Vatti Vasant Kumar
-
మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కన్నుమూత
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున వైజాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వసంత్‌కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళ గ్రామం. కాగా అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకురానున్నారు. ఆది నుంచి వసంత్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్లోనూ అదే శాఖా మంత్రిగా పని చేశారు. ఇక కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్లో పర్యాటక శాఖ మంత్రి విధులు నిర్వర్తించారు. 2018 లో టీడీపీ-కాంగ్రెస్ కలయిక తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న వసంత్‌కుమార్ విశాఖలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. -
‘చంద్రబాబు తీరుతో గోదావరి డెల్టాకు నష్టం’
సాక్షి, విజయవాడ : పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ సర్కార్ గొప్పలు చెప్పుకుంటోందని, కానీ వాస్తవానికి అక్కడ ముందుకు జరిగింది ఏం లేదంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వట్టి వసంతకుమార్ మండిపడ్డారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై టీడీపీ సర్కార్ చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో గురువారం వట్టి వసంతకుమార్ మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు తీరుతో గోదావరి డెల్టా ప్రాంత ప్రజలు నష్టపోతున్నారని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుతో గోదావరి ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సర్కార్ ఇష్టానుసారం గోదావరి నీటిని తరలిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 51 ద్వారా 6,020 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ 73 టీఎంసీల నీటిని పెన్నానదికి తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ చెబుతోందన్నారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్ ప్రకారం గోదావరి నీటిని తరలించకూడదని పేర్కొన్నారు. నిబంధనలు తుంగలో తొక్కి చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందంటూ మాజీ మంత్రి వట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాజకీయాలకు వట్టి వసంత్ గుడ్‌బై
మాజీమంత్రి వట్టి వసంతకుమార్ క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇక మీదట తాను రాజకీయాల్లో పాల్గొనబోనని ఆయన స్పష్టం చేశారు. 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన గన్ని లక్ష్మీకాంతంపై 6459 ఓట్ల మెజారిటీతో నెగ్గిన వసంత కుమార్.. అప్పుడు చెప్పినట్లు గానే తాను ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పటికైనా త్వరితగతిన పూర్తి చేయాలని వట్టి వసంత్ డిమాండ్ చేశారు. వట్టి వెంకటరంగ పార్థసారథి కుమారుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వసంతకుమార్, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బాగా ఎదిగారు. ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తీరుపట్ల కలత చెంది.. పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఉంగుటూరులో ఆయన ప్రకటించారు. -
చేనేత కళాకారులకు ఇళ్లు, బీమా
=కేంద్ర మంత్రి కావూరి =శిల్పారామంలో ‘హస్తకళామేళా’ ప్రారంభం =31 వరకు కొనసాగనున్న మేళా మాదాపూర్, న్యూస్‌లైన్: చేనేత కళాకారులకు జీవిత బీమా, గృహ వసతులను కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర టెక్స్టైల్స్ శాఖా మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. శిల్పారామంలో ఈ అఖిల భారత హస్తకళా మేళా ఆదివారం అట్టహాసంగా ఆరంభమైంది. ఈ మేళాను రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంతకుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ చేనేత కళాకారులు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. యంత్రాలు రావడంతో వారు తయారుచేసిన అనువైన వస్తువులు మరుగును పడుతున్నాయని, అలాంటి వారికి ఇదో మంచి అవకాశమని చెప్పారు. పదిహేను రోజుల పాటు కొనసాగనున్న మేళాలో రూ.12కోట్ల వ్యాపారం జరగనున్నట్లు అంచనా అని మంత్రి కావూరి తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 600 మంది కళాకారులు ఈ క్రాఫ్ట్ మేళాలో పాల్గొంటున్నారు. మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్ళను మంత్రులు సందర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖాన్, రాష్ట్ర పర్యాటక భవన్ ప్రత్యేక అధికారి కిషన్‌రావు, శిల్పారామం ప్రత్యేకాధికారి జీఎన్‌రావు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు... హస్తకళామేళా ప్రారంభానికి ముందు శిల్పారామంలో నిర్వహించిన వివిధ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామానికి చెందిన దుర్గానాగేశ్వరసాయి డప్పు బృందం డప్పు ప్రదర్శన, విజయనగరం జిల్లాకు చెందిన ముత్య అప్పన్న బృందం నిర్వహించిన తప్పెట గుళ్ళ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. -
కక్కుర్తి మంత్రాంగం!
సాక్షి, హైదరాబాద్: మన అమాత్యులకు అన్ని రకాల అలవెన్సులు, అధికారిక కార్యక్రమాలకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. తిరగడానికి వాహనం, ఉండటానికి వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. మంత్రులకు పీఏలు, పీఎస్‌లు, భద్రత, రాచవుర్యాదలు ఇక సరేసరి! ఇన్ని ఇస్తున్నా సరే కొందరు మంత్రులు సొంత వ్యవహారాలకు, చిన్న చిన్న విషయూలకూ కక్కుర్తి పడుతున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు! మంత్రుల కోసం అధికారికంగా కేటాయించిన, ప్రత్యేకంగా కొనుగోలు చేసిన వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు అయ్యే వ్యయానికి ప్రభుత్వం మినహాయింపులు ఇవ్వడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ వుంత్రులు తావుు సొంతంగా కొన్న వాహనాల ఫ్యాన్సీ నంబర్లకూ ప్రత్యేక మినహాయింపులు కోరుకున్నారు. వారి బంధువులకూ మినహాయింపు అడుగుతున్నారు. నిజానికి వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు కావాలంటే వేలం పాటలో కొనుక్కోవాలి. ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికే నంబర్ దక్కాలనేది ప్రభుత్వ విధానం. ఇంత చిన్న విషయూనికీ మినహారుుంపులు పొందిన వుంత్రుల వ్యవహారం ఇదుగో మీరే చూడండి... గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు, దేవాదాయ శాఖ మంత్రి సీ రామచంద్రయ్య ఇటీవల సొంతంగా వాహనాలను కొనుగోలు చేశారు. వీరిద్దరూ ప్రత్యేక ఉత్తర్వులతో వేలం పాట నుంచి మినహాయింపు పొంది ఒకరేమో 1వ నంబర్, మరో మంత్రి 999వ నంబర్ తమ వాహనాలకు కేటాయింపజేసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తొలుత అధికారులు తిరస్కరించారు. అయితే, అమాత్యులు వింటే కదా.... ఫైళ్లను ఆర్థిక మంత్రి వద్దకు పంపి మరీ మినహాయింపులు పొందారు. సాధారణంగా ఈ నంబర్లకు చాలా మంది పోటీపడతారు. ఒకరికి ఒక ధర ఇంకొకరికి మరో ధర ఉండకూడదనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆదేశాలతో వాహనాల నంబర్లకు వేలం పాట విధానాన్ని అధికారులు అమల్లోకి తెచ్చారు. 1, 999 నంబర్లను వేలం పాట వేస్తే ఐదారు లక్షల రూపాయల వరకు ధర పలుకుతాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఇద్దరు వుంత్రులను చూసిన వురో వుంత్రి వట్టి వసంత్కువూర్ వురో అడుగు వుుందుకేసి తన సమీప బంధువుకూ ఈ మినహారుుంపు ఇవ్వాలంటూ కోరారు. ఫ్యాన్సీ నంబర్‌కు వేలం పాట నుంచి వట్టి మినహాయింపును కూడా కోరారు. దీన్ని అధికారులు వ్యతిరేకిస్తేనేం.. ఫైల్ సిద్ధమైంది. ఆర్థిక మంత్రి నుంచి మినహాయింపు పొందడమే మిగిలి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పలుకుబడి ఉన్న ప్రతీ నాయకుడు ఫ్యాన్సీ నంబర్లకు వేలం పాట నుంచి మినహాయింపులు పొందుతారని, ఇక ఫ్యాన్సీ నంబర్లు రాజకీయు నేతలకే దఖలు పడతాయుని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
విభజన అంశాన్నిపునరాలోచించుకోవాలి: వట్టి
-
విభజన అంశాన్నిపునరాలోచించుకోవాలి: వట్టి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్యూసీ తీసుకున్న నిర్ణయం అనాలోచితమని మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. విభజన వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. జీఒఎంతో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసిన అనంతరం వట్టి మీడియాతో మాట్లాడారు. విభజన అంశాన్ని కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్లే వచ్చే సమస్యలను పరిష్కరించడం కష్టమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీఓఎం పెద్దలకు కూడా ఇవే అంశాలను వివరించినట్లు తెలిపారు. విభజన అంశాన్ని కేంద్రం మరొకసారి పునరాలోచించుకోవాలని సీమాంధ్ర మంత్రులు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఒకవేళ విభజన జరిగితే అనంతరం అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అన్ని అంశాలను జీఓఎం సభ్యులకు వివరించామని, తమ ప్రాంతానికి తగిన న్యాయం జరుగుతుందని వట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. -
పంట నష్టం అంచనాలు పక్కాగా ఉండాలి
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం అంచనాలు పక్కాగా ఉండాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్ వ్యవసాయాధికారులకు సూచించారు. జిల్లాలో భారీ వర్షాలు, పంట నష్టం, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై కలెక్టరేట్లో శనివారం అధికారులతో ఆయన సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమా వర్తింపును పారదర్శకంగా అమలు చేయకపోతే ఉన్నతస్థాయి విచారణకు వెనుకాడబోమని హెచ్చరించారు. గతేడాది నీలం తుపాను బాధిత రైతుల్లో 6 వేల మందికి పైగా గుర్తింపు పూర్తికాలేదని వ్యవసాయశాఖ జేడీ వీడీవీ కృపాదాస్ చెప్పగా మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నీలం’ నష్టం అంచనాల్లో అధికారులు తప్పులు చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీలో చర్యలు తీసుకోవాలని ఎల్డీఎం లక్ష్మీనారాయణను కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ రికార్డులు, అడంగళ్లు పక్కాగా ఉండేలా ఆర్డీవో, తహసిల్దార్ల పర్యవేక్షించేలా చూడాలని జేసీకి మంత్రి సూచించారు. కౌలు రుణాల మంజూరుపై అసంతృప్తి వ్యవసాయ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించిన తీరును మంత్రి సమీక్షించారు. కౌలు రైతులు 1.22 లక్షల మందికి రుణార్హత కార్డులు జారీచేయగా 52 వేల 98 మందికి మాత్రమే రూ. 132.45 కోట్లు రుణాలు మంజూరు చేయడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకు లింకేజీ కింద 25 వేల స్వయం సహాయక సంఘాలకు రూ. 1,000 కోట్ల రుణాలందించాలని డీఆర్డీఏ పీడీ వై.రామకృష్ణకు సూచించారు. మంత్రి మండిపాటు వర్షాలతో మత్స్యకారులు, చేనేత కార్మికులకు జరిగిన నష్టం, వారిని ఆదుకున్న విషయాలపై సమగ్ర సమాచారం లేకపోవడంతో మత్స్యశాఖ డీడీ వీవీ కృష్ణమూర్తి, చే నేత, జౌళి శాఖ ఏడీలపై మంత్రి వసంత్ మండిపడ్డారు.‘నాలుగు గణాంకాలు చెప్పి వెళ్లిపోదామనుకున్నారా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి నివేదికను సాయంత్రంలోగా కలెక్టర్‌కు ఇవ్వాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా రాబోయే 48 గంటలు కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వసంత్ సూచించారు. పారిశుధ్యం, ఆరోగ్యంపై దృష్టి వర్షాలతో తాగునీటి వనరులు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు క్లోరినేషన్ పక్కాగా జరిగేలా ఆర్డబ్ల్యూ ఎస్ అధికారులు, గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదలకు పంచాయతీ సిబ్బంది కృషిచేయాలని మంత్రి వసంత్‌కుమార్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో టి.శకుంతలను ఆదేశించారు. 48 శాతం అధిక వర్షపాతం భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. జిల్లాలో అక్టోబర్‌లో 48 శాతం అధికంగా వర్షపాతం నమోదైందన్నారు. ధాన్యం కొనుగోలుకు చర్యలు ఐకేపీ కేంద్రాల ద్వారా జిల్లాలో 2 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి వసంత్ ఆదేశించారు. 100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ ముద్రించిన కరపత్రాలను మంత్రి, కలెక్టర్ ఆవిష్కరించారు. డీఆర్వో కె.ప్రభాకర్‌రావు, సోషల్ వెల్ఫేర్ జేడీ మల్లికార్జునరావు, హౌ సింగ్ పీడీ జి.సత్యనారాయణ, డీపీవో , జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్ పాల్గొన్నారు. జిల్లాకు వరద భయం లేదు జిల్లాకు వరదభయం లేదని మంత్రి వట్టి వసంతకుమార్ అన్నారు. ఏలూరు తూర్పులాకుల వద్ద తమ్మిలేరు వరద పరిస్థితిని ఆయన పరి శీలించారు. ఏలూరు నగరంలోకి వరద నీరు రాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. కలెక్టర్ ఆయన వెంట ఉన్నారు.