?’’... చిందులు తొక్కుతున్నాడు ఫ్రాన్సిస్. క్లారా నిలబడి చూస్తోంది.
‘‘మాట్లాడవేం... డెబోరా ఏమయ్యింది?’’... మరోసారి ఉరిమాడు.
‘‘నాకు మాత్రం ఏం తెలుసు సర్. సాయంత్రం ఆరున్నరకే ఇంటికెళ్లిపోయింది. ఫ్రెష్ అయ్యి ఎనిమిది గంటల కల్లా వచ్చేస్తానంది. రాలేదు. ఫోన్ చేస్తే తీయడం లేదు.’’
‘‘ఇవన్నీ నాకు తెలిసినవే. కొత్త విషయాలేమైనా ఉంటే చెప్పు.’’
ఒళ్లు మండింది క్లారాకి. ‘రిహార్సల్స్ మేనేజర్ అయినంత మాత్రాన ఇంత ఎగరాలా’ అనుకుంది మనసులో. పైకి మాత్రం నవ్వు ముఖం పెట్టింది. ‘‘తను ఎప్పుడూ ఇలా చేయదుగా సర్. తనకేం పని వచ్చిందో ఏమో.’’
తల పంకించాడు ఫ్రాన్సిస్. అతడికి తెలుసు డెబోరా ఎంత నిబద్ధత గల అమ్మాయో. అందుకే ఇక ఆ విషయం వదిలేసి తన పనిలో పడిపోయాడు. అలా చేసి తనెంత తప్పు చేశాడో తర్వాతి రోజుకానీ అర్థం కాలేదతడికి.
మరునాడు సాయంత్రం షో టైమవుతున్నా డెబోరా రాలేదు. ఫ్రాన్సిస్‌కి టెన్షన్ పెరిగిపోయింది. అందరూ వచ్చేదే డెబోరాని చూడ్డానికి. తను లేకుండా షో ఎలా చేయాలి?
‘‘ఏంటి క్లారా ఇది? ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పొచ్చు కదా. ముందే ప్రిపేరవడమో, షో క్యాన్సిల్ చేయడమో చేసేవాళ్లం కదా’’... విసుక్కున్నాడు.
‘‘పని తప్ప మరో ప్రపంచమే లేనట్టుగా ఉండే అమ్మాయి ఇలా చేస్తే, తనకి ఏమయ్యిందోనని కంగారుపడటం మానేసి తిట్టుకోవడం ఏమైనా బాగుందా సర్?’’
చివ్వున తలెత్తి చూశాడు ఫ్రాన్సిస్. తను అలా ఆలోచించలేకపోయానే అని సిగ్గుపడుతున్నట్టుగా ఉంది అతడి చూపు. ‘‘సారీ క్లారా... షోని క్యాన్సిల్ చేద్దాం’’ అన్నాడు స్వరం తగ్గించి. తలాడించింది క్లారా. ఇద్దరూ స్టేజివైపు నడిచారు.
డిసెంబర్ 13... రాత్రి పది కావస్తోంది.
‘‘లగ్జర్ హోటల్లో జరిగిన డ్యాన్స్ షోలో కలకలం రేగింది. ప్రముఖ డ్యాన్సర్ డెబోరా ఫ్లారెస్ నార్వేజ్ లేనందున షో క్యాన్సిల్ చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించడంతో డెబోరా అభిమానులు నిరాశకు లోనయ్యారు.’’
టీవీలో వార్తలు చూస్తోన్న షానన్ షాకయ్యింది. ‘డెబోరా లేక షో క్యాన్సిలయ్యిందా? అదెలా? తనెప్పుడూ అలా చేయదే’ అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుని డెబోరాకి కాల్ చేసింది. తీయలేదు. వెంటనే క్లారా నంబర్ డయల్ చేసింది. ముందు రోజు నుంచీ జరిగినదంతా వివరించింది క్లారా. షానన్ మనసు కలవరపడింది. తన స్నేహితురాలికి ఏమయ్యిందో ఏమోనని కంగారుపడింది. వెంటనే లాస్ వేగాస్ పోలీసులకు ఫోన్ చేసింది. హుటాహుటిన తనూ బయలుదేరింది.
డిసెంబర్ 14... ఉదయం పదకొండు... లాస్‌వేగాస్ పోలీస్ స్టేషన్.
‘‘మేము ఎంక్వయిరీ చేస్తున్నాం మిస్ షానన్... ఇంకా ఏమీ తెలియలేదు.’’
‘‘నాకేదో భయంగా ఉంది సర్.’’
‘‘మీకు తనెప్పటి నుంచి పరిచయం?’’
‘‘మేం పదిహేనేళ్ల నుంచీ ఫ్రెండ్‌సమి. రోజూ ఏదో ఒక సమయంలో కలుసు కుంటాం. తన షో ఏదీ మిస్ కాను. కానీ ఆఫీసు పనిమీద నాలుగు రోజుల క్రితం వేరే ఊరికెళ్లాను. అందుకే ఈ షోకి లేను. టీవీలో తన గురించిన న్యూస్ చూడగానే మనసు ఏదో కీడు శంకించింది. వెంటనే బయలుదేరి వచ్చేశాను.’’
అలాగా అన్నట్టు తలూపాడు ఇన్‌స్పెక్టర్. ‘‘డెబోరా అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ రప్పించాను. మీరు కూడా రండి చూద్దాం’’ అంటూ లేచాడు. అతడిని అనుసరించింది షానన్.
వీడియో రన్ అవుతోంది. సమయం ఏడవుతుండగా మెరూన్ కలర్ షెవరోలెట్ కారు వచ్చి గ్యారేజ్‌లో ఆగింది. క్షణం తరువాత 31 యేళ్ల డెబోరా దిగింది. ముదురురంగు స్కర్టు, జీన్స్ కోటు, మోకాళ్ల వరకూ నల్లని బూట్లు వేసుకుంది. భుజానికి తెల్లని జిమ్ బ్యాగ్, చేతిలో బ్రౌన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ఉన్నాయి. కారు లాక్ చేసి లోనికి వెళ్లిపోయింది.
‘‘అంటే తను ఫ్లాట్‌కి వచ్చింది. కానీ తనని ఎవరూ చూడలేదు. ఫ్లాట్‌లోనూ లేదు. అంటే మళ్లీ ఎక్కడికైనా వెళ్లిందా?’’ సందేహాన్ని వ్యక్తం చేశాడు ఇన్‌స్పెక్టర్. అతడి అనుమానం నిజమే అయ్యింది. ఇరవై నిమిషాల తరువాత డెబోరా తన కారులో మళ్లీ ఎక్కడికో బయలుదేరింది.
‘‘తను ఎక్కడికో వెళ్లింది సర్. అక్కడే ఏదో జరిగి ఉంటుంది’’... షానన్ గొంతు బాధతో జీరబోయింది. తడిసిన కళ్లను తుడుచుకుని అంది... ‘‘గ్రిఫిత్‌ను అడిగితే ఏమైనా తెలుస్తుందేమో సర్.’’
చురుక్కున చూశాడు ఇన్‌స్పెక్టర్. ‘‘గ్రిఫిత్ ఎవరు?’’
‘‘డెబోరా మాజీ బాయ్‌ఫ్రెండ్ సర్. తనూ డ్యాన్సరే.’’
‘‘యు మీన్... జేసన్ గ్రిఫిత్?’’
అవునన్నట్టు తలూపింది షానన్. వెంటనే ఆమెను తీసుకుని గ్రిఫిత్ దగ్గరకు బయలుదేరాడు ఇన్‌స్పెక్టర్. డెబోరా వచ్చిందా అని అడిగితే... 12వ తేదీ సాయంత్రం వచ్చిందని, ఆరింటికి వెళ్లిపోయిందని చెప్పాడు గ్రిఫిత్. మేం మాజీ ప్రేమికులం, తన దగ్గర ఉన్న నా వస్తువుల్ని తిరిగివ్వడానికి వచ్చింది తప్ప ఆమెతో తనకే సంబంధం లేదని చెప్పాడు. అతడి మాటల్లో తడబాటు లేకపోవడంతో పోలీసులకు వెనుదిరగక తప్పలేదు.
డెబోరా ఫ్లాట్ తనిఖీ చేశారు. అనుమానించదగ్గవేమీ కనిపించలేదు. కారు కోసం వెతికారు. నాలుగు రోజుల తరువాత లాస్ వేగాస్‌కి కొన్ని కిలోమీటర్ల దూరంలో... రోడ్డు పక్కన కనిపించింది. అయితే దాని వల్ల కూడా ఏ ఆధారమూ దొరకలేదు. దాంతో కేసునెలా ఛేదించాలా అన్న ఆలోచనలతో పోలీసుల బుర్ర వేడెక్కింది. దాదాపు 25 రోజుల తర్వాత వారి బుర్రలను చల్లబరిచే ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. అవతలి వ్యక్తి చెప్పింది వినగానే సబార్డినేట్స్‌ని తీసుకుని హుటాహుటిన బయలుదేరాడు ఇన్‌స్పెక్టర్.
జనవరి 8... 2011. డౌన్‌టౌన్ దగ్గరున్న బొనాంజా వే లో దూసుకుపోతోన్న పోలీసు జీపు... ఓ చోట రోడ్డుకు కాస్త దూరంగా విసిరేసినట్టుగా ఉన్న ఓ ఇంటి ముందు ఆగింది. జీపు దిగి ఒక్క అంగలో లోనికి నడిచాడు ఇన్‌స్పెక్టర్. సబార్డినేట్స్ అతడిని అనుసరించారు. లోనికి వెళ్తూనే ‘సెర్చ్’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. వెంటనే అందరూ వెతుకులాట మొదలుపెట్టారు.
మొదటి అంతస్తులో ఓ మూలన ఉన్న పెద్ద పెద్ద నీలిరంగు ప్లాస్టిక్ టబ్బుల మీద పడింది వారి చూపు. వాటి నిండా కంకర నింపి ఉంది. మధ్యలో ఏదో నల్లని కవర్ లాంటిది కనిపించింది. వెంటనే ఆ కవర్‌ని పట్టి లాగారు. తెరచి చూసి తుళ్లిపడ్డారు. అందులో తొడవరకూ నరికేసిన ఓ ఆడపిల్ల కాలు ఉంది. కడుపులో దేవినట్టయ్యింది. డబ్బా లోపలున్న కంకరంతా బయటకు తీస్తే అడుగున ఇంకో పాలిథీన్ కవర్ కనిపించింది. అందులో రెండో కాలు ఉంది. ఆ పక్కనే ఉన్న మరో రెండు టబ్బుల్లో కూడా పాలిథీన్ కవర్లున్నాయి. వాటిలో డెబోరా తల, చేతులు, బట్టల్లేని మొండెం ఉన్నాయి.
‘‘మైగాడ్’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ వాటిని చూస్తూనే. మిగతావారంతా అవాక్కయి చూస్తూండిపోయారు. ఆ భాగాలన్నింటినీ తీసి ఓ సంచీలో వేసుకుని పోలీస్ స్టేషన్‌కి బయలుదేరారు. గ్రిఫిత్‌ను అరెస్ట్ చేసి సెల్‌లోకి తోశారు.
‘‘లేదు సర్. డెబ్బీని నేను చంపలేదు’’ ... పోలీస్ స్టేషన్ గోడలు దద్దరిల్లేలా కేకలు పెట్టాడు గ్రిఫిత్. కానీ ఇన్‌స్పెక్టర్ లెక్కచేయలేదు. ఎందుకంటే గ్రిఫితే డెబోరాని చంపాడనటానికి అతడి దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి.
డెబోరా కేసును పరిష్కరించలేక మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కేలీ కసోర్సో అనే మహిళ ఫోన్ చేసింది. గ్రిఫిత్ తన స్నేహితుడని, అతడు తన ఫ్రెండ్ కొలంబియాతో కలిసి తన ఇంటికొచ్చాడని, ఓ పెద్ద నీలిరంగు టబ్‌ని తన ఫ్లాటులో కొన్ని రోజులు ఉంచుకోవాలని కోరాడని, అందులో ఏముందని అడిగితే ‘డెబోరా’ ఉందని చెప్పాడని, దాంతో తాను వెళ్లిపొమ్మని అరిచానని చెప్పింది. ఆమె మాటలకు అనుమానం వచ్చిన పోలీసులు గ్రిఫిత్ మీద కన్నేశారు. అతని స్నేహితుడు కొలంబియాని పట్టుకుని తమ స్టయిల్లో విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది.
డెబోరా గ్రిఫిత్‌ని ప్రేమించింది. గుడ్డిగా నమ్మింది. అతడితో అన్నీ పంచుకుంది. ఫలితంగా గర్భం దాల్చింది. పెళ్లి చేసుకుందామంటే, తానింకా ఎదగాలన్నాడు. అబార్షన్ చేయించాడు. అయినా ఆమె అతణ్ని ప్రేమిస్తూనే ఉంది. కానీ అతడు మాత్రం ఆమెను వంచించాడు. నిర్లక్ష్యం చేశాడు. విడిపోవడం మంచి దన్నాడు. తనకు ఇష్టం లేకపోయినా అతడి సంతోషం కోసం సరేనంది డెబోరా. కానీ తర్వాత తెలిసింది... తన కడుపులో పిండం పెరుగుతోందని. దాంతో అతడికి ఫోన్ చేసింది. విషయం చెప్పింది. జరిగిం దేదో జరిగిపోయింది పెళ్లి చేసుకుందా మంది.
ఈ బిడ్డనైనా నాకివ్వు అంటూ ప్రాధేయపడింది. మాట్లాడుకుందాం రమ్మ న్నాడు. ఆనందంగా వెళ్లిన ఆమెకి విశ్వ రూపం చూపించాడు. ప్రేమ లేదన్నాడు. పెళ్లి కుదరదన్నాడు. ఆమె ఒత్తిడి చేయ డంతో ఆవేశపడ్డాడు. తల మీద కొట్టి చంపేసి, శవాన్ని టబ్బులో పెట్టాడు. పోలీసులు పరిశోధన తీవ్రస్థాయిలో ఉండటంతో తీసుకెళ్లి పారేయలేకపోయాడు. కొన్నిరోజులు కేలీ ఇంట్లో దాచాలనుకున్నాడు. కానీ ఆమె నో అనడంతో, కొలంబియాతో కలిసి దేహాన్ని ముక్కలు చేసి, కాంక్రీట్ టబ్బుల్లో పెట్టాడు.
‘‘ప్రేమించిన అమ్మాయిని మోసగించావ్. పెళ్లి చేసుకోమంటే ప్రాణాలు తీశావ్. ప్రేమ విలువ తెలియని నీలాంటి నీచుణ్ని ప్రేమించడం ఆమె దురదృష్టం’’ ... గ్రిఫిత్ కళ్లలోకి చూస్తూ అన్నాడు ఇన్‌స్పెక్టర్. అతగాడి కళ్లలో పశ్చాత్తాపం కనిపిస్తుందేమోనని వెతికాడు. అలాంటిదేమీ కనిపించలేదు. ఇప్పటికీ తాను నేరం చేయలేదనే అంటున్నాడు గ్రిఫిత్. చట్టానికి చిక్కకుండా తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నెల 23వ తేదీన తుది తీర్పు వెలువడవచ్చు. మరి అతడి నేరం నిరూపణ అవుతుందా? ఆ వంచకుడికి శిక్ష పడుతుందా? అతడిని ప్రేమించినందుకు ప్రాణాలనే కోల్పోయిన డెబోరాకి న్యాయం జరుగుతుందా?
- సమీర నేలపూడి