శిలలే కళలుగా! | Arts rocks! | Sakshi
Sakshi News home page

శిలలే కళలుగా!

Published Sun, Mar 20 2016 12:21 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

శిలలే  కళలుగా! - Sakshi

శిలలే కళలుగా!

విహారం

అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ ఫిల్మ్ ‘గెలాక్సీ క్వెస్ట్’లో గ్రహాంతరవాసుల గ్రహం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గ్రహాంతరవాసుల నివాసంగా భ్రమింప జేసిన  ఆ ప్రదేశం నిజానికి కృత్రిమంగా సృష్టించింది కాదు. సినిమా కోసం వేసిన భారీ సెట్ కూడా కాదు. గ్రహం కాని ఆ గ్రహం భూమి మీదే ఉంది.


అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఉన్న ‘గోబ్లిన్ వ్యాలీ స్టేట్ పార్క్’ను సందర్శిస్తే మనం వేరే గ్రహంలో విహరిస్తున్నట్లుగా  ఉంటుంది. ఈ స్టేట్ పార్క్‌లో హూడూ శిలలు ప్రధాన ఆకర్షణ. ‘టెంట్ రాక్’ పేరుతో కూడా పిలిచే ఈ శిలలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా కనిపిస్తాయి. కోడి, రాణి కిరీటం, చిమ్నీ, పిరమిడ్, స్తంభాలు, దీపస్తంభం మొదలైన  ఆకారాల్లో ఉండే ఈ ప్రాచీన శిలలు చూపరులను ఆకట్టుకుంటాయి.


గోబ్లిన్ వ్యాలీ స్టేట్ పార్క్‌లో వేలాది ‘హూడూ’లు ఉన్నాయి. వీటిని స్థానికంగా గోబ్లిన్ పేరుతో పిలుస్తారు. ఈ శిలల ఎత్తు... మనిషి ఎత్తు నుంచి పది అంతస్తుల భవంతి ఎత్తు వరకు ఉంటుంది. మన ఊహాశక్తి బలంగా ఉండాలేగానీ, ఒక్కో శిల ఒక్కో కథను మన మదిలో స్ఫురింపచేస్తుంది. పుట్టగొడుగు ఆకారంలో ఉన్న శిలలు ఎక్కువగా ఉండడం వల్ల ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ‘పుట్టగొడుగు లోయ’ అని పిలిచేవారట.

 
ఈ ప్రాంతాన్ని తొలిసారిగా కొందరు పశువుల కాపరులు కనుగొన్నారట. తర్వాత 1964లో ఇది స్టేట్ పార్క్ హోదా పొందింది. సూర్యాస్తమయ సమయంలో ఈ శిలలపై ప్రతిఫలించే కాంతి కొత్త దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ఇక నిండు వెన్నెల్లో ఈ శిలలను చూడడం మాటలకు అందని అనుభవం.

 ఈ అద్భుత అందాల వెనుక శాస్త్రీయ కారణాల మాట ఎలా ఉన్నా... ఆఫ్రికా జానపద కథల నేపథ్యంలో ఎన్నో వ్యాఖ్యానాలు వినిపిస్తాయి. ఆ కథల్లో వినిపించే ఔషధ కొండ ఇదేనని, ఇక్కడి మట్టిని తాకితే రోగాలు నయమయ్యేవని  అంటారు. కొన్ని మౌఖిక జానపద కథల ప్రకారం... శాపవశాత్తూ రాతిశిలలుగా మారిన ఒక రాజ్యమే ఈ ప్రాంతం! ఈ అతిశయాల మాట ఎలా ఉన్నా... రకరకాల ఆకారాల్లో ఉన్న శిలలను అనుసంధానం చేస్తూ మనమే ఒక అందమైన కథ  అల్లవచ్చు.


ఆఫ్రికన్ కథల ప్రభావమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు గానీ...ఈ ప్రాంతంలో విహరించడం వల్ల స్వీయనియంత్రణ పెరుగుతుందని, ఈ  ప్రాచీన శిలల మీద నుంచి వీచే గాలి ఔషధ గుణాలను కలిగి ఉందని... ఇంకా చెప్పాలంటే ఈ ప్రదేశంలో ‘మ్యాజిక్ పవర్స్’ దాగి ఉన్నాయనే విశ్వాసం ఉంది. అది ఎంత నిజమో తెలియదు గానీ...‘గోబ్లిన్  వ్యాలీ స్టేట్ పార్క్’ను ఒక్క సారి చూస్తే చాలు భూగ్రహంలోనే కొత్త గ్రహాన్ని చూసిన అనుభూతి కలుగు తుంది!     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement