బఘా జతిన్ పేరు హిందూ–జర్మన్ కుట్ర రెండో దశతో గాఢంగా ముడిపడి ఉంది. ఈ దశ అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతుంది. అఖిల భారత స్థాయి సాయుధ సమరంతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చడానికి 1915 ఫిబ్రవరిలో చేసిన తొలి ప్రయత్నం విఫలమైన తరువాత జుగాంతర్ విప్లవసంస్థ సభ్యులు తమ నేత బఘా జతిన్ (బఘా అంటే పులి. ఊరి మీద పడిన పులితో పోరాడి చంపినందుకు వచ్చిన బిరుదు. అసలు పేరు జతిన్ ముఖర్జీ)ను రహస్య ప్రదేశానికి పంపి మరో విప్లవానికి నాడే నాంది పలికారు. ఆ ప్రదేశమే ఒడిశా సాగరతీరం బాలసోర్. కలకత్తా కేంద్రంగా నడిచే హ్యారీ అండ్ సన్స్ వ్యాపార సంస్థకు శాఖ పేరుతో యూనివర్సల్ ఎంపోరియమ్‌ను బాలసోర్‌లో నెకొల్పారు. నిజానికి అది విప్లవకారుల సమావేశ స్థలి. జతిన్ బాలసోర్‌కు 30 మైళ్ల దూరంలోని కప్తిపదా గ్రామంలో అజ్ఞాతవాసం చేసేవారు.
జర్మనీ ప్రభు వంశీకుడు, రాజకీయ ప్రముఖుడు పాపెన్ ఆయుధాలను పంపించాడు. బెర్లిన్ కమిటీ ప్రతినిధిగా తనకు తాను ప్రకటించుకుని అమెరికాలో ఉంటున్న చంద్రకాంత్ చక్రవర్తి మధ్యవర్తిత్వంతో స్కూనర్ అనీ లారెన్స్ ఓడకు ఆ ఆయుధాలను ఎక్కించారు. ఈ ఓడ 1915 మార్చి ప్రాంతంలో శాన్‌డీగో నుంచి బయలుదేరింది. మెక్సికోకు సమీపంలో ఉన్న సోకొరో అనే దీవికి వెడుతున్న చమురు నౌక దీని వెనకే ఉంది. దాని పేరు ఎస్‌ఎస్ మావెరిక్. నిజానికి ఇదే అనీ లారెన్స్‌కు మార్గదర్శి. కానీ మావెరిక్‌కు ఒక దశలో వచ్చిన మరమ్మతుతో అనీ లారెన్స్‌కు దూరమైంది.
అనీ లారెన్స్ కోసం ఎంతో వెతికిన మీదట మావెరిక్ మళ్లీ వాషింగ్టన్‌కు వెళ్లిపోయింది. దీనితో అందులోని ఆయుధాలు అమెరికా కస్టమ్స్ అధికారులకు పట్టుబడిపోయాయి. ఈ విషయాన్ని అమెరికా ఇంగ్లండ్‌కు చేరవేసింది. మావెరిక్‌ను కెప్టెన్ పసిఫిక్ మీదుగా డచ్ ఈస్టిండీస్‌కు చేర్చుతూ తమ నౌకలో ఆయుధాలు ఏమీ రాలేదనీ, కొంత విప్లవ సాహిత్యం, కొందరు విప్లవకారులు మాత్రమే వచ్చారని జర్మనీకి తెలియచేసింది. ఈ విషయం తెలియక పాపెన్ రెండో దఫా ఆయుధ సంపత్తిని కూడా బెర్లిన్ కమిటీ మరొక ప్రతినిధి హన్స్ టాషెర్ ద్వారా ఓడ ఎక్కించాడు. 1915 జూన్ నెల మధ్యలో హాలెండ్ అమెరికన్ స్టీవ్‌ు షిప్ ఎస్‌ఎస్ డెంబర్‌లో ఇవి ఈస్ట్ ఇండీస్‌లోని సురాబాయా వెళ్లాయి. ఇదంతా బ్రిటిష్ పాలకులను మూకుమ్మడిగా హత్య చేయాలన్న ఒక పథకం. అందుకు ఎంచుకున్న సమయం 1915 డిసెంబర్ 25. అదే క్రిస్మస్ కుట్ర.
ఏటా క్రిస్మస్‌కు బెంగాల్ గవర్నర్ బ్రిటిష్ ప్రముఖులకు విందు ఇస్తాడు. ఆ సమయంలో దాడి చేయడమే ఈ పథకం లక్ష్యం. థాయ్‌లాండ్, బర్మాలలో జర్మనీ ప్రతినిధులు ఎమిల్, థియోడర్ హెల్ఫ్‌రిచ్. జుగాంతర్ సభ్యుడు జతీంద్రనాథ్ లాహిరి ద్వారా వీరంతా 1915 మార్చి ప్రాంతంలో జతిన్ ముఖర్జీతో లంకె ఏర్పరుచుకోగలిగారు. ఆ తరువాతే జతీంద్రనాథ్ లాహిరీ, నరేంద్రనాథ్ భట్టాచార్యలను బాఘా జతిన్ బటేవియాకు పంపాడు. అక్కడ జర్మన్ దౌత్యవేత్త ద్వారా హెల్ఫ్‌రిచ్ సోదరులను నరేంద్రనాథ్ కలుసుకోగలిగాడు. అక్కడే మావెరిక్ ఓడ ద్వారా ఆయుధాలు బంగాళాఖాతం తీరానికి చేరుతాయన్న వార్త అందుకున్నారు. బాలసోర్‌లో జతిన్ బృందం వాటిని స్వాధీనం చేసుకోవాలి. జుగాంతర్ సంస్థకు 1915 జూన్–ఆగస్ట్ నెలల మధ్య హెల్ఫ్‌రిచ్ సోదరుల నుంచి హ్యారీ అండ్ సన్స్ ద్వారా 33,000 రూపాయలు నిధులుగా అందాయి.
కలకత్తాకు చెందిన 14వ రాజపుట్ రెజిమెంట్ తన మాట వింటుందని, బాలసోర్ దగ్గర కలకత్తాతో సంబంధాలు కత్తిరిస్తే బెంగాల్‌పై పట్టు సాధించవచ్చునని బాఘా జతిన్ భావించాడు. బెంగాల్‌ను స్వాధీనం చేసుకోవడానికి విప్లవకారులకు చాలినంత సమయం ఉండేటట్టు చేయడానికి థాయ్‌లాండ్ నుంచి వచ్చే ఆయుధాలతో బర్మాలో తిరుగుబాటు చేయాలని కూడా పథకం వేశాడు. దీనికే సయాంబర్మా పథకమని పేరు. ఈ పథకాన్ని 1914 అక్టోబర్‌లో గదర్ పార్టీ రూపొందించింది. ఇందుకోసం చైనా, అమెరికా గదర్ పార్టీ శాఖల సభ్యులు, షాంఘై నుంచి ఆత్మారావ్‌ు, థకార్‌సింగ్, బంతాసింగ్; శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి సంతోఖ్‌సింగ్, భగ్వాన్‌సింగ్ వంటి వారు బర్మా మిలిటరీ పోలీసులను థాయ్‌లాండ్‌లో చొప్పించే పని చేపట్టాలని కూడా నిర్ణయించారు. 1915లోనే ఆత్మారావ్‌ు కలకత్తా, పంజాబ్‌లలో పర్యటించి జుగాంతర్ సంస్థ సభ్యులు సహా, ఇతర విప్లవకారులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు.
సయాంలో ఉన్న భారతీయులకు సాయుధ శిక్షణ ఇవ్వడానికి హేరంబాలాల్ గుప్తా, షికాగోలోని జర్మనీ దౌత్యవేత్త మనీలా మార్గం ద్వారా నలుగురిని పంపించారు. బర్మా మిలిటరీ పోలీసులను థాయ్‌లాండ్‌లో చొప్పించే పని అయ్యాక సంతోఖ్‌సింగ్ తిరిగి షాంఘై వెళ్లి, రెండు బృందాలను బర్మాకు పంపే ఏర్పాట్లు చేశాడు. కానీ ఇందులో కొన్ని ప్రయత్నాలను అమెరికా నిరోధించగలిగింది. అయినా థాయ్‌లాండ్‌లోని జర్మనీ దౌత్యవేత్త రెమీ థాయ్–బర్మా సరిహద్దులలోని అడవులలో ఒక శిబిరం ఏర్పాటు చేసి చైనా, కెనడాల నుంచి వచ్చే గదర్ పార్టీ సభ్యులకు సాయుధ శిక్ష ఇచ్చే ఏర్పాట్లు చేశారు. షాంఘైలో ఉన్న జర్మన్ కౌన్సిల్ జనరల్ నిప్పింగ్ పెకింగ్ భద్రతాదళాలలో పనిచేస్తున్న ముగ్గురు అధికారులను స్వాటో అనే చోటికి పంపాడు.
అక్కడున్న నార్వే ప్రతినిధికి ఆయుధాల స్మగ్లింగ్‌లో తర్ఫీదు ఇవ్వడానికి ఆ ముగ్గురిని పంపాడు. అదే సమయంలో జతిన్ నాయకత్వంలో బెంగాల్ మీద, అండమాన్‌లోని పీనాల్ కాలనీ మీద జర్మనీ బృందం దాడి చేయాలని కూడా యోచించారు. వందమంది ఉండే జర్మనీ బృందానికి వాన్ ముల్లర్ అనే మాజీ నౌకాదళ అధికారి నాయకత్వం వహిస్తాడు. ఈ పథకమంతా బటేవియాలో ఉండే జర్మనీ జాతీయుడు, తోటల యజమాని విన్సెంట్ క్రాఫ్ట్‌దే. 1915 మే 14న దీనినే ఇండియన్ కమిటీ ఆమోదించింది.
కానీ హఠాత్తుగా పోలీసులకు సమస్తం తెలిసిపోయింది. బెంగాల్, ఒడిశాలలోని రహస్య ప్రదేశాలను చుట్టుముట్టారు. హ్యారీ అండ్ సన్స్ మీద దాడులు జరిగాయి. కప్తిపదాలో జతిన్ ఉన్న సంగతి తెలిసిపోయింది. అతడిని అక్కడ నుంచి వెళ్లిపొమ్మని ముందే సమాచారం వచ్చినా, జతీశ్, నిరేన్ అనేవారి కోసం ఎదురుచూడడంతో కొన్ని గంటలు ఆలస్యమైంది. వారంతా అడవుల గుండా బాలసోర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ పోలీసులకు ఎదురుపడ్డారు. కాల్పులు జరిగాయి. చాలామంది జతిన్ అనుచరులు చనిపోయారు.
బాగా గాయపడిన జతిన్ బాలసోర్ ఆసుపత్రిలో చేర్చగా అక్కడే చనిపోయాడు. సయాం, బర్మాలలో కూడా దాడులు జరిగాయి. ఆరుగురు గదర్ వీరులను పట్టుకుని ఉరితీశారు. ఇన్ని దేశాల సహకారంతో ఇంత పకడ్బందీగా వేసిన పథకం ఎలా బయటపడిపోయింది? అండమాన్‌కు ఆయుధాలు చేర్చాలన్న నిప్పింగ్ పథకం గురించి బ్రిటిష్ నిఘా విభాగానికి ఎలా తెలిసింది? ఎవరైతే ఈ పథకం రచించాడో, అతడు విన్సెంట్ క్రాఫ్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చేశాడు. ఇతడు డబుల్ ఏజెంట్ (శత్రుదేశం కోసం పనిచేసే దేశ పౌరుడు).
బెంగాల్‌లో 1909లో తొలి క్రిస్మస్ కుట్ర జరిగింది. మళ్లీ 1915లో జరిగింది. రెండో కుట్రలో జర్మనీ నిర్వహించిన పాత్రతోనే తరువాత ఆ దేశం మీద సుభాష్‌చంద్ర బోస్ నమ్మకం పెంచుకున్నారా? కావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment