private finance
-
ప్రాణం తీసిన ‘ఫైనాన్స్’
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి తీసుకున్న రుణం ఓ మహిళ పాలిట మృత్యు పాశమైంది. అధిక వడ్డీలు చెల్లించలేక, ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు భరించలేక తనువు చాలించింది. మంగళవారం విజయవాడలో ఈ విషాదం చోటు చేసుకుంది. విజయవాడ వాంబే కాలనీకి చెందిన అల్లంపల్లి మస్తానమ్మ అలియాస్ మాధవి (44) పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త లక్ష్మీనారాయణతో విభేదాలు తలెత్తడంతో పదేళ్ల క్రితం విడిపోయి వేరుగా ఉంటోంది. ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తగారిళ్లకు పంపింది. వ్యాపారంలో నష్టం రావడం, పిల్లల వివాహాల కోసం కొంత అప్పులు చేసింది. హైదరాబాద్‌కు చెందిన క్రిస్ ఫైనాన్స్, స్పందన అనే సంస్థల ప్రతినిధులు రుణాలు ఇస్తామని చెప్పడంతో వారి వద్ద డబ్బులు అప్పుగా తీసుకోవడంతో పాటు మరి కొంతమంది మహిళలను కూడా గ్రూపులుగా చేర్చి అప్పు ఇప్పించింది. రూ.42 వేలు అప్పు ఇస్తే ప్రతి నెల మొదటి బుధవారం రూ.3,370 చొప్పున 20 నెలల పాటు చెల్లించాలనే షరతుతో ఫైనాన్స్ సంస్థలు అప్పులు ఇచ్చాయి. కొద్ది నెలలుగా అనారోగ్యం, వ్యాపారం సరిగా నడవకపోవడంతో డబ్బులు చెల్లించేందుకు బయట అప్పులు చేసింది. గత బుధవారం డబ్బులు కట్టకపోవడంతో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు ఆమె ఇంటి వద్దకు వచ్చి బెదిరించినట్లు సమాచారం. తాజాగా మంగళవారం మరోసారి వచ్చి భయబ్రాంతులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మస్తానమ్మ వారి ముందే ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై నున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గృహ సారథిగా సేవలు..మస్తానమ్మ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. 60వ డివిజన్లో వైఎస్సార్ సీపీ గృహ సారథిగా మస్తానమ్మ సేవలందించారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో వైఎస్సార్సీపీ నాయకులు, మహిళలు ఆమె ఇంటి వద్దకు చేరుకుని సంతాపం తెలిపారు. -
జ్యువెలరీ షాపులో బంగారు నగలు పక్కదారి
మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ జ్యువెలరీ దుకాణంలో భారీస్థాయిలో బంగారు ఆభరణాలు పక్కదారి పట్టాయి. దుకాణ నిర్వాహకులకు ఏమాత్రం తెలియకుండా అక్కడ పని చేసే కొందరు సిబ్బంది గ్రూప్‌గా ఏర్పడి విలువైన బంగారు ఆభరణాలు తీసుకొని రుణాలిచ్చే ఫైనాన్స్ కేంద్రంలో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.80లక్షల వరకు ఉంటుందని సమాచారం. తాకట్టు పెట్టిన తర్వాత వచ్చిన సొమ్మును సిబ్బంది ఒక్కొక్కరు రూ.ఐదు నుంచి రూ.ఏడు లక్షల వరకు పంచుకున్నట్లు తెలుస్తోంది. దుకాణంలో రోజుకు రోజుకు తగ్గుతున్న ఆభరణాలను కొంత ఆలస్యంగా గుర్తించిన జ్యువెలరీ దుకాణ యాజమాని ఏం జరిగిందని ఆరా తీస్తే అక్కడ పనిచేసే కొందరు దుకాణంలోంచి ఆభరణాలు తీసుకుపోయి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్న వ్యవహారం బయటపడింది. దీంతో షోరూం యాజమాని హైదరాబాద్‌లోని పోలీస్ ఉన్నతాధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయం సమాచారం. మూడు రోజుల కిందట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్‌గౌడును సాక్షి వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని కొన్ని ఆభరణాలు రీకవరీ కావాల్సి ఉందని, రెండురోజుల్లో ఈ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
పరిహారం..పరిహాసం..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటేనే ఆ సాయానికి సార్ధకత ఉంటుంది. బాధితులకు మేలు జరుగుతుంది. కాని ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పంటనష్టం పరిహారం గురించి నోరు మెదపడం లేదు. అరకొరగా నిధులు మంజూరు చేస్తూ చేతులు దులుపుకుంటున్నాయి. 2012లో నీలం తుపాను నష్ట పరిహారం ఇప్పటికీ పూర్తిగా రైతులకు అందలేదంటే రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధేపాటిదో అర్థమవుతోంది. ఇక గతేడాది వర్షాలకు జరిగిన పంట నష్టానికి ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ విషయాన్ని కొత్త ప్రభుత్వం కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంతలో హుదూద్ ఈ ఏడాది ఖరీఫ్ పంటను తుడిచిపెట్టేసింది. ఇంకా పంట నష్టం అంచనాలు తయారు పనిలోనే అధికారులు నిమగ్నమై ఉన్నారు. విశాఖ రూరల్: పంటనష్టం పరిహారం చెల్లింపు పరిహాసమవుతోంది. పరిహారం వెంటనే అందించేందుకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం పెట్టుబడి రాయితీ భారాన్ని తగ్గించుకోవడానికి రోజుకో ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఈక్రమంలో ఇప్పట్లో అన్నదాతలకు హుదూద్ ఇన్పుట్ సబ్సిడీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే రబీ ప్రారంభమైంది. రుణ మాఫీ పేరుతో బూటకపు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వరకు రుణాలను రద్దు చేయలేదు. ఫలితంగా ఖరీఫ్‌లో రైతులకు కొత్త రుణాలు లేకుండాపోయాయి. ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మదుపులు పెట్టిన అన్నదాతలను హుదూద్ కోలుకోలేకుం డా చేసింది. ఇప్పటికైనా రైతాంగానికి పరి హారాన్ని వెంటనే అందించే ఏర్పాట్లు చేస్తే కనీ సం రబీసాగుకైనా సంసిద్ధులవ్వడానికి అవకాశముంటుంది. లేకపోతే జిల్లాలో రబీ సాగు లక్ష్యం 50 శాతం కూడా చేరుకొనే అవకాశముండదని అధికారులే భావిస్తున్నారు. రూ.12.25 కోట్లు పరిహారం వచ్చేనా! గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అధిక వర్షాలు పంటలను ముంచెత్తాయి. వరుసగా అల్పపీడనం, హెలెన్ కారణంగా జిల్లాలో 13,341 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. 52,426 మంది రైతులకు నష్టం వాటిల్లింది. వాస్తవానికి ఇంతకు రెట్టింపు నష్టం జరిగినప్పటికీ.. ప్రభుత్వ ఆంక్షలు కారణంగా కేవలం రూ.12.25 కోట్లు పెట్టుబడి రాయితీకే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే ఆ వరదలకు 1191.29 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా 9212 మంది రైతులకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. వీరికి రూ.1.87 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదించారు. ఈ పరిహారంపై ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం దృష్టి సారించలేదు. ఇదిలా ఉంటే 2012 నీలం తుపాను పరిహారం ఇప్పటికీ పూర్తిగా అందకపోవడం విశేషం. అప్పట్లో రూ.30.41 కోట్లు ఇన్పుట్ సబ్సిడీకి ఇంకా 20,364 మంది రైతులకు రూ.1.23 కోట్లు పరిహారం అందించాల్సి ఉంది. ఉద్యాన పంటలకు సంబంధించి 7920 మంది రైతులకు రూ.3.45 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు ఈ పరిహారం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఖజానా ఫ్రీజ్ చేయడంతో నిధులు విడుదల కాలేదు. రైతులు ఎదురుచూపులు ఏటా తుపాన్లు రైతులను నిలువునా ముంచుతున్నాయి. కాని పరిహారం మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. రెండేళ్ల క్రితం రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కోసం రైతులు ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెట్టుబడి రాయితీని వెంటనే మంజూరు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ పరిహారం విషయంపై కనీసం నోరెత్తడం లేదు. -
టీవీ వస్తుందని...
తపాలా అవి నేను ప్రైవేట్ ఫైనాన్స్‌లో పనిచేస్తున్న రోజులు. ఈ సంఘటన జరిగి దాదాపు పదేళ్లు అయినా, ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా నా అమాయకత్వానికి నవ్వుకుంటాం. ఓరోజు ఫైనాన్స్‌లో దినపత్రికలు తిరగేస్తుంటే ఒక పజిల్ కనిపించింది. దాన్ని పూర్తిచేసి పంపిస్తే, కారు, టీవీ లాంటి బహుమతులు ఉన్నాయని చూసి ఆశపడి, పూర్తిచేసి ఇచ్చిన అడ్రెస్‌కు పోస్ట్ చేశాను. తర్వాత కొన్ని రోజులు దాని గురించి మరిచిపోయాను. ఓ పదిహేను రోజుల తర్వాత, నాకు తపాలా వచ్చింది. నా పజిల్ కరెక్టు అనీ, అందుకు నాకు టీవీ బహుమతిగా వచ్చిందనీ, అందుకు నాలుగొందల రూపాయలు కడితే వివరాలు పంపుతామనీ దాని సారాంశం. నేను మొదట వద్దనుకున్నాను. నాతో పనిచేసే మిగతావారు నీకు వద్దంటే చెప్పు, మేం తీసుకుంటామనే సరికి, నాకు ఆశపుట్టి ఎలాగోలా డబ్బు సర్ది పంపించాను. తర్వాత కొన్ని రోజులకు నాకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ఆరొందల రూపాయలు కడితే దాన్ని ఇస్తామన్నారు. ఆనందంతో అవి కూడా కట్టాను. పార్శిల్ ఓపెన్ చేస్తే, టికెట్ బుక్! ఒక్కో టికెట్ రూ.400. నేను అమ్మి వాటిని పంపిస్తే, అప్పుడిస్తారట టీవీ. అంతే, నాకు నాలుక తడారిపోయింది. ఇంట్లో ఒకటే తిట్లు. వీధిలో వారు నవ్వులు. కొన్ని రోజులు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాను. ఎందుకంటే అప్పుడు నా జీతం నాలుగొందలు మాత్రమే. కాబట్టి అలాంటి ప్రకటనలు చూసి ఇంకెప్పుడూ మోసపోకూడదనుకున్నాను. - టి.రెడ్డివెంకటరమణ రాయలపేట, చిత్తూరు -
స్వ‘గృహ’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ సంస్థలు నిర్మించే ఇళ్లకు తీసిపోకుండా అన్ని వసతులతో తక్కువ ధరకే స్వగృహ ఇళ్లను అందిస్తామని ఊదరగొట్టిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ క్రమంగా ఒక్కో ‘ప్రత్యేకత’కు నీళ్లొదులుతోంది. పైపు ద్వారా వంటగ్యాస్ సరఫరా, సోలార్ వాటర్ హీటింగ్, మెరుగైన చలవరాళ్లతో ఫ్లోరింగ్, బ్రాండెడ్ కంపెనీల ఫిటింగ్ల బిగింపు... తదితర ప్రత్యేకతలకు ఇప్పటికే తిలోదకాలిచ్చారు. ఇక భూగర్భ కేబుల్ వ్యవస్థకూ మంగళం పాడాలని తాజాగా నిర్ణయించారు. నిధులు లేక పనులెలా కొనసాగించాలో తెలియుక అధికారులు అయోమయంలో ఉండగా, ప్రభుత్వ పరంగా సాయం చేసేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపకపోవటంతో ఈ పరిస్థితి ఎదురైంది. రూ.500 కోట్లు కావాలంటూ దాదాపు ఏడాదిన్నరగా అధికారులు కోరుతుండగా, ప్రభుత్వం ఇటీవల రూ.105 కోట్లు వూత్రమే అందజేసింది. ఈ నిధులతో కొన్ని ప్రాజెక్టులను ఎలాగో ముగించి, దరఖాస్తుదారులకు అందించి, ఇచ్చిన నిధులను వడ్డీ సహా తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. ఆ చాలీచాలని నిధులతో పనులు చేయటం సాధ్యం కాకపోవటంతో... ప్రజలను ఆకట్టుకునేందుకు మొదట్లో చేసిన హంగులను తొలగించి ఆర్థికభారం నుంచి బయటపడాలన్నది అధికారుల ఆలోచన. ప్రతి ఇంటికి సోలార్ వాటర్ హీటర్, పైప్‌లైన్‌లో వంటగ్యాస్ వంటి వసతులు ఉండబోవని ఇప్పటికే తేల్చిచెప్పారు. ఫ్లోరింగ్‌కు, స్నానాల గదులలో, ఇతర చోట్ల వాడే ఫిటింగ్స్‌ను బ్రాండెడ్ కంపెనీలవి కాకుండా, మామూలు కేటగిరీవి వాడాలని నిర్ణయించారు. విద్యుత్తు స్తంభాలు, వాటికి అడ్డదిడ్డంగా కరెంటు వైర్లు వేళ్లాడే పరిస్థితికి భిన్నంగా భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించినా ఇపుడు అదీ వద్దనుకున్నారు. ఇప్పటికి, ఒకటి రెండు ప్రాజెక్టుల్లో భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయుగా, అందులో ఒక్కో ప్రాజెక్టుకు రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు భారం పడటంతో, దీని బదులు మామూలుగా బయటకే కేబుళ్లు ఏర్పాటు చేస్తే కనీసం 40 శాతం వరకు ఖర్చు తగ్గుతుందని లెక్కలు తేల్చారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, నిర్వహణకు తగ్గ నిపుణులు అందుబాటులో లేరన్న సాకుతో ఇప్పుడు భూగర్భ కేబుళ్ల వ్యవస్థకు కూడా మంగళం పాడబోతున్నారు. -
ఫైనాన్స్ మేనేజర్ ఘరానా మోసం
ములుగు, న్యూస్‌లైన్ : ప్రైవేటు ఫైనాన్స్ చేతిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మోసపోయాడు. తాను మొత్తం డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన ద్విచక్రవాహనంపై సదరు కంపెనీ మేనేజర్ గుట్టుచప్పుడు కాకుండా లోన్ తీసుకోవడంతో అవాక్కయ్యాడు. కాగా, త న పేరిట లోన్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించిన ఉద్యోగిపై మేనేజర్ చిందులు తొక్కుతున్నాడు. నీ పేరిట తీసుకున్న బైక్ లోన్ డబ్బులు మేమే కడుతున్నాం కదా.. నీకేం బాధంటూ బెదిరిస్తున్నాడు. బాధితుడి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి. ములుగు మండల కేంద్రానికి చెందిన నలువాల నర్సయ్య స్థానిక ప్రభుత్వ గిరిజన హాస్టల్లో కుక్‌గా పనిచేస్తున్నాడు. అయితే తన కుమారుడు ఫ్యాషన్ ప్రో బైక్ కావాలని అడుగడం తో అతడు ములుగులో ఉన్న ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ను ఏడాదిన్న ర క్రితం సంప్రదించాడు. బైక్‌కు మొత్తం *62వేలు అవుతుంద ని, ముందుగా *20వేలు చెల్లిస్తే మిగతా డబ్బు *42వేలు లోన్ ద్వారా చెల్లిస్తామని చెప్పారు. దీంతో నర్సయ్య తొలుత *20 వేలు చెల్లించి ఫైనాన్స్ నిబంధనల మేరకు డాక్యుమెంట్లపై సం తకాలు చేశాడు. అయితే కొద్దిరోజుల తర్వాత మేనేజర్‌ను నర్స య్య కలిస్తే.. నీకు లోన్ మంజూరుకావడం లేదని, పూర్తిచేసిన డాక్యుమెంట్లు కూడా తిరిగి వెనక్కి వచ్చాయని చెప్పాడు. తాను ప్రభుత్వ ఉద్యోగినైనా లోన్ మంజూరు కాకపోవడమేమిటని మేనేజర్‌ను అడిగాడు. దీనిపై మేనేజర్ సమాధానం ఇస్తూ గతంలో ఓ వాహనదారుడికి నువ్వు జమానతు ఇచ్చినందున లోన్ రావడంలేదన్నాడు. అలాగే చెల్లించిన *20 వేలలో తమ కంపెనీ కమీషన్ *5 వేలు పో గా, మిగతా సొమ్ము తిరిగి ఇచ్చేస్తామని.. లేదంటే మిగతా మొత్తం డబ్బు *42వేలు చెల్లించి బైక్ కొనుగోలు చేసుకోవాలని సూచించాడు. దీంతో చేసేదేమి లేక నర్సయ్య తొ లుత చెల్లించిన *20వేలు పోగా మిగతా *42వేలు చెల్లించి ఫ్యాషన్‌ప్రో బైక్‌ను కొనుగోలు చేశాడు. అనంతరం మేనేజర్ బైక్ రిజిస్ట్రేషన్ కాగితాలను ఆరునెలల తర్వాత ఇచ్చాడు. ఇదిలా ఉండగా, నర్సయ్య పూర్తి డబ్బులు చెల్లించిన వాహనంపై మేనేజర్ గుట్టుచప్పుడు కాకుండా లోన్ తీసుకుని ప్రతీనెల కిస్తీలను చెల్లిస్తూ వస్తున్నాడు. అలాగే వాహనానికి సంబంధించిన ఎలాంటి లెటర్లు నర్సయ్యకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డాడు. దీంతో అతడికి తన వాహనంపై లోన్ ఉన్న విషయం తెలియలేదు. వెలుగులోకి వచ్చింది ఇలా..కాగా, బైక్ కొనుగోలు చేసి ఏడాదిన్నర కావడంతో నర్సయ్య కుమారుడు పాతబండిని అమ్మి పెట్టాలని ఇటీవ ల ఓ కన్సల్టెన్సీని సంప్రదించాడు. దీంతో కన్సల్టెన్సీ నిర్వాహకుడు బైక్ వివరాలను సేకరించాడు. మీరు ఓ ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకుని బండిని కొనుగోలు చేశారని, పూర్తి కిస్తీ లు చెల్లిస్తే బైక్‌ను అమ్మి పెడతానని చెప్పాడు. దీంతో అవాక్కయిన నర్సయ్య కుమారుడు ఇంటికి వెళ్లి తండ్రిని నిలదీశాడు. డబ్బులు మొత్తం కట్టిన తర్వాత లోన్ ఉండడమేమిటని వాదించాడు. దీంతో బిత్తరపోయిన నర్సయ్య ఇదెక్కడి గోల అంటూ.. ఫైనాన్స్ మేనేజర్‌ను లోన్ విషయమై నిలదీశాడు. దీనిపై మేనేజర్ మాట్లాడుతూ బైక్ కిస్తీలను తానే చెల్లిస్తున్నానని, మీకు ఎలాంటి బాధ ఉండదని సర్దిచెప్పాడు. తనకు లోన్ మంజూరుకాదని.. డాక్యుమెంట్లు తిరిగి వచ్చాయని.. చె ప్పి ఇప్పుడు వాహనంపై ఎలా లోన్ తీసుకున్నారని నర్సయ్య మేనేజర్‌ను ప్రశ్నించగా అతడిని బెదిరించడం గమనార్హం. కాగా, ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు నర్సయ్య తెలిపాడు. ఇదిలా ఉండగా, సదరు మేనేజర్ ఇదే కాకుండా మరికొంతమంది వాహనాలపై కూడా లోన్ తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, దీనిపై మేనేజర్ మాట్లాడుతూ నర్సయ్య ఫ్యాషన్‌ప్రో వాహనంపై ఎలాంటి లోన్ లేదని చెప్పుకొస్తున్నాడు