అడవిలో అంతర్జాతీయ వైద్యం
సాంకేతికం
చత్తీస్‌గడ్ రాష్ర్టంలో చాలా జిల్లాలున్నాయి. కానీ బస్తర్ జిల్లా మాత్రం దేశంలోని ప్రతి ఒక్కరికీ పరిచయం. అక్కడున్న ‘అన్నల’ వల్ల ఆ జిల్లా దేశ వ్యాప్తంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నక్సల్స్ ప్రాబల్యం వ ల్లే అసలు ఆ ప్రాంతం అన్నింటికీ దూరమైందనే అభిప్రాయం ఉంది. అక్కడ రోడ్లు వేయరు. వేసినా వాటిని ఉండనివ్వరు. ఎవరూ దుకాణం పెట్టరు, ఏ అధికారీ అక్కడ పనిచేయడానికి ఇష్టపడడు... ఇంతమందికి ఇష్టంలేనిది ఆ అటవీ ప్రాంతపు జిల్లా డాక్టర్లకు మాత్రం ఎలా నచ్చుతుంది? అందుకే అక్కడి ప్రజలకు ఏదైనా అనారోగ్యం వస్తే ఒక జీవితం అర్పణం. మందులుండవు. మాకులుండవు.
అలా రోగంతో కుంగి కుశించి నశించాల్సిందే. ఎంతటి ఘోరమైన పరిస్థితులు ఉంటాయంటే ఆ ప్రాంతంలో... సాధారణ చికిత్సతో తగ్గే డయేరియా వల్ల కూడా మనుషులు చచ్చిపోతున్నారంటే ప్రాథమిక వైద్యం కూడా వారికి ఎంత దూరంలో ఉందో అర్థమవుతోంది.ఈ నేపథ్యంలో ఆలస్యంగానే అయినా వీరి కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకుంది. ప్రభుత్వ సంకల్పాన్ని ‘ఎయిమ్స్’ ఆస్పత్రి అర్థం చేసుకుంది. ఫలితంగా బస్తర్ జిల్లాలోని అడవి బిడ్డలకు ఇప్పుడు హై క్లాస్ వైద్యం అందుతోంది!
చత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఎయిమ్స్ ఉంది. ఇక్కడ అత్యుత్తమ వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. అత్యాధునికమైన 900 బెడ్లు ఉన్న ఈ ఆస్పత్రి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది. తాజాగా ఇక్కడి నిపుణులు బస్తర్ జిల్లా ప్రజలకు వరంగా మారారు. నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో భారత ప్రభుత్వం వంద సీఆర్‌పీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఒక్కో క్యాంపు పరిధిలో 15 నుంచి 20 గ్రామాలుంటాయి. ఇవే ఆయా గ్రామాలకు వైద్యాలయాలు. అవి వైద్యాలయాలే గాని వైద్యులు మాత్రం ఆర్మీవాళ్లు కాదు లెండి. సాధారణంగా మొబైల్, ఇంటర్నెట్ వంటి ఏ సదుపాయాలకు ఈ గ్రామాలు నోచుకోవు. కానీ, సైన్యానికి ఉండే అవసరాల రీత్యా ఈ క్యాంపుల్లో మాత్రం అవి అందుబాటులో ఉంటాయి.
అలా రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ వైద్య బృందం వారానికి రెండు రోజులు ఈ క్యాంపుల ద్వారా ప్రజలకు ‘టెలిమెడిసిన్’ విధానంలో వైద్య చికిత్సలు అందిస్తోంది. ఇదెలా పనిచేస్తుందంటే... ఎయిమ్స్ కేంద్రంలోని వైద్య బృందాలు ఈ ఆర్మీక్యాంపుల్లో పనిచేసే పారామెడిక్, మెడికల్ అసిస్టెంట్లకు స్కైప్ ద్వారా కనెక్ట్ అవుతారు. వైద్యం కోసం వచ్చిన వారితో స్కైప్ ద్వారా వైద్యులు మాట్లాడతారు. వారి పరిస్థితిని నేరుగా వీడియోలో ప్రత్యక్షంగా చూసి లక్షణాలు తెలుసుకున్న అనంతరం స్థానికంగా ఉండే పారామెడిక్‌లకు ఎలా వైద్యం చేయాలో చెబుతారు. వారి సూచనలు ఫాలో అవుతూ పారామెడిక్‌లు రోగులకు చికిత్సలు చేస్తారు. అవసరమైన మందులు, ఇంజెక్షన్లు ముందుగానే ఆర్మీక్యాంపుల్లో అందుబాటులో ఉంచడం వల్ల అక్కడికక్కడే వైద్యంతో పాటు మందులు కూడా వారికి అందుతున్నాయి. అయితే కొన్ని క్యాంపుల్లో ఇంటర్నెట్, మొబైల్ సదుపాయం కూడా ఉండదు.
అక్కడ డీఎస్‌పీటీ (డిజిటల్ శాటిలైట్ ఫోన్ టెర్మినల్) ద్వారా రోగులతో మాట్లాడుతారు. ఒకవేళ క్యాంపుల్లో నిర్వహించే వైద్య చికిత్సలతో రోగాలు తగ్గే పరిస్థితి లేనపుడు ఆర్మీయే రోగులను పెద్ద ఆస్పత్రులకు తీసుకెళ్తుంది. ఇదే వైద్య బృందం అక్కడి డాక్టర్ల ద్వారా అవసరమైన చికిత్సలు చేయిస్తుంది. ఈ వైద్యాలయాల నిర్వహణకు పూర్తి సహకారం అందేలా ఆర్మీకి భారత ప్రభుత్వం ఆదేశాలున్నాయి. వీటివల్ల చాలా వ్యాధులకు చికిత్సలు సకాలంలో అందుబాటులో ఉండి ప్రజల ప్రాణాలు రక్షిస్తున్నాయి. అడవి బిడ్డలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కుడోస్ టు టెక్నాలజీ, కుడోస్ టు టెలిమెడిసిన్!