indipendence movement
-
ఆజాద్ హింద్ ఫౌజ్.. ఖుషీ కే గీత్ గాయే జా..!
ఆ ప్రశ్న ఎందుకు వేశానా అనిపించింది. అలా అడిగాక మొదట అతడు చేసిన పని, తటాల్న నాకేసి చూడడం. నన్ను చూస్తూనే బుగ్గల మీద ఎడం చేత్తో రాసుకున్నాడు, కొన్ని సెకన్లు. దంతాలు ఊడి లోతుకుపోయిన బుగ్గలు. ఓ నిమిషం తరువాత అతడి ముఖంలో చిన్న నవ్వు. అప్పుడే కళ్లూ మెరిశాయి, ఒక్కసారిగా. ‘చూశాను బాబూ!’ స్థిరంగా అన్నాడతడు. అతని గొంతుపెగిలాక నా మనసు శాంతించింది. పాట అందుకుంటే రెండు వీధుల అవతల ఉన్నా ఖంగుమంటూ వినిపించే ఆ గొంతు అంత మార్దవంగా, అంత మంద్రంగా స్పందించడం కొంచెం వింతే. ఎంత గొప్పగా పాడతాడో ఆ పాటలన్నీ ‘కదం కదం బఢాయే జా, ఖుషీ కే గీత్ గాయే జా.. ఏ జిందగీ హై కౌవ్ుకీ, తో కౌవ్ు పే లుటాయే జా..’ ఒళ్లు గగుర్పొడుస్తుంది. సాగిపో సాగిపో మున్ముందుకు, ఆనందగీతికలను ఆలపిస్తూ సాగిపో, నీ జీవితాన్ని మాతృభూమి కోసం అర్పించుకో ఎంత బలమైన భావన. ఇదే కాదు శుభ్ సుఖ్ చైన్ కీ బర్ఖా బర్సే, ఎక్ల చొలో, హవ్‌ు దిల్లీ దిల్లీ జాయేంగే, చలో దిల్లీ వంటి పాటలూ పాడతాడు. శ్రీరాములు, కొల్లి శ్రీరాములు.. ఒంటి మీద ఖాకీ మిలటరీ యూనిఫారవ్ు. టక్ చేసుకున్నాడు. అప్పటిదే కాబోలు ఆ యూనిఫారవ్ు. శిథిలమైపోయినట్టున్నా, రంగు మాత్రం వెలిసిపోలేదు. అతడు ఒక వయసులో ఎలా ఉన్నాడో చెబుతూ, ఆ శరీరం మీద ఇప్పుడు వేలాడిపోతోంది. దాని వయసు కనీసం యాభయ్ ఏళ్లు. కాళ్లకి బూట్లతోనే బాసిం పట్టు వేసుకుని నేల మీద కూర్చున్నాడు. బూట్లు కూడా అప్పటివేనేమో! స్లాబ్ పనివాళ్ల బూట్లలా ఉన్నాయి. ఆ రూపం చిన్నతనం నుంచి మేం చూస్తున్నదే. మామూలు బట్టల్లో ఏనాడూ చూసిందిలేదు. జుట్టు మరీ ముగ్గుబుట్ట కాలేదు. కొద్దిగా నల్ల వెంట్రుకలూ ఉన్నాయి. నడినెత్తి మీద నుంచి వెనక్కే. ముందంతా బట్టతల, వెనక జులపాలు. నల్లటి శరీరం. నుదురు కింద లోతుకు పోయిన కళ్లు. ఆ మహావ్యక్తిని చూసిన కళ్లు ఇవే! అదృష్టం చేసుకున్నాయి! ‘ఎక్కడ చూశావు శ్రీరాములు?’ ‘బర్మాలో బాబూ!’ ఏదో లోకంలో ఉన్నట్టే ఆ మాటలన్నాడు. నేను ఐదో తరగతిలో ఉండగా, ఓ ఆగస్ట్ 15 పండుగకి ఒక సన్నివేశంలో అతడిని చూసినప్పటి నుంచి నాకు ఓ రకమైన సానుభూతి.. శ్రీరాములంటే. నాన్నగారు చెప్పినదానిని బట్టి గౌరవం కూడా. మా ఇంటి బయటకొచ్చి నిలబడినా మేం చదువుకున్న ఆ స్కూలు కనిపిస్తూనే ఉంటుంది. కొంచెం ఇవతలే అమ్మవారి గుడి. దానికి దగ్గరగా గ్రామ పంచాయతీ కార్యాలయం. ఆ ఘటన జరిగింది ఆ కార్యాలయం ముందే. శ్రీరాములుకి గుర్తుందో లేదో! దారే కాబట్టి ఆ కార్యాలయం ముందు నుంచి పాడుకుంటూ అతడు ఎప్పుడు నడిచి వస్తున్నా, వెళుతున్నా నాకు మాత్రం ఆ సన్నివేశమే గుర్తుకొస్తుంది. తరువాత అతడిని చూస్తున్న కొద్దీ నాకూ అనిపించేది, ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాలేదు. ఎందరికో ఉన్న అభిప్రాయమే. అలా చూస్తూనే ఉన్నాం. ఏళ్లు గడచిపోయాయి. పదిరోజులకీ, పదిహేను రోజులకీ ఒకసారి ఇంటిముందుకొచ్చి అరుస్తాడు, అటెన్షన్లో నిలబడే, ‘బోసుబాబు అనుచరుడినొచ్చానయ్యా! ధర్మం చెయ్యండి!’ బిచ్చగాళ్లు వచ్చినప్పుడు వేయడానికి సావిట్లో నల్లటి రేకు డబ్బా ఉంటుంది, బియ్యంతో. రెండు కేజీల వరకు పడుతుంది. అంతకంటే పెద్ద డబ్బాలో వడ్లు ఉంటాయి. కొందరికి బియ్యం, కొందరికి ధాన్యం. ఎవరికైనా దోసెడు. నాన్నగారు ఎప్పుడో చెప్పేశారు, శ్రీరాములిని అలా చూడకండని. అందుకే ఎప్పుడొచ్చి నిలబడినా డబ్బా నిండుగా బియ్యం పట్టుకొచ్చి అతడి పాత్రలో పోస్తాం. శ్రీరాములుని చూడగానే ‘జైహింద్’ అనేవారు పిల్లలు. అతడు ఉరిమినట్టు ఇంకా గట్టిగా అనేవాడు, కాలుని నేలకి బలంగా తాటించి, సెల్యూట్ చేస్తూ. ఆ నినాదం ఇచ్చినందుకు పిల్లలని సంతోషపెట్టడం తన కర్తవ్యం అనుకునేవాడు కాబోలు. ఒక్కొక్క వస్తువుని లేదా జంతువుని కొన్ని భాషలలో ఏమంటారో చెప్పేవాడు. ‘కుక్క.. తెలుగులో కుక్క, హిందీలో కుత్తా, ఇంగిలీసులో డాగ్, బర్మాలో హావె, తమిళంలో నాయీ, బెంగాలీలో కుకురో..’ అంటూ చెప్పేవాడు. కానీ ఈ ప్రవర్తనే అతడి మీద మతి స్థిమితం లేనివాడి ముద్ర వేసింది. అది నిజమే, శ్రీరాములుకి మతి చలించిందని నాన్నే చెప్పారు. అలా జరిగిందీ ఒక సందర్భంలోనే. ఇలా కథలు కథలుగా చెప్పుకునేవారు. ఎప్పటి నుంచో శ్రీరాములుతో మాట్లాడాలని చూస్తుంటే, అనుకోకుండా ఈ రోజు సాధ్యపడింది, నేను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు. అతడి మీద ఇంకాస్త వృద్ధాప్యం పడింది. అప్పుడే ఏదో గుర్తుకు వచ్చినట్టు, పై జేబులోంచి బంతిలా చుట్టిన ఒక గుడ్డ తీశాడు, ఖాకీదే. మడత విప్పాక తెలిసింది, అది ఖాకీ టోపీ. ఎంతో భక్తిగా, పద్ధతిగా శిరస్సున అలంకరించుకున్నాడు. ఆ టోపీతో ముఖం ఏదో ప్రత్యేకతని సంతరించుకుంది. సుభాష్‌చంద్ర బోస్ రూపం నా దృష్టిపథంలోకి వచ్చి నిలిచింది వెంటనే. అలాంటిదే టోపీ. ఔను, శ్రీరాములు ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పనిచేసి వచ్చాడు. లోపలికి రమ్మని పదిసార్లు పిలిస్తే మొత్తానికి వచ్చాడు. దూరంతో కూడిన చనువు, మా ఇంట్లో. నేరుగా పెరట్లోకి వెళ్లాం. బావి చూడగానే నీళ్లు తోడుకుని తాగాడు. తడి ముఖంతో, చేతులతో అక్కడే మొక్కల మధ్య ఖాళీ స్థలంలో నేల మీద చతికిలపడ్డాడు. కాస్త ఎత్తుగా ఉండే నూతిపళ్లెం అంచున నేను కూర్చున్నాను. ‘విలేకరుగారు, అమ్మగారు..?’ ఉన్నారా అన్నట్టు అడిగాడు. ‘లేరు, పెళ్లికెళ్లారు. ఏమైనా చెప్పాలా?’ అన్నాను. విలేకరుగారంటే మా నాన్నగారే. ఆ చుట్టుపక్కల ఆయనకు అదే పేరు. ఆంధ్రప్రభకి గ్రామీణ విలేకరి. ఏమీ లేదన్నట్టు తలాడించి, మళ్లీ మౌనం దాల్చాడు శ్రీరాములు. వాస్తవానికి అతడు ఏదో జ్ఞాపకపు గాలానికి చిక్కుకున్నాడనాలి. రెండు నిమిషాల తరువాత మళ్లీ అడిగాను. ‘సుభాష్ బోస్ ఎలా ఉండేవారు?’ ‘శివాలయంలో నందంత అందంగా, కొట్టొచ్చినట్టు ఉండేవారు బాబూ!’ ఒక ఉద్యమ నేత మీద ఎంత గౌరవం ఉంటుందో బాగా అర్థమయింది. ఆ మాట అంటున్నప్పుడు అతడి రెండు చేతులూ నమస్కరిస్తున్నట్టు కలసి గాల్లోకి లేచాయి. నేత్రాలు అర్ధనిమీలితాలయ్యాయి. మద్దూరి అన్నపూర్ణయ్య గారని, ఆయన సుభాష్‌చంద్ర బోస్‌ని రాజమండ్రి తీసుకువచ్చినప్పుడు శ్రీరాములు మొదటిసారి విన్నాడట ఆ పేరు. ఈ బోస్గారే సింగపూర్‌లో ఐఎన్ఏతో ఉద్యమం మొదలుపెట్టాడని తెలిసిందట. ఒక వేకువన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడట. ఇంకొకరు ఎవరో చెబితే కలకత్తా వెళ్లి, అక్కడి నుంచి బర్మా చేరుకుని మొత్తానికి ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరాడట. ఎవరో ఆజాద్ హింద్ ఫౌజ్ వీరుడు రాసిన స్వీయానుభవమే ఎక్కడో చదివాను. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఓటమితో ఫౌజ్ సైనికులను బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీ తీసుకువచ్చి ఎర్రకోటలో సైనిక విచారణ పేరుతో హింసించారు. యుద్ధఖైదీల్లా కాదు, నేరగాళ్లని చూసినట్టు చూశారు. రెండురోజులకీ మూడురోజులకీ ఒకసారి తిండి పెట్టేవారు. అలాంటి పరిస్థితిలో కొందరిని పరుగెట్టమని, వెనక నుంచి కాల్చి చంపారు కూడా. బతికి బయటపడి ఢిల్లీ నుంచి శ్రీరాములు కోనసీమలో తన స్వగ్రామానికి వచ్చాడని నాన్నగారు చెప్పేవారు. ఆ ఒక్కరోజే అతడు హీరో. ఎలా వెళ్లాడో, ఎలా వచ్చాడో! స్వాతంత్య్రం వచ్చింది. ఊరూవాడా ఉత్సవాలు జరిగాయి. స్వాతంత్య్ర పోరాటం తరువాత చాలామంది స్వాతంత్య్ర సమరయోధులకి జీవనపోరాటం ఎదురైంది. అలాంటి వాళ్లలో శ్రీరాములూ ఉన్నాడు. అసలు ప్రశ్న. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన విషయం శ్రీరాములుకి స్పృహలో ఉందో లేదో! నాకు ఎప్పటికీ గుర్తుంటుందన్న ఆ సందర్భం ఆగస్ట్ 15నే జరిగింది. అంటే శ్రీరాములు అనే ఓ స్వాతంత్య్ర సమరయోధుడి జీవితంలో ఆ రోజు కూడా భిక్షాటనతోనే గడిచింది. శ్రీరాములు గాథంతా నాన్నగారు వార్తాకథనంగా రాశారు. చాలామంది సమరయోధులకి పింఛను వచ్చింది. భూములు దక్కాయి. ఉచిత ప్రయాణాలు అమరాయి. తామ్రపత్రాలూ వచ్చాయి. దేశం కోసం జవానుగా మారి చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన శ్రీరాములుకి ఏమీ రాలేదు. కారణం, అతడు దేశం కోసం దేశం బయట నుంచి పోరాడాడట. అది నిజమేనని చెప్పే రికార్డేదీ లేదట. ప్రస్తుతం అతడికి భుక్తి గడవడం కష్టంగా ఉందనీ, ఇస్తే ఏ ఉద్యోగమైనా చేస్తాడంటూ కథనం ముగించారట నాన్న. ఎవరో సహృదయుడు స్పందించాడట. మద్రాస్‌లో ఉంటాడట. పెద్ద ఆఫీసరట. నూట యాభయ్ రూపాయల జీతంతో, ఉండడానికి క్వార్టర్స్ సహా అన్నీ ఇస్తానని పత్రికా కార్యాలయానికి ఉత్తరం రాస్తే, అది నాన్నగారికి చేర్చారు వాళ్లు. ఎందుకో ఏమో, అప్పుడే మూడువారాలైనా మా ఊరివైపు రాలేదట శ్రీరాములు. విషయం చెప్పి, ఇంటికే కబురు చేశారు నాన్న. శ్రీరాములు భార్యే కాబోలు ఎవరితోనో కబురు పెట్టింది, ఇప్పుడు అతడిని అంత దూరం పంపలేమన్నదే దాని సారాంశం. నాన్న వాకబు చేశారు. శ్రీరాములుకు మతి చలించిందని తెలిసింది. బోస్ బతికే ఉన్నాడా? విమాన ప్రమాదంలో మరణించాడా? ఇదే ధ్యాసట కొంతకాలం. కారణం దేశమంతా ఇదే చర్చట. ఎలా తెలుసుకున్నాడో, ఏం తెలుసుకున్నాడో, అంతిమంగా బోస్ మరణించడమే నిజమన్న నిర్ణయానికి వచ్చాడట శ్రీరాములు. అప్పటి నుంచి మనిషి మారిపోయాడు. ఇది జరిగిన కొద్దిరోజులకే చేతికి భిక్షాపాత్ర వచ్చింది. బ్రిటన్ మీద యుద్ధం ప్రకటించిన సైన్యం తన కవాతులో పాడుకున్న దేశభక్తి గీతాలు భిక్షాపాత్రా, కడుపూ నింపుకోవడానికి అభ్యర్థనలుగా ఉపయోగపడుతున్నాయి. ‘మా పొలాలు చూడు అని నీకు చెప్పడానికి మనసొప్పక చెప్పలేదయ్యా శ్రీరాములు. నీకేమిటీ ఖర్మ? వచ్చి మా పొలం పనుల్లో సాయపడు. ఎంతో కొంత ఇస్తాను.’ నాన్నది చిన్నపాటి సేద్యమే అయినా, సాటి స్వాతంత్య్ర సమరయోధుడికి సాయం చేయాలనుకుని, ఈ మాట అన్నారట. ఒక నమస్కారం పెట్టి వెళ్లిపోయాడట. భిక్షాటనలోనే ఉండిపోయాడు. ‘ఇదిగో! ఇది ఉంచు!’ అని పది రూపాయలు, నా పాకెట్ మనీ, అతడి చేతిలో పెట్టాను. మళ్లీ మొహమాటం. ‘తీసుకో ఫరవాలేదు’ అంటే, జేబులో పెట్టుకుని లేచాడు. ‘సెలవిప్పించండి!’ అన్నాడు, సెల్యూట్ భంగిమలో. నేను కూడా లేచాను. సింహద్వారం దాకా వెళ్లాను. నెమ్మదిగా మెట్లు దిగి వీథిలోకి వెళ్లిపోయాడు శ్రీరాములు. ఎదురుగా కనిపిస్తోంది పంచాయతీ కార్యాలయం. ముందు నుంచే నడిచి వెళుతున్నాడతడు. ఆ రోజూ, అతడు పాడిన సందర్భం ఎలాంటి ప్రయత్నమూ లేకుండానే గుర్తుకు వచ్చాయి. ఆ ఆగస్ట్ 15కి కూడా బడి దగ్గర నుంచి మమ్మల్నందరినీ ఉరేగింపుగా తీసుకొచ్చి పంచాయతీ కార్యాలయం ముందు బారులు తీర్చారు. తరగతుల వారీగా నిలబెడుతున్నారు. ఆ పనంతా వీరస్వామి మాస్టారిదే. పిల్లలంతా సిరా నీలం రంగు నిక్కరు, తెల్లచొక్కాలతో, ఆడపిల్లలు కూడా అలాంటి కూడికతోనే గౌన్లు, స్కర్టులతో ముచ్చటగా ఉన్నారు. మా పైనంతా రంగురంగుల కాగితపు జెండాల తోరణాలు. నిటారుగా ఉన్న ఒక సరుగుడు కర్రని కార్యాలయం ముందు పాతిపెట్టారు. దానికే వేలాడుతోంది మువ్వన్నెల జెండా. జెండా కొయ్య మొదట్లో వరసగా మూడు కుర్చీలు. మధ్య కుర్చీలో బోసినవ్వుల గాంధీ ఫొటో. ఒక పక్క నెహ్రూ బొమ్మ, రెండో పక్క బాబూ రాజేంద్రప్రసాద్ బొమ్మ. మూడు ఫొటోలకి మువ్వన్నెల ఖాదీ దండలు. గోలగోలగా ఉందంతా. కార్యాలయం లోపల ఊరి పెద్దలు పది పన్నెండు మంది ఖద్దరు దుస్తుల్లో తిరుగుతున్నారు, హడావిడి చేస్తూ. బడిపిల్లల గోల కంటే ఎక్కువే ఉంది. ఉదయం తొమ్మిది గంటల వేళకి సర్పంచ్‌గారు కష్టపడి జెండా ఎగరేశారు. వెంటనే వీరాస్వామి మేస్టారు ‘జెండా ఊంఛా రహే హమారా.. విజయీ విశ్వతిరంగా ప్యారా’ అంటూ పిడికిలెత్తి ఉద్విగ్నంగా పాడితే మేమంతా ఉత్సాహంగా అనుసరించాం. ఇంకొద్ది సేపటికి మేం ఎదురుచూస్తున్న చాక్లెట్ల పంపకం మొదలయింది. అప్పుడే లోపల పెద్దల చేతికి తలొక ప్యాకెట్ వచ్చింది. ఇడ్లీ కాబోలు. చాక్లెట్లు చేతుల్లో పడినవాళ్లు పరుగెత్తుతున్నారు. ఐదో తరగతి వాళ్లందరం చివర్న ఉన్నాం. లోపల పెద్దలు తినడం పూర్తి చేసి బయటకొచ్చి చేతులు కడుగుతున్నారు. ఒకళ్ల తరువాత ఒకళ్లు.. ఆ నీళ్లు నెమ్మదిగా ముందుకొస్తున్నాయి, సరిగ్గా జెండా కర్ర దిశగా, ఆ మహానుభావుల ఫొటోలు ఉన్న కుర్చీల కిందకే. వీరాస్వామి మాస్టారు, సరోజినీ టీచరమ్మ, మార్తమ్మ టీచరు, హెడ్మాస్టరు శివలపంతులు గారు, ఆయా వెంకమ్మ అట్టపెట్టెలలో తెచ్చిన చాక్లెట్లు పంచుకుంటూ వస్తున్నారు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు శ్రీరాములు. నేరుగా పంచాయతీ కార్యాలయం ముందుకెళ్లి గట్టిగా అరిచాడు, ‘బాబూ! బోసుబాబు అనుచరుణ్ణొచ్చాను. నాక్కూడా ఓ పొట్లం ఇప్పించండి బాబూ!’ ఒక్క నిమిషం ఆగి మళ్లీ అరిచాడు శ్రీరాములు. చేయి కడుక్కోవడానికి బయటకు వచ్చిన ఓ ఖద్దరుధారికి ఆ అరుపు చిర్రెత్తించింది. ఏదో అనబోయాడు గాని, గొంతులో నీళ్లు దిగేదాకా ఆగాడు. ఈసారి పాట అందుకున్నాడు శ్రీరాములు. ‘హవ్‌ు దిల్లీ దిల్లీ జాయేంగే, చలో దిల్లీ..’ ‘ఛ, అవతలకి పో!’ భరించలేనట్టే అసహనంతో అరిచాడు పెద్దమనిషి. పెద్దలకి కలిగిన అసౌకర్యానికి భయపడిన ప్యూను వెంటనే ప్రత్యక్షమై, ‘పైకెళ్లు.. పో, పైకెళ్లు..’ మీదకెళుతూ అన్నాడు, పొమ్మని బిచ్చగాళ్లకి చెప్పేమాట. అలాంటి చీదరింపులకి అలవాటు పడిపోయినట్టు నిర్లిప్తంగా ఉండిపోయాడు శ్రీరాములు. అంతా అటే చూశారు. నిమిషం తరువాత భారంగా కదిలాడు శ్రీరాములు. పంచాయతీ కార్యాలయం దాటి, ముందుకు వెళ్లిపోయాడు. చెట్లపల్లి వారి ఇంటి పక్క నుంచి వెళ్లే కాలిబాటని అనుసరించాడు. రెండు మూడు నిమిషాల తరువాత గాలి మోసుకొచ్చింది పాట. ‘కదం కదం బఢాయే జా.. ఖుషీ కే గీత్ గాయే జా.. ఏ జిందతీ హై కౌవ్ుకీ, తో కౌవ్ు పే లుటాయే జా..’ సావిట్లోకి అడుగుపెట్టిన తరువాత దూరం నుంచి శ్రీరాములు కంఠం లీలగా. గెలవాలన్న నిశ్చయం, ఓడిపోతున్నానన్న దిగులుతో కలసి జుగల్బందీ చేస్తున్నట్టుంది. ‘.. ఖుషీ కే గీత్ గాయే జా.. కదం కదం బఢాయే జా..’ జెండా కొయ్య మొదట్లో వరసగా మూడు కుర్చీలు. మధ్య కుర్చీలో బోసినవ్వుల గాంధీ ఫొటో. ఒక పక్క నెహ్రూ బొమ్మ, రెండో పక్క బాబూ రాజేంద్రప్రసాద్ బొమ్మ. మూడు ఫొటోలకి మువ్వన్నెల ఖాదీ దండలు. ∙డా. గోపరాజు నారాయణరావు -
ఆత్మహత్య చేసుకున్నప్పటికీ భౌతికకాయాన్నే ఉరి తీశారు...సేఫ్టీవాల్వ్ అందుకే...!
ఈస్టిండియా కంపెనీ అనుభవాలను గుణపాఠాలుగా మలచుకోక తప్పని ఒక క్లిష్ట వాతావరణం బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి ఎదురైంది. భారతీయులతో, స్థానిక పాలకులతో కంపెనీ వ్యవహరించిన విధానం స్థానికులను తిరుగుబాట్లకు ప్రేరేపించేదే! కంపెనీకి విదేశాలతో గొడవ పెట్టుకునే అవకాశం లేదు. కొన్ని పనులకు బ్రిటిష్ రాణి అనుమతి తీసుకోక తప్పేది కాదు. కానీ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ పరిధి పెద్దది. ఇరుగు పొరుగు దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకుంది. కంపెనీ నీచత్వం సరే, దానికేమీ తీసిపోని రాణి పాలన కారణంగాను 1857 తరువాత కూడా ప్రజానీకంలో చల్లారని ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. రాణి వాటిని చల్లార్చే ప్రయత్నమేమీ చేయలేదు. అన్ని వైపుల నుంచి ఆగ్రహ జ్వాలలు చుట్టుముట్టాయి. ఈ వేడిని తగ్గించే ఒక వ్యూహంలో భాగంగానే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు కోసం ఏ ఓ హ్యూమ్ అక్షరాలా కాలికి బలపం కట్టుకుని మద్రాస్, బొంబాయి, పూనా నగరాలు తిరిగాడు. ఒక సేఫ్టీవాల్వ్ ఏర్పాటు అవసరమని బ్రిటిష్ ఇండియా ఎందుకు అంతగా తహతహలాడిందో తెలియాలంటే జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు ముందు నాటి రగులుతున్న భారతదేశం ఎలా ఉన్నదో చూడాలి. 1885కు ముందు, అంటే కాంగ్రెస్ స్థాపనకు ముందు ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ ఇండియా హయాంలలో దేశం నలుమూలలా ఆగ్రహావేశాలు చెలరేగాయి. హిందీ ప్రాంతాలు సరే, అస్సాం, బెంగాల్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర, నిజాం ప్రాంతాలలో కూడా తిరుగుబాట్లు జరిగాయి. తిరగబడిన దాదాపు అందరినీ ఉరికంబాలు ఎక్కించారు. నెర్కట్టుంసేవల్ పాలెగార్ (పాలెగాడు) పులిదేవర్. ఇది తిరునేల్వేలి దగ్గర ఉంది.1757లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా ఇతడు పోరాడాడు. ఊండివరన్, వెన్నికలాది ఈయన సైన్యాధిపతులు. కంపెనీ మీద తిరగబడిన తొలి భారతీయునిగా ఇతడికి పేరుంది. అప్పుడే బెంగాల్లో సిరాజుద్దౌలాకీ కంపెనీకీ మధ్య ప్లాసీ యుద్ధం జరిగింది. మరుధు పాండియార్లు (పెరియ మరుధు, చిన్న మరుధు) వీరు 18వ శతాబ్దం చివరిలో శివగంగై పాలకులు. వీరు కంపెనీ ఆధిపత్యం మీద తిరుగుబాటు చేశారు. ఈ ఇద్దరినీ ఉరి తీశారు. 18వ శతాబ్దంలో దక్షిణాదిన కనిపించే మరొక వీరుడు వీరపాండ్య కట్టబొమ్మ కరుతయ్య నాయకర్. పాంచాలన్కురుచిని పాలించేవాడు. ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు 1799లోనే ఉరి తీశారు. 1808–09 నాటి వేలు తంపి తిరుగుబాటు కూడా చరిత్రలో ఎంతో కీలకమైనది. తిరువాన్కూర్ దివాన్ వేలు తంపిని పదవి నుంచి తొలగించాలని కంపెనీ కుట్ర పన్నింది. సైన్య సహకార పద్ధతితో సంస్థానాన్ని దోచేస్తున్న కంపెనీ ఆగడాలను అడ్డుకొనే ప్రయత్నం చేయడమే తంపి చేసిన పాపం. చివరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పటికీ భౌతికకాయాన్నే ఉరి తీశారు. మహారాష్ట్ర ప్రాంతం సతారాలో 1822–25 ప్రాంతాలలో జరిగిన రామోసీల తిరుగుబాటు కూడా కంపెనీని భయపెట్టింది. రామోసీలు అంటే పోలీసు, సైనిక వ్యవస్థలో ఉండే అత్యంత కింది స్థాయి ఉద్యోగులు. వీరే చిత్తూర్‌సింగ్ నాయకత్వంలో తిరగబడ్డారు. చిత్రంగా వీరు పెంచిన భూమిపన్నుకు వ్యతిరేకంగా ఆ తిరుగుబాటు చేశారు. ఆంధ్ర ప్రాంతాన్ని కబళించే ప్రయత్నం 1766 నుంచి కంపెనీ ఎలా చేసిందో ప్రొఫెసర్ కెఎస్ఎస్ శేషన్ ‘ఎర్లీ యాంటీ బ్రిటిష్ రివోల్ట్స్ ఇన్ ఆంధ్ర 1766–1857’ పుస్తకంలో వివరించారు. స్థానిక పాలకుల పట్ల ఈస్టిండియా కంపెనీ చూపిన అవమానకర వైఖరితోనే ఆ తిరుగుబాట్లు జరిగాయని శేషన్ అంటారు. సర్కార్ గడ్డ మీద మైదాన ప్రాంతంలో పెద్ద జమీందార్లు, మన్య ప్రాంతాలలో చిన్న జమీందార్లు కూడా తిరుగుబాట్లు చేశారు. తమను ఆర్కాట్ నవాబు అధికారం నుంచి తొలగించడం, నవాబుకు కంపెనీ అండ ఉండడం వంటి కారణాలతో ఈ తిరుగుబాట్లు సాగాయి. 1846 నాటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం, విశాఖపట్నం, మొమినాబాద్, బొల్లారం తిరుగుబాట్లు కూడా అలాంటివే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తండ్రి మల్లారెడ్డి పాలెగాడు. కర్నూలు జిల్లాలో కంపెనీ దమనకాండకు నిరసనగా పోరుబాట పట్టిన ఐదువేల మంది రైతులకు నరసింహారెడ్డి నాయకత్వం వహించాడు. ఈయన సేనాపతి వడ్డె ఓబన్న. రైత్వారీ విధానం, పన్ను పెంపు మీద రైతులు తిరగబడ్డారు. ఇతడి చేతిలో పెద్ద ఎత్తున కంపెనీలు సేనలు హతమయ్యాయి. 1847 ఫిబ్రవరి 22న నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరి తీయడంతో ఉద్యమం చల్లారిపోయింది. 19వ శతాబ్దంలో తూర్పు భారతంలో ముఖ్యంగా అస్సాంలో కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగాయి. యాండాబు ఒప్పందం (1826) మేరకు అస్సాం కంపెనీ అధీనంలోకి వచ్చింది. యథాప్రకారం కంపెనీ కిందకు అస్సాం రావడం, కల్లోలం ఆరంభం కావడం ఏకకాలంలో జరిగాయి. తిరుగుబాట్లలో అటు పై వర్గాల వారు, మధ్య, దిగువ తరగతుల వారు కూడా పాల్గొన్నారు. అలాంటి ప్రయత్నం చేసిన వారిలో మొదటివాడు గోంధార్ కున్వార్. కుందురా దీకా ఫుఖాన్, దామోదర్, హర్నాథ్ ఇతర స్థానిక పాలకులు కూడా అతడికి సహకరించారు. వీరంతా కలసి 1828లో సాడియా అనే చోట కంపెనీ ఆయుధాగారం మీద దాడి చేశారు. ఇది విఫలమైంది. మళ్లీ పియాలీ బర్ఫూఖన్ నాయకత్వంలో మరొక తిరుగుబాటు జరిగింది. ఈయనకు జీయురాం దూలియా బారువా, బేణుధర్ కున్వార్, రూప్‌చంద్ కున్వార్, దేయురాం దిహింగియా, బౌవ్‌ు చింగ్‌ఫూ, హర్నాథ్ తదితరులు సహకరించారు. రంగపూర్‌లో ఉన్న బ్రిటిష్ శిబిరాన్ని దగ్ధం చేయాలని పియాలీ బర్ఫూఖన్ నాయత్వంలో జరిగిన కొత్త ప్రయత్నం విజయవంతమైంది. కానీ పియాలీ, జియురాం బారువా, ఇంకొందరు ఆందోళనకారులను కంపెనీ అధికారులు పట్టుకున్నారు. పియాలీ, జియురాంలను ఉరి తీసి, మిగిలిన వారిని ద్వీపాంతరం పంపారు. ఇదే సమయంలో ఎగువ అస్సాంలో పనిచేసే కొందరు కంపెనీ బ్రిటిష్ జాతీయులను చంపాలని గదాధర్ గొహిన్ అనే మరొక వీరుడి నాయకత్వంలో ప్రయత్నించారు. కానీ ఇది విఫలయింది. గదాధర్‌ను జైలులో పెట్టారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆ జ్వాలను అస్సాంకు తీసుకుని వెళ్లినవాడు మణిరాం దివాన్. ఆ సమయంలో కలకత్తా వెళ్లి, మరొక ఉద్యమకారుడు మధు మల్లిక్ సాయంతో పథకం వేశాడు. 1857 ఘటన వార్తలను అస్సాం సంస్థానం ఆఖరి పాలకుడు కందర్పేశ్వర్ సింగ్, సలహాదారు పియాలీ బారువాకు మణిరాం అందించేవాడు. ఈ పథకంలో ఇంకా మాయారాం నజిర్, నీలకంఠ చోలాధర ఫుఖాన్, మారంగికోవె గొహిన్, ద్యుతిరాం బారువా, బహదూర్ గాన్బురా, ఫార్ముద్ అలీ, త్రినయ, కమల బారువా పనిచేశారు. సాహాబాద్ అనేచోట ఉన్న సిపాయీల మద్దతే వీరికి కీలకమైంది. ఈ పథకం ప్రకారం సిపాయీలంతా, అస్సాం పాలకుని నాయకత్వంలో కంపెనీ అధికారుల మీద తిరగబడాలి. ఇంతలో మణిరాం కలకత్తా నుంచి ఆయుధాలతో వచ్చి కలుస్తాడు. పథకం అమలులో కొద్దిపాటి ఆలస్యం కావడంతో కంపెనీ వెంటనే అప్రమత్తమై తిరుగుబాటులో ఉన్నవారందరినీ అదుపులోకి తీసుకుంది. కలకత్తా నుంచి పనిచేస్తున్న మణిరాంను కూడా అరెస్టు చేశారు. కందర్పేశ్వర్‌సింగ్‌ను కారాగారంలో పెట్టారు. చాలామందిని ద్వీపాంతరం పంపారు. మణిరాం, పియాలీ జోర్హాట్ కారాగారంలోనే చనిపోయారు. 1861, 1894లలో ఫులగారి, పత్థర్‌ఘాట్ అనేచోట రైతాంగ పోరాటాలు జరిగాయి. ఇలాంటివి ఇంకా ఎన్నో! - డా. గోపరాజు నారాయణరావు చదవండి: Needle Free Injection: సూదిలేని ఇంజెక్షన్ వచ్చేసింది.. నొప్పి లేకుండా... -
నాటి దుశ్చర్యలో వెలుగుచూడని నిజాలెన్నో..
జలియన్‌వాలా బాగ్ సభ మీద 1919 ఏప్రిల్ 13న జనరల్ డయ్యర్ పేల్చిన తూటాలు 1,650. అక్కడకి 31 మైళ్ల దూరంలో ఉన్న లాహోర్‌లో 1940 మార్చి 19న ఊరేగింపుగా వెళుతున్న ఒక సమూహం మీద డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ పీసీడీ బీటీ ఆదేశాల మేరకు పోలీసులు కాల్చినవి 1,620. ముప్పయి మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 200 మంది చనిపోయారు, ఛిద్రమైన శవాలను ట్రక్కుల్లోకి విసిరి తీసుకుపోయారు. నిర్బంధాలను ఎత్తివేయాలని కోరుతూ శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్న ఖక్సర్ తెహ్రీక్ కార్యకర్తలపై 1,620 తూటాలు కాల్చినట్టు అక్కడి పోలీస్ స్టేషన్ గుమాస్తా (మొహరీర్) నమోదు చేశాడు. కాల్పుల వార్తను ప్రపంచ పత్రికలు ప్రచురించాయి. సర్ డగ్లస్ యంగ్ అధ్యక్షునిగా హైకోర్టు న్యాయమూర్తులతో దర్యాప్తు సంఘం నియమించారు కూడా. కానీ నివేదిక వెలుగు చూడలేదు. ఇంతకీ ఏమిటీ ఖక్సర్ తెహ్రీక్? భారత స్వాతంత్య్ర సమరంలో జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్, గదర్ పార్టీ, హిందూ మహాసభ, స్వరాజ్య పార్టీ హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ వంటివెన్నో కనిపిస్తాయి. అలాంటిదే ఖక్సర్ తెహ్రీక్. ఖక్సర్ అంటే అర్థం అణకువ కలిగినవాడు. నలభై లక్షల సభ్యత్వంతో (1942 నాటికి), దేశంలోను, విదేశాలలో కూడా శాఖలు నెలకొల్పింది. దీని మీద భయంకరమైన నిర్బంధం ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం అణచివేతే కాదు, మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలోని అఖిల భారతీయ ముస్లిం లీగ్ కూడా ఖక్సర్‌ను పరమ శత్రువులాగే చూసింది. ఎంత శత్రుత్వం అంటే, 1943 జూలై 20న బొంబాయిలో జిన్నా మీద ఆయన ఇంట్లోనే హత్యాయత్నం జరిగింది. ఆ పని చేసిన రఫీక్ సాబిర్ ఖక్సర్ సభ్యుడని అనుమానించారు. పంజాబ్ ప్రీమియర్, ముస్లింలీగ్ ప్రముఖుడు సర్ సికిందర్ హయత్‌ఖాన్ కూడా ఖక్సర్ మీద కక్ష కట్టాడు. స్వరాజ్య ఉద్యమం దేనికి? బ్రిటిష్ పాలన అంతానికి! ఈ విషయం మీద ఉన్న స్పష్టత స్వతంత్ర భారత ప్రభుత్వం గురించి ఎక్కువమందికి లేదంటే అతిశయోక్తి కాదు. ఆ విషయం ఆలోచించిన సంస్థ ఖక్సర్. హిందూముస్లిం ప్రభుత్వమే స్వతంత్ర భారత్‌ను పాలించాలన్నది సంస్థ ఆశయాలలో ఒకటి. 1936 నవంబర్ 29న సియాల్కోట్లో నిర్వహించిన సమావేశంలో ఒక ప్రణాళికను రూపొందించుకుంది (మష్రికి మనుమడు నాసివ్ు యూసఫ్ సేకరించిన వివరాలు, ఇతర చరిత్రకారులు సేకరించిన విషయాలు ఎన్నో). దైవం ఆధిపత్యాన్ని అంగీకరించడం, జాతీయ సమైక్యత, మానవ సేవ వంటి సిద్ధాంతాలను ఖక్సర్ స్వీకరించింది. సమాజంలోని అంతరాలను సరిచేయడమనే సంస్థ సూత్రాన్ని గౌరవిస్తూ పారను చిహ్నంగా తీసుకుంది. ఎక్కువ ముస్లిం సిద్ధాంతాల ఛాయలు ఉన్నా, ఖక్సర్లో సభ్యుడు కావడానికి మతం, ప్రాంతం, కులం, వర్ణం అడ్డు కాలేదు. కానీ వేయేళ్లు ఈ దేశాన్ని పాలించిన ముస్లింల పూర్వ వైభవం ఖక్సర్ ఆశయాలలో ఒకటన్నది నిజం. ఖక్సర్ దేశ విభజనను వ్యతిరేకించింది. అందుకే అఖండ భారత్ కోసం, విభజనను నిరోధించడానికి చివరి యత్నంగా 1946లో ఒక రాజ్యాంగాన్ని కూడా తెచ్చింది. మొత్తం 17 ఏళ్ల పాటు స్వాతంత్య్ర సమరంలో ఈ సంస్థ పాల్గొన్నది. లాహోర్ కేంద్రంగా ఉద్యమించిన ఖక్సర్ తెహ్రీక్‌ను 1931లో అల్లామా ఇనాయతుల్లా అల్ మష్రికి (25 ఆగస్ట్ 1888– 27 ఆగస్ట్ 1963) స్థాపించాడు. సంస్థ నిబంధనలకు కచ్చితంగా లోబడి ఉండడమే కాదు, సభ్యులు ఉద్యమానికి సమయం ఇవ్వడంతో పాటు, దేశం కోసం ఎవరి వ్యయం వారే భరించాలి. అచ్చంగా బ్రిటిష్ పోలీసుల యూనిఫామ్‌ను పోలి ఉన్న దుస్తులు ధరించేవారు. దాని మీద సోదరత్వం అన్న నినాదం (ఉఖూవ్వాత్) ఉండేది. నాయకుడు సహా అంతా ఇదే ధరించేవారు. మష్రికి అనేకసార్లు కారాగారం అనుభవించాడు. 1942 జనవరి 19న వెల్లూరు జైలు నుంచి విడుదలచేసి... మద్రాస్ ప్రెసిడెన్సీ దాటకూడదని ఆంక్షలు పెట్టారు. సంస్కరణ, వ్యక్తి నిర్మాణం, దేశం కోసం త్యాగం ఖక్సర్ ఆశయాలు. ఇరుగు పొరుగులకు సేవ కార్యక్రమంలో అంతర్భాగం. ఇక్కడ ముస్లింలు, ముస్లిమేతరులు అన్న భేదం లేదు. పరిసరాలను శుభ్రం చేస్తూ, పేదలు, వృద్ధులు, రోగులకు సేవలు అందించాలి. మష్రికి ఇస్లామిక్ పండితుడు, మేధావిగా గుర్తింపు పొందాడు. అమృత్‌సర్‌కు చెందిన ముస్లిం రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టిన మష్రికి కేంబ్రిడ్జ్ నుంచి గణితశాస్త్ర పోస్ట్ గ్రాడ్యుయేట్. 1912లో స్వదేశం వచ్చి 25 ఏళ్లకే కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు. 29 ఏళ్లకి విద్యాశాఖ అండర్ సెక్రటరీ అయ్యాడు. మొగల్ దర్బార్‌లో కీలక పదవులు అనుభవించిన కుటుంబం వారిది. తండ్రి ఖాన్ అటా మహ్మద్ ఖాన్ న్యాయవాది. ‘వకీల్’ అనే పక్షపత్రిక నడిపేవారు. కాంగ్రెస్ స్థాపన సమయంలో దేశంలో ఎంతో ఖ్యాతి వహించిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వంటివారికి అటా ఖాన్ సన్నిహితుడు. వీటన్నింటికీ మించి ఖురాన్‌కు మష్రికి రాసిన వ్యాఖ్యానం (తాజ్కిరా) నోబెల్ సాహిత్య బహుమానం పరిశీలనకు పంపారు. తత్త్వశాస్త్రం మీద కొన్ని రచనలు చేశాడు. మష్రికి 1939లో బ్రిటిష్ ప్రభుత్వానికి తుది హెచ్చరికలు చేయడం ఆరంభించాడు. సంవత్సరంలోనే ఖక్సర్ తన లక్ష్యాన్ని చేరుకుంటుందని ప్రకటించాడు. అలా జరగకపోతే సంస్థను రద్దు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మరొక రెండున్నర లక్షలమందిని సభ్యులుగా చేర్చాలని అనుచరులను ఆదేశించాడు. ఖక్సర్ ప్రమాదకరంగా తయారైందని 1939లోనే పంజాబ్ గవర్నర్ హెన్రీ డఫీల్డ్ వైస్రాయ్ లిన్లిత్గోకు ఇచ్చిన నివేదికలో వెల్లడించాడు. ఇలాంటి నివేదికే మధ్య పరగణాల నుంచి కూడా వెళ్లింది. ఒకసారి ఢిల్లీలో మాట్లాడిన తరువాత మష్రికి మీద జిన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మష్రికి ఒక ఉన్మాది అని వ్యాఖ్యానించాడు. ఇదే బ్రిటిష్ ప్రభుత్వానికి ఉపకరించింది. మరింత కర్కశంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. నాటి పంజాబ్ ప్రీమియర్ హయత్‌ఖాన్, ‘రెండు రోజులలోనే ఖక్సర్ పనిపడతానని’ చెప్పాడని మష్రికి అనుచరుడు రజా షేర్ జమీన్ తన పుస్తకంలో నమోదు చేశాడు. రెండో ప్రపంచ యద్ధంలో పరిస్థితులను బట్టి భారత్‌లో తలనొప్పులు లేకుండా చేసుకోవడానికి హయత్ఖాన్కు ఖక్సర్ అణచివేతకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనితోనే సంస్థ నిషేధానికి ఎత్తులు మొదలయినాయి. దుష్ప్రచారమూ మొదలయింది. జర్మనీ నాజీలతో ఖక్సర్కు సంబంధాలు ఉన్నాయని ‘ది ట్రిబ్యూన్’ పత్రికలో ఒక వ్యాసం వెలువడింది. పంజాబ్ అసెంబ్లీలో కూడా పథకం ప్రకారం సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ఖక్సర్ ఉద్యమంలో మతోన్మాదమే ఉందని హయత్‌ఖాన్ సమాధానం ఇచ్చాడు. నిజానికి అందులో ముస్లింలు, హిందువులు, సిక్కులు కూడా ఉన్నారు. అప్పుడే లాహోర్‌లో 1940 మార్చి 19న ఖక్సర్ ప్రదర్శన మీద కాల్పులు జరిగాయి. ఆ రోజే నిషేధించారు.లాహోర్ ప్రదర్శన మీద కాల్పులు, జిన్నా మీద హత్యాయత్నం రెండూ పథకం ప్రకారం జరిగినవేననీ, వాటి వెనుక, బ్రిటిష్ ప్రభుత్వం, జిన్నా ఉన్నారంటూ మష్రికి 1943లో పత్రికా ప్రకటన ఇచ్చాడు. ఒక దశలో జిన్నా రాజకీయంగా బలహీనపడినప్పుడు ఖక్సర్ సభ్యులు లీగ్ జెండా కిందకు రావాలని ఆశించాడని చెబుతారు. 1947 జూలై 4న సంస్థను మష్రికి రద్దు చేశాడు. అయినా అతడి మరణానంతరం పాకిస్తాన్లో దానిని పునరుద్ధరించారు. - డా. గోపరాజు నారాయణరావు చదవండి: 900 యేళ్లనాటి ఈ గ్రామానికి రెండే ద్వారాలు... కారణం అదేనట.. -
తెలుసా..! స్వతంత్ర పాకిస్తాన్ కావాలని మొదట కోరింది అతనేనట!
‘పాక్స్తాన్’ ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్.. 3, హంబర్‌స్టోన్ ఇంటిలోని ఒకగది గోడమీద రాసున్నాయి ఆ అక్షరాలు (పాకిస్తాన్ కాదు). రాసినవాడు జిన్నా కాదు, చౌధురి రహమత్ అలీ. ఆ పద సృష్టికర్త అలీయే. భారత స్వాతంత్య్రోద్యమానికి సమాంతరంగా ముస్లిం జాతీయోద్యమం నడపాలని ఆశించినవాడు, స్వతంత్ర పాకిస్తాన్ కావాలని మొదట కోరినవాడు ఇతడే. ఎవరీ అలీ? తూర్పు పంజాబ్, హోషియార్‌పూర్‌లోని కామేలియా అతడి స్వస్థలం. 1897 నవంబర్ 16న బాలాచౌర్లో పుట్టాడు. 1930లో ఇంగ్లండ్ వెళ్లి 1931లో కేంబ్రిడ్జ్ పరిధిలోని ఇమ్మాన్యుయేల్ కళాశాలలో చేరాడు. అలీ మిత్రుడు అబ్దుల్ కరీం కథనం ప్రకారం తన మిత్రులు పీర్ అహసనుద్దీన్, ఖ్వాజా అబ్దుల్లతో కలసి థేమ్స్ ఒడ్డున నడుస్తుండగా అలీకి ఆ పేరు స్ఫురణకు వచ్చింది. అలీ కార్యదర్శి ఫ్రాస్ట్ మాటలలో అయితే, ఒక రోజున బస్సు టాప్ మీద ప్రయాణిస్తున్నప్పుడు ఆ పేరు స్ఫురించింది. ఆ హ్రస్వనామమే (పి.ఎ.కె. స్తాన్) తరువాత ‘ఐ’ చేరి పాకిస్తాన్ అయింది. పాకిస్తాన్ అంటే పర్షియన్లో పవిత్రభూమి. బహుశా భారత్, పాక్ చరిత్రలలో అలీ అంతటి వివాదాస్పద వ్యక్తి కనిపించడు. భారత్‌లో సరే, పాకిస్తాన్ చరిత్రలో కూడా ఇతడికి కొద్దిపాటి స్థానం కూడా కనిపించనిది అందుకే కాబోలు. కానీ పాక్స్తాన్ జాతీయోద్యమ నిర్మాతగా ఇతడు తనను తాను ప్రకటించుకున్నాడు. నిజానికి బొంబాయి కేంద్రంగా ‘పాకిస్తాన్’ పేరుతో పత్రికను ప్రచురించడానికి 1928లో ఒక పత్రికా రచయిత దరఖాస్తు చేశాడు. అతడు కశ్మీర్‌కు చెందిన గులాం హసన్ షా కాజ్మీ. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫలితాలు రహమత్‌ను బాగా నిరాశపరచాయి. ఆ సమావేశాలకు వెళ్లిన భారతీయ బృందాన్ని క్షమించకూడదన్నాడు. ఆ సమావేశాలకు డాక్టర్ ఇక్బాల్ కూడా హాజరయ్యారు. అప్పుడే రహమత్ ఆయనను ఇంగ్లండ్‌లో కలుసుకున్నాడు. తరువాత 1932 నాటి అలహాబాద్ ముస్లింలీగ్ సమావేశాలలో డాక్టర్ ఇక్బాల్ చేసిన ప్రతిపాదన కూడా అలీకి నిరాశ కలిగించింది. వాయవ్య ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉన్న ఐదు ప్రాంతాలను కలిపి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసి, బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగా ఉంచాలని ఇక్బాల్, లీగ్ కోరడం అలీకి నచ్చలేదు. దక్షిణాసియాలో ముస్లింలకో స్వతంత్ర దేశం అన్నది అతడి నినాదం. అసలు పరమతానికి చెందిన ఏ పేరూ ఆసియాలో మిగిలి ఉండకూడదని అతడి నిశ్చితాభిప్రాయం. రహమత్ అలీ ప్రతిపాదించిన పిఎకెలో, పి అంటే పంజాబ్, ఎ అంటే అఫ్గానిస్తాన్ (మొత్తం వాయవ్య సరిహద్దు), కె అంటే కశ్మీర్, ఎస్ అంటే సింధ్, స్తాన్ అంటే బలూచిస్తాన్‌కు సంకేతాక్షరాలు. బ్రిటిష్ ఇండియా పటంలోని బెంగాల్, అస్సాంలకు బంగిస్తాన్ అన్న పేరూ పెట్టాడు. ఉస్మాన్స్తాన్ (నిజాం రాజ్యం), ముస్లింలు అధికంగా ఉండే ఇంకొన్ని ప్రాంతాల మీద ఆకుపచ్చ రంగు పులిమి ఒక సరికొత్త భౌగోళిక పటాన్ని అతడు రచించాడు. ఆ పచ్చరంగు ప్రాంతాలే పాక్స్తాన్. ఈ ఊహనంతటినీ 1933 జనవరి 28న విడుదల చేసిన చరిత్ర ప్రసిద్ధ ‘నౌ ఆర్ నెవర్’ కరపత్రంలో అలీ వివరించాడు. దీనర్థం ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?’ అని. దీనికే ‘మనం బతికేందుకా! నశించిపోతూ ఉండడానికా?’ అన్న ఉపశీర్షిక కూడా ఉంది. మూడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరైన భారతీయ బృందాన్ని దృష్టిలో ఉంచుకునే అతడు ఈ కరపత్రం రాశాడని చెబుతారు. దీనికే ‘పాకిస్తాన్ ప్రకటన’ అంటూ పాకిస్తాన్ పత్రిక ‘డాన్’ పేరు పెట్టడం గమనార్హం. ఈ కరపత్రం బహిర్గతమైన సంవత్సరం తరువాత 1934 జనవరి 28న ఇంగ్లండ్‌లోనే ఉన్న జిన్నాను రహమత్ అలీ తన నివాసానికి పిలిచి వివరించాడని కోలిన్స్, లాపిరే (‘ఫ్రీడవ్‌ు ఎట్ మిడ్నైట్’), రషీదా మాలిక్ (‘ఇక్బాల్: స్పిరిచ్యువల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్’) వంటి రచయితలు వేర్వేరు రీతులలో తెలియచేశారు. లండన్‌లోని వాల్డెర్ఫ్ హోటల్లో జిన్నా కోసం బ్లాక్‌టై పార్టీ ఏర్పాటు చేసి.. అలీ ఇవన్నీ చెప్పినట్టు కోలిన్స్, లాపిరే రాశారు. 3, హంబర్‌స్టోన్ ఇంటికే జిన్నా వచ్చారని ఎక్కువమంది రాశారు. చిత్రంగా ‘పాకిస్తాన్ ఆలోచనే అసాధ్యం’ అంటూ ఆ క్షణంలోనే జిన్నా చెప్పారని కోలిన్స్, లాపిరే చెబితే, ‘కాలం గడవనీ! వాళ్ల సంగతి వాళ్లే (భారతీయ ముస్లింలు) చూసుకుంటారు’ అని సర్ది చెప్పినట్టు ఇతర రచయితలు రాశారు. ఏమైనా 1934 వరకు కూడా పాకిస్తాన్ ఆలోచనకు ఎవరూ సానుకూలంగా లేరన్నది నిజం. ఇది కాలేజీ కుర్రాళ్ల రగడ అనే మూడో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లిన పెద్దలు భావించారు. రహమత్ అలీ మరికొన్ని కరపత్రాలు కూడా వెలువరించాడు. ‘పాక్స్తాన్: ది ఫాదర్ల్యాండ్ ఆఫ్ పాక్స్తానీ నేషన్’ అన్న పుస్తకం కూడా రాశాడు. ఇస్లాంను ఆవిష్కరించే క్రమంలో ప్రవక్త అరబ్ తెగలను ఏకం చేసిన క్రమమే దక్షిణాసియాలో ముస్లింలకో దేశం అన్న తన లక్ష్యానికి ప్రేరణ అని అలీ చెప్పుకున్నాడు. తమ పూర్వికులు ఆరంభించిన స్థలాలు, పట్టణాలు, కొండల పేర్ల మార్పు ఉద్యమం కొనసాగాలనీ ఆశించాడు. హిమాలయాలను ‘జబాలియా’ అని, బంగాళాఖాతాన్ని ‘బంగి ఇ ఇస్లాం’ అని, ఆసియా ఖండాన్ని ‘దినియా’అని పిలిస్తేనే సార్థకమని భావించాడు. బుందేల్‌ఖండ్ మాల్వాలను సిద్దిఖిస్తాన్ అని, బిహార్, ఒడిశాలను ఫారూకిస్తాన్ అని, రాజస్థాన్‌ను ముయిస్తాన్ అని, మొత్తం హిందూస్థాన్‌ను హైదర్స్తాన్ అని, దక్షిణ భారతదేశాన్ని మాప్లిస్తాన్ అని పిలవడం సరైనదని వాదించాడు. పశ్చిమ సింహళానికి షఫిస్తాన్ అని, తూర్పు సింహళానికి నాసరిస్తాన్ అని కూడా పేర్లు పెట్టాడు. వీటిలో మొదట సాధించవలసినది మాత్రం పాక్స్తాన్ అని అనుకున్నాడు. జాతీయోద్యమానికి సమాంతరంగా ముస్లిం జాతీయోద్యమం సాగించడానికి రహమత్ అలీ ప్రయత్నించాడు. 1940 నాటి లాహోర్ సమావేశంలో మొదటిసారిగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్ చేశాడు జిన్నా. ఆ సమావేశానికి రహమత్ కూడా హాజరయ్యాడు. దేశ విభజన తరువాత 1948 ఏప్రిల్ 6న అలీ లాహోర్ చేరుకున్నాడు. యమునా నదే హిందుస్థాన్‌కు, పాకిస్తాన్‌కు మధ్య సహజ సరిహద్దు అని, ఢిల్లీ, ఆగ్రాలు లేని పాకిస్తాన్‌ను ఎలా అంగీకరించారని ధ్వజమెత్తడం ఆరంభించాడు. తను పచ్చరంగు పూసి, సూచించిన ప్రాంతాలతో పాకిస్తాన్ ఎందుకు సాధించలేదన్నదే అతడి ప్రశ్న. జిన్నా ‘ఖాయిద్ ఏ ఆజమ్’ (మహా నాయకుడు జిన్నా బిరుదు) కాదు, ‘క్విస్లింగ్ ఏ ఆజమ్’(మహా ద్రోహి) అని విమర్శలు ఆరంభించాడు. దీనితో ప్రధాని లియాఖత్ అలీఖాన్ పాక్ నుంచి రహమత్‌ను బహిష్కరించాడు. అతడి ఆస్తులను జప్తు చేయించాడు. తిరిగి కేంబ్రిడ్జ్ చేరుకున్న అలీ 1951 ఫిబ్రవరి 3న దాదాపు అనాథగా చనిపోయాడు. కేంబ్రిడ్జ్‌లో అతడి ఆచార్యుడు ఎడ్వర్డ్ వెల్బోర్న్ డబ్బు ఇచ్చి అంత్యక్రియలు జరిపించాడు (ఈ ఖర్చులను తరువాత పాకిస్తాన్ హైకమిషన్ చెల్లించింది). మరణానంతరమైనా తన అవశేషాలు స్వస్థలం కామేలియాకు పంపించాలని తన న్యాయవాదిని అలీ కోరినట్టు చెబుతారు. కానీ 2006లో జరిగిన ఈ ప్రయత్నం కూడా చిత్తశుద్ధితో సాగలేదు. 1947లో మౌంట్‌బాటన్‌తో జిన్నా చెప్పిన ‘మాత్ ఈటెన్ పాకిస్తాన్’ (అసంపూర్ణ పాకిస్తాన్) అన్నమాటకీ, ‘కశ్మీర్ లేని పాకిస్తాన్ ఏమిటీ?’ అన్న రహమత్ వాదనకీ ఏమైనా వ్యత్యాసం ఉందా? - డా. గోపరాజు నారాయణరావు చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్ క్రైం స్టోరీ: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. -
ఆ రోజు పంజాబ్‌లో ఆరోనది పారింది! అసలేం జరిగిందంటే..
ఐదునదుల పంజాబ్‌లో ఆ ఒక్కరోజు ఆరోనది కనిపించింది. అది నెత్తుటినది. 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్‌వాలాబాగ్ దురంతంతో ఆనాడు అమృత్సర్ రక్తపుటేరునే చూసింది. సంవత్సరాది (వైశాఖి) పండగ జరుపుకోవడానికి వచ్చి, ఆ మైదానంలో కూర్చున్న దాదాపు ఇరవైవేల మంది నిరాయుధుల మీద 1650 తూటాలు పేలాయి. స్వాతంత్య్రోద్యమం మలుపు తిరిగింది. ఆ దురంతంలో జనరల్ రెజినాల్డ్ డయ్యర్ కంటే పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఫ్రాన్సిస్ ఓడ్వయ్యర్(1912–19) పెద్ద దోషి అని ప్రముఖ చరిత్రకారుడు కేకే ఖుల్లర్ అంటారు. అదో విడి ఘటన కాదు. ముందూ వెనుకా కుట్రలు ఉన్న గొలుసుకట్టు ఘటనలకు పరాకాష్ట. జనరల్ డయ్యర్ ఎక్కుపెట్టించిన ఆ 90 తుపాకులకు అందిన ఆదేశం వెనుక ఓడ్వయ్యర్ జాత్యహంకారం ఉంది. లాలా లాజ్పతిరాయ్ 1920 ఫిబ్రవరిలో అమెరికా నుంచి వచ్చి వాస్తవాలు సేకరించారు. 12 అంశాలతో ఆరోపణల పత్రం తయారు చేశారు. ఓడ్వయ్యర్ ఆత్మకథ ‘ఇండియా యాజ్ ఐ న్యూ ఇట్’ కూడా ఆ క్రమాన్ని వర్ణించింది. నిజానికి పంజాబీలకు ‘గుణపాఠం’ చెప్పాలన్న అతడి ఆలోచన మూడేళ్ల నాటిది. మొదటి ప్రపంచ యుద్ధం కోసం పంజాబ్ నుంచి ఎక్కువమంది యువకులను ఓడ్వయ్యర్ సైన్యంలో చేర్పించాడు. 1914 ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు భారత్‌లో 27,522 మంది సైన్యంలో చేరితే అందులో 13,400 మంది పంజాబీలు. గ్రేట్‌వార్‌లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ కాలమే ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టడానికి అనువైనదని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న గదర్ పార్టీ భావించింది. ఆ పార్టీలో ఎక్కువ మంది పంజాబీలే. అప్పుడే ఇండోజర్మన్ ప్రణాళిక బయటపడింది. అంటే ఇంగ్లండ్‌ను భారత్ నుంచి తరిమి వేయడానికి ప్రయత్నిస్తున్న భారతీయ తీవ్ర జాతీయవాదులకు జర్మన్ అండగా ఉండాలన్న యోజన. గదర్ వీరులకు ఐరిష్ ఉగ్రవాదులు అండగా ఉన్నారన్న వార్తలూ వచ్చాయి. అందుకే తీవ్ర జాతీయవాదాన్నీ, స్వాతంత్యోద్య్రమాలనూ ఎంత క్రూరంగా అణచివేసినది దాదాపు 485 పేజీల ఆత్మకథలో ఓడ్వయ్యర్ చాలా రాశాడు. సిక్కులు–గదర్ పార్టీ మధ్య బంధాన్ని చెప్పడానికి అధ్యాయమే (17) కేటాయించాడు (ఈ పుస్తకంలో మనకి ఆసక్తి కలిగించేది 8వ అధ్యాయం ‘హైదరాబాద్ డెక్కన్ 1907 – 09’. ఆ కాలంలో ఓడ్వయ్యర్ నిజాం సంస్థానంలో బ్రిటిష్ రెసిడెంట్). హోంరూల్ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్న సమయంలో 1916 ఏప్రిల్‌లో పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఓడ్వయ్యర్, ‘అనీబిసెంట్, తిలక్, బిపిన్‌చంద్ర పాల్ పంజాబ్‌లో ప్రవేశిస్తే చల్లారిపోతున్న తీవ్ర జాతీయవాదోద్యమ జ్వాల మళ్లీ ఎగసిపడుతుంద’ని హెచ్చరించాడు. వారు పంజాబ్‌లోకి రాకుండా బహిష్కరించాడు. పంజాబ్‌లోనే కాదు, భారత్ అంతటా ఉద్రిక్త వాతావరణమే. దీనికి భయపడిన ఫలితమే రౌలట్ బిల్లు. భాతీయుల నిరసనల మధ్య 1919 మార్చి 18న చట్టమైంది. మొదటి ప్రపంచయుద్ధంలో టర్కీ పతనంతో ముస్లింలు ఆగ్రహంగా ఉన్నారనీ, ‘హిందూ తీవ్రవాదులు’ ఈజిప్ట్, సిరియా, ఇరాక్ బాటలో ‘స్వయం నిర్ణయాధికారం’ కోరుతున్నారనీ ఓడ్వయ్యర్ అంటాడు. ఈ రెండు కారణాలు ఆ రెండు మతాలవాళ్లని ఇంగ్లిష్ పాలనకి వ్యతిరేకంగా ఐక్యం చేశాయనీ తేల్చాడు. ఈ ‘అపవిత్ర’ బంధం అమృత్‌సర్‌లో బాగా కనిపించిందని కూడా విశ్లేషించాడు. ఇందుకు ప్రతినిధులుగా జర్మనీలో చదువుకుని వచ్చిన ‘కశ్మీరీ ముస్లిం’ న్యాయవాది సైఫుద్దీన్ కిచ్లూ, ‘హిందూ సర్జన్’ డాక్టర్ సత్యపాల్లను చూపాడు. వీళ్లిద్దరూ హింసామార్గంలో ఆందోళన ఆరంభించారని అరోపించాడు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా మార్చి 30న హర్తాల్ పాటించవలసిందిగా గాంధీజీ పిలుపునిచ్చారు. ఉత్తర భారతం, పంజాబ్ ప్రాంతంలో లాహోర్, గుజ్రన్‌వాలా, షేక్‌పురా, ముల్తాన్, జలంధర్, కాసూర్, అమృత్సర్లు భగ్గుమన్నాయి. ఉత్తర భారతంలో కొన్ని రైల్వే స్టేషన్లు దగ్ధమైనాయి. ఇంగ్లిష్ వాళ్ల మీద దాడులు జరిగాయి. ఉత్తర భారత తీవ్ర జాతీయవాదులంతా పంజాబ్ మీద దృష్టి సారించారంటాడు ఓడ్వయ్యర్. ‘ఏప్రిల్ 6న లాహోర్‌లో పెద్ద విప్లవం (గదర్) వస్తుంది. అదే మా జాతీయ దినోత్సవం. ఇంగ్లిష్ వాళ్ల అధికారం పతనమయ్యే రోజు అదే’ అంటూ పత్రికలలో రాశారని కూడా అంటాడు. మళ్లీ ఏప్రిల్ 6న మరొక హర్తాల్‌కు గాంధీజీ పిలుపునిచ్చారు. ఇదే జలియన్‌వాలా బాగ్ దురంతానికి నాంది. ఏప్రిల్ 6,7 తేదీలలో గాంధీజీ ఢిల్లీ నుంచి పంజాబ్ వస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఓడ్వయ్యర్ నిషేధాజ్ఞలు విధించాడు. భారత ప్రభుత్వం కూడా గాంధీజీ కదలికల మీద ఆంక్షలు పెట్టింది. 9వ తేదీన పంజాబ్ ప్రావిన్స్ సరిహద్దులలో పల్వాల్ దగ్గర అరెస్టు చేసి, నిషేధాజ్ఞల ఆదేశాలు అందించారు. గాంధీజీ అక్కడ నుంచే బొంబాయి వెళ్లిపోవడానికి అంగీకరించారు. బర్మా పంపేయాలని సూచించాడు ఓడ్వయ్యర్. ఏప్రిల్ 9న శ్రీరామనవమి. పైకి ప్రశాంతంగా ఉన్నా, కిచ్లూ, సత్యపాల్లను వెంటనే అరెస్టు చేయమని ఆరోజే అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ మైల్స్ ఇర్వింగ్‌ను ఓడ్వయ్యర్ ఆదేశించాడు. 10వ తేదీన ఆ ఇద్దరినీ ఇంటికి పిలిచి అరెస్టు చేసి, ధర్మశాల అనే చోటకు చేర్చాడతడు (ఈ సంగతిని హంటర్ కమిషన్ ఎదుట చెప్పాడు). వీరిని విడుదల చేయాలని డిప్యూటీ కమిషనర్ ఇంటి ముందు జనం ఆందోళనకు దిగారు. కాల్పులు జరిగాయి. కొంతమంది చనిపోయారు. ఆవేశంతో జనం రాళ్లు విసిరారు. రోడ్డు మీద ఏ యూరోపియన్ కనిపించినా చావగొట్టారు. ఆ మరునాడే మార్సెల్లా షేర్వుడ్ అనే ఆంగ్ల మహిళ మీద దాడి జరిగింది (19న ఆమెను కలుసుకున్న తరువాత ఆ దాడి జరిగిన వీధి కూచా కురిచాహన్ గుండా వెళ్లే ప్రతి భారతీయుడిని నేలమీద పాములా పాకించారు సైనికులు. ఒక పెళ్లి బృందం, ఒక అంధుడు, గర్భవతి కూడా ఆ ‘శిక్ష’ అనుభవించారు. డయ్యర్ పంజాబ్ రక్షకుడని షేర్వుడ్ కీర్తించారు). ఒక బ్యాంక్ మీద ఆందోళనకారులు దాడి చేసి ఐదుగురు యూరోపియన్లను చంపారు. 9వ తేదీన అమృత్సర్ రైల్వేస్టేషన్ రక్షణ కోసం జలంధర్ నుంచి బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ తన దళాలతో వచ్చాడు. ఇతడికి అన్ని బాధ్యతలు అప్పగించి ఓడ్వయ్యర్ లాహోర్ వెళ్లిపోయాడు. 13వ తేదీ సూర్యాస్తమయం నాటి ఆ దుర్ఘటనలో 379 మంది మరణించారనీ, 1,137 మంది గాయపడ్డారనీ ప్రభుత్వం ప్రకటించింది. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యుడు విఎన్ తైవ్రాజ్ ఆ సంఖ్యను 530 అని చెప్పాడు. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ విషయం లేవనెత్తిన మాలవీయ మృతులు 1000 మంది అని చెప్పాడు. ఆర్య సమాజ్ ప్రముఖుడు స్వామి శ్రద్ధానంద 1500 మంది అని చెప్పాడు. కాల్పుల తరువాత కర్ఫ్యూ విధించారు. అందుకే చాలామంది వైద్యం అందక చనిపోయారు. ఆ మరునాడు కూడా గుజ్రన్‌వాలా, ఇంకొన్ని పట్టణాల మీద ఏరోప్లేన్‌ల ద్వారా బాంబులు కురిపించాడు ఓడ్వయ్యర్. 14వ తేదీ తెల్లవారుజామున కాల్పుల వార్త ఓడ్వయ్యర్‌కు లాహోర్‌లోనే అందింది. దేశ ప్రజలకు నెలా పదిహేను రోజుల తరువాత తెలిసింది. ఆంధ్రపత్రిక జూలై 12 డేట్‌లైన్‌తో ప్రచురించింది. అట్లాంటి ఓడ్వయ్యర్ మీద కాల్పులు జరపడానికి 21 ఏళ్లు ఎదురుచూశాడు ఒక యువకుడు. పేరు ఉద్దమ్‌సింగ్. - డా. గోపరాజు నారాయణరావు -
స్వాతంత్రోద్యమ చిహ్నాలేమిటో గుర్తున్నాయా?
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర ఉద్యమానికి 190 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వాతంత్య్ర సమరయోధులు ఎవరంటే, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, సుభాస్ చంద్రబోస్...ఇలా చెప్పుకుంటూ పోవచ్చు ఎవరైనా. కానీ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చిహ్నాలు ఏవంటే ఎవరైనా తడుముకోవాల్సిందే. వాటిల్లో మొదటి చిహ్నం వందేమాతరం ఉద్యమం పతాకం. స్వదేశీ ఉద్యమం పేరిట సాగిన ఈ ఉద్యమం 1905లో ప్రారంభమైన 1911 వరకు కొనసాగింది. బాల గంగాధర్ తిలక్, బిపిన్‌చంద్ర పాల్, లాలా లజిపతి రాయ్‌లు ఈ ఉద్యమానికి నేతృత్వం వహించారు. వివిధ మతాల, కులాల ప్రజలను ఉద్యమంలోకి తీసుకరావడం కోసం వారు ఉద్యమానికి ఓ జెండా ఉండాలని నిర్ణయించారు. 1906, ఆగస్టు ఏడవ తేదీన ఆవిష్కరించిన ఈ జెండాను సచింద్ర ప్రసాద్ బోస్ రూపొందించారు. పైన కాషాయం, మధ్యన పసుపు, కింద ఆకుపచ్చ రంగులో తయారు చేసిన జెండాపై, పై వరుసలో ఎనిమిది వికసించిన కమల పుష్పాలు, మధ్యలో వందేమాతరం అక్షరాలు, దిగువున సూర్య, చంద్రులు, నక్షత్రాల గుర్తులను ముద్రించారు. ఆజాద్ హింద్ ఫ్లాగ్ కూడా స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన చిహ్నంగా చరిత్రలో మిగిలింది. సుభాస్ చంద్ర బోస్ స్థాపించిన ‘ఆజాద్ హిందూ ఫౌజ్’కు జెండా గుర్తుగా దీన్ని రూపొందించారు. పైన లేత కాషాయ రంగులో ఆజాద్ అనే అక్షరాలను, అడుగున ఆకుపచ్చ రంగులో హింద్ అనే పదాలను, మధ్యలో తెల్లటి రంగుపై పులి గుర్తును ముద్రించారు. ఈ గుర్తును చూడగానే అప్పట్లో భారతీయుల రోమాలు నిక్కబొడుచుకునేవాట. నేతాజీ అదృశ్యంతో ఈ ఉద్యమం పూర్తిగా కనుమరుగైంది. జాతిపిత మహాత్మా గాంధీ తన సబర్మతి ఆశ్రమంలో కూర్చొని స్వయంగా నూలు ఒడుకుతున్న ఫొటో స్వదేశీ, స్వయం సమృద్ధి చిహ్నంగా నిలిచిపోయింది. ఈ చిహ్నాన్ని జెండాపై ముద్రించి, 1921లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆవిష్కరించారు. జాతీయ ఉద్యమానికి స్ఫూర్తిగా ఈ జెండా చిహ్నం చరిత్రలో నిలిచిపోయింది. మహాత్మా గాంధీ మూడు కోతుల సిద్ధాంతం జనంలోకి వెళ్లడానికి ఆయన వద్దనున్న మూడు కోతుల విగ్రహాలు ఎంతో దోహదపడ్డాయి. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దనే విధంగా ఉండే ఈ విగ్రహాలు వాస్తవానికి జపాన్ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చాయి. అందులో చెవులు మూసుకొని ఉండే మొదటి కోతి విగ్రహాన్ని ‘మిజారు’ అని, కళ్లు మూసుకొని ఉండే రెండో విగ్రహాన్ని ‘కికజారు’ అని, నోరు మూసుకున్నట్లు ఉండే మూడో కోతి విగ్రహాన్ని వజారు అని పిలుస్తారు. మహాత్మాగాంధీ 1930లో సబర్మతి నుంచి దండికి కాలి నడకన చేపట్టిన యాత్రను, దండి యాత్రని, ఉప్పు సత్యాగ్రహమని పిలుస్తారు. బ్రిటిష్ పాలకుల చట్టాన్ని ఉల్లంఘించి దండిలో ఉప్పును తయారు చేసిన ఈ ఉద్యమం స్వాతంత్య్రోద్యమంలో ఓ కీలక మలుపు. గాంధీజీ సాగించిన కాలినడక ఫొటో ఉద్యమ స్ఫూర్తికి చిహ్నంగా విస్తృత ప్రచారానికి నోచుకుంది. 82 పౌండ్ల ఉప్పును ఉత్పత్తి చేస్తే ఒక రూపాయి నుంచి నాలుగు రూపాయల వరకు పన్ను చెల్లించాలంటూ బ్రిటీష్ పాలకులు 1882లో ఓ చట్టాన్ని తీసుకొచ్చారు.