దేశ విభజన నాటి ఒక దయనీయ దృశ్యం
రేపు దేశ విభజన విషాదాల సంస్మరణ దినం
శతాబ్దాల బానిస గతానికి స్వతంత్రం అంతం పలికింది. భారత భవితవ్యానికి మాత్రం దేశ విభజన సవాళ్లు విసిరింది. స్వాతంత్య్రం కొరకు పోరాడిన వారు అంటూ చిరకాలంగా కొన్ని కుటుంబాలనే భారతీ యులు ఆరాధించారు. విభజన విషాదంలో అకారణంగా కన్ను మూసి, అందరినీ పోగోట్టుకుని, స్వాతంత్య్రోద్యమ సంబరాలు ఎరుగని వారినీ ఇప్పుడు తలుచుకోవాలని అనుకుంటున్నాం. దేశ విభజన విషాదాల సంస్మరణ దినం (ఆగస్ట్ 14) అందుకు అవకాశం ఇస్తున్నది.
స్వాతంత్య్ర సమరంలోని చాలా ఘట్టాలు చరిత్ర పుటలకు చేరనట్టే, విభజన విషాదమూ మరుగున ఉండిపోయింది. కేవలం తేదీలు, కారణాలు, ఫలితాల దృష్టి నుంచి సాగే చరిత్ర రచన కంటే, చరిత్రకు ఛాయ వంటి సృజనాత్మక సాహిత్యమే విభజన విషాదాన్ని గుర్తు చేసే బాధ్యతను ఎక్కువగా స్వీకరించింది. ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదలు నిన్న మొన్నటి జస్వంత్ సింగ్ వరకూ తమ పుస్తకాలలో చరిత్రగా విభజన గాథను విశ్లేషించారు. నవల, కవిత, కథ, నాటక ప్రక్రియలు విభజన విషాదాన్ని ఆవిష్కరించిన తీరూ స్మరణీయమే.
భీష్మ సహానీ ‘తమస్’ (అంధ కారం) విభజన కాలాన్ని చర్చించిన నవలా సాహిత్యంలో మకుటాయమానమైనదనిపిస్తుంది. విభజనకు కారణం మతమా? మత రాజకీయమా అన్నది చర్చించారాయన. చల్లారుతున్న మతోద్రిక్తతలు పంది కళే బరం మసీదు మెట్ల మీద కనిపించడం వల్ల తిరిగి భగ్గు మనడం ఇందులో ఇతివృత్తం. ఇంతకీ నాథూ అనే తోళ్ల కార్మికుడికి, పారిశుద్ధ్య కార్మికుడికి మాయమాటలు చెప్పి మురాద్ అలీ అనే వ్యాపారి చేయించిన పని ఇది. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుల గిల్లికజ్జాలు, పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న ఆంగ్లేయుడు దేశం వీడు తున్న క్షణంలోనూ ప్రదర్శించిన ‘విభజించి పాలించు’ బుద్ధినీ కూడా ఇందులో పరిచయం చేశారాయన.
చివరికి శాంతియాత్రకు మురాద్ అలీ ముందు ఉండడం పెద్ద మలుపు. ఈ నవలను డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెనిగించారు. మహిళల మీద విభజన చేసిన దాడిని చాలామంది వర్ణించారు. అమృతాప్రీతమ్ నవల ‘పింజర్’ (అస్తిపంజరం) వాటిలో ప్రత్యేకమైనది. పెళ్లి నిశ్చయమైన పూరో అనే హిందూ యువతిని రషీద్ అనే ముస్లిం యువకుడు అపహరించడం ఇందులో కీలకం. ఆమె తప్పించుకు వచ్చినా తల్లిదండ్రులు స్వీకరించ డానికి నిరాకరి స్తారు. మతం మారి రషీద్‌నే ఆమె పెళ్లి చేసుకుంటుంది. చివరికి ఆమె అవసరమే పుట్టింటివారికి వస్తుంది.
స్వాతంత్య్రోద్యమం, దాని ఫల శ్రుతి వేర్వేరేనని గుర్తించాలన్నట్టు విభజన గాథలను వివరించేందుకు రైలు ప్రయాణాలను పలు వురు తమ ఇతివృత్తాలకు నేప థ్యంగా స్వీకరించారనిపిస్తుంది. వాటిలో ప్రముఖమై నది ‘ట్రెయిన్ టు పాకిస్తాన్’. కుష్వంత్ సింగ్ ఈ నవలను జుగ్గు (సిక్కు), నురాన్ (ముస్లిం)ల ప్రేమ వ్యవహారంతో ముడిపెట్టి అల్లారు. ముస్లిం శరణార్థులతో పాకిస్తాన్ వెళుతున్న రైలును కొందరు హిందువులు, సిక్కులు తగలబెడితే అందులో నుంచి నురాన్‌ను జుగ్గు రక్షిస్తాడు. భారత్ నుంచి ముస్లింల శవాలతో, వక్షోజాలు నరికిన మహిళల శరీరాలతో పాకిస్తాన్‌కు రైలు రావడం బప్సి సిధ్వా నవల ‘ఐస్‌క్యాండీ మ్యాన్’లో మలుపు.
గుల్జార్ రాసిన ‘రావి నదికి ఆవల’ కథ విభజనతో భారత ఉపఖండం ఆత్మను కోల్పోయిన వైనం ఉంది. ఇది కూడా రైలు ప్రయాణం నేపథ్యంగానే సాగుతుంది. ఆయనదే ‘భయం’ (కావూఫ్) కథలో యాసిన్ అనే ముస్లిం యువకుడు లోకల్ ట్రైన్‌లో పొందిన వింత అనుభవం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఒక స్టేషన్‌లో మరో యువకుడు ఎక్కాడు. అతడు హిందువులా కనిపించాడు. అతడితో తనకు ప్రాణహాని తప్పదని రైలు భయాందర్ వంతెన మీదకు వచ్చాక గుమ్మం దగ్గర ఆదమరచి ఉన్న ఆగంతకుడిని యాసిన్ బయ టకు నెట్టేశాడు.
మరుక్షణం ఒక ఆక్రందన ‘అల్లా’ అంటూ! భీష్మ సహానీ రాసిన ‘రైలు అమృత్‌సర్ చేరింది’ కథ కూడా పట్టాల మీద నడిచిన అనుభవమే. పాకిస్తాన్ నుంచి భారత్ వస్తున్న ఒక హిందూ శరణార్థిని (బాబు) ముస్లింలు ఏడిపిస్తారు. వాళ్లు మధ్యలో దిగిపోతారు. ఇతడు మాత్రం రైలు భారత్‌లో ప్రవేశించాక అంతదాకా అణచి ఉంచుకున్న కోపాన్ని ఇక్కడ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ముస్లిం మీద చూపిస్తాడు. అంతకు ముందే దాచి పెట్టిన ఇనప రాడ్‌తో తల బద్దలు కొడతాడు. పెషావర్–బొంబాయి మధ్యలో జరి గిన హిందూ ముస్లిం హింసాకాండ దృశ్యాలను కిషన్ చందర్ తన కథ ‘పెషావర్ ఎక్స్‌ప్రెస్’ కథలో అక్షర బద్ధం చేశారు. ఆ దారిలో రైలు ఆగిన ప్రతి స్టేషన్ రక్త పాతంతోనే కనిపిస్తుంది. ఒక చోట స్త్రీలను నగ్నంగా ఊరేగించడం కూడా కనిపిస్తుంది. గతంలోని కక్షలను వెలికి తీసి మరీ పరస్పరం దాడులకు దిగారు. పింజ ర్‌లో పూరోను రషీద్ ఎత్తుకుపోవడానికి కారణం, రెండు మూడు తరాల క్రితం ఆ ముస్లిం కటుంబం నుంచి ఒక మహిళను రుణం గొడవలో పూరో తాతలు ఎవరో అపహరించారు.
ముస్లిం లీగ్ వైఖరి కారణంగానే విభజన జరిగిందన్నది నిజం. కానీ ఆ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోయినవారు అన్ని వర్గాలలోను ఉన్నారు. సాదత్ హసన్ మంటో రాసిన ‘టోబా టేక్‌సింగ్’ కథకు ఇతివృత్తం ఇదే. రెండు మతాల వారిని రెండు దేశాలు పంచుకున్నట్టే మతిస్థిమితం లేనివారిని కూడా పంచు కుంటారు. కానీ లాహోర్ పిచ్చాసుపత్రిలో ఉన్న టోబా టేక్‌సింగ్‌ను భారత్‌కు అప్పగిస్తున్నప్పుడు అతడు వాఘా సరిహద్దులో సగం పాక్ వైపు, సగం భారత్ వైపు తన దేహం ఉండేలా పడి మరణిస్తాడు.
విభజన నిర్ణయం తరువాత సరిహద్దు రేఖ గీయ డానికి వచ్చినవాడు సెరిల్ రాడ్‌క్లిఫ్. కేవలం ఐదువారా లలో అతడు ఆ పని ముగించాడు. కానీ రేఖ మీద నెత్తుటి తడి ఏడు దశాబ్దాలైనా ఆరలేదు. ఆ పరిణామం ఎంతటి పాశవికతకు దారి ఇచ్చిందో అమెరికా కవి డబ్ల్యూ హెచ్ ఎడెన్ ‘పార్టిషన్’ పేరుతో రాసిన తన కవితలో నిక్షిప్తం చేశాడు. ‘డ్రాయింగ్ ది లైన్’ పేరుతో రాడ్‌క్లిఫ్ చర్యనే నాటకంగా మలిచాడు బ్రిటిష్ రచయిత హోవార్డ్ బెంటన్. దీనిని 2013లోనే ప్రదర్శించారు.
భారత విభజన ప్రపంచ చరిత్రలోనే విషాద కరమైనదిగా చెప్పడం సత్యదూరం కాదు. విభజన మూల్యం 20 లక్షల ప్రాణాలు. కోటీ నలభై ల„ý లు లేదా కోటీ ఎనభై లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇది ఇప్పటికి దొరికిన లెక్క. ఇందులో స్త్రీల దుఃఖం మరీ ఘోరమైనది. ఊర్వశీ బుటాలియా విభజన వేళ స్త్రీ పడిన వేదనను, క్షోభను, గుండె కోతను అన్వేషించారు. చాలాకాలం వరకు 75 వేల మంది మహిళలు విభజనకు బాధితులని అనుకున్నారు. కానీ లక్షమంది స్త్రీలను బలి చేశారని, ‘ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్’ పుస్తకంలో రాశారు.
ఇన్ని కోట్ల మంది బాధితులలో ప్రతి ఒక్కరికీ ఒక విషాద గాథ ఉంది. ప్రతి కన్నీటి బొట్టుకు ఒక కథ ఉంది. నెలల తరబడి సాగిన ఈ హత్యాకాండలో చలికీ, వానకీ, ఎండకీ, మతోన్మాదానికీ, ఆకలికీ సరిహద్దుల వెంట రాలిపోయిన ప్రతి ప్రాణం ఒక నవలకు ఇతివృత్తం కాగలినదే. ఉన్మాదుల నుంచి రక్షణ కోసం గురుద్వారా వెనుక బావులలో పిల్లలతో సహా దూకేసిన వందలాది మంది మహిళల గుండె ఆక్రోశాన్ని, చావును సమీపంగా చూసిన పసి ఆక్రందనలను ఇప్పుడైనా గమ నించాలి. అందుకే ఆ గ్రంథాల వెల్లువ. మానవతను అతి హీనంగా ఛిద్రం చేస్తూ కాలం కల్పించే దుస్సంఘ టనల్లో దేశ విభజన కూడా ఒకటి!
– డా. గోపరాజు నారాయణరావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment