
మాంసం తింటే ఎముకలు మెళ్లో కట్టుకు తిరగాలా...
ఒక ఊళ్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ప్రతి చిన్నదానికీ ఆర్భాటం చేసేవాడు. రోజూ మాంసం తెచ్చి వండించేవాడు. రోజూ ఎందుకండీ అని భార్య అంటే... చెప్పింది చెయ్యమంటూ ఆమె మీద అరిచేవాడు. పైగా తాము రోజూ విందు ఆరగిస్తామని అందరికీ తెలిసేలా చేయడానికి మాంసంలోని ఎముకలను అందరూ చూసేలా పారబోసేవాడు. కొన్నాళ్లకు ఆ ఊళ్లోవాళ్లు పెంచుకునే కోళ్లను ఎవరో ఎత్తుకెళ్లటం మొదలుపెట్టారు.
వరుసగా అందరి కోళ్లనూ ఎత్తుకెళ్లేసరికి అందరూ కలిసి సదరు వ్యక్తి ఇంటిమీద పడ్డారు. నేను మాంసం కొని తెచ్చుకుంటున్నాను, మీ కోళ్లు ఏమయ్యాయో నాకు తెలీదు అని ఎంత చెప్పినా నమ్మలేదు సరికదా చితక బాదేశారు. కుయ్యో మొర్రో అంటున్న అతడిని చూసి...‘మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెళ్లో వేసుకుని తిరిగితే ఇలానే ఉంటుంది’ అంది భార్య. ఆ మాటే తర్వాత సామెతయ్యింది.