పరిహారం..పరిహాసం..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటేనే ఆ సాయానికి సార్ధకత ఉంటుంది. బాధితులకు మేలు జరుగుతుంది. కాని ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పంటనష్టం పరిహారం గురించి నోరు మెదపడం లేదు. అరకొరగా నిధులు మంజూరు చేస్తూ చేతులు దులుపుకుంటున్నాయి.
2012లో నీలం తుపాను నష్ట పరిహారం ఇప్పటికీ పూర్తిగా రైతులకు అందలేదంటే రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధేపాటిదో అర్థమవుతోంది. ఇక గతేడాది వర్షాలకు జరిగిన పంట నష్టానికి ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ విషయాన్ని కొత్త ప్రభుత్వం కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంతలో హుదూద్ ఈ ఏడాది ఖరీఫ్ పంటను తుడిచిపెట్టేసింది. ఇంకా పంట నష్టం అంచనాలు తయారు పనిలోనే అధికారులు నిమగ్నమై ఉన్నారు.
విశాఖ రూరల్: పంటనష్టం పరిహారం చెల్లింపు పరిహాసమవుతోంది. పరిహారం వెంటనే అందించేందుకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం పెట్టుబడి రాయితీ భారాన్ని తగ్గించుకోవడానికి రోజుకో ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఈక్రమంలో ఇప్పట్లో అన్నదాతలకు హుదూద్ ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే రబీ ప్రారంభమైంది. రుణ మాఫీ పేరుతో బూటకపు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వరకు రుణాలను రద్దు చేయలేదు. ఫలితంగా ఖరీఫ్‌లో రైతులకు కొత్త రుణాలు లేకుండాపోయాయి.
ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మదుపులు పెట్టిన అన్నదాతలను హుదూద్ కోలుకోలేకుం డా చేసింది. ఇప్పటికైనా రైతాంగానికి పరి హారాన్ని వెంటనే అందించే ఏర్పాట్లు చేస్తే కనీ సం రబీసాగుకైనా సంసిద్ధులవ్వడానికి అవకాశముంటుంది. లేకపోతే జిల్లాలో రబీ సాగు లక్ష్యం 50 శాతం కూడా చేరుకొనే అవకాశముండదని
అధికారులే భావిస్తున్నారు.
రూ.12.25 కోట్లు పరిహారం వచ్చేనా!
గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అధిక వర్షాలు పంటలను ముంచెత్తాయి. వరుసగా అల్పపీడనం, హెలెన్ కారణంగా జిల్లాలో 13,341 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. 52,426 మంది రైతులకు నష్టం వాటిల్లింది. వాస్తవానికి ఇంతకు రెట్టింపు నష్టం జరిగినప్పటికీ.. ప్రభుత్వ ఆంక్షలు కారణంగా కేవలం రూ.12.25 కోట్లు పెట్టుబడి రాయితీకే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే ఆ వరదలకు 1191.29 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా 9212 మంది రైతులకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
వీరికి రూ.1.87 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదించారు. ఈ పరిహారంపై ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం దృష్టి సారించలేదు. ఇదిలా ఉంటే 2012 నీలం తుపాను పరిహారం ఇప్పటికీ పూర్తిగా అందకపోవడం విశేషం. అప్పట్లో రూ.30.41 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీకి ఇంకా 20,364 మంది రైతులకు రూ.1.23 కోట్లు పరిహారం అందించాల్సి ఉంది. ఉద్యాన పంటలకు సంబంధించి 7920 మంది రైతులకు రూ.3.45 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు ఈ పరిహారం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఖజానా ఫ్రీజ్ చేయడంతో నిధులు విడుదల కాలేదు.
రైతులు ఎదురుచూపులు
ఏటా తుపాన్లు రైతులను నిలువునా ముంచుతున్నాయి. కాని పరిహారం మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. రెండేళ్ల క్రితం రావాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రైతులు ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెట్టుబడి రాయితీని వెంటనే మంజూరు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ పరిహారం విషయంపై కనీసం నోరెత్తడం లేదు.