ఆ ప్రశ్న ఎందుకు వేశానా అనిపించింది. అలా అడిగాక మొదట అతడు చేసిన పని, తటాల్న నాకేసి చూడడం. నన్ను చూస్తూనే బుగ్గల మీద ఎడం చేత్తో రాసుకున్నాడు, కొన్ని సెకన్లు. దంతాలు ఊడి లోతుకుపోయిన బుగ్గలు. ఓ నిమిషం తరువాత అతడి ముఖంలో చిన్న నవ్వు. అప్పుడే కళ్లూ మెరిశాయి, ఒక్కసారిగా. ‘చూశాను బాబూ!’ స్థిరంగా అన్నాడతడు.
అతని గొంతుపెగిలాక నా మనసు శాంతించింది. పాట అందుకుంటే రెండు వీధుల అవతల ఉన్నా ఖంగుమంటూ వినిపించే ఆ గొంతు అంత మార్దవంగా, అంత మంద్రంగా స్పందించడం కొంచెం వింతే.
ఎంత గొప్పగా పాడతాడో ఆ పాటలన్నీ ‘కదం కదం బఢాయే జా, ఖుషీ కే గీత్ గాయే జా.. ఏ జిందగీ హై కౌవ్‌ుకీ, తో కౌవ్‌ు పే లుటాయే జా..’ ఒళ్లు గగుర్పొడుస్తుంది.
సాగిపో సాగిపో మున్ముందుకు, ఆనందగీతికలను ఆలపిస్తూ సాగిపో, నీ జీవితాన్ని మాతృభూమి కోసం అర్పించుకో ఎంత బలమైన భావన. ఇదే కాదు శుభ్ సుఖ్ చైన్ కీ బర్ఖా బర్సే, ఎక్ల చొలో, హవ్‌ు దిల్లీ దిల్లీ జాయేంగే, చలో దిల్లీ వంటి పాటలూ పాడతాడు.
శ్రీరాములు, కొల్లి శ్రీరాములు.. ఒంటి మీద ఖాకీ మిలటరీ యూనిఫారవ్‌ు. టక్ చేసుకున్నాడు. అప్పటిదే కాబోలు ఆ యూనిఫారవ్‌ు. శిథిలమైపోయినట్టున్నా, రంగు మాత్రం వెలిసిపోలేదు. అతడు ఒక వయసులో ఎలా ఉన్నాడో చెబుతూ, ఆ శరీరం మీద ఇప్పుడు వేలాడిపోతోంది. దాని వయసు కనీసం యాభయ్ ఏళ్లు. కాళ్లకి బూట్లతోనే బాసిం పట్టు వేసుకుని నేల మీద కూర్చున్నాడు. బూట్లు కూడా అప్పటివేనేమో! స్లాబ్ పనివాళ్ల బూట్లలా ఉన్నాయి. ఆ రూపం చిన్నతనం నుంచి మేం చూస్తున్నదే. మామూలు బట్టల్లో ఏనాడూ చూసిందిలేదు. జుట్టు మరీ ముగ్గుబుట్ట కాలేదు. కొద్దిగా నల్ల వెంట్రుకలూ ఉన్నాయి. నడినెత్తి మీద నుంచి వెనక్కే. ముందంతా బట్టతల, వెనక జులపాలు.
నల్లటి శరీరం. నుదురు కింద లోతుకు పోయిన కళ్లు. ఆ మహావ్యక్తిని చూసిన కళ్లు ఇవే! అదృష్టం చేసుకున్నాయి!
‘ఎక్కడ చూశావు శ్రీరాములు?’
‘బర్మాలో బాబూ!’ ఏదో లోకంలో ఉన్నట్టే ఆ మాటలన్నాడు.
నేను ఐదో తరగతిలో ఉండగా, ఓ ఆగస్ట్ 15 పండుగకి ఒక సన్నివేశంలో అతడిని చూసినప్పటి నుంచి నాకు ఓ రకమైన సానుభూతి.. శ్రీరాములంటే. నాన్నగారు చెప్పినదానిని బట్టి గౌరవం కూడా. మా ఇంటి బయటకొచ్చి నిలబడినా మేం చదువుకున్న ఆ స్కూలు కనిపిస్తూనే ఉంటుంది. కొంచెం ఇవతలే అమ్మవారి గుడి. దానికి దగ్గరగా గ్రామ పంచాయతీ కార్యాలయం. ఆ ఘటన జరిగింది ఆ కార్యాలయం ముందే. శ్రీరాములుకి గుర్తుందో లేదో! దారే కాబట్టి ఆ కార్యాలయం ముందు నుంచి పాడుకుంటూ అతడు ఎప్పుడు నడిచి వస్తున్నా, వెళుతున్నా నాకు మాత్రం ఆ సన్నివేశమే గుర్తుకొస్తుంది.
తరువాత అతడిని చూస్తున్న కొద్దీ నాకూ అనిపించేది, ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాలేదు. ఎందరికో ఉన్న అభిప్రాయమే.
అలా చూస్తూనే ఉన్నాం. ఏళ్లు గడచిపోయాయి. పదిరోజులకీ, పదిహేను రోజులకీ ఒకసారి ఇంటిముందుకొచ్చి అరుస్తాడు, అటెన్షన్‌లో నిలబడే, ‘బోసుబాబు అనుచరుడినొచ్చానయ్యా! ధర్మం చెయ్యండి!’
బిచ్చగాళ్లు వచ్చినప్పుడు వేయడానికి సావిట్లో నల్లటి రేకు డబ్బా ఉంటుంది, బియ్యంతో. రెండు కేజీల వరకు పడుతుంది. అంతకంటే పెద్ద డబ్బాలో వడ్లు ఉంటాయి. కొందరికి బియ్యం, కొందరికి ధాన్యం. ఎవరికైనా దోసెడు. నాన్నగారు ఎప్పుడో చెప్పేశారు, శ్రీరాములిని అలా చూడకండని. అందుకే ఎప్పుడొచ్చి నిలబడినా డబ్బా నిండుగా బియ్యం పట్టుకొచ్చి అతడి పాత్రలో పోస్తాం.
శ్రీరాములుని చూడగానే ‘జైహింద్’ అనేవారు పిల్లలు. అతడు ఉరిమినట్టు ఇంకా గట్టిగా అనేవాడు, కాలుని నేలకి బలంగా తాటించి, సెల్యూట్ చేస్తూ. ఆ నినాదం ఇచ్చినందుకు పిల్లలని సంతోషపెట్టడం తన కర్తవ్యం అనుకునేవాడు కాబోలు. ఒక్కొక్క వస్తువుని లేదా జంతువుని కొన్ని భాషలలో ఏమంటారో చెప్పేవాడు. ‘కుక్క.. తెలుగులో కుక్క, హిందీలో కుత్తా, ఇంగిలీసులో డాగ్, బర్మాలో హావె, తమిళంలో నాయీ, బెంగాలీలో కుకురో..’ అంటూ చెప్పేవాడు.
కానీ ఈ ప్రవర్తనే అతడి మీద మతి స్థిమితం లేనివాడి ముద్ర వేసింది.
అది నిజమే, శ్రీరాములుకి మతి చలించిందని నాన్నే చెప్పారు. అలా జరిగిందీ ఒక సందర్భంలోనే. ఇలా కథలు కథలుగా చెప్పుకునేవారు.
ఎప్పటి నుంచో శ్రీరాములుతో మాట్లాడాలని చూస్తుంటే, అనుకోకుండా ఈ రోజు సాధ్యపడింది, నేను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు. అతడి మీద ఇంకాస్త వృద్ధాప్యం పడింది.
అప్పుడే ఏదో గుర్తుకు వచ్చినట్టు, పై జేబులోంచి బంతిలా చుట్టిన ఒక గుడ్డ తీశాడు, ఖాకీదే. మడత విప్పాక తెలిసింది, అది ఖాకీ టోపీ.
ఎంతో భక్తిగా, పద్ధతిగా శిరస్సున అలంకరించుకున్నాడు. ఆ టోపీతో ముఖం ఏదో ప్రత్యేకతని సంతరించుకుంది. సుభాష్‌చంద్ర బోస్ రూపం నా దృష్టిపథంలోకి వచ్చి నిలిచింది వెంటనే.
అలాంటిదే టోపీ. ఔను, శ్రీరాములు ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పనిచేసి వచ్చాడు.
లోపలికి రమ్మని పదిసార్లు పిలిస్తే మొత్తానికి వచ్చాడు. దూరంతో కూడిన చనువు, మా ఇంట్లో. నేరుగా పెరట్లోకి వెళ్లాం. బావి చూడగానే నీళ్లు తోడుకుని తాగాడు. తడి ముఖంతో, చేతులతో అక్కడే మొక్కల మధ్య ఖాళీ స్థలంలో నేల మీద చతికిలపడ్డాడు. కాస్త ఎత్తుగా ఉండే నూతిపళ్లెం అంచున నేను కూర్చున్నాను.
‘విలేకరుగారు, అమ్మగారు..?’ ఉన్నారా అన్నట్టు అడిగాడు.
‘లేరు, పెళ్లికెళ్లారు. ఏమైనా చెప్పాలా?’ అన్నాను.
విలేకరుగారంటే మా నాన్నగారే. ఆ చుట్టుపక్కల ఆయనకు అదే పేరు. ఆంధ్రప్రభకి గ్రామీణ విలేకరి.
ఏమీ లేదన్నట్టు తలాడించి, మళ్లీ మౌనం దాల్చాడు శ్రీరాములు. వాస్తవానికి అతడు ఏదో జ్ఞాపకపు గాలానికి చిక్కుకున్నాడనాలి. రెండు నిమిషాల తరువాత మళ్లీ అడిగాను.
‘సుభాష్ బోస్ ఎలా ఉండేవారు?’
‘శివాలయంలో నందంత అందంగా, కొట్టొచ్చినట్టు ఉండేవారు బాబూ!’
ఒక ఉద్యమ నేత మీద ఎంత గౌరవం ఉంటుందో బాగా అర్థమయింది. ఆ మాట అంటున్నప్పుడు అతడి రెండు చేతులూ నమస్కరిస్తున్నట్టు కలసి గాల్లోకి లేచాయి. నేత్రాలు అర్ధనిమీలితాలయ్యాయి.
మద్దూరి అన్నపూర్ణయ్య గారని, ఆయన సుభాష్‌చంద్ర బోస్‌ని రాజమండ్రి తీసుకువచ్చినప్పుడు శ్రీరాములు మొదటిసారి విన్నాడట ఆ పేరు. ఈ బోస్‌గారే సింగపూర్‌లో ఐఎన్‌ఏతో ఉద్యమం మొదలుపెట్టాడని తెలిసిందట. ఒక వేకువన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడట. ఇంకొకరు ఎవరో చెబితే కలకత్తా వెళ్లి, అక్కడి నుంచి బర్మా చేరుకుని మొత్తానికి ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరాడట.
ఎవరో ఆజాద్ హింద్ ఫౌజ్ వీరుడు రాసిన స్వీయానుభవమే ఎక్కడో చదివాను. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఓటమితో ఫౌజ్ సైనికులను బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీ తీసుకువచ్చి ఎర్రకోటలో సైనిక విచారణ పేరుతో హింసించారు. యుద్ధఖైదీల్లా కాదు, నేరగాళ్లని చూసినట్టు చూశారు. రెండురోజులకీ మూడురోజులకీ ఒకసారి తిండి పెట్టేవారు. అలాంటి పరిస్థితిలో కొందరిని పరుగెట్టమని, వెనక నుంచి కాల్చి చంపారు కూడా. బతికి బయటపడి ఢిల్లీ నుంచి శ్రీరాములు కోనసీమలో తన స్వగ్రామానికి వచ్చాడని నాన్నగారు చెప్పేవారు. ఆ ఒక్కరోజే అతడు హీరో. ఎలా వెళ్లాడో, ఎలా వచ్చాడో!
స్వాతంత్య్రం వచ్చింది. ఊరూవాడా ఉత్సవాలు జరిగాయి. స్వాతంత్య్ర పోరాటం తరువాత చాలామంది స్వాతంత్య్ర సమరయోధులకి జీవనపోరాటం ఎదురైంది. అలాంటి వాళ్లలో శ్రీరాములూ ఉన్నాడు.
అసలు ప్రశ్న. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన విషయం శ్రీరాములుకి స్పృహలో ఉందో లేదో!
నాకు ఎప్పటికీ గుర్తుంటుందన్న ఆ సందర్భం ఆగస్ట్ 15నే జరిగింది. అంటే శ్రీరాములు అనే ఓ స్వాతంత్య్ర సమరయోధుడి జీవితంలో ఆ రోజు కూడా భిక్షాటనతోనే గడిచింది.
శ్రీరాములు గాథంతా నాన్నగారు వార్తాకథనంగా రాశారు. చాలామంది సమరయోధులకి పింఛను వచ్చింది. భూములు దక్కాయి. ఉచిత ప్రయాణాలు అమరాయి. తామ్రపత్రాలూ వచ్చాయి. దేశం కోసం జవానుగా మారి చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన శ్రీరాములుకి ఏమీ రాలేదు. కారణం, అతడు దేశం కోసం దేశం బయట నుంచి పోరాడాడట. అది నిజమేనని చెప్పే రికార్డేదీ లేదట.
ప్రస్తుతం అతడికి భుక్తి గడవడం కష్టంగా ఉందనీ, ఇస్తే ఏ ఉద్యోగమైనా చేస్తాడంటూ కథనం ముగించారట నాన్న. ఎవరో సహృదయుడు స్పందించాడట. మద్రాస్‌లో ఉంటాడట. పెద్ద ఆఫీసరట. నూట యాభయ్ రూపాయల జీతంతో, ఉండడానికి క్వార్టర్స్ సహా అన్నీ ఇస్తానని పత్రికా కార్యాలయానికి ఉత్తరం రాస్తే, అది నాన్నగారికి చేర్చారు వాళ్లు.
ఎందుకో ఏమో, అప్పుడే మూడువారాలైనా మా ఊరివైపు రాలేదట శ్రీరాములు.
విషయం చెప్పి, ఇంటికే కబురు చేశారు నాన్న. శ్రీరాములు భార్యే కాబోలు ఎవరితోనో కబురు పెట్టింది, ఇప్పుడు అతడిని అంత దూరం పంపలేమన్నదే దాని సారాంశం.
నాన్న వాకబు చేశారు. శ్రీరాములుకు మతి చలించిందని తెలిసింది. బోస్ బతికే ఉన్నాడా? విమాన ప్రమాదంలో మరణించాడా? ఇదే ధ్యాసట కొంతకాలం. కారణం దేశమంతా ఇదే చర్చట. ఎలా తెలుసుకున్నాడో, ఏం తెలుసుకున్నాడో, అంతిమంగా బోస్ మరణించడమే నిజమన్న నిర్ణయానికి వచ్చాడట శ్రీరాములు. అప్పటి నుంచి మనిషి మారిపోయాడు.
ఇది జరిగిన కొద్దిరోజులకే చేతికి భిక్షాపాత్ర వచ్చింది. బ్రిటన్ మీద యుద్ధం ప్రకటించిన సైన్యం తన కవాతులో పాడుకున్న దేశభక్తి గీతాలు భిక్షాపాత్రా, కడుపూ నింపుకోవడానికి అభ్యర్థనలుగా ఉపయోగపడుతున్నాయి.
‘మా పొలాలు చూడు అని నీకు చెప్పడానికి మనసొప్పక చెప్పలేదయ్యా శ్రీరాములు. నీకేమిటీ ఖర్మ? వచ్చి మా పొలం పనుల్లో సాయపడు. ఎంతో కొంత ఇస్తాను.’ నాన్నది చిన్నపాటి సేద్యమే అయినా, సాటి స్వాతంత్య్ర సమరయోధుడికి సాయం చేయాలనుకుని, ఈ మాట అన్నారట.
ఒక నమస్కారం పెట్టి వెళ్లిపోయాడట. భిక్షాటనలోనే ఉండిపోయాడు.
‘ఇదిగో! ఇది ఉంచు!’ అని పది రూపాయలు, నా పాకెట్ మనీ, అతడి చేతిలో పెట్టాను.
మళ్లీ మొహమాటం. ‘తీసుకో ఫరవాలేదు’ అంటే, జేబులో పెట్టుకుని లేచాడు.
‘సెలవిప్పించండి!’ అన్నాడు, సెల్యూట్ భంగిమలో.
నేను కూడా లేచాను. సింహద్వారం దాకా వెళ్లాను. నెమ్మదిగా మెట్లు దిగి వీథిలోకి వెళ్లిపోయాడు శ్రీరాములు.
ఎదురుగా కనిపిస్తోంది పంచాయతీ కార్యాలయం. ముందు నుంచే నడిచి వెళుతున్నాడతడు. ఆ రోజూ, అతడు పాడిన సందర్భం ఎలాంటి ప్రయత్నమూ లేకుండానే గుర్తుకు వచ్చాయి.
ఆ ఆగస్ట్ 15కి కూడా బడి దగ్గర నుంచి మమ్మల్నందరినీ ఉరేగింపుగా తీసుకొచ్చి పంచాయతీ కార్యాలయం ముందు బారులు తీర్చారు. తరగతుల వారీగా నిలబెడుతున్నారు. ఆ పనంతా వీరస్వామి మాస్టారిదే.
పిల్లలంతా సిరా నీలం రంగు నిక్కరు, తెల్లచొక్కాలతో, ఆడపిల్లలు కూడా అలాంటి కూడికతోనే గౌన్లు, స్కర్టులతో ముచ్చటగా ఉన్నారు. మా పైనంతా రంగురంగుల కాగితపు జెండాల తోరణాలు. నిటారుగా ఉన్న ఒక సరుగుడు కర్రని కార్యాలయం ముందు పాతిపెట్టారు. దానికే వేలాడుతోంది మువ్వన్నెల జెండా. జెండా కొయ్య మొదట్లో వరసగా మూడు కుర్చీలు. మధ్య కుర్చీలో బోసినవ్వుల గాంధీ ఫొటో. ఒక పక్క నెహ్రూ బొమ్మ, రెండో పక్క బాబూ రాజేంద్రప్రసాద్ బొమ్మ. మూడు ఫొటోలకి మువ్వన్నెల ఖాదీ దండలు. గోలగోలగా ఉందంతా.
కార్యాలయం లోపల ఊరి పెద్దలు పది పన్నెండు మంది ఖద్దరు దుస్తుల్లో తిరుగుతున్నారు, హడావిడి చేస్తూ. బడిపిల్లల గోల కంటే ఎక్కువే ఉంది.
ఉదయం తొమ్మిది గంటల వేళకి సర్పంచ్‌గారు కష్టపడి జెండా ఎగరేశారు. వెంటనే వీరాస్వామి మేస్టారు ‘జెండా ఊంఛా రహే హమారా.. విజయీ విశ్వతిరంగా ప్యారా’ అంటూ పిడికిలెత్తి ఉద్విగ్నంగా పాడితే మేమంతా ఉత్సాహంగా అనుసరించాం.
ఇంకొద్ది సేపటికి మేం ఎదురుచూస్తున్న చాక్లెట్ల పంపకం మొదలయింది. అప్పుడే లోపల పెద్దల చేతికి తలొక ప్యాకెట్ వచ్చింది. ఇడ్లీ కాబోలు. చాక్లెట్లు చేతుల్లో పడినవాళ్లు పరుగెత్తుతున్నారు. ఐదో తరగతి వాళ్లందరం చివర్న ఉన్నాం. లోపల పెద్దలు తినడం పూర్తి చేసి బయటకొచ్చి చేతులు కడుగుతున్నారు. ఒకళ్ల తరువాత ఒకళ్లు.. ఆ నీళ్లు నెమ్మదిగా ముందుకొస్తున్నాయి, సరిగ్గా జెండా కర్ర దిశగా, ఆ మహానుభావుల ఫొటోలు ఉన్న కుర్చీల కిందకే.
వీరాస్వామి మాస్టారు, సరోజినీ టీచరమ్మ, మార్తమ్మ టీచరు, హెడ్‌మాస్టరు శివలపంతులు గారు, ఆయా వెంకమ్మ అట్టపెట్టెలలో తెచ్చిన చాక్లెట్లు పంచుకుంటూ వస్తున్నారు.
సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు శ్రీరాములు. నేరుగా పంచాయతీ కార్యాలయం ముందుకెళ్లి గట్టిగా అరిచాడు, ‘బాబూ! బోసుబాబు అనుచరుణ్ణొచ్చాను. నాక్కూడా ఓ పొట్లం ఇప్పించండి బాబూ!’
ఒక్క నిమిషం ఆగి మళ్లీ అరిచాడు శ్రీరాములు. చేయి కడుక్కోవడానికి బయటకు వచ్చిన ఓ ఖద్దరుధారికి ఆ అరుపు చిర్రెత్తించింది. ఏదో అనబోయాడు గాని, గొంతులో నీళ్లు దిగేదాకా ఆగాడు.
ఈసారి పాట అందుకున్నాడు శ్రీరాములు.
‘హవ్‌ు దిల్లీ దిల్లీ జాయేంగే, చలో దిల్లీ..’
‘ఛ, అవతలకి పో!’ భరించలేనట్టే అసహనంతో అరిచాడు పెద్దమనిషి.
పెద్దలకి కలిగిన అసౌకర్యానికి భయపడిన ప్యూను వెంటనే ప్రత్యక్షమై, ‘పైకెళ్లు.. పో, పైకెళ్లు..’ మీదకెళుతూ అన్నాడు, పొమ్మని బిచ్చగాళ్లకి చెప్పేమాట.
అలాంటి చీదరింపులకి అలవాటు పడిపోయినట్టు నిర్లిప్తంగా ఉండిపోయాడు శ్రీరాములు. అంతా అటే చూశారు. నిమిషం తరువాత భారంగా కదిలాడు శ్రీరాములు. పంచాయతీ కార్యాలయం దాటి, ముందుకు వెళ్లిపోయాడు. చెట్లపల్లి వారి ఇంటి పక్క నుంచి వెళ్లే కాలిబాటని అనుసరించాడు.
రెండు మూడు నిమిషాల తరువాత గాలి మోసుకొచ్చింది పాట.
‘కదం కదం బఢాయే జా.. ఖుషీ కే గీత్ గాయే జా.. ఏ జిందతీ హై కౌవ్‌ుకీ, తో కౌవ్‌ు పే లుటాయే జా..’
సావిట్లోకి అడుగుపెట్టిన తరువాత దూరం నుంచి శ్రీరాములు కంఠం లీలగా. గెలవాలన్న నిశ్చయం, ఓడిపోతున్నానన్న దిగులుతో కలసి జుగల్బందీ చేస్తున్నట్టుంది.
‘.. ఖుషీ కే గీత్ గాయే జా.. కదం కదం బఢాయే జా..’
జెండా కొయ్య మొదట్లో వరసగా మూడు కుర్చీలు. మధ్య కుర్చీలో బోసినవ్వుల గాంధీ ఫొటో. ఒక పక్క నెహ్రూ బొమ్మ, రెండో పక్క బాబూ రాజేంద్రప్రసాద్ బొమ్మ. మూడు ఫొటోలకి మువ్వన్నెల ఖాదీ దండలు.
∙డా. గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment