తపాలా
అవి నేను ప్రైవేట్ ఫైనాన్స్‌లో పనిచేస్తున్న రోజులు. ఈ సంఘటన జరిగి దాదాపు పదేళ్లు అయినా, ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా నా అమాయకత్వానికి నవ్వుకుంటాం.
ఓరోజు ఫైనాన్స్‌లో దినపత్రికలు తిరగేస్తుంటే ఒక పజిల్ కనిపించింది. దాన్ని పూర్తిచేసి పంపిస్తే, కారు, టీవీ లాంటి బహుమతులు ఉన్నాయని చూసి ఆశపడి, పూర్తిచేసి ఇచ్చిన అడ్రెస్‌కు పోస్ట్ చేశాను. తర్వాత కొన్ని రోజులు దాని గురించి మరిచిపోయాను.
ఓ పదిహేను రోజుల తర్వాత, నాకు తపాలా వచ్చింది. నా పజిల్ కరెక్టు అనీ, అందుకు నాకు టీవీ బహుమతిగా వచ్చిందనీ, అందుకు నాలుగొందల రూపాయలు కడితే వివరాలు పంపుతామనీ దాని సారాంశం. నేను మొదట వద్దనుకున్నాను. నాతో పనిచేసే మిగతావారు నీకు వద్దంటే చెప్పు, మేం తీసుకుంటామనే సరికి, నాకు ఆశపుట్టి ఎలాగోలా డబ్బు సర్ది పంపించాను.
తర్వాత కొన్ని రోజులకు నాకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ఆరొందల రూపాయలు కడితే దాన్ని ఇస్తామన్నారు. ఆనందంతో అవి కూడా కట్టాను. పార్శిల్ ఓపెన్ చేస్తే, టికెట్ బుక్! ఒక్కో టికెట్ రూ.400. నేను అమ్మి వాటిని పంపిస్తే, అప్పుడిస్తారట టీవీ. అంతే, నాకు నాలుక తడారిపోయింది. ఇంట్లో ఒకటే తిట్లు. వీధిలో వారు నవ్వులు.
కొన్ని రోజులు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాను. ఎందుకంటే అప్పుడు నా జీతం నాలుగొందలు మాత్రమే. కాబట్టి అలాంటి ప్రకటనలు చూసి ఇంకెప్పుడూ మోసపోకూడదనుకున్నాను.
- టి.రెడ్డివెంకటరమణ రాయలపేట, చిత్తూరు
టీవీ వస్తుందని...
Published Sat, May 31 2014 10:55 PM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
Advertisement