♦ ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులకు రెయిన్‌గన్‌లు ఇస్తారట!
♦ 13,933 మంది రైతుల నోట్లో మట్టికొట్టనున్న సర్కారు
♦ రూ.18.22కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకి ఎసరు
కడప అగ్రికల్చర్: ఘనమైన హామీలిచ్చే పాలక ప్రభుత్వం, మంత్రులు ఆపదలో ఉన్న రైతులను నిలువునా దోపిడీ చేయడానికి సిద్ధమైంది. పంటలు నష్టపోయి పరిహారం కోసం ఏళ్ల తరబడి రైతన్న నిరీక్షిస్తున్నా పైసా కూడా పరిహారం అందిచక పోగా ఆ నిధులను ఇతర ప్రచారాలకు, స్కీములకు మళ్లించడానికి సిద్ధమవుతోంది. అదేమంటే వర్షాభావ పరిస్థితుల్లో పంటకు నీటి తడులు అందించే రెయిన్‌గన్‌ల కొనుగోలుకు ఇన్‌పుట్ సబ్సిడీ పరిహార నిధులు వెచ్చించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నేడో రేపో ప్రభుత్వం జీవో జారీ చేయనున్నట్లు అధికారులు అంటున్నారు. అంతకు ముందుగానే అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రైతులకు చెందాల్సిన పరిహారాన్ని అందించకుండా ఇలా ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాలతో కమీషన్ల కోసం కక్కుర్తిపడి రైతుల సొమ్ములను ఇలా వాడుకుంటారా? అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
జిల్లాలో 50 వేల హెక్టార్లకు రెయిన్‌గన్లు....
ఈ ఖరీఫ్ సీజన్‌లో ఉద్యాన పంటలకు రాబోయే విపత్తులను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా పంటలను కాపాడతామని, ఇందుకుగాను రెయిన్‌గన్లు ఏర్పాటు చేసి ఆదుకుంటామని ప్రభుత్వం ఇటీవల విజయవాడలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ప్రకటించింది. అదేమంటే ఇప్పటి వరకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ పరిహారానికి ఈ రెయిన్‌గన్‌ను ముడిపెట్టారు. జిల్లాలో 50 వేల హెక్టార్లకు ఈ రెయిన్‌గన్‌లను వినియోగించాలని, అందుకు తగ్గ ప్రణాళికలను తయారు చేయాలని ఉద్యానశాఖను ఆదేశించింది.జిల్లా ఉద్యాన అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపారు.
ప్రభుత్వం ఎసరు పెట్టింది ఈ పరిహారానికే....
జిల్లాలో 2010లో ఫిబ్రవరి నుంచి 2015 నవంబరు వరకు ప్రకృతి విపత్తులతో 70,566.361 హెక్టార్లలో ఉద్యాన పంటలు తోటలు దెబ్బతినగా 13933 మంది రైతులు రూ. 18.22 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని ఉద్యానశాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇంత వరకు పైసా కూడా ప్రభుత్వం విదిల్చకుండా ఈ ఇన్‌పుట్ సబ్సిడీనే ప్రభుత్వం ఇలా వినియోగించడానికి సిద్ధమవుతుండడంతో రైతులు మండిపడుతున్నారు.