ఈస్టిండియా కంపెనీ అనుభవాలను గుణపాఠాలుగా మలచుకోక తప్పని ఒక క్లిష్ట వాతావరణం బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి ఎదురైంది. భారతీయులతో, స్థానిక పాలకులతో కంపెనీ వ్యవహరించిన విధానం స్థానికులను తిరుగుబాట్లకు ప్రేరేపించేదే! కంపెనీకి విదేశాలతో గొడవ పెట్టుకునే అవకాశం లేదు. కొన్ని పనులకు బ్రిటిష్ రాణి అనుమతి తీసుకోక తప్పేది కాదు. కానీ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ పరిధి పెద్దది. ఇరుగు పొరుగు దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకుంది.
కంపెనీ నీచత్వం సరే, దానికేమీ తీసిపోని రాణి పాలన కారణంగాను 1857 తరువాత కూడా ప్రజానీకంలో చల్లారని ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. రాణి వాటిని చల్లార్చే ప్రయత్నమేమీ చేయలేదు. అన్ని వైపుల నుంచి ఆగ్రహ జ్వాలలు చుట్టుముట్టాయి. ఈ వేడిని తగ్గించే ఒక వ్యూహంలో భాగంగానే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు కోసం ఏ ఓ హ్యూమ్ అక్షరాలా కాలికి బలపం కట్టుకుని మద్రాస్, బొంబాయి, పూనా నగరాలు తిరిగాడు. ఒక సేఫ్టీవాల్వ్ ఏర్పాటు అవసరమని బ్రిటిష్ ఇండియా ఎందుకు అంతగా తహతహలాడిందో తెలియాలంటే జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు ముందు నాటి రగులుతున్న భారతదేశం ఎలా ఉన్నదో చూడాలి.
1885కు ముందు, అంటే కాంగ్రెస్ స్థాపనకు ముందు ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ ఇండియా హయాంలలో దేశం నలుమూలలా ఆగ్రహావేశాలు చెలరేగాయి. హిందీ ప్రాంతాలు సరే, అస్సాం, బెంగాల్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర, నిజాం ప్రాంతాలలో కూడా తిరుగుబాట్లు జరిగాయి. తిరగబడిన దాదాపు అందరినీ ఉరికంబాలు ఎక్కించారు.
నెర్కట్టుంసేవల్ పాలెగార్ (పాలెగాడు) పులిదేవర్. ఇది తిరునేల్వేలి దగ్గర ఉంది.1757లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా ఇతడు పోరాడాడు. ఊండివరన్, వెన్నికలాది ఈయన సైన్యాధిపతులు. కంపెనీ మీద తిరగబడిన తొలి భారతీయునిగా ఇతడికి పేరుంది. అప్పుడే బెంగాల్‌లో సిరాజుద్దౌలాకీ కంపెనీకీ మధ్య ప్లాసీ యుద్ధం జరిగింది.
మరుధు పాండియార్‌లు (పెరియ మరుధు, చిన్న మరుధు) వీరు 18వ శతాబ్దం చివరిలో శివగంగై పాలకులు. వీరు కంపెనీ ఆధిపత్యం మీద తిరుగుబాటు చేశారు. ఈ ఇద్దరినీ ఉరి తీశారు. 18వ శతాబ్దంలో దక్షిణాదిన కనిపించే మరొక వీరుడు వీరపాండ్య కట్టబొమ్మ కరుతయ్య నాయకర్. పాంచాలన్‌కురుచిని పాలించేవాడు. ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు 1799లోనే ఉరి తీశారు. 1808–09 నాటి వేలు తంపి తిరుగుబాటు కూడా చరిత్రలో ఎంతో కీలకమైనది.
తిరువాన్కూర్ దివాన్ వేలు తంపిని పదవి నుంచి తొలగించాలని కంపెనీ కుట్ర పన్నింది. సైన్య సహకార పద్ధతితో సంస్థానాన్ని దోచేస్తున్న కంపెనీ ఆగడాలను అడ్డుకొనే ప్రయత్నం చేయడమే తంపి చేసిన పాపం. చివరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పటికీ భౌతికకాయాన్నే ఉరి తీశారు. మహారాష్ట్ర ప్రాంతం సతారాలో 1822–25 ప్రాంతాలలో జరిగిన రామోసీల తిరుగుబాటు కూడా కంపెనీని భయపెట్టింది. రామోసీలు అంటే పోలీసు, సైనిక వ్యవస్థలో ఉండే అత్యంత కింది స్థాయి ఉద్యోగులు. వీరే చిత్తూర్‌సింగ్ నాయకత్వంలో తిరగబడ్డారు. చిత్రంగా వీరు పెంచిన భూమిపన్నుకు వ్యతిరేకంగా ఆ తిరుగుబాటు చేశారు.
ఆంధ్ర ప్రాంతాన్ని కబళించే ప్రయత్నం 1766 నుంచి కంపెనీ ఎలా చేసిందో ప్రొఫెసర్ కెఎస్‌ఎస్ శేషన్ ‘ఎర్లీ యాంటీ బ్రిటిష్ రివోల్ట్స్ ఇన్ ఆంధ్ర 1766–1857’ పుస్తకంలో వివరించారు. స్థానిక పాలకుల పట్ల ఈస్టిండియా కంపెనీ చూపిన అవమానకర వైఖరితోనే ఆ తిరుగుబాట్లు జరిగాయని శేషన్ అంటారు. సర్కార్ గడ్డ మీద మైదాన ప్రాంతంలో పెద్ద జమీందార్లు, మన్య ప్రాంతాలలో చిన్న జమీందార్లు కూడా తిరుగుబాట్లు చేశారు. తమను ఆర్కాట్ నవాబు అధికారం నుంచి తొలగించడం, నవాబుకు కంపెనీ అండ ఉండడం వంటి కారణాలతో ఈ తిరుగుబాట్లు సాగాయి.
1846 నాటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం, విశాఖపట్నం, మొమినాబాద్, బొల్లారం తిరుగుబాట్లు కూడా అలాంటివే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తండ్రి మల్లారెడ్డి పాలెగాడు. కర్నూలు జిల్లాలో కంపెనీ దమనకాండకు నిరసనగా పోరుబాట పట్టిన ఐదువేల మంది రైతులకు నరసింహారెడ్డి నాయకత్వం వహించాడు. ఈయన సేనాపతి వడ్డె ఓబన్న. రైత్వారీ విధానం, పన్ను పెంపు మీద రైతులు తిరగబడ్డారు. ఇతడి చేతిలో పెద్ద ఎత్తున కంపెనీలు సేనలు హతమయ్యాయి. 1847 ఫిబ్రవరి 22న నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరి తీయడంతో ఉద్యమం చల్లారిపోయింది.
19వ శతాబ్దంలో తూర్పు భారతంలో ముఖ్యంగా అస్సాంలో కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగాయి. యాండాబు ఒప్పందం (1826) మేరకు అస్సాం కంపెనీ అధీనంలోకి వచ్చింది. యథాప్రకారం కంపెనీ కిందకు అస్సాం రావడం, కల్లోలం ఆరంభం కావడం ఏకకాలంలో జరిగాయి. తిరుగుబాట్లలో అటు పై వర్గాల వారు, మధ్య, దిగువ తరగతుల వారు కూడా పాల్గొన్నారు. అలాంటి ప్రయత్నం చేసిన వారిలో మొదటివాడు గోంధార్ కున్వార్. కుందురా దీకా ఫుఖాన్, దామోదర్, హర్నాథ్ ఇతర స్థానిక పాలకులు కూడా అతడికి సహకరించారు. వీరంతా కలసి 1828లో సాడియా అనే చోట కంపెనీ ఆయుధాగారం మీద దాడి చేశారు. ఇది విఫలమైంది.
మళ్లీ పియాలీ బర్ఫూఖన్ నాయకత్వంలో మరొక తిరుగుబాటు జరిగింది. ఈయనకు జీయురాం దూలియా బారువా, బేణుధర్ కున్వార్, రూప్‌చంద్ కున్వార్, దేయురాం దిహింగియా, బౌవ్‌ు చింగ్‌ఫూ, హర్నాథ్ తదితరులు సహకరించారు. రంగపూర్‌లో ఉన్న బ్రిటిష్ శిబిరాన్ని దగ్ధం చేయాలని పియాలీ బర్ఫూఖన్ నాయత్వంలో జరిగిన కొత్త ప్రయత్నం విజయవంతమైంది. కానీ పియాలీ, జియురాం బారువా, ఇంకొందరు ఆందోళనకారులను కంపెనీ అధికారులు పట్టుకున్నారు. పియాలీ, జియురాంలను ఉరి తీసి, మిగిలిన వారిని ద్వీపాంతరం పంపారు. ఇదే సమయంలో ఎగువ అస్సాంలో పనిచేసే కొందరు కంపెనీ బ్రిటిష్ జాతీయులను చంపాలని గదాధర్ గొహిన్ అనే మరొక వీరుడి నాయకత్వంలో ప్రయత్నించారు. కానీ ఇది విఫలయింది. గదాధర్‌ను జైలులో పెట్టారు.
1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆ జ్వాలను అస్సాంకు తీసుకుని వెళ్లినవాడు మణిరాం దివాన్. ఆ సమయంలో కలకత్తా వెళ్లి, మరొక ఉద్యమకారుడు మధు మల్లిక్ సాయంతో పథకం వేశాడు. 1857 ఘటన వార్తలను అస్సాం సంస్థానం ఆఖరి పాలకుడు కందర్పేశ్వర్ సింగ్, సలహాదారు పియాలీ బారువాకు మణిరాం అందించేవాడు. ఈ పథకంలో ఇంకా మాయారాం నజిర్, నీలకంఠ చోలాధర ఫుఖాన్, మారంగికోవె గొహిన్, ద్యుతిరాం బారువా, బహదూర్ గాన్బురా, ఫార్ముద్ అలీ, త్రినయ, కమల బారువా పనిచేశారు. సాహాబాద్ అనేచోట ఉన్న సిపాయీల మద్దతే వీరికి కీలకమైంది. ఈ పథకం ప్రకారం సిపాయీలంతా, అస్సాం పాలకుని నాయకత్వంలో కంపెనీ అధికారుల మీద తిరగబడాలి.
ఇంతలో మణిరాం కలకత్తా నుంచి ఆయుధాలతో వచ్చి కలుస్తాడు. పథకం అమలులో కొద్దిపాటి ఆలస్యం కావడంతో కంపెనీ వెంటనే అప్రమత్తమై తిరుగుబాటులో ఉన్నవారందరినీ అదుపులోకి తీసుకుంది. కలకత్తా నుంచి పనిచేస్తున్న మణిరాంను కూడా అరెస్టు చేశారు. కందర్పేశ్వర్‌సింగ్‌ను కారాగారంలో పెట్టారు. చాలామందిని ద్వీపాంతరం పంపారు. మణిరాం, పియాలీ జోర్హాట్ కారాగారంలోనే చనిపోయారు. 1861, 1894లలో ఫులగారి, పత్థర్‌ఘాట్ అనేచోట రైతాంగ పోరాటాలు జరిగాయి. ఇలాంటివి ఇంకా ఎన్నో!
- డా. గోపరాజు నారాయణరావు
చదవండి: Needle Free Injection: సూదిలేని ఇంజెక్షన్ వచ్చేసింది.. నొప్పి లేకుండా...
Comments
Please login to add a commentAdd a comment