శిలలే కళలుగా!
విహారం
అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ ఫిల్మ్ ‘గెలాక్సీ క్వెస్ట్’లో గ్రహాంతరవాసుల గ్రహం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గ్రహాంతరవాసుల నివాసంగా భ్రమింప జేసిన ఆ ప్రదేశం నిజానికి కృత్రిమంగా సృష్టించింది కాదు. సినిమా కోసం వేసిన భారీ సెట్ కూడా కాదు. గ్రహం కాని ఆ గ్రహం భూమి మీదే ఉంది.
అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఉన్న ‘గోబ్లిన్ వ్యాలీ స్టేట్ పార్క్’ను సందర్శిస్తే మనం వేరే గ్రహంలో విహరిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ స్టేట్ పార్క్లో హూడూ శిలలు ప్రధాన ఆకర్షణ. ‘టెంట్ రాక్’ పేరుతో కూడా పిలిచే ఈ శిలలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా కనిపిస్తాయి. కోడి, రాణి కిరీటం, చిమ్నీ, పిరమిడ్, స్తంభాలు, దీపస్తంభం మొదలైన ఆకారాల్లో ఉండే ఈ ప్రాచీన శిలలు చూపరులను ఆకట్టుకుంటాయి.
గోబ్లిన్ వ్యాలీ స్టేట్ పార్క్లో వేలాది ‘హూడూ’లు ఉన్నాయి. వీటిని స్థానికంగా గోబ్లిన్ పేరుతో పిలుస్తారు. ఈ శిలల ఎత్తు... మనిషి ఎత్తు నుంచి పది అంతస్తుల భవంతి ఎత్తు వరకు ఉంటుంది. మన ఊహాశక్తి బలంగా ఉండాలేగానీ, ఒక్కో శిల ఒక్కో కథను మన మదిలో స్ఫురింపచేస్తుంది. పుట్టగొడుగు ఆకారంలో ఉన్న శిలలు ఎక్కువగా ఉండడం వల్ల ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ‘పుట్టగొడుగు లోయ’ అని పిలిచేవారట.
ఈ ప్రాంతాన్ని తొలిసారిగా కొందరు పశువుల కాపరులు కనుగొన్నారట. తర్వాత 1964లో ఇది స్టేట్ పార్క్ హోదా పొందింది. సూర్యాస్తమయ సమయంలో ఈ శిలలపై ప్రతిఫలించే కాంతి కొత్త దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ఇక నిండు వెన్నెల్లో ఈ శిలలను చూడడం మాటలకు అందని అనుభవం.
ఈ అద్భుత అందాల వెనుక శాస్త్రీయ కారణాల మాట ఎలా ఉన్నా... ఆఫ్రికా జానపద కథల నేపథ్యంలో ఎన్నో వ్యాఖ్యానాలు వినిపిస్తాయి. ఆ కథల్లో వినిపించే ఔషధ కొండ ఇదేనని, ఇక్కడి మట్టిని తాకితే రోగాలు నయమయ్యేవని అంటారు. కొన్ని మౌఖిక జానపద కథల ప్రకారం... శాపవశాత్తూ రాతిశిలలుగా మారిన ఒక రాజ్యమే ఈ ప్రాంతం! ఈ అతిశయాల మాట ఎలా ఉన్నా... రకరకాల ఆకారాల్లో ఉన్న శిలలను అనుసంధానం చేస్తూ మనమే ఒక అందమైన కథ అల్లవచ్చు.
ఆఫ్రికన్ కథల ప్రభావమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు గానీ...ఈ ప్రాంతంలో విహరించడం వల్ల స్వీయనియంత్రణ పెరుగుతుందని, ఈ ప్రాచీన శిలల మీద నుంచి వీచే గాలి ఔషధ గుణాలను కలిగి ఉందని... ఇంకా చెప్పాలంటే ఈ ప్రదేశంలో ‘మ్యాజిక్ పవర్స్’ దాగి ఉన్నాయనే విశ్వాసం ఉంది. అది ఎంత నిజమో తెలియదు గానీ...‘గోబ్లిన్ వ్యాలీ స్టేట్ పార్క్’ను ఒక్క సారి చూస్తే చాలు భూగ్రహంలోనే కొత్త గ్రహాన్ని చూసిన అనుభూతి కలుగు తుంది!