మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ జ్యువెలరీ దుకాణంలో భారీస్థాయిలో బంగారు ఆభరణాలు పక్కదారి పట్టాయి. దుకాణ నిర్వాహకులకు ఏమాత్రం తెలియకుండా అక్కడ పని చేసే కొందరు సిబ్బంది గ్రూప్‌గా ఏర్పడి విలువైన బంగారు ఆభరణాలు తీసుకొని రుణాలిచ్చే ఫైనాన్స్ కేంద్రంలో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.80లక్షల వరకు ఉంటుందని సమాచారం. తాకట్టు పెట్టిన తర్వాత వచ్చిన సొమ్మును సిబ్బంది ఒక్కొక్కరు రూ.ఐదు నుంచి రూ.ఏడు లక్షల వరకు పంచుకున్నట్లు తెలుస్తోంది.
దుకాణంలో రోజుకు రోజుకు తగ్గుతున్న ఆభరణాలను కొంత ఆలస్యంగా గుర్తించిన జ్యువెలరీ దుకాణ యాజమాని ఏం జరిగిందని ఆరా తీస్తే అక్కడ పనిచేసే కొందరు దుకాణంలోంచి ఆభరణాలు తీసుకుపోయి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్న వ్యవహారం బయటపడింది. దీంతో షోరూం యాజమాని హైదరాబాద్‌లోని పోలీస్ ఉన్నతాధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయం సమాచారం. మూడు రోజుల కిందట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్‌గౌడును సాక్షి వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని కొన్ని ఆభరణాలు రీకవరీ కావాల్సి ఉందని, రెండురోజుల్లో ఈ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment