చౌధురి రహమత్ అలీ
‘పాక్‌స్తాన్’
ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్.. 3, హంబర్‌స్టోన్ ఇంటిలోని ఒకగది గోడమీద రాసున్నాయి ఆ అక్షరాలు (పాకిస్తాన్ కాదు). రాసినవాడు జిన్నా కాదు, చౌధురి రహమత్ అలీ. ఆ పద సృష్టికర్త అలీయే. భారత స్వాతంత్య్రోద్యమానికి సమాంతరంగా ముస్లిం జాతీయోద్యమం నడపాలని ఆశించినవాడు, స్వతంత్ర పాకిస్తాన్ కావాలని మొదట కోరినవాడు ఇతడే.
ఎవరీ అలీ? తూర్పు పంజాబ్, హోషియార్‌పూర్‌లోని కామేలియా అతడి స్వస్థలం. 1897 నవంబర్ 16న బాలాచౌర్‌లో పుట్టాడు. 1930లో ఇంగ్లండ్ వెళ్లి 1931లో కేంబ్రిడ్జ్ పరిధిలోని ఇమ్మాన్యుయేల్ కళాశాలలో చేరాడు. అలీ మిత్రుడు అబ్దుల్ కరీం కథనం ప్రకారం తన మిత్రులు పీర్ అహసనుద్దీన్, ఖ్వాజా అబ్దుల్‌లతో కలసి థేమ్స్ ఒడ్డున నడుస్తుండగా అలీకి ఆ పేరు స్ఫురణకు వచ్చింది. అలీ కార్యదర్శి ఫ్రాస్ట్ మాటలలో అయితే, ఒక రోజున బస్సు టాప్ మీద ప్రయాణిస్తున్నప్పుడు ఆ పేరు స్ఫురించింది. ఆ హ్రస్వనామమే (పి.ఎ.కె. స్తాన్) తరువాత ‘ఐ’ చేరి పాకిస్తాన్ అయింది. పాకిస్తాన్ అంటే పర్షియన్‌లో పవిత్రభూమి.
బహుశా భారత్, పాక్ చరిత్రలలో అలీ అంతటి వివాదాస్పద వ్యక్తి కనిపించడు. భారత్‌లో సరే, పాకిస్తాన్ చరిత్రలో కూడా ఇతడికి కొద్దిపాటి స్థానం కూడా కనిపించనిది అందుకే కాబోలు. కానీ పాక్‌స్తాన్ జాతీయోద్యమ నిర్మాతగా ఇతడు తనను తాను ప్రకటించుకున్నాడు. నిజానికి బొంబాయి కేంద్రంగా ‘పాకిస్తాన్’ పేరుతో పత్రికను ప్రచురించడానికి 1928లో ఒక పత్రికా రచయిత దరఖాస్తు చేశాడు. అతడు కశ్మీర్‌కు చెందిన గులాం హసన్ షా కాజ్మీ.
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫలితాలు రహమత్‌ను బాగా నిరాశపరచాయి. ఆ సమావేశాలకు వెళ్లిన భారతీయ బృందాన్ని క్షమించకూడదన్నాడు. ఆ సమావేశాలకు డాక్టర్ ఇక్బాల్ కూడా హాజరయ్యారు. అప్పుడే రహమత్ ఆయనను ఇంగ్లండ్‌లో కలుసుకున్నాడు. తరువాత 1932 నాటి అలహాబాద్ ముస్లింలీగ్ సమావేశాలలో డాక్టర్ ఇక్బాల్ చేసిన ప్రతిపాదన కూడా అలీకి నిరాశ కలిగించింది. వాయవ్య ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉన్న ఐదు ప్రాంతాలను కలిపి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసి, బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగా ఉంచాలని ఇక్బాల్, లీగ్ కోరడం అలీకి నచ్చలేదు. దక్షిణాసియాలో ముస్లింలకో స్వతంత్ర దేశం అన్నది అతడి నినాదం. అసలు పరమతానికి చెందిన ఏ పేరూ ఆసియాలో మిగిలి ఉండకూడదని అతడి నిశ్చితాభిప్రాయం. రహమత్ అలీ ప్రతిపాదించిన పిఎకెలో, పి అంటే పంజాబ్, ఎ అంటే అఫ్గానిస్తాన్ (మొత్తం వాయవ్య సరిహద్దు), కె అంటే కశ్మీర్, ఎస్ అంటే సింధ్, స్తాన్ అంటే బలూచిస్తాన్‌కు సంకేతాక్షరాలు. బ్రిటిష్ ఇండియా పటంలోని బెంగాల్, అస్సాంలకు బంగిస్తాన్ అన్న పేరూ పెట్టాడు. ఉస్మాన్‌స్తాన్ (నిజాం రాజ్యం), ముస్లింలు అధికంగా ఉండే ఇంకొన్ని ప్రాంతాల మీద ఆకుపచ్చ రంగు పులిమి ఒక సరికొత్త భౌగోళిక పటాన్ని అతడు రచించాడు. ఆ పచ్చరంగు ప్రాంతాలే పాక్‌స్తాన్.
ఈ ఊహనంతటినీ 1933 జనవరి 28న విడుదల చేసిన చరిత్ర ప్రసిద్ధ ‘నౌ ఆర్ నెవర్’ కరపత్రంలో అలీ వివరించాడు. దీనర్థం ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?’ అని. దీనికే ‘మనం బతికేందుకా! నశించిపోతూ ఉండడానికా?’ అన్న ఉపశీర్షిక కూడా ఉంది. మూడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరైన భారతీయ బృందాన్ని దృష్టిలో ఉంచుకునే అతడు ఈ కరపత్రం రాశాడని చెబుతారు. దీనికే ‘పాకిస్తాన్ ప్రకటన’ అంటూ పాకిస్తాన్ పత్రిక ‘డాన్’ పేరు పెట్టడం గమనార్హం. ఈ కరపత్రం బహిర్గతమైన సంవత్సరం తరువాత 1934 జనవరి 28న ఇంగ్లండ్‌లోనే ఉన్న జిన్నాను రహమత్ అలీ తన నివాసానికి పిలిచి వివరించాడని కోలిన్స్, లాపిరే (‘ఫ్రీడవ్‌ు ఎట్ మిడ్‌నైట్’), రషీదా మాలిక్ (‘ఇక్బాల్: స్పిరిచ్యువల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్’) వంటి రచయితలు వేర్వేరు రీతులలో తెలియచేశారు. లండన్‌లోని వాల్డెర్ఫ్ హోటల్‌లో జిన్నా కోసం బ్లాక్‌టై పార్టీ ఏర్పాటు చేసి.. అలీ ఇవన్నీ చెప్పినట్టు కోలిన్స్, లాపిరే రాశారు. 3, హంబర్‌స్టోన్ ఇంటికే జిన్నా వచ్చారని ఎక్కువమంది రాశారు.
చిత్రంగా ‘పాకిస్తాన్ ఆలోచనే అసాధ్యం’ అంటూ ఆ క్షణంలోనే జిన్నా చెప్పారని కోలిన్స్, లాపిరే చెబితే, ‘కాలం గడవనీ! వాళ్ల సంగతి వాళ్లే (భారతీయ ముస్లింలు) చూసుకుంటారు’ అని సర్ది చెప్పినట్టు ఇతర రచయితలు రాశారు. ఏమైనా 1934 వరకు కూడా పాకిస్తాన్ ఆలోచనకు ఎవరూ సానుకూలంగా లేరన్నది నిజం. ఇది కాలేజీ కుర్రాళ్ల రగడ అనే మూడో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లిన పెద్దలు భావించారు. రహమత్ అలీ మరికొన్ని కరపత్రాలు కూడా వెలువరించాడు. ‘పాక్‌స్తాన్: ది ఫాదర్‌ల్యాండ్ ఆఫ్ పాక్‌స్తానీ నేషన్’ అన్న పుస్తకం కూడా రాశాడు. ఇస్లాంను ఆవిష్కరించే క్రమంలో ప్రవక్త అరబ్ తెగలను ఏకం చేసిన క్రమమే దక్షిణాసియాలో ముస్లింలకో దేశం అన్న తన లక్ష్యానికి ప్రేరణ అని అలీ చెప్పుకున్నాడు. తమ పూర్వికులు ఆరంభించిన స్థలాలు, పట్టణాలు, కొండల పేర్ల మార్పు ఉద్యమం కొనసాగాలనీ ఆశించాడు. హిమాలయాలను ‘జబాలియా’ అని, బంగాళాఖాతాన్ని ‘బంగి ఇ ఇస్లాం’ అని, ఆసియా ఖండాన్ని ‘దినియా’అని పిలిస్తేనే సార్థకమని భావించాడు.
బుందేల్‌ఖండ్ మాల్వాలను సిద్దిఖిస్తాన్ అని, బిహార్, ఒడిశాలను ఫారూకిస్తాన్ అని, రాజస్థాన్‌ను ముయిస్తాన్ అని, మొత్తం హిందూస్థాన్‌ను హైదర్‌స్తాన్ అని, దక్షిణ భారతదేశాన్ని మాప్లిస్తాన్ అని పిలవడం సరైనదని వాదించాడు. పశ్చిమ సింహళానికి షఫిస్తాన్ అని, తూర్పు సింహళానికి నాసరిస్తాన్ అని కూడా పేర్లు పెట్టాడు. వీటిలో మొదట సాధించవలసినది మాత్రం పాక్‌స్తాన్ అని అనుకున్నాడు. జాతీయోద్యమానికి సమాంతరంగా ముస్లిం జాతీయోద్యమం సాగించడానికి రహమత్ అలీ ప్రయత్నించాడు. 1940 నాటి లాహోర్ సమావేశంలో మొదటిసారిగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్ చేశాడు జిన్నా. ఆ సమావేశానికి రహమత్ కూడా హాజరయ్యాడు.
దేశ విభజన తరువాత 1948 ఏప్రిల్ 6న అలీ లాహోర్ చేరుకున్నాడు. యమునా నదే హిందుస్థాన్‌కు, పాకిస్తాన్‌కు మధ్య సహజ సరిహద్దు అని, ఢిల్లీ, ఆగ్రాలు లేని పాకిస్తాన్‌ను ఎలా అంగీకరించారని ధ్వజమెత్తడం ఆరంభించాడు. తను పచ్చరంగు పూసి, సూచించిన ప్రాంతాలతో పాకిస్తాన్ ఎందుకు సాధించలేదన్నదే అతడి ప్రశ్న. జిన్నా ‘ఖాయిద్ ఏ ఆజమ్’ (మహా నాయకుడు జిన్నా బిరుదు) కాదు, ‘క్విస్లింగ్ ఏ ఆజమ్’(మహా ద్రోహి) అని విమర్శలు ఆరంభించాడు. దీనితో ప్రధాని లియాఖత్ అలీఖాన్ పాక్ నుంచి రహమత్‌ను బహిష్కరించాడు.
అతడి ఆస్తులను జప్తు చేయించాడు. తిరిగి కేంబ్రిడ్జ్ చేరుకున్న అలీ 1951 ఫిబ్రవరి 3న దాదాపు అనాథగా చనిపోయాడు. కేంబ్రిడ్జ్‌లో అతడి ఆచార్యుడు ఎడ్వర్డ్ వెల్‌బోర్న్ డబ్బు ఇచ్చి అంత్యక్రియలు జరిపించాడు (ఈ ఖర్చులను తరువాత పాకిస్తాన్ హైకమిషన్ చెల్లించింది). మరణానంతరమైనా తన అవశేషాలు స్వస్థలం కామేలియాకు పంపించాలని తన న్యాయవాదిని అలీ కోరినట్టు చెబుతారు. కానీ 2006లో జరిగిన ఈ ప్రయత్నం కూడా చిత్తశుద్ధితో సాగలేదు. 1947లో మౌంట్‌బాటన్‌తో జిన్నా చెప్పిన ‘మాత్ ఈటెన్ పాకిస్తాన్’ (అసంపూర్ణ పాకిస్తాన్) అన్నమాటకీ, ‘కశ్మీర్ లేని పాకిస్తాన్ ఏమిటీ?’ అన్న రహమత్ వాదనకీ ఏమైనా వ్యత్యాసం ఉందా?
- డా. గోపరాజు నారాయణరావు
చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్ క్రైం స్టోరీ: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..
Comments
Please login to add a commentAdd a comment