స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం సాగిన సమరంలోని ప్రతి కదలిక.. ప్రతి సందర్భం చిరస్మరణీయం! నిత్య ప్రేరణ.. స్ఫూర్తి!! భారత స్వాతంత్య్ర పోరాటంలోని అలాంటి ఘట్టాలను అమృతోత్సవ నేపథ్యంలో ప్రతి వారం ‘కాలరేఖలు’ పేరుతో కథనాలుగా అందిస్తున్నాం.
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక నేపథ్యంలో స్మరించుకోవలసిన మరొక తేదీ–జూన్ 3, 1947. భారతదేశానికి ‘అధికార బదలీ’ చేస్తున్నట్టు ఇంగ్లండ్ ప్రకటించిన రోజు. దాదాపు తొమ్మిది దశాబ్దాల స్వరాజ్య సమరం ఆ రోజుతో ముగుస్తుంది. ఆ పోరు చాలా పంథాలలో సాగినా జాతీయ కాంగ్రెస్‌కు ఆ కీర్తి దక్కింది. ముస్లింలీగ్ ఆశయం నెరవేరింది.
హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ప్రాంతాన్ని భారత్ అని, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ అని ఇంగ్లిష్ ప్రభువులు నామకరణం చేశారు. పెద్ద దేశం! ఇన్ని సంస్కృతులు, భాషలు, వైవిధ్యం ఉన్న ప్రజలను విభజించడానికి ప్రాతికపదిక ఏమిటి?
భారతీయులకు ‘అధికార బదలీ’ (స్వతంత్రం అన్నమాట లేదు) చేస్తున్నట్టు 1947 ఫిబ్రవరి 20న నాటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ (లేబర్ పార్టీ) వారి పార్లమెంట్‌లో ప్రకటించాడు. అందుకు ముహూర్తం జూన్, 1948. అక్షరాలా జూన్, 1948. ఈ ప్రక్రియని వేగంగా పూర్తి చేయడానికి ఏరి కోరి పంపిన వ్యక్తి, ఆఖరి వైస్రాయ్ లార్డ్ లూయీ ఫ్రాన్సిస్ అల్బర్ట్ విక్టర్ ‘డికీ’ మౌంట్‌బాటన్.
విభజన వాదంతో భారత్ రక్తమోడుతున్న క్షణాలలో, మార్చి 22న మౌంట్‌బాటన్ భారత్‌లో అడుగుపెట్టాడు. వెంటనే నేతలతో చర్చించాడు. విభజనకి గాంధీజీ అంగీకరించలేదు. ‘నా శవం మీద విభజన జరగాలి’ అన్నాడాయన. ఆ వేసవిలో నెహ్రూను సిమ్లాకు ప్రత్యేక అతిథిగా పిలిచి విభజన ప్రణాళికను ఆయన ముందుంచాడు వైస్రాయ్. నెహ్రూ మండిపడ్డాడు. తరువాత విభజన పట్ల కాస్త మెత్తబడినా మిగిలిన విషయాలకు జాతీయ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగానే ఉన్నారు.
దీనితో తన వ్యక్తిగత సిబ్బందిలోని ఏకైక భారతీయుడు వీపీ మేనన్ (రాజ్యాంగ వ్యవహారాల సలహాదారు)ను కొత్త ప్రణాళిక తయారు చేయమని మౌంట్‌బాటన్ ఆదేశించాడు. ఆ ప్రణాళికను తీసుకుని మౌంట్‌బాటన్ లండన్ వెళ్లాడు. దీనిలో కీలకాంశమూ విభజనే. దీనిని ఆమోదించడానికి అట్లీ మంత్రిమండలి తీసుకున్న సమయం ఐదు నిమిషాలే. మే 31న మౌంట్‌బాటన్ భారత్ తిరిగి వచ్చాడు.
మళ్లీ చర్చలు. పటేల్, రాజాజీ వంటివారు ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు. ఇది తక్కువ ప్రమాదకర ఆలోచన అన్నాడు నెహ్రూ. నిజానికి విభజన కోరి తప్పు చేశామని ముస్లింలీగ్ పశ్చాత్తాపపడుతుందని నాడు చాలామంది నమ్మినట్టు సమకాలికుల అభిప్రాయంగా నమోదైంది.
1947 జూన్2న వైస్రాయ్ హౌస్ (నేటి రాష్ట్రపతి భవన్)లో సమావేశం. అది జరగడానికి రెండు మూడు గంటల ముందు కూడా జిన్నా అంగీకరించలేదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలతో పాటు అస్సాం కూడా పాకిస్తాన్‌లో ఉండాలని ఆయన కోరిక. అది కుదరకపోవడంతో ‘చిమ్మెటలు కొట్టేసిన గుడ్డ’ ఎందుకు అన్నాడు. అయితే ముస్లింలీగ్ నేతలతో తానే మాట్లాడతానని మౌంట్‌బాటన్ బెదిరించడంతో ఎట్టకేలకు జిన్నా అంగీకరించాడు.
మధ్యాహ్నం రెండు గంటలకు జాతీయ కాంగ్రెస్ నేత/ తాత్కాలిక ప్రభుత్వ (1946 సెప్టెంబర్ 2న ఏర్పడింది) ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ, హోమ్ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్‌పటేల్, కాంగ్రెస్ అధ్యక్షుడు జేబీ కృపలానీ, ముస్లింలీగ్ తరఫున మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ (నెహ్రూ మంత్రిమండలిలో ఆర్థికమంత్రి), అబ్దుల్ రబ్ నిష్తార్ (మరొక మంత్రి), సిక్కుల తరఫున బలదేవ్ సింగ్ (రక్షణ మంత్రి) పిలుపు మేరకు వచ్చారు. మౌంట్‌బాటన్, వైస్రాయ్ సలహాదారు ఎరిక్ మీవిల్లె, సిబ్బంది ప్రధాన అధికారి లార్డ్ ఇస్మే ఉన్నారు.
మొత్తం తొమ్మిది మంది. విభజన ప్రణాళిక లేదా మౌంట్‌బాటన్ పథకం లేదా జూన్ 3 పథకానికి వీరే ఆమోదముద్ర వేశారు. విభజనతో కూడిన అధికార బదలీ గురించి జూన్ 3న రేడియోలో మౌంట్‌బాటన్, నెహ్రూ, జిన్నా, బల్‌దేవ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. ఆ సాయంత్రమే బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభ ఆమోదించింది. జూన్ 15న వాగ్వాదాల మధ్య ఏఐసీసీ కూడా అంగీకరించింది.
ఒక ప్రశ్న! విభజిస్తూనే కావచ్చు, భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఈ సమావేశంలో స్వతంత్ర సమర సారథి గాంధీజీ ఎక్కడ?
గాంధీ ఆ సమావేశంలో ఉండడం మౌంట్ బాటన్‌కు ఇష్టంలేదు. ఆయన అంతరంగాన్ని బట్టే కాంగ్రెస్‌నేతలు వ్యవహరించారు.
నిజానికి ఆ రోజు ఉదయం పదకొండు గంటల వేళ మను, అభాల సాయంతో గాంధీ వైస్రాయ్ హౌస్‌కు వెళ్లారు. ఒక లేఖ ఇచ్చి ‘మౌనంగా’ నిష్క్రమించారు. అంతే. ఆ లేఖలో ఏముంది?
‘నన్ను మన్నించండి! నేను మాట్లాడలేను. కానీ ప్రతి సోమవారం మౌనవ్రతం పాటించాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు రెండు మినహాయింపులు చేసుకున్నాను. అవి, అత్యవసర అంశాల మీద అత్యున్నత స్థాయి వ్యక్తులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, లేదా అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించవలసినప్పుడు తప్ప. అయితే ఇప్పుడు నేను మౌనం వీడరాదనే మీరు కోరుకుంటున్నారు. నా ఉపన్యాసాలలో మీకు వ్యతిరేకమైన మాట ఎప్పుడైనా మాట్లాడానా? లేదని మీరు ఒప్పుకుంటే ఈ ఆంక్ష అనవసరం. అయినా మీతో తప్పనిసరిగా మాట్లాడవలసిన ఒకటి రెండు విషయాలు ఉన్నాయి. అవైనా ఇవాళ కాదు. మళ్లీ మనం కలుసుకునే అవకాశం వస్తే మాట్లాడతాను.’
-డా. గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment