పత్తి, వరి, సోయా సహా ఇతర పంటలపై ప్రభావం
పలుచోట్ల కొట్టుకుపోయిన వరి... పత్తికి తీవ్రమైన నష్టం
సోయా, కంది పంటలపైనా ప్రభావం
సాక్షి, హైదరాబాద్: ఎడతెరపి లేని వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పత్తి పూత దశలో ఉండటం... వరి నాట్లు పూర్తయిన దశలో ఉన్న నేపథ్యంలో వరదల ప్రభావం ఆయా పంటలపై తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. పంట మునిగిన ప్రాంతాలపై వ్యవ సాయశాఖ ఇంకా దృష్టి సారించలేదు. ఆదివారం కావడంతో అధికారులంతా సెలవుల్లో ఉండిపోయారు. దీంతో రైతులకు గ్రామాల్లో సలహాలు సూచనలు ఇచ్చే దిక్కే లేకుండా పోయింది. మరోవైపు ఏం చేయాలన్న దానిపై రాష్ట్రస్థాయిలో శాస్త్రవేత్తల నుంచి సలహాలు, సూచనలు ఇప్పించడంలో కూడా వ్యవసాయశాఖ విఫలమైంది.
8 లక్షల ఎకరాల్లో పత్తికి ఎఫెక్ట్...
రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 1.09 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా వరి 47.81 లక్షల ఎకరాల్లో, పత్తి 42.66 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. మొక్కజొన్న 4.88 లక్షల ఎకరాలు, కంది 4.60 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.84 లక్షలు ఎకరాల్లో సాగైంది. వర్షాల దెబ్బకు అధికంగా మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, నల్లగొండ, నాగర్‌కర్నూలు, మహబూబ్ నగర్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం వంటి జిల్లాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నీట మునిగాయి. పత్తి 8 లక్షల ఎకరాల్లో నీట మునిగినట్లు అంచనా వేస్తుండగా, వరి 5 లక్షల ఎకరాల్లో నీట మునిగింది. నాట్ల దశలోనే వరి ఉండటంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లనుంది. మిగిలిన పంటలు మరో 2లక్షల ఎకరాల్లో నీట మునిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయికి వెళ్తే ఈ లెక్కలు మరింతగా ఉండొచ్చని అంటున్నారు.
అందుబాటులోకి రాని పంటల బీమా...
ప్రభుత్వం ఈ సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలులోకి తీసుకొస్తామని హామీయిచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. పంటల బీమా అమలులోకి వస్తే రైతులకు నష్టపరిహారం అందేది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో అది ఇప్పటికీ పట్టాలకెక్కలేదు. మార్గదర్శకాలు ఖరారు చేయడంలోనూ నిర్లిప్తత కొనసాగుతోంది. ఎప్పటినుంచో బీమాపై చర్చలు జరుగుతున్నా కొలిక్కి రావడంలేదు. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment