స్వాతంత్రోద్యమ చిహ్నాలేమిటో గుర్తున్నాయా?
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర ఉద్యమానికి 190 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వాతంత్య్ర సమరయోధులు ఎవరంటే, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, భగత్ సింగ్, సుభాస్ చంద్రబోస్...ఇలా చెప్పుకుంటూ పోవచ్చు ఎవరైనా. కానీ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చిహ్నాలు ఏవంటే ఎవరైనా తడుముకోవాల్సిందే.
వాటిల్లో మొదటి చిహ్నం వందేమాతరం ఉద్యమం పతాకం. స్వదేశీ ఉద్యమం పేరిట సాగిన ఈ ఉద్యమం 1905లో ప్రారంభమైన 1911 వరకు కొనసాగింది. బాల గంగాధర్ తిలక్, బిపిన్‌చంద్ర పాల్, లాలా లజిపతి రాయ్‌లు ఈ ఉద్యమానికి నేతృత్వం వహించారు. వివిధ మతాల, కులాల ప్రజలను ఉద్యమంలోకి తీసుకరావడం కోసం వారు ఉద్యమానికి ఓ జెండా ఉండాలని నిర్ణయించారు. 1906, ఆగస్టు ఏడవ తేదీన ఆవిష్కరించిన ఈ జెండాను సచింద్ర ప్రసాద్ బోస్ రూపొందించారు. పైన కాషాయం, మధ్యన పసుపు, కింద ఆకుపచ్చ రంగులో తయారు చేసిన జెండాపై, పై వరుసలో ఎనిమిది వికసించిన కమల పుష్పాలు, మధ్యలో వందేమాతరం అక్షరాలు, దిగువున సూర్య, చంద్రులు, నక్షత్రాల గుర్తులను ముద్రించారు.
ఆజాద్ హింద్ ఫ్లాగ్ కూడా స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన చిహ్నంగా చరిత్రలో మిగిలింది. సుభాస్ చంద్ర బోస్ స్థాపించిన ‘ఆజాద్ హిందూ ఫౌజ్’కు జెండా గుర్తుగా దీన్ని రూపొందించారు. పైన లేత కాషాయ రంగులో ఆజాద్ అనే అక్షరాలను, అడుగున ఆకుపచ్చ రంగులో హింద్ అనే పదాలను, మధ్యలో తెల్లటి రంగుపై పులి గుర్తును ముద్రించారు. ఈ గుర్తును చూడగానే అప్పట్లో భారతీయుల రోమాలు నిక్కబొడుచుకునేవాట. నేతాజీ అదృశ్యంతో ఈ ఉద్యమం పూర్తిగా కనుమరుగైంది.
జాతిపిత మహాత్మా గాంధీ తన సబర్మతి ఆశ్రమంలో కూర్చొని స్వయంగా నూలు ఒడుకుతున్న ఫొటో స్వదేశీ, స్వయం సమృద్ధి చిహ్నంగా నిలిచిపోయింది. ఈ చిహ్నాన్ని జెండాపై ముద్రించి, 1921లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆవిష్కరించారు. జాతీయ ఉద్యమానికి స్ఫూర్తిగా ఈ జెండా చిహ్నం చరిత్రలో నిలిచిపోయింది.
మహాత్మా గాంధీ మూడు కోతుల సిద్ధాంతం జనంలోకి వెళ్లడానికి ఆయన వద్దనున్న మూడు కోతుల విగ్రహాలు ఎంతో దోహదపడ్డాయి. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దనే విధంగా ఉండే ఈ విగ్రహాలు వాస్తవానికి జపాన్ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చాయి. అందులో చెవులు మూసుకొని ఉండే మొదటి కోతి విగ్రహాన్ని ‘మిజారు’ అని, కళ్లు మూసుకొని ఉండే రెండో విగ్రహాన్ని ‘కికజారు’ అని, నోరు మూసుకున్నట్లు ఉండే మూడో కోతి విగ్రహాన్ని వజారు అని పిలుస్తారు.
మహాత్మాగాంధీ 1930లో సబర్మతి నుంచి దండికి కాలి నడకన చేపట్టిన యాత్రను, దండి యాత్రని, ఉప్పు సత్యాగ్రహమని పిలుస్తారు. బ్రిటిష్ పాలకుల చట్టాన్ని ఉల్లంఘించి దండిలో ఉప్పును తయారు చేసిన ఈ ఉద్యమం స్వాతంత్య్రోద్యమంలో ఓ కీలక మలుపు. గాంధీజీ సాగించిన కాలినడక ఫొటో ఉద్యమ స్ఫూర్తికి చిహ్నంగా విస్తృత ప్రచారానికి నోచుకుంది. 82 పౌండ్ల ఉప్పును ఉత్పత్తి చేస్తే ఒక రూపాయి నుంచి నాలుగు రూపాయల వరకు పన్ను చెల్లించాలంటూ బ్రిటీష్ పాలకులు 1882లో ఓ చట్టాన్ని తీసుకొచ్చారు.