ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలోని పంట పొలాల్లోకి చేరిన వర్షపు నీరు
►అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో దెబ్బతిన్న పంటలు- 43,601ఎకరాలు
►వ్యవసాయ శాఖ ప్రకారం పంట నష్టం అంచనా.. 2,00,000ఎకరాలు
►రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 90.98 లక్షల (78%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి 49.63 లక్షల (104.3%) ఎకరాల్లో సాగు చేయగా, 20.68 లక్షల (60.8%) ఎకరాల్లో వరి నాట్లు వేశారు.
►అనధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇందులో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: గత వారం కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద తగ్గినా.. రైతుల కన్నీటి ప్రవాహం మాత్రం కొనసాగుతోంది. ఉప్పొంగిన వరదలతో పంటలు దెబ్బతిని పెట్టుబడులు కోల్పోయిన రైతులు, జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ.. పొలాల్లో ఇసుక మేటలు చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వ్యవసాయ శాఖ వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం 2 లక్షల ఎకరాల్లో పంట లకు నష్టం జరిగింది. కానీ వివరాలను అధికారులు బయటకు వెల్లడించడం లేదు. ఇంకా నష్టాన్ని అం చనా వేస్తున్నామని చెబుతున్నారు. నష్టం తాము ప్రాథమికంగా వేసిన దానికంటే పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
అత్యధికంగా పత్తికి నష్టం జరిగినట్లు చెబుతుండగా.. తర్వాతి స్థానంలో వరి, సోయాబీన్, మొక్కజొన్న తదితర పంటలు ఉన్నాయి. చాలాచోట్ల వరినాట్లు కొట్టుకుపోయాయి. విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులు కలుపుకొని ఎకరానికి సగటున రూ.30 వేల చొప్పున పెట్టుబడి అవుతుందని అంచనా. కాగా.. అనధికారిక లెక్కల ప్రకారం నాలుగు లక్షల ఎకరాల్లో పంటల మునకకు గాను రైతులు వందల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం పాడై పోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవా లని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
90.98 లక్షల ఎకరాల్లో సాగు
రాష్ట్రంలో ఇప్పటివరకు 90.98 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వానలు ముందే కురవడంతో జూన్ మొదటి వారంలోనే రైతులు పత్తి వంటి పంటలు వేశారు. విత్తనాలు వేసి నెల రోజులు కూడా గడవకముందే వర్షాలు బాగా పడటంతో పత్తి, మొక్కజొన్న, పెసర, కంది పంటలు మొలక దశలోనే దెబ్బతిన్నాయి. దీంతో కొన్నిచోట్ల పత్తి విత్తనాలు మళ్లీ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్నందున ఆ పంట సాగును ప్రభుత్వం ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. దీంతో పత్తి సాగు గణనీయంగా పెరగ్గా.. వర్షాలకు అత్యధికంగా పత్తి పంటే దెబ్బతింది. తర్వాత వరి, మొక్కజొన్న, సోయాబీన్‌లకు ఎక్కువగా నష్టం వాటిల్లింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో పత్తి చేనులో నిలిచిన వర్షపు నీరు
మంచిర్యాల జిల్లాలో 6,864 ఎకరాల్లో..
మంచిర్యాల జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాణహిత, గోదావరి తీర ప్రాంత రైతుల పత్తి, వరి పంటలు నీట మునిగాయి. పంట నష్టంపై అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఎక్కువగా పత్తి పంట నీట మునిగింది. ఈ జిల్లాలో 6,864 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు. అందులో పత్తి 5 వేల ఎకరాలు, వరి 1400 ఎకరాలు, మిర్చి 284 ఎకరాలు ఉంది. మొత్తం 2,743 మంది రైతులు నష్టపోయారు. దాదాపు రూ. 3.24 కోట్లు నష్టం జరిగిందని అంచనా వేశారు.
►అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 43,601 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఒక్క పత్తి పంటే 40,795 ఎకరాల్లో దెబ్బతింది. 2,401 ఎకరాల్లో కందికి, 45 ఎకరాల్లో సోయాకు, 90 ఎకరాల్లో వరికి, 270 ఎకరాల్లో పెసరకు నష్టం వాటిల్లింది.
►ఆదిలాబాద్ జిల్లాలో 19 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అందులో పత్తి 11 వేల ఎకరాలు కాగా సోయా 4 వేల ఎకరాలు ఉంది. జిల్లాలో కంది, ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లాలో 8,400 ఎకరాలలో పంట నష్టం జరిగింది. వరద నీటితో వచ్చిన ఇసుక మేటలు వేయడం వల్ల పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి.
నిజామాబాద్‌లో దెబ్బతిన్న వరి, సోయా
నిజామాబాద్ జిల్లాలో వరి, సోయా, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. అధికారిక లెక్కల ప్రకారం 6,205 రైతులకు సంబంధించిన 12,597 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాగా మరో 6 వేల ఎకరాల్లో కూడా పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాల్లో ఉద్యానపంటలు నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
►కామారెడ్డి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 2,240 మంది రైతులకు సంబంధించి 18,392 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి మరో పదివేల ఎకరాల్లో కూడా పంటలు దెబ్బతిని ఉంటాయని అంచనా. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 11,635 ఎకరాల్లో సోయా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. 4 వేల ఎకరాల్లో పప్పుధాన్యాల పంటలు దెబ్బతిన్నాయి. 1,847 ఎకరాల్లో వరి, 837 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిందని ప్రభుత్వానికి నివేదిక పంపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 1,605 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అందులో వరి 596.3 ఎకరాలు, పత్తి 929 ఎకరాలు, మొక్కజొన్న 80 ఎకరాల్లో దెబ్బతిన్నాయి.
బ్యాక్ వాటర్‌కు పంటలు బలి
పెద్దపల్లి జిల్లాలో గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలతో గోదావరి, మానేరు ఉగ్రరూపం దాల్చడంతో, సరస్వతి, పార్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్‌తో మంథిని, ముత్తరాం, అంతర్గం, రామగిరి, రామగుండం మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. జిల్లాలో మొత్తం 3,374 ఎకరాల్లో 1,620 మంది రైతులకు చెందిన వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి నాట్లు నీట మునగడంతో పాటు చాలాచోట్ల మొక్కలు కొట్టుకుపోయాయి.
►ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని 5 జిల్లాల్లో అధిక వర్షాలకు తెగిన కుంటలు, చెరువులతో మొత్తం 2,512 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 1,964 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాల్లో వరి, 428 ఎకరాల్లో కందికి నష్టం వాటిల్లింది. నారాయణపేట జిల్లాలో అధికంగా 1,300 ఎకరాల్లో పత్తి, 428 ఎకరాల్లో కంది రైతులు నష్టపోయారు. యాదాద్రి జిల్లాలో 1,205 ఎకరాల్లో పంట దెబ్బతింది. 600 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది.
మూడెకరాలు నీళ్ల పాలు
మానేరు పక్కన నాకున్న నాలుగు ఎకరాల్లో వరి పంట సాగు చేశా. ఒక ఎకరానికి రూ.15 వేల చొప్పున నాలుగు ఎకరాలకు రూ. 60 వేలు కూలీలకే ఖర్చయ్యి ౌది. మానేరులో నీటి ప్రవాహం ఎక్కువై నా పంట పొలం మీద నుండి నీరు పోవడంతో మూడెకరాల పంటకు నష్టం జరిగింది. అంతేకాకుండా పొలంలో ఇసుక మేటలు పేరుకుపోయాయి. ఇసుక మేటలు తీసి భూమి చదును చేయడానికి సుమారు రూ.20 వేలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి.
-నిమ్మతి రమేష్, అడవి శ్రీరాంపూర్ గ్రామం, ముత్తరాం, పెద్దపల్లి జిల్లా
పొలం మొత్తం కొట్టుకుపోయింది
నాలుగు ఎకరాల్లో వరి నాట్లు వేస్తే వర్షాలతో మొత్తం పొలం కొట్టుకుపోయింది. దాదాపు రూ.75 వేల నష్టం వాటిల్లింది. మళ్లీ వరి నాట్లు వేయాలంటే నారు కొనుగోలు చేయాల్సి వస్తుంది. మళ్లీ పెట్టుబడి పెట్టాలంటే అప్పు చేయాలి. వరితో పాటు సోయా పంటను కూడా నష్టపోయాను. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– కొప్పుల రాజశేఖర్, రైతు, మోర్తాడ్
ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి
వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాల్సిందే. గతంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇన్‌పుట్ సబ్సిడీని నిలిపివేశారు. రైతులకు రైతుబంధు కంటే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడమే మంచిది. నష్టపోయిన పంటలపై సర్వే నిర్వహించి రైతులకు తగిన పరిహారం ఇవ్వాలి.
– సాయిని సమ్మారావు... పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామం. మానేరు పక్కన ఉన్న 7 ఎకరాల 10 గుంటల భూమిలో వరి వేశాడు. ఒక ఎకరానికి రూ.15 వేల చొప్పున 1.15 లక్షల దాకా కూలీలకు ఖర్చు అయ్యింది. ఇటీవల లోయర్ మానేరు గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహం పంట పొలం మీద నుండి పారడంతో పంటకు నష్టం వాటిల్లింది. అంతేకాకుండా పొలంలో ఇసుక మేటలు వేసింది. ఇసుక మేటలు తీసి భూమి చదును చేయడానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం కూడా పొలం మీద నుండి వరద పోయి పంట నష్టం జరిగింది. అప్పుడు అధికారులు వచ్చి చూశారు కానీ ఎలాంటి నష్టపరిహారం అందలేదు. తాజా పంట నష్టంతో అతను రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment