ప్రైవేట్ సంస్థల వేధింపులతో విజయవాడలో మహిళ ఆత్మహత్య
ఏజెంట్లు తరచూ ఇంటికొచ్చి బెదిరించడంతోమనస్తాపంతో వారి ముందే ఉరేసుకున్న బాధితురాలు
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి తీసుకున్న రుణం ఓ మహిళ పాలిట మృత్యు పాశమైంది. అధిక వడ్డీలు చెల్లించలేక, ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు భరించలేక తనువు చాలించింది. మంగళవారం విజయవాడలో ఈ విషాదం చోటు చేసుకుంది. విజయవాడ వాంబే కాలనీకి చెందిన అల్లంపల్లి మస్తానమ్మ అలియాస్ మాధవి (44) పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త లక్ష్మీనారాయణతో విభేదాలు తలెత్తడంతో పదేళ్ల క్రితం విడిపోయి వేరుగా ఉంటోంది.
ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తగారిళ్లకు పంపింది. వ్యాపారంలో నష్టం రావడం, పిల్లల వివాహాల కోసం కొంత అప్పులు చేసింది. హైదరాబాద్‌కు చెందిన క్రిస్ ఫైనాన్స్, స్పందన అనే సంస్థల ప్రతినిధులు రుణాలు ఇస్తామని చెప్పడంతో వారి వద్ద డబ్బులు అప్పుగా తీసుకోవడంతో పాటు మరి కొంతమంది మహిళలను కూడా గ్రూపులుగా చేర్చి అప్పు ఇప్పించింది. రూ.42 వేలు అప్పు ఇస్తే ప్రతి నెల మొదటి బుధవారం రూ.3,370 చొప్పున 20 నెలల పాటు చెల్లించాలనే షరతుతో ఫైనాన్స్ సంస్థలు అప్పులు ఇచ్చాయి.
కొద్ది నెలలుగా అనారోగ్యం, వ్యాపారం సరిగా నడవకపోవడంతో డబ్బులు చెల్లించేందుకు బయట అప్పులు చేసింది. గత బుధవారం డబ్బులు కట్టకపోవడంతో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు ఆమె ఇంటి వద్దకు వచ్చి బెదిరించినట్లు సమాచారం. తాజాగా మంగళవారం మరోసారి వచ్చి భయబ్రాంతులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మస్తానమ్మ వారి ముందే ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై నున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గృహ సారథిగా సేవలు..
మస్తానమ్మ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. 60వ డివిజన్‌లో వైఎస్సార్ సీపీ గృహ సారథిగా మస్తానమ్మ సేవలందించారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, మహిళలు ఆమె ఇంటి వద్దకు చేరుకుని సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment