పంట నష్టం అంచనాలు పక్కాగా ఉండాలి
Published Sun, Oct 27 2013 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం అంచనాలు పక్కాగా ఉండాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్ వ్యవసాయాధికారులకు సూచించారు. జిల్లాలో భారీ వర్షాలు, పంట నష్టం, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో ఆయన సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా వర్తింపును పారదర్శకంగా అమలు చేయకపోతే ఉన్నతస్థాయి విచారణకు వెనుకాడబోమని హెచ్చరించారు. గతేడాది నీలం తుపాను బాధిత రైతుల్లో 6 వేల మందికి పైగా గుర్తింపు పూర్తికాలేదని వ్యవసాయశాఖ జేడీ వీడీవీ కృపాదాస్ చెప్పగా మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నీలం’ నష్టం అంచనాల్లో అధికారులు తప్పులు చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీలో చర్యలు తీసుకోవాలని ఎల్‌డీఎం లక్ష్మీనారాయణను కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ రికార్డులు, అడంగళ్లు పక్కాగా ఉండేలా ఆర్డీవో, తహసిల్దార్ల పర్యవేక్షించేలా చూడాలని జేసీకి మంత్రి సూచించారు.
కౌలు రుణాల మంజూరుపై అసంతృప్తి
వ్యవసాయ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించిన తీరును మంత్రి సమీక్షించారు. కౌలు రైతులు 1.22 లక్షల మందికి రుణార్హత కార్డులు జారీచేయగా 52 వేల 98 మందికి మాత్రమే రూ. 132.45 కోట్లు రుణాలు మంజూరు చేయడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకు లింకేజీ కింద 25 వేల స్వయం సహాయక సంఘాలకు రూ. 1,000 కోట్ల రుణాలందించాలని డీఆర్‌డీఏ పీడీ వై.రామకృష్ణకు సూచించారు.
మంత్రి మండిపాటు
వర్షాలతో మత్స్యకారులు, చేనేత కార్మికులకు జరిగిన నష్టం, వారిని ఆదుకున్న విషయాలపై సమగ్ర సమాచారం లేకపోవడంతో మత్స్యశాఖ డీడీ వీవీ కృష్ణమూర్తి, చే నేత, జౌళి శాఖ ఏడీలపై మంత్రి వసంత్ మండిపడ్డారు.‘నాలుగు గణాంకాలు చెప్పి వెళ్లిపోదామనుకున్నారా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి నివేదికను సాయంత్రంలోగా కలెక్టర్‌కు ఇవ్వాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా రాబోయే 48 గంటలు కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వసంత్ సూచించారు.
పారిశుధ్యం, ఆరోగ్యంపై దృష్టి
వర్షాలతో తాగునీటి వనరులు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు క్లోరినేషన్ పక్కాగా జరిగేలా ఆర్‌డబ్ల్యూ ఎస్ అధికారులు, గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదలకు పంచాయతీ సిబ్బంది కృషిచేయాలని మంత్రి వసంత్‌కుమార్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో టి.శకుంతలను ఆదేశించారు.
48 శాతం అధిక వర్షపాతం
భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. జిల్లాలో అక్టోబర్‌లో 48 శాతం అధికంగా వర్షపాతం నమోదైందన్నారు.
ధాన్యం కొనుగోలుకు చర్యలు
ఐకేపీ కేంద్రాల ద్వారా జిల్లాలో 2 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి వసంత్ ఆదేశించారు. 100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ ముద్రించిన కరపత్రాలను మంత్రి, కలెక్టర్ ఆవిష్కరించారు. డీఆర్వో కె.ప్రభాకర్‌రావు, సోషల్ వెల్ఫేర్ జేడీ మల్లికార్జునరావు, హౌ సింగ్ పీడీ జి.సత్యనారాయణ, డీపీవో , జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్ పాల్గొన్నారు.
జిల్లాకు వరద భయం లేదు
జిల్లాకు వరదభయం లేదని మంత్రి వట్టి వసంతకుమార్ అన్నారు. ఏలూరు తూర్పులాకుల వద్ద తమ్మిలేరు వరద పరిస్థితిని ఆయన పరి శీలించారు. ఏలూరు నగరంలోకి వరద నీరు రాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. కలెక్టర్ ఆయన వెంట ఉన్నారు.
Advertisement
Advertisement