సహాయ నిరాకరణోద్యమం సాగుతున్న క్రమంలోని అద్భుత ఘట్టమే చీరాల–పేరాల ఉద్యమం. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య దీనికి నేతృత్వం వహించారు. నాటి గుంటూరు జిల్లాలో చేనేత, రంగుల అద్దకం వంటి వృత్తులతో జీవించే జనాభాతో ఉన్నదే చీరాల యూనియన్. చీరాల, జాండ్రపేట, పేరాల, వీరరాఘవపేట గ్రామాలు కలిపి చీరాల పంచాయతీ యూనియన్. 1919 నవంబర్‌లో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం చీరాల–పేరాల కలిపి మునిసిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్టు ఆకస్మికంగా ప్రకటించింది.
మునిసిపాలిటీ ఆవిర్భవిస్తే అప్పటిదాకా రూ.4 వేలుగా ఉన్న పన్నులు పదిరెట్లు, అంటే రూ.40 వేలకు చేరతాయి. ఈ పరిణామం ప్రజలకు ఆందోళన కలిగించింది. 1920 ఫిబ్రవరి 20న రేట్ పేయర్స్ అసోసియేషన్ పేరుతో స్థానికులు నిరసన ప్రదర్శనలు చేశారు. అయినా రెండు నెలలలోనే చీరాలను మునిసిపాలిటీగా మార్చినట్టు ప్రకటన వచ్చింది. ఆర్‌డీఓ చైర్మన్‌గా, పదకొండు మంది కౌన్సిలర్లతో ప్రభుత్వమే కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. పన్నులు కట్టలేమని ప్రజలు ఆర్‌డీఓకు విన్నవించుకున్నారు. ‘ముందు పన్నులు కట్టండి, తరువాత అప్పీలు సంగతి చూద్దాం’ అన్నాడాయన. ఈమాట నమ్మి ఆరుమాసాల పన్నులు చెల్లించారు. కానీ ప్రభుత్వం కనికరించే సూచనలేవీ కానరాలేదు.
అప్పుడు బ్రిటిష్ రాజభక్తి నరనరాన నింపుకున్న జస్టిస్ పార్టీ మద్రాస్ ప్రెసిడెన్సీని ఏలుతున్నది. అలాంటి జస్టిస్ పార్టీ ప్రభుత్వానికి కళ్లు బైర్లు కమ్మే పరిణామం చీరాలలో జరిగింది. ప్రజల ఆవేదన వాస్తవమేనంటూ ప్రభుత్వం నియమించిన పదకొండు మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. చివరకు మద్రాస్ ప్రెసిడెన్సీ స్థానిక స్వయంపాలన వ్యవహారాల మంత్రి రాజా రామరాయణింగార్ (పానగల్ రాజా) కౌన్సిల్ అభిప్రాయాన్ని చెత్తబుట్టలో వేసి 1921 ఏప్రిల్ 1న ఒక చైర్మన్‌ను నియమించారు.
దీంతో మండిపడ్డ జనం టోల్‌గేట్‌ను ధ్వంసం చేసి, రైలు పట్టాల మీద వేసి దహనం చేశారు. వందమంది రిజర్వు పోలీసుల సాయంతో చైర్మన్ ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. పన్నులు కట్టని నేరానికి పన్నెండు మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. వారిలో ఒకరు రావూరి అలిమేలుమంగమ్మ, నిరుపేద మహిళ. గాంధీయుగం ఆరంభమైన తరువాత రాజకీయ నేరారోపణతో దేశం మొత్తం మీద జైలుకు వెళ్లిన తొలి మహిళ అలిమేలుమంగమ్మ.
గోపాలకృష్ణయ్య నాయకత్వం
‘బ్రిటిష్ సామ్రాజ్యంలో రవి అస్తమించడంటారు. ఎందుకో తెలుసా? చీకట్లో ఇంగ్లిష్ వాళ్లని నమ్మడం మరీ కష్టం!’ అని ఒక సందర్భంలో వ్యాఖ్యానించిన ధైర్యశాలి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. జాతీయోద్యమంలో చేరిన ఆయన అప్పటికే భార్య ఆరోగ్యం కోసం చీరాల వచ్చారు. తిలక్ స్వరాజ్య నిధి వసూలులో భాగంగా బెజవాడ నుంచి ఏప్రిల్ 6న చీరాల వచ్చిన గాంధీ పన్నుల చెల్లింపునకు నిరాకరించి జైలుకు వెళ్లిన అలిమేలుమంగమ్మ సహా అందరినీ సత్కరించారు. అప్పుడే గాంధీని గోపాలకృష్ణయ్య సలహా కోరగా, ‘మీరు చేసే కార్యం విజయవంతమైతే కాంగ్రెస్ మిమ్మల్ని అభినందిస్తుంది.
అపజయం పొందితే ఆ బాధ్యత కాంగ్రెస్ తనపై పెట్టుకోదు’ అంటూ మెలిక పెట్టారు. చీరాల శివార్లలోని భూములలో రావ్‌ునగర్ పేరిట ఒక గ్రామాన్ని నిర్మించారు గోపాలకృష్ణయ్య. 1921 ఏప్రిల్ 25 నడి రాత్రి వేసవి చీరాలపేరాల ప్రజలు పేద, ధనిక; ఉన్నత, చిన్న కులాల తేడా లేకుండా అంతా తమ సామగ్రితో తాత్కాలికంగా నిర్మించిన రావ్‌ునగర్‌కు ప్రయాణమయ్యారు. గోపాలకృష్ణయ్య అక్కడే పంచాయతీ, న్యాయ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ‘అక్కడ గవర్నర్ పాలన లేదు, ఉన్నదల్లా గోపాలకృష్ణయ్య పాలనే’ అని ఆ ఏడాది మార్చి 31న విజయవాడలో చిత్త రంజన్‌దాస్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడతాయి.
తనను నమ్మి రావ్‌ునగర్‌కు వచ్చిన పేదలను ఆదుకోవడం గోపాలకృష్ణయ్యకు శక్తికి మించిన పనే అయింది. టంగుటూరి ప్రకాశం పంతులు రూ.3 వేలు విరాళం ఇచ్చారు. నిధి వసూలు కోసం 1921 సెప్టెంబర్ 28న బరంపురంలో జరిగిన ఆంధ్ర మహాసభలకు దుగ్గిరాల హాజరయ్యారు. ఆ వేదిక మీద మంత్రి రామరాయణింగార్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. దాంతో గుంటూరు జిల్లా కలెక్టర్ టీజీ రూథర్‌ఫర్డ్ సంతకంతో ఆ రోజు సాయంత్రం వారెంట్ జారీ అయింది. గోపాలకృష్ణయ్య రెండు నెలల పాటు ఎక్కడా నోరు విప్పరాదని దాని సారాంశం. ఆ ఆదేశాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ప్రకటించారాయన.
అక్టోబర్ 1న అరెస్టు చేసి తిరుచ్చి జైలుకు తరలించారు. 1922 అక్టోబర్‌లో విడుదలయ్యారు. గోపాలకృష్ణయ్య జైలుకు వెళ్లాక రామ్‌నగర్ ఉద్యమం సడలి పోయింది. చీరాలపేరాల ప్రజలు పన్నులు చెల్లించకుండా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేశారు. కానీ గాంధీ తన అహింసా సిద్ధాంతం ప్రాతిపదికగా జరిగిన ఓ గొప్ప ప్రజా ఉద్యమానికి సహాయ నిరాకరణ చేయడమే చారిత్రక వైచిత్రి. ఏమైనా, పదకొండు మాసాల పాటు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వినూత్నంగా నిరసన చెప్పడం చరిత్రలో అపురూపమైన విషయం. నాటి ప్రజానీకం ఓడినా, చీరాలపేరాల ఉద్యమం చరిత్రలో తన స్థానాన్ని గెలుచుకుంది.
- డా. గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment